NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

మాపై హత్యాయత్నం చేశారు.. సునీతా లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు

వినాయక నిమజ్జనం వేడుకల పేరుతో మాపై హత్యాయత్నం చేశారని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లుగా మా గ్రామంలో ఎటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవన్నారు. వినాయక నిమజ్జనం వేడుకల పేరుతో మాపై హత్యాయత్నం చేశారన్నారు. గొడవ జరుగుతుందని తెలిసి ముందే పోలీసులకు చెప్పిన పట్టించుకోలేదన్నారు. గ్రామంలోని కొంతమందికి మద్యం తాగించి దాడులకు ఉసిగొల్పారన్నారు. ఇంటి గేట్లు తన్నుకుంటూ వచ్చి నా అనుచరులపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారన్నారు. ఇంటి లోపలికి టపాసులు వేసి రాళ్లు, కర్రలతో ఇంట్లో ఉన్నవారిపై దాడికి దిగారన్నారు. దాడి చేసిన వారితో పాటు ఘటనను ప్రోత్సహించిన వారిపై కేసు నమోదు చేయాలన్నారు. మీరు రెచ్చగొడితే మేము రెచ్చిపోము.. మా సహనం పరీక్షించొద్దన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలవడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకే దాడులకు దిగుతోందన్నారు. పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేస్తారని నమ్మకం లేదన్నారు.

పురంధేశ్వరికి కీలక పోస్టు.. లోక్‌సభ స్పీకర్‌ ఉత్తర్వులు

భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు.. రాజమండ్రి లోక్‌సభ సభ్యురాలిగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం.. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎంపీ పురంధేశ్వరిని నియమించారు.. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సీపీఏ) ఇండియా రీజియన్ ప్రతినిధిగా.. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు పురంధేశ్వరి.. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.. 2026 చివరి వరకు ఈ నియామకం వర్తించనుంది.. అంటే 2024 నుంచి 2026 చివరి వరకు కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు పురంధేశ్వరి.. మహిళా పార్లమెంటేరియన్లు, స్టీరింగ్ కమిటీకి చైర్‌పర్సన్‌గా కూడా ఆమె వ్యవహరిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా..

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏజెన్సీ ప్రాంతాల్లో కుంభవృష్టి..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో కుంభవృష్టిగా వర్షం కురుస్తుంది. సుమారు రెండుగంటలుపైగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు. పొంగిపొర్లుతున్నాయి. మారేడుమిల్లిలో వాగులు పొంగి రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో గిరిజనులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పలుచోట్ల వాగులు పొంగి ప్రవహించడంతో రహదారులపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనితో వాహనాలు రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆనకట్టులు నీటమునిగాయి. సుమారు 50 గిరిజన గ్రామాలకు వెళ్లే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

అన్న క్యాంటీన్‌లో అక్కడ ఉచితంగా ఆహారం.. ఒక్క రూపాయి కూడా వద్దు..

రాయచోటిలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ లో సంవత్సరం పాటు ఉచితంగా మూడు పూటల ఆహారం అందిస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. రాయచోటిలో టీడీపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో మూడు పూటల ఆహారం అందిస్తామని.. ఇందుకు ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు.. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పర్యటించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాం అన్నారు.. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తున్నాం అని తెలిపారు.. కొన్ని ప్రభుత్వాలు పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టే పథకాలను దూరం చేశాయని దుయ్యబట్టిన ఆయన.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్‌లను రాష్ట్ర వ్యాప్తంగా పునఃప్రారంభిస్తున్నాం అన్నారు.. ఇక, రాయచోటిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌లో ఏడాది పాటు ఉచితంగా మూడు పూటల ఆహారం అందిస్తాం… ఇందుకు ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.

విశాఖ డెయిరీపై స్పీకర్‌ కీలక వ్యాఖ్యలు

విశాఖ డెయిరీ యాజమాన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు… అయితే, విశాఖ డెయిరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేత అడారి ఆనంద్ కుమార్.. గత ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆనంద్.. అయితే, విశాఖ డెయిరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు స్పీకర్.. రైతుల సొమ్ములతో డెయిరీ పాలకవర్గం సోకులు చేస్తోంది.. అవసరమైతే చైర్మన్ ను జైలుకు ఈడుస్తాం అని హెచ్చరించారు.. సొసైటీ ప్రెసిడెంట్లకు 4 గ్రాముల బంగారం ఇచ్చి.. సొసైటీ నుంచి రూ. 39,100ల రైతుల సొమ్ము దోచేశారు.. సొసైటీల సొమ్ముతో షీలా నగర్ లో ఆసుపత్రి ఏర్పాటు చేసి, రైతులకు నామమాత్రం చికిత్సలు అందిస్తున్నారు. రైతుల పిల్లల ఇంజనీరింగు చదువుల పేరుతో యలమంచిలిలో పాల రైతుల సొమ్ముతో స్థలం కొని, ఎవరిని సంప్రదించకుండా అమ్మేశారు… దాన్ని అమ్మకం చేసిన తులసీరావు తూర్పు గోదావరి జిల్లాలో భూమి కొన్నారు.. అది పాల రైతులదా? తులసీరావుదా? అని నిలదీశారు.

రైల్వే, జిల్లా కోర్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం

గుంటూరు జిల్లాలో రైల్వే, జిల్లా కోర్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గుంజి శ్రీనివాస్ రావు అనే వ్యక్తి మోసం చేశాడని భాదితులు ఫిర్యాదు చేశారు. పదిమంది వద్ద సుమారు కోటి రూపాయలు వసూలు చేశాడని చిలకలూరిపేటకు చెందిన గుంజి శ్రీనివాసరావుపై ఆరోపణలు వచ్చాయి. దొంగ అపాయింట్మెంట్ ఆర్డర్లు చూపి, దొంగ అధికారులతో విచారణ పేరుతో మోసం చేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగాల పేరుతో బాపట్ల, పెదనందిపాడు, గుంటూరు, చిలకలూరిపేటలకు చెందిన యువత మోసపోయినట్లు తెలిసింది. నకిలీ ఉద్యోగాలు అని తెలుసుకుని బాధితులు నిలదీసినట్లు తెలుస్తోంది. డబ్బు ఇవ్వను చేతనైంది చేసుకోండంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని గుంజి శ్రీనివాసరావుపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ స్పందనలో జిల్లా ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు.

ఆర్మీ ప్రత్యేక రైలును పేల్చివేసేందుకు కుట్ర?.. నిందితుడు రైల్వే ఉద్యోగి

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఆర్మీ రైలును పేల్చివేసేందుకు కుట్ర పన్నిన కేసులో పెద్ద సంచలనం చోటుచేసుకుంది. ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సబీర్ అనే నిందితుడు రైల్వే ట్రాక్‌పై 10 డిటోనేటర్లను అమర్చాడు. నిందితుడు సబీర్ రైల్వే ఉద్యోగి కావడం గమనార్హం. ఇలా చేయడం వెనుక అతని ఉద్దేశం ఏమిటి? దీనికి సంబంధించి ఎన్ఐఏ, ఏటీఎస్, ఆర్పీఎఫ్, రైల్వే మంత్రిత్వ శాఖ వంటి సంస్థలు నిందితులను విచారిస్తున్నాయి. బుర్హాన్‌పూర్‌లోని నేపానగర్‌లో రైలు పట్టాలు తప్పేందుకు ప్రయత్నించిన ఘటన సెప్టెంబర్ 18న జరిగింది. సబీర్ అనే రైల్వే ఉద్యోగి పట్టాలపై 10 డిటోనేటర్లను అమర్చాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దర్యాప్తు సంస్థల్లో ఉత్కంఠ నెలకొంది. అనంతరం ఏటీఎస్‌, ఎన్‌ఐఏ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ మొత్తం విషయం భుసావల్ రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే నేపానగర్‌లోని సగ్‌ఫటా స్టేషన్‌కు సమీపంలో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి..

నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మున్సిపాలిటీ పరిధిలోని పేరారెడ్డిపల్లిలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుమల లడ్డూ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయని ఆయన అన్నారు. గత ప్రభుత్వం 2022 లో టెండర్లు మార్చారని, మూడు సంవత్సరాల అనుభవం ఉండాల్సిన కంపెనీలకు ఒక సంవత్సరానికి తగ్గించారని మంత్రి తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్ ప్రక్రియను కూడా అప్పట్లో తీసేశారని వ్యాఖ్యానించారు. నిబంధనలను పట్టించుకోకుండా టెండర్లను పిలిచారన్నారు. అధికారం కోసం.. బాబాయి దోపిడి కోసం హిందువుల మనోభావాలను దెబ్బ తీసి.. ఏమీ ఎరగనట్టు ప్రధాన మంత్రికి జగన్ ఒక ఉత్తరం రాశాడని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తాను వేసిన టీటీడీ బోర్డులో బీజేపీ సభ్యులు కూడా ఉన్నారని పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నారు. చంద్రబాబు అధికారాన్ని ప్రశ్నించే హక్కు జగన్‌కు ఎవరు ఇచ్చారని మంత్రి ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు గుండా రాజ్యం నడుస్తుంది

మెదక్ జిల్లాలోని గోమారంలోని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. హరీష్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సునీతా ఇంటిపై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు గుండా రాజ్యం నడుస్తుందన్నారు. మొన్న సిద్దిపేటలో నా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగిందని, నిన్న కౌశిక్ రెడ్డిపై, అర్థరాత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి జరిగిందని హరీష్‌ రావు మండిపడ్డారు. బీహార్, రాయలసీమ ఫ్యాక్షన్ లా రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నాడని హరీష్‌ రావు విమర్శించారు. నిన్న జరిగిన దాడి కాంగ్రెస్ నాయకులు ప్రోత్సహించిందే…ఉద్దేశపూర్వకంగా నే మాపై దాడి చేశారని ఆయన మండిపడ్డారు. ఎస్పీ, ఐజీతో మాట్లాడను వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా అని, వీడియోలు తీస్తున్న హెడ్ కానిస్టేబుల్ పై కూడా కాంగ్రెస్ న్నాయకులు దాడి చేశారన్నారు హరీష్ రావు.

ఔటర్ బయట ఉన్న రూరల్ ప్రాంతంలోని చెరువులు, నాలాలపై హైడ్రా ఫోకస్‌

హైడ్రా ఇప్పటివరకు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, నాలాల పైన దృష్టి పెట్టింది. మొదటి సారి రంగారెడ్డి జిల్లా ఔటర్ బయట ఉన్న రూరల్ ప్రాంతంలోని చెరువులు, నాలాలను హైడ్రా బృందం పరిశీలించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్‌, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలోని మసాబ్ చెరువు, పెద్ద చెరువుల పరిధిలోని నాలాలను హైడ్రా సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటించింది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు పరిధిలోని ఉప్పరిగూడ, పోచారం గ్రామాల్లోని బఫర్ జోన్, ఎఫ్టీఎల్ ను హైడ్ర అసిస్టెంట్ కమిషనర్ పాపయ్య బృందం పరిశీలించింది. అబ్దుల్లాపూర్ మెట్టు మాసాబ్ చెరువు, ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు పరిధిలోని పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా బృందం పరిశీలించింది.