NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

నేపాల్‌లో నదిలో పడిపోయిన 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణీకుల బస్సు..

నేపాల్‌ దేశంలో భారీ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. 40 మంది భారతీయులతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోయిందని సమాచారం. ఘటన నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మంది మృతి చెందే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఘటనకు సంబంధించి నేపాల్ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణీకుల బస్సు తనహున్ జిల్లాలో మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. జిల్లా పోలీసు కార్యాలయం తనహున్ డీఎస్పీ దీప్‌కుమార్ రాయ ఈ విషయాన్ని ధృవీకరించారు. UP FT 7623 నంబర్ ప్లేట్ ఉన్న బస్సు నదిలో పడిపోయిందని ఆయన చెప్పారు. అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు పోఖారా నుంచి ఖాట్మండుకు వెళ్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తెలంగాణ పీసీసీ చీఫ్పై ఢిల్లీలో కసరత్తు..

ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతుంది. ఈ మీటింగ్ లో తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడు నియామకం, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ పాల్గొన్నారు.

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్‌

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల టైమ్‌లో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి కేసు, పోలింగ్‌ తర్వాత కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి కేసుల్లో పిన్నెల్లికి ఏపీ ఉన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పాస్ పోర్ట్ సమర్పించాలని పిన్నెల్లికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అధికారి దగ్గరకు వారానికి ఒకసారి వెళ్లి సంతకం చేయాలని షరతు విధించింది.50 వేలతో రెండు పూచీ కత్తులు సమర్పించాలని, దేశం విడిచి వెళ్లొద్దని పిన్నెల్లికి హైకోర్టు ఆదేశించింది. షరతులకు కట్టుబడి ఉంటానని.. బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి కోరగా ఈ మేరకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో నెల్లూరులోని కేంద్ర కారాగారం వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. జైలు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.

మైనర్పై గ్యాంగ్ రేప్.. యాక్షన్లోకి సీఎం

సమాజంలో మహిళలపై అత్యాచారాలు పాల్పడటం ఆగడం లేదు. ఎక్కడో చోట కామాంధులు అమ్మాయిలపై క్రూరత్వానికి పాల్పడుతున్నారు. కోల్కతా ఘటన మరువక ముందే అస్సాంలో మరో అత్యాచారం ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం (గ్యాంగ్ రేప్) జరిగిన ఘటన అస్సాంలో వెలుగు చూసింది. బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్ క్లాస్ నుంచి ఇంటికి తిరిగి వస్తోండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసోంలోని నాగావ్ జిల్లాలో ఈ ఉదాంతం చోటుచేసుకుంది. కాగా.. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేసే వరకు నిరవధిక బంద్‌కు వివిధ సంస్థలు, నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేయడంపై దేశం మొత్తం ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితం బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో అమాయక చిన్నారులపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

సీఎం చంద్రబాబు ఒక విజన్‌ ఉన్న లీడర్‌..

సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన మహిళా పారిశ్రామిక వేత్తల పీఎస్‌యూ కనెక్ట్‌-2024 సదస్సులో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. మహిళలు ఏ స్థాయిలో వున్నా ఒక మహిళగానే ఈ సమాజం చూస్తుందన్నారు. సీఎం చంద్రబాబు ఒక విజన్ వున్న లీడర్.. మహిళలకు చాలా ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి అంటూ కొనియాడారు. మహిళలు బిజినెస్‌లో అభివృద్ధి చెందడం కోసం ఒక డ్రైవ్‌ని నిర్వహిస్తామన్నారు. ఏ వ్యాపార రంగంలోనైనా ఎలా అభివృద్ధి చెందాలో అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి మహిళ ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకుపోవాలని అన్నారు.

కేసీఆర్ ధనిక రాష్ట్రం అన్నారు కానీ… ఖజానా మాత్రం ఖాళీ

మార్పు కావాలని.. ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యం అని కాంగ్రెస్ నీ దివించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి..సంక్షేమం రెండు కళ్లు గా పని చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చాక ఖజానా చూస్తే 7 లక్షల కోట్ల అప్పు ఉన్నా.. ఇచ్చిన మాట ప్రకారం సర్కార్ వచ్చిన వెంటనే ఐదు పథకాలు అమలు చేశామన్నారు మంత్రి పొంగులేటి. కేసీఆర్ ధనిక రాష్ట్రం అన్నారు కానీ… ఖజానా మాత్రం ఖాళీ అని, మేము అధికారంలోకి వచ్చిన కొత్తలో అప్పు చూసి షాక్ అయ్యామన్నారు. రైతుల రుణమాఫీ .. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని రీతిలో చేశామని, దుబారా ఖర్చులు దూరం పెట్టీ రైతును రాజు చేసే పనిలో పడ్డామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమని, 31 వేల కోట్లు మాఫీ కోసం అవసరం అవుతాయని అంచనాతో సిద్ధం అయ్యామన్నారు. 18 వేల కోట్లు ఇచ్చాము..ఇంకో 12 వేల కోట్లు రైతులకు అందాల్సి ఉందని, బీఆర్‌ఎస్‌ లక్ష రూపాయలు మాఫీ చేయడానికే.. ఐదేళ్లు పట్టిందని, RRRనీ అమ్మకానికి పెట్టింది మీరు.. ఎన్నికలు వస్తేనే మాఫీ డబ్బులు వేసింది మీరు అని ఆయన మండిపడ్డారు.

కోల్‌కతా ఘటన నిందితుడికి 14 రోజుల కస్టడీ..

కోల్‌కతా మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసును శుక్రవారం సీల్దా కోర్టులో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో.. నిందితుడు సంజయ్ రాయ్‌ను కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ సెమినార్‌లో ఆగస్టు 9న జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నివేదిక ప్రకారం.. సంఘటన సమయంలో నిందితుడు మద్యం సేవించినట్లు దర్యాప్తులో తేలింది. సంఘటన జరగడానికి కొన్ని గంటల ముందు.. నిందితుడు తన స్నేహితుడితో కలిసి రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి వచ్చాడు.

మహిళా జర్నలిస్టులపై దాడి.. నాగర్‌కర్నూల్‌ పోలీసుల నుంచి నివేదిక కోరిన మహిళా కమిషన్‌

ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై గురువారం జరిగిన దాడిని వివిధ వర్గాలు ఖండించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నాగర్‌కర్నూల్ పోలీసులను రిపోర్టు కోరింది. ప్రజలు, ముఖ్యంగా జర్నలిస్టు సంఘాలు మరియు మహిళా జర్నలిస్టులు ఈ సంఘటనను ఖండిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నేరాన్ని గుర్తించింది. కమిషన్ చైర్‌పర్సన్ శారద నెరెళ్ల X లో పోస్ట్ చేసారు: “నమోదైన నేరాన్ని మహిళా కమిషన్ గుర్తించింది. ఈ వ్యవహారంలో న్యాయమైన, త్వరితగతిన విచారణ జరిగేలా చూడాలని నాగర్‌కర్నూల్‌ ఎస్పీకి లేఖ రాశాను. సవివరమైన చర్య తీసుకున్న నివేదికను కమిషన్‌కు వీలైనంత త్వరగా అంచనా వేయాలి. ఈ ఘటనను ఖండిస్తూ, నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మహిళా జర్నలిస్టుపై ఆమె స్పందించారు. అంతకుముందు రోజు ఉదయం ఇద్దరు జర్నలిస్టులు ఆవుల సరిత, విజయారెడ్డిలు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ని ఆమె కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నేరెళ్ల హామీ ఇచ్చారు.

కోల్‌కతా ఘటన కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు..

కోల్‌కతా అత్యాచారం కేసులో విచారణ కొనసాగుతోంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్.. నేరం చేయడానికి ఒక రోజు ముందు ఆగస్టు 8న బాధితురాలిని ఛాతీ మందుల వార్డు వరకు ఫాలో అయినట్లు పోలీసులకు చెప్పాడు. ఈ క్రమంలో.. ఆసుపత్రి ఛాతీ వార్డులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. 33 మంది వ్యక్తులు బాధితురాలితో పాటు మరో నలుగురు జూనియర్ డాక్టర్లను అదే పనిగా చూస్తున్నారు.

జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌కు ఏసీబీ కోర్టు బెయిల్

మాజీ మంత్రి జోగి రమేష్‌ కుమారుడు జోగి రాజీవ్‌కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్‌ను ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంబాపురం అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంలో మొత్తం 9 మందిపై కేసు నమోదైంది.