Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

రాయ్‌గఢ్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏం రాసిందంటే..!

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో విషాదం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు నోట్‌లో అన్ని విషయాలు రాసి ప్రాణాలు తీసుకుంది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రిన్సీ కుమారి(20) .. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ నివాసి. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఒక విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. పుంజిపాత్ర సమీపంలోని విశ్వవిద్యాలయ హాస్టల్‌లో నివసిస్తోంది. శనివారం రాత్రి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ సందర్భంగా ఒక సూసైడ్ నోట్‌ను రాసింది. ‘‘క్షమించండి అమ్మా, నాన్న’’. మీ అంచనాలను అందుకోలేపోతున్నా.. పరీక్షల ఒత్తిడి భరించలేకపోతున్నట్లు వాపోయింది. నా చదువు కారణంగా కుటుంబంపై ఆర్థిక భారం పడకూడదని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది.

సలార్-2’పై ప్రశాంత్ నీల్ బిగ్ క్లూ..

రెబల్ స్టార్ ప్రభాస్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సలార్’ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌ను మునుపెన్నడూ లేని పవర్‌ఫుల్ లుక్‌లో చూపించిన ఈ సినిమా రిలీజ్ అయి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయింది. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ‘సలార్’ ముచ్చట్లను మళ్లీ ట్రెండ్ చేస్తున్నారు. సినిమా వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ‘సలార్-2’ (శౌర్యాంగ పర్వం) షూటింగ్ గురించి మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక క్లారిటీ లేకపోవడంతో అభిమానులు కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం, ప్రశాంత్ నీల్ కూడా తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టడంతో సీక్వెల్ ఎప్పుడనేది హాట్ టాపిక్‌గా మారింది. అయితే, సలార్-2 గురించి గతంలో ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇప్పుడు ఫ్యాన్స్‌కు ధైర్యాన్నిస్తోంది.

రష్యాలో కారు బ్లాస్ట్.. రష్యన్ లెఫ్టినెంట్ జనరల్ మృతి

రష్యాలోని దక్షిణ మాస్కోలో కారు బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనలో సీనియర్ రష్యన్ లెఫ్టినెంట్ జనరల్ ఫనిల్ సర్వరోవ్ ప్రాణాలు కోల్పోయారు. కారు కింద ఒక పేలుడు పరికరం ఉండడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. అయితే దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఏదైనా ఉందా? అన్న కోణంలో రష్యన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దక్షిణ మాస్కోలో సోమవారం ఒక సీనియర్ రష్యన్ సైనిక అధికారి తన కారు కింద పేలుడు పరికరం పేలి మరణించారని రష్యన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సైనిక వ్యక్తులపై జరుగుతున్న ఉన్నత స్థాయి దాడుల్లో ఇదొక సంఘటన అని పేర్కొన్నారు. హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్ నిఘా వర్గాల ద్వారానే ఈ దాడి జరిగినట్లుగా భావిస్తున్నట్లు దర్యాప్తు కమిటీ అధికారిక ప్రతినిధి స్వెత్లానా పెట్రెంకో అన్నారు.

భక్తితో బ్యాలెట్ పేపర్ ను దేవుని హుండీలో వేసిన సర్పంచ్ అభ్యర్థి.. చివరకు ఎన్నికల్లో..

తెలంగాణలో స్థానిక ఎన్నికలు ముగియగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా గెలుపొందిన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డ్ మెంబర్స్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో గ్రామాల్లో కొత్త పాలకమండల్లు కొలువుదీరాయి. కాగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించేందుకు అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోలేదు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి వినూత్నంగా ఆలోచించింది. తనకు కేటాయించిన రింగ్ గుర్తు బ్యాలెట్ పేపర్ ను గెలుపును కాంక్షిస్తూ భక్తి భావంతో దేవుని హుండీలో వేసింది. అనూహ్యంగా ఎన్నికల్లో గెలుపొందింది.

శబరిమల బంగారు దొంగతనంలో వెలుగులోకి సంచలన విషయాలు..!

శబరిమల ఆలయానికి చెందిన బంగారు దొంగతన కేసులో నిందితుల ప్రమేయం, వారి ముఠా నెట్‌వర్క్‌కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదిక ప్రకారం చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ సీఈవో పంకజ్ భండారి, బళ్లారికి చెందిన ఆభరణాల వ్యాపారి గోవర్ధన్ ఈ దొంగతనంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. కోలాం విజిలెన్స్ కోర్టులో SIT దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో ఈ ఇద్దరూ ప్రధాన నిందితులకు సహకరించి నేరాన్ని దాచిపెట్టేందుకు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చినట్లు పేర్కొంది. విచారణలో సేకరించిన ఆధారాల ఆధారంగా వీరిద్దరినీ శుక్రవారం అరెస్ట్ చేసినట్లు SIT వెల్లడించింది. ఈ కేసుకు అంతర్‌రాష్ట్ర సంబంధాలు ఉన్నాయని కూడా దర్యాప్తులో తేలింది.

కో-లివింగ్ హాస్టల్స్ కాదు.. డ్రగ్స్‌కు అడ్డాలు..

భాగ్యనగరంలోని ఐటీ హబ్‌గా పేరుగాంచిన మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం పరిసరాల్లోని కో-లివింగ్ హాస్టల్స్ ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం అంజయ్యనగర్‌లోని ‘కో-లివ్ గార్నెట్ పీజీ హాస్టల్’ వేదికగా జరుగుతున్న డ్రగ్స్ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ (SOT) పోలీసులు, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో కో-లివింగ్ హాస్టళ్ల ముసుగులో సాగుతున్న చీకటి వ్యాపారం బయటపడింది. హాస్టల్‌పై ఆకస్మిక దాడి చేసిన పోలీసు బృందం, అక్కడ డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు పెడ్లర్లతో పాటు వాటిని వినియోగిస్తున్న ముగ్గురు కన్జ్యూమర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – తెలుగు చిత్ర పరిశ్రమ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. టాలీవుడ్‌ను పీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఏపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం సినీ ప్రముఖులతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనుందని తెలుస్తోంది. ఈ ప్రక్రియ నేరుగా కాకుండా ఒక పక్కా ప్రణాళికతో సాగనుంది. మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కీలక ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది. తొలుత సినిమాటోగ్రఫీ, హోంశాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఒక అంతర్గత సమావేశం జరుగుతుంది. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సాంకేతిక, పరిపాలనాపరమైన చిక్కులను ఈ సమావేశంలో అధికారులు క్షుణ్ణంగా చర్చిస్తారు.

సీఆర్డీఏ కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 56వ సీఆర్డీఏ (CRDA) అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని పనుల పురోగతి, కొత్త టెండర్లు, భూ కేటాయింపులపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిని నాలెడ్జ్ హబ్‌గా మార్చే దిశగా, రాజధానిలో ‘క్వాంటం కంప్యూటింగ్ సెంటర్’ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచే అంశంపై అథారిటీ సుదీర్ఘంగా చర్చించింది. వీటితో పాటు రాజధానిలో నివసించే అఖిల భారత సర్వీసు అధికారులు (IAS, IPS), అలాగే గౌరవ న్యాయమూర్తుల నివాసాల వద్ద చేపట్టాల్సిన అదనపు నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్షించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అమరావతి పునర్నిర్మాణంలో మరో ముందడుగు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సర్వంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 56వ సీఆర్డీఏ (CRDA) అథారిటీ సమావేశంలో రాజధాని అభివృద్ధికి సంబంధించి ఏడు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశం అనంతరం పురపాలక శాఖ మంత్రి నారాయణ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ, రాజధాని నిర్మాణ పనుల కోసం భారీగా నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. రాజధానిలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ, 103.96 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ‘అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్’ భవనాల టెండర్లకు అథారిటీ పచ్చజెండా ఊపింది. ఈ కేంద్రం అమరావతిని అంతర్జాతీయ సాంకేతిక చిత్రపటంలో నిలబెట్టనుంది. వీటితో పాటు, రాజధానిలో నివసించే అఖిల భారత సర్వీసు అధికారులు (IAS, IPS) , గౌరవ న్యాయమూర్తుల నివాసాల వద్ద అదనపు నిర్మాణ పనుల కోసం 109.52 కోట్ల రూపాయల మంజూరుకు అథారిటీ ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఏపీసీఆర్డీఏ , అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ADCL) పాలనా వ్యయాలకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా సీఎం సమీక్షించారు.

ఘోర తప్పిదాన్ని మళ్లీ సమర్థించుకుంటున్నారు

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. సోమవారం జరిగిన మీడియా చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం నుండి కృష్ణా జలాల పంపకాల వరకు బీఆర్ఎస్ నేతలు అనుసరించిన విధానాలు తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయిందని, అటువంటి ఘోర తప్పిదాన్ని సమర్థించుకోవడం సిగ్గుచేటని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రూ. 1.80 లక్షల కోట్లు అప్పు తెచ్చి నిర్మించిన ప్రాజెక్టు నిరుపయోగం కావడం బీఆర్ఎస్ ఘనతేనని, ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని కాగ్ కూడా పేర్కొందని ఆయన గుర్తుచేశారు. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకుంది కేవలం 70 నుండి 80 టీఎంసీల నీరు మాత్రమేనని, కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టు డిజైన్ మార్చారని ఆరోపించారు.

 

Exit mobile version