Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

రేవంత్ లా డ్యుయల్ రోల్ నేను చేయలేను..

రేవంత్ లా డ్యుయల్ రోల్ నేను చేయలేనని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మోడీ పాలన చూసి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏ సర్వేలు చూసిన మోడీ మూడోసారి ప్రధాని అవుతారని వస్తున్నాయన్నారు. ఇంకొన్ని అంశాలు మిగిలి పోయాయి కాబట్టి 400 సీట్లు లక్ష్యంగా ముందుకి వెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు తీసుకొని నిర్ణయాలు మోడీ అమలు చేస్తున్నారని తెలిపారు. బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించి పారదర్శకత పెంచామన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఉపాధి హామీ కూలీ డబ్బులు నేరుగా లబ్ది దారుడి అకౌంట్ లో వేసిన ఘనత మోడీ కి దక్కుతుందన్నారు.

కూరగాయలు అమ్మే వారు కూడా డిజిటల్ పేమెంట్స్ పెట్టుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ కి హామీలు ఇచ్చి మర్చిపోవడం అలవాటే అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా హామీలు పెట్టిందన్నారు. పోలవరంకు ఆరోజే జాతీయ హోదా ఇవ్వాల్సిందన్నారు. ఒక్క రాష్ట్రంలో ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇచ్చి రెండవ రాష్ట్రానికి ఇవ్వకపోవడం ఎంటి? అని ప్రశ్నించారు. హామీలు ఇవ్వడం కాంగ్రెస్ వంతు అమలు చేయడం మా వంతు అన్నారు. 1980లో మెదక్ కి రైల్ ఇస్తానని ఇందిరా గాంధీ హామీ ఇచ్చిందన్నారు. కానీ మా హయాంలో మెదక్ కి రైల్ తెచ్చామన్నారు. నిన్న సీఎం ఏదంటే అదే మాట్లాడి వెళ్ళారన్నారు.

టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన చంద్రబాబు

ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీ-ఫారాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఉదయమే అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాగా.. వారికి టీడీపీ అధినేత చంద్రబాబు బీఫారాలు అందజేశారు. రాష్ట్ర పునర్మిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని చంద్రబాబు అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు. 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ఇదిలా ఉండగా.. 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను మార్చి బీఫారాలను అందజేసింది. టీడీపీ అభ్యర్థులు కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. గెలిచి కచ్చితంగా లోక్‌సభ, అసెంబ్లీకి వచ్చి తీరాలన్నారు.

భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం పని చేయడమే మోడీ లక్ష్యం..

భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం పని చేయడమే మోడీ లక్ష్యమని ఎంపీ రాజ్యసభ లక్ష్మణ్ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని కీస్ హై స్కూల్ లో తమిళ తులువా వెళ్లాల (ముదాలియర్) కమ్యూనిటీ వారు నిర్వహించిన తమిళ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కార్యక్రమానికి బిజెపి రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తమిళ సోదరులందరికి తమిళ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. నిజాం పరిపాలన అనంతరం తమిళనాడు నుండి చాల మంది హైదరాబాద్ వచ్చి సెట్టెల్ అయ్యారని అన్నారు. సుదూర ప్రాంతాల నుండి హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్థిరపడి ఎదుగుగారు అంటే చాల సంతోషమన్నారు.

తమిళనాడుతో దేశం మొత్తం ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. దేశంలో అనేక ప్రాంతం లో తమిళ భాషను గుర్తిస్తున్నారని తెలిపారు. ప్రధాని కూడా తమిళ భాషను ప్రత్యేకంగా గుర్తించారని అన్నారు. అనేక రంగాల్లో తమిళులు ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. ప్రధాని మన్ కి బాత్ కార్యక్రమంలో కూడా తమిళుల గురించి మాట్లాడిన సందర్భం ఉందన్నారు. తమిళ ప్రజలన్న తమిళ భాషన్న కూడా ప్రధానికి ప్రత్యేక అభిమానం ఉందన్నారు. కాశీకి రామేశ్వరానికి ఉన్న సంబంధాన్ని గుర్తించింది కూడా ప్రధాని మోడీ నే అన్నారు. తమిళ చరిత్రను డిల్లీ వరకు చేర్చారని తెలిపారు. ముదలియర్ కమ్యూనిటీ వారు ఎక్కువగా ఇక్కడ స్థిరపడ్డారని తెలిపారు. వారికి తగిన గుర్తింపు కావాలని ఈ సంఘం వారు కోరుతున్నారని అన్నారు.

‘ఇంపాక్ట్‌’ రూల్‌లో మార్పులు చేసేందుకు సిద్ధమే: బీసీసీఐ

ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్’ రూల్‌ను బీసీసీఐ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మ్యాచ్ జరుగుతుండగా అదనంగా బౌలర్‌ లేదా బ్యాటర్‌ను తీసుకొనే వెసులుబాటును కలిగింది. ఈ రూల్‌పై కొందరి నుంచి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంపాక్ట్‌ రూల్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంపాక్ట్‌ రూల్ తనను ఆకట్టుకోలేదని, దీంతో ఆల్‌రౌండర్ల అభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్ ఈ రూల్‌పై దృష్టి సారించింది.

ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్‌ ధుమాల్ ఇంపాక్ట్‌ రూల్‌పై మాట్లాడుతూ… ‘టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్లను గమనించాం. తప్పకుండా ఇంపాక్ట్‌ రూల్‌పై దృష్టిసారిస్తాం. ఫ్రాంచైజీలు, కమిటీ సభ్యులతో చర్చించి.. ఓ నిర్ణయానికి వస్తాం. ఇంపాక్ట్‌ రూల్‌లో మార్పులు చేసేందుకు మేము సిద్ధమే. అయితే ఆటలో కొత్త నిబంధన తీసుకొచ్చినప్పుడు లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి’ అని అన్నాడు. 2022-23 సీజన్‌ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా ఇంపాక్ట్‌ రూల్‌ను అమలు చేసిన బీసీసీఐ.. ఆ తర్వాత ఐపీఎల్‌లో అమలు చేస్తున్నారు. గత సీజన్‌తో పోలిస్తే.. ఈ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను అన్ని జట్లు బాగా ఉపయోగిస్తున్నాయి.

తెలంగాణ కోసం 14 ఏళ్లు కష్టపడింది మేము.. కానీ పేరొచ్చింది కేసీఆర్ కు..!

14 ఏళ్లు తెలంగాణ కోసం కొట్లాడిన పేరు కేసీఆర్ కి రావొచ్చు కానీ కష్టపడింది మేము అని మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని అస్మద్ పేటలో… పప్పుపటేల్ నివాసంలో స్థానికులు ఏర్పాటుచేసిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కి ఈటల రాజేందర్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మొదటి సారి అనుకుంటా.. ఓటు వేయడానికి ఇష్టపడని వారు కూడా మోడీ గారి పదేళ్ల పాలన చూసి ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. మోడీ నాయకత్వంలోనే దేశం పురోభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారని అన్నారు. 2014లో 273 సీట్లతో సంకీర్ణ రాజకీయాలకు స్వస్తిపలికిన నాయకుడు మోడీ అన్నారు.

మోడీ మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. మొదటిసారి ఎంపీగా గెలిచి ప్రధాని అయ్యారని ఇది చాలా అరుదు. మోడీలొ ఏదో తెలియని ప్రత్యేకత ఉంది.. ఆయన చేసే పనే మాట్లాడుతుందన్నారు. పక్కదేశాలు భారత్ భూమిని ఇంచుకూడా ఆక్రమించుకోకుండా చేశారన్నారు. మనవైపు కన్నెత్తి చూడడానికే భయపడుతున్నారని తెలిపారు. కాశ్మీర్ లోని లాల్ చౌక్ లో భారత మువ్వన్నెల జెండా స్వేచ్ఛగా ఎగురవేస్తున్నామని తెలిపారు. ఒకే దేశం ఒకే చట్టం ఒక కల ఉండే.. దానిని నిజం చేశారు మోడీ అన్నారు. మోడీకి ఒకప్పుడు అమెరికా వీసా నిరాకరిస్తే.. ఇప్పుడు వారి సెనేట్ లో జై మోడీ అని చప్పట్లు కొట్టించుకున్నారు. అమెరికా అధ్యక్షుని భుజం మీద చేయి వేసి మాట్లాడే స్థాయికి వచ్చామన్నారు. అప్పులు తెస్తే తప్ప గడవని భారతదేశ ఆర్థిక వ్యవస్థను 11 వ స్థానం నుండి 5 స్థానానికి తీసుకువచ్చారు. మళ్ళీ అధికారం ఇస్తే మూడవ స్థానానికి తీసుకువస్తాం అనీ హామీ ఇస్తున్నారన్నారు. ఎదిగిన దేశాల సరసన నిలబెడతామంటున్నారని తెలిపారు. మోడీ కంటే ముందు 3 ఎయిమ్స్ ఉంటే ఈ పదేళ్లలో 16 ఎయిమ్స్ వచ్చాయి.

మా ప్రధాని అభ్యర్థి మోడీ.. మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?

మేం మోడి ప్రధాని అంటూ ఓట్లడుగుతున్నాం, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఓట్ల కోసం కాదు, భక్తితో రాముడి పేరు వాడుకుంటున్నాం. ఆసరా పెన్షన్లు ఎవరి అకౌంట్లో ఐనా పడినాయా? అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ వాళ్ళు గుడిని మింగితే, కాంగ్రెస్ వాళ్ళు గుడిని గుడిలోపలి లింగాన్ని మింగే రకం అన్నారు. ప్రజల కోసం మేం పోరాడితే, మీరు కాంగ్రెస్ వాళ్ళకు ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరువై, ప్రజలకు తెలియని అభ్యర్థికి పోటీలో నిలపడానికి ప్రయత్నిస్తుందన్నారు.

రాహుల్ గాంధీకి అస్వస్థత.. ఇండియా కూటమి ర్యాలీకి గైర్హాజరు..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణాల వల్ల రాంచీలో జరిగే ఇండియా కూటమి ర్యాలీకి ఆయన హాజరుకాలేకపోతున్నారని జైరాం రమేష్ చెప్పారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్ తరుపున ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారు. ఆప్ నుంచి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి ప్రతిపక్ష నాయకులు హాజరుకానున్నారు. ఈ రోజు రాంచీ వేదికగా ఇండియా కూటమి నేతలు బలప్రదర్శన చేయనున్నారు.

రాహుల్ గాంధీ సాత్నాలో ప్రచారంలో ప్రసంగించిన తర్వాత రాంచీలో ఇండియా బ్లాక్ ర్యాలీకి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే అతను అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారని జైరాం రమేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాంచీలో జరిగే ‘‘ ఉల్గులన్ న్యాయ్’’ ర్యాలీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం భార్య కల్పనా సోరెన్ కూడా హాజరుకానున్నారు.

ఈటల రాజకీయ జీవితం.. రాహుల్ గాంధీ నాయకత్వం ముందు చాలా చిన్నది

ఈటల రాజేందర్ రాజకీయ జీవితం.. రాహుల్ గాంధీ నాయకత్వం ముందు చాలా చిన్నదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చరిత్ర.. రాజకీయం మీద బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారని, ఆయన ముందు వీళ్లంతా చిన్న వ్యక్తులు అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులకు స్పష్టంగా చెబుతున్నానని, దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ, మోడీ చుట్టే తిరుగుతున్నాయన్నారు. రాహుల్ గాంధీ గురించి కానీ .. మోడీ గురించి చెప్పాల్సిన అవసరం ఉందని, మోడీ ప్రధాని కాకముందు.. అద్వానీ రథయాత్ర ప్రారంభ సమయంలో ఆయన వెనక ఉండి సర్వీస్ చేసే వాడు.. మోడీ అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కి మోడీ కి చాలా వ్యత్యాసం ఉందని, అద్వానీ రథయాత్ర కి ముందు దేశానికి .. గుజరాత్ కి మోడీ ఎవరో కూడా తెలియదన్నారు జగ్గారెడ్డి.

వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి 80 శాతం ప్రజలకు చేరింది

ఎన్నికల పై నియోజకవర్గాల వారీగా సమీక్ష చేస్తున్నామన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి 80 శాతం ప్రజలకు చేరిందని, కూటమికి అజెండా లేదన్నారు. అధికారం కోసమే పొత్తులతో టీడీపీ కూటమి నానా జాతి సమితి ఒకవైపు అని, మంచి చేసిన మేము ఒక వైపు అని ఆయన వ్యాఖ్యానించారు. నానాజాతి సమితి అంతా కలిసి అధికారం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. 2014 -19 అరాచక ప్రభుత్వం కావాలా అని, 2019-24 మధ్య ఉన్న ప్రజా ప్రభుత్వం కావాలో ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. పెనమలూరు నుంచి జోగి రమేష్ గెలుపు ఇప్పటికే ఫిక్స్ అయ్యిందని, పెనమలూరు నుంచి మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే టీడీపీలోకి ఫిరాయించారన్నారు. గతం కంటే ఎక్కువ మెజారిటీతో పెనమలూరులో విజయం సాధిస్తామన్నారు సజ్జల.

పొదలకూరులో చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభ అట్టర్ ప్లాప్

పొదలకూరులో చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభ అట్టర్ ప్లాప్ అని, గూడూరులో సభ తర్వాత గంటన్నర సేపు అక్కడే వేచి ఉన్నారన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లాలో మాట్లాడుతూ.. సభ సమయం ప్రకారం 3 గంటలకు 500 మంది కూడా లేరన్నారు. గరిష్టంగా సభకు 15 వందల మంది వచ్చారని, చంద్రబాబు మాట్లాడేటప్పుడు 300 మంది కూడా లేరన్నారు కాకాణి గోవర్థన్‌ రెడ్డి. మెట్ట ప్రాంతమైన సర్వేపల్లి.కి చంద్రబాబు ఏమీ చేయలేదని, అందుకే ఏమీ చెప్పుకోలేక పోయారని, అందుకే నన్ను.జగన్ ను తిట్టారన్నారు. నా మీద చంద్రబాబు అభియోగాలు చేశారని, ఆ అభియోగాలపై సి.బి.ఐ.విచారణ జరిపించాలని కోర్టు ను కోరేందుకు నేను సిద్ధమన్నారు కాకాణి గోవర్థన్‌ రెడ్డి. దమ్ముంటే చంద్రబాబు..కూడా తన పై వచ్చిన అభియోగాల పై సీబీఐ విచారణ కోరే ధైర్యం ఉందా అని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా..’చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజలకు తెలుసు. సర్వేపల్లి లో చంద్రబాబు కె.జి.ఎఫ్..అన్నారు. సర్వేపల్లిలో జరిగిన అభివృద్ధి చూపిస్తా రండి. వాటిని చూస్తే కుప్పంలో ఎందుకు ఈ పనులు చేయలేకపోయానని చంద్రబాబు బాధ పడతారు. ప్రజలకు చంద్రబాబుపై నమ్మకం లేదు. పొదలకూరు సభకు ప్రజలు రాకపోతే నేను ఆపానని చంద్రబాబు ఆరోపించారు. సోమిరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లారు. ప్రజలు రాకపోవడంతో అసంతృప్తి లో నన్ను..జగన్ ను తిట్టారు. జగన్ అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు సంతృప్తిగా వున్నారు. వ్యవసాయం గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు హయాంలో వర్షాలు కురవలేదు. కానీ బ్రహ్మాండంగా వ్యవసాయం జరిపించానని చెబుతున్నారు.

 

Exit mobile version