NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

భూవివాదాలను త్వరగా పరిష్కరించండి.. మంత్రి లోకేష్‌ ఆదేశాలు

ప్రజా సమస్యల పరిష్కారం ఫోకస్‌ పెట్టారు మంత్రి నారా లోకేష్‌.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా దర్బార్‌ నిర్వహిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ.. వారి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.. ఇక, 28వ రోజు కూడా మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు క్యూ కట్టారు ప్రజలు.. అయితే, భూవివాదాలపై ప్రజల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నందున ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు లోకేష్.. సంబంధిత శాఖతో సమన్వయం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఉండవల్లిలోని నివాసంలో 28వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలను విన్నవించారు. ఆయా విజ్ఞప్తులను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణం కోసం పెదవడ్లపూడికి చెందిన 40 మంది వృద్ధులు కలిసి సేకరించిన రూ.28వేల విరాళాన్ని “ప్రజాదర్బార్” లో మంత్రి నారా లోకేష్ ను కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు మంత్రి లోకేష్‌.

సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి తీరుతాం..

బీఆర్ఎస్ రాగానే సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి తీరుతామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ దొంగలా దొరికిపోయిందని తెలిపారు. ఇంకా 13 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉందని మంత్రులు ఒప్పుకున్నారన్నారు. బ్యాంకర్ల లెక్క ప్రకారం 50 లక్షల మంది రైతులు 49 వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం చెప్పిన 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీని ఎప్పుడు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రుణమాఫీ అయిందని సీఎం డ్యాన్సులు వేస్తున్నారన్నారు. రాజీనామా ఎవరు చేయాలో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. రైతులకు, బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఇంకా పని మొదలు పెట్టలేదని తెలిపారు. ప్రభుత్వంలో మంత్రుల మాటలకు పొంతన లేదన్నారు.

వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్లకు పొంగులేటి ఆదేశం..

వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి, జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కేసీఆర్ ట్యూనింగ్ చేస్తే.. కిషన్ రెడ్డి మ్యూజిక్ ఇస్తుండు..

కేసీఆర్ ట్యూనింగ్ చేస్తే.. కిషన్ రెడ్డి మ్యూజిక్ ఇస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 9 లోపు రూ.2 లక్షలు రుణాలు పొందిన రైతులందరికి రుణమాఫీ జరుగుతుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రతి పక్షాల తప్పుడు ప్రచారంతో రైతులు కంగారు పడొద్దన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విదంగా తెలంగాణాలో 2లక్షల రుణమాఫి ఒకేసారి చేసిన ఘనత మాదే అన్నారు. పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ అధికారంలో ఉండి రైతులకు ఏమిచేశారని ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి ఓట్లు బదలాయింపు చేసుకున్న 8 సీట్లు దాటలేదన్నారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రామ పంచాయతీలకు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల వ్యయాన్ని రూ. 10- 25 వేలకు పెంచినట్టు సమీక్షలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం నిర్వహణకు ప్రత్యేకమైన మొబైల్ యాప్ రూపొందించి పర్యవేక్షిస్తున్నట్టు సీఎంకు గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీకి అనర్హత వేటు నిబంధనను తొలగించినట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీనిపై కేబినెట్‌లో చట్ట సవరణ బిల్లు కూడా ఆమోదించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపుపైనా సమీక్షలో చర్చించారు. దీనిపై పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ నెల 23 తేదీన 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు వివరించారు.

బాలికలపై అసభ్యంగా ప్రవర్తించిన స్కూల్ స్వీపర్..పెద్దఎత్తున నిరసనలు..రైలు రోకో

కోల్‌కతాలో ఓ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. తాజాగా ముంబైలోని థానేలో ఇద్దరు బాలికలను వేధించడంపై తల్లిదండ్రుల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. కోల్‌కతాలాగే ఇప్పుడు ముంబైలోనూ ప్రజల ఆగ్రహం కనిపిస్తోంది. ముంబైకి ఆనుకుని ఉన్న థానే జిల్లాలోని బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఇద్దరు బాలికలపై ఓ స్వీపర్ ఈనెల 14న అఘాయిత్యానికి పాల్పడిన ఘటనపై పెను దుమారం చెలరేగుతోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. నిరసన కారులు పాఠశాలను ధ్వంసం చేసి రైల్వే ట్రాక్‌ను దిగ్బంధించారు. ఆ తర్వాత పోలీసులు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

రాజధాని పరిధిలో కొనసాగుతోన్న జంగిల్ క్లియరెన్స్

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో జంగిల్ క్లియరెన్స్ కొనసాగుతోంది. జంగిల్ క్లియరెన్స్ పనులను మంత్రి నారాయణ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఐఐటీ నిపుణుల నివేదిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ఐఐటీ నిపుణుల నివేదిక వచ్చాక ఐకానిక్ కట్టడాల ప్రాంతంలోని నీటిని సీఆర్‌డీఏ తోడనుంది. ప్రస్తుతం ఐకానిక్ కట్టడాల ప్రాంతం చెరువులను తలపిస్తోంది. ఐకానిక్ కట్టడాల వద్ద 0.7 టీఎంసీల నీరు నిల్వ ఉందని సీఆర్‌డీఏ చెప్తోంది. ఐకానిక్ కట్టడాల వద్దనున్న నీటిని తోడేందుకు సీఆర్డీఏ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఐకానిక్ కట్టడాల వద్దనున్న నీటిని పాలవాగులోకి తరలించేందుకు పిల్ల కాల్వలు తవ్వే యోచనలో సీఆర్డీఏ ఉంది. ఈ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

కేటీఆర్‌కు ఏం మాట్లాడాలో.. ఎలాంటి విషయాలు మాట్లాడాలో తోయడం లేదు

కేటీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని, రాజకీయాలు మీకు..మాకు అవసరమే.. కానీ ఏం మాట్లాడాలో..ఎలాంటి విషయాలు మాట్లాడాలో తోయడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జగ్గారెడ్డి అన్నారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్.. ఎక్కడైనా పొలిటికల్ కోచింగ్ సెంటర్ ఉంటే కోచింగ్ తీసుకో బెటర్ అని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ దేశ ప్రజల కోసం బలిదానం అయ్యారని, మిలిటెంట్లు కాల్చి చంపింది నిజమే కదా ? అని ఆయన అన్నారు. కేసీఆర్ గారు.. కేటీఆర్ కి కొంత ట్రైనింగ్ ఇప్పించండని, రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ ముందు తీసేస్తం అంటాడా..? అని ఆయన మండిపడ్డారు. ప్రజలు మాకు ఐదేళ్లు అధికారం ఇచ్చారని, రాజీవ్ గాంధీ .. 18 ఏండ్లు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించారన్నారు జగ్గారెడ్డి. కేటీఆర్.. అమెరికా లో ఐటి ఉద్యోగం చేసిన అంటున్నావు.. ఆ ఐటి నీ తెచ్చింది రాజీవ్ గాంధీ అని ఆయన వ్యాఖ్యానించారు.

వంద రోజుల్లో 1.20 లక్షల ఇళ్ల నిర్మాణమే మా లక్ష్యం!

రాష్ట్రంలో వంద రోజుల్లో 1.20 లక్షల ఇళ్లు, రాబోయే రోజుల్లో 7 లక్షల ఇళ్ల నిర్మాణమే మా లక్ష్యమని ఏపీ గృహనిర్మాణి, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. గృహనిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టామని, మైలవరంలో ఇళ్ల స్థలాల అంశంలో ఇబ్బందికర పరిస్ధితులు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో నిర్ణయించిన స్థలాలు నివాసయోగ్యంగా లేవన్న ఆయన.. కొన్నిచోట్ల వరదలు వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు. గత ప్రభుత్వం సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా భూములను తీసుకుందని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వం రాజకీయ కక్షపూరిత ఆలోచనలు కారణంగా ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందిపడ్డారన్నారు. గృహ నిర్మాణంలో మట్టికోసం కొత్త విధానం ఆలోచించామని… ఫ్లై యాష్‌ను వాడే విధంగా ఆలోచించామన్నారు. 2014-2019 గృహ నిర్మాణాలపై కొన్ని ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని.. 2014-19 నాటి గృహాలకు కూడా డబ్బు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో గృహనిర్మాణాలను వ్యాపార ధోరణిలో చూశారని విమర్శలు గుప్పించారు.

రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీకి రావాలి.. హరీష్‌కు మైనంపల్లి సవాల్‌

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావుకి మైనంపల్లి హనుమంతరావు సవాల్‌ విసిరారు. రుణమాఫీ చేసినందుకు హరీష్‌రావు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉప ఎన్నికల్లో ఇద్దరం నిలబడదామని, మళ్లీ హరీష్‌ రావు గెలిస్తే నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన అన్నారు. సిద్దిపేటలో రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీకి రావాలి మైనంపల్లి హనుమంత రావు డిమాండ్‌ చేశారు. సిద్ధిపేటలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. బీఆరెస్ రుణమాఫీ సమస్యపై సమావేశం నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ సంబర సభను నిర్వహించింది. కాంగ్రెస్ సభకు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హాజరయ్యారు.