ఈ నెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. 24న ఆల్ పార్టీ మీటింగ్
ఈ నెల 25 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించింది. నవంబర్ 24న ఆల్ పార్టీ మీటింగ్ ను ఏర్పాటు చేసింది. పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఈరోజు (మంగళవారం) తెలిపారు. పార్లమెంట్ ఉభయసభల్లోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లను సభా వ్యవహారాలపై చర్చించేందుకు సెంట్రల్ సర్కార్ మీటింగ్ కు ఆహ్వానించింది. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై పార్లమెంట్ సెషన్స్ లో చర్చించే ఛాన్స్ ఉంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేంద్‌రెడ్డికి హైకోర్టులో ఊరట..
వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి కాస్త ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. చర్లపల్లి జైలులో నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించిన న్యాయస్థానం ఇంటి భోజనానికి అనుమతించింది.
నాపై అసత్య ప్రచారానికి బీజేపీ రూ.500 కోట్లు ఖర్చు చేసింది..
తనపై అసత్య ప్రచారం చేసేందుకు బీజేపీ భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతోందంటూ ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆరోపణలు చేశారు. ప్రజల్లో విద్వేషాన్ని రగిల్చేందుకు యత్నిస్తోందన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బీజేపీ తనపై చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి ఎక్స్ (ట్విటర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. ప్రజల్లో నాపై విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు కాషాయ పార్టీ ట్రై ఏకంగా రూ. 500 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. అలాగే, రాష్ట్రంలోని సంకీర్ణ సర్కార్ గురించి అసత్య ప్రచారం చేసేందుకు 9 వేలకు పైగా వాట్సప్ గ్రూప్‌లను సృష్టించిందన్నారు. కానీ, నేను ఝార్ఖండ్ బిడ్డని.. ఈ గడ్డపై ఇలాంటి సంస్కృతికి తావు లేదని పిలుపునిచ్చారు. అలాంటి పనులు ఎప్పటికీ చేయలేనని సీఎం హేమంత్ సోరెన్ చెప్పుకొచ్చారు.
పంచాయతీరాజ్ బిల్లు ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం.. కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలో పంచాయతీరాజ్ బిల్లును ప్రవేశపెట్టారు.. ఆశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. గ్రామాల్లో పరిశుభ్రత అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. అయితే, డంపింగ్ యార్డ్ సమస్య ప్రధానంగా మారిందన్నారు.. దీని కోసం మండలం యూనిట్‌గా డంపింగ్ యార్డ్‌లను ఏర్పాటు చేస్తున్నాం అని వివరించారు.. ఇక, 2019-24 మధ్య పంచాయతీ భవనాలకు రంగులు వేయడానికి రూ.104.81 కోట్లు ఖర్చు చేశారని దుయ్యబట్టారు పవన్ కల్యాణ్..
విశాఖ లా స్టూడెంట్ అత్యాచార ఘటనపై స్పందించిన హోం మంత్రి
విశాఖ లా స్టూడెంట్ అత్యాచార ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ పోలీస్ కమిషనర్‌తో మంత్రి అనిత ఫోన్‌లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ యువకులను కఠినంగా శిక్షించాలని పోలీసులను హోంమంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం ఉండగా ఉంటుందని హోం మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.
జీవో 16ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 16ను కొట్టివేసింది. ఈ జీవో ద్వారా దాదాపు 8,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం చట్టపరంగా చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. ముఖ్యంగా విద్య, వైద్య శాఖలలో ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం గమనార్హం. ఈ జీవో తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ, వారు హైకోర్టును ఆశ్రయించారు. వారి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, జీవో 16 చట్టప్రకారం నిలబడదని తీర్పునిచ్చింది. తాజా తీర్పుతో రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. హైకోర్టు తీర్పు తీరుతో తమ భవిష్యత్తు గందరగోళంలో పడిందని వారు చెబుతున్నారు. ఈ సంక్షోభ పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఎలాంటి మార్పు తీసుకురాగలవో వేచి చూడాల్సి ఉంది.
గత ఐదేళ్ల పాలనలో పోలవరం 20 ఏళ్లు వెనక్కి పోయింది..
ఏపీ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు గురించి వివరించారు. డయాఫ్రం వాల్ ఉందో లేదో తెలియకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఫేజ్ – 1, ఫేజ్ – 2 అని ఏ రోజూ మేం చెప్పలేదన్నారు. పోలవరంతో పాటుగా చింతలపూడి, హంద్రీనీవాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేస్తున్నారన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్‌ను విధ్వంసం చేయడమే లక్ష్యంగా పని చేశారని విమర్శించారు.
కాళోజి కళాక్షేత్రం భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
వరంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి నేడు పర్యటిస్తున్నారు.. ఈ పర్యటనలో భాగంగా ఆయన కాళోజి కళాక్షేత్రం భవనాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా.. కాళోజీ కళాక్షేత్రంలో కాళోజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కళాక్షేత్రంలోని గ్యాలరీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఇదేకాకుండా.. డిజిటల్ పద్ధతిలో వరంగల్‌లో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి.
పోలవరం ఏపీకి జీవనాడి.. పూర్తయితే కరవుకు చెక్ పెట్టినట్లే..
పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి, వెన్నెముక లాంటిదని.. అది పూర్తయితే ఏపీ కరవుకు చెక్ పెట్టినట్లేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ఉన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరావతి, పోలవరం ఏపీకి రెండు కళ్లు అని వ్యాఖ్యానించారు. మన రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ పోలవరం అని పేర్కొన్నారు. నీటి వాడుకలో మార్పులు చేస్తే పర్యావరణంలో కూడా మార్పులు వస్తాయన్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఫ్లోరైడ్ పరిస్థితులు చూస్తున్నామన్నారు. రూ.55వేల కోట్లకు పోలవరం నిర్మాణ వ్యయం చేరిందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం 7 మండలాలు ఏపీకి ఇవ్వాలని కోరానని.. కృష్ణా డెల్టాకు గోదావరిని తీసుకొచ్చి రెండు నదుల అనుసంధానం చేశామన్నారు.
పోలీసుల ముందు లొంగిపోయిన లగచర్ల కేసు నిందితుడు సురేష్
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ స్థాపనపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ , ఇతర రెవెన్యూ అధికారులపై స్థానికుల దాడి జరిగింది. ఈ దాడిలో అధికారులు ప్రయాణిస్తున్న వాహనాలను రాళ్లతో ధ్వంసం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై దాడి జరగడంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఘటన వెనుక బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని ఆరోపించింది. స్థానికులను రెచ్చగొట్టి అధికారులపై దాడి చేయించారని కాంగ్రెస్ విమర్శలు చేసింది. బీఆర్ఎస్ నేతల ఆదేశాల మేరకు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తన అనుచరుడు భోగమోని సురేష్‌తో కలిసి ఈ దాడి ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.