NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

నేడు సీఎల్పీ సమావేశం.. రేపు అభిషేక్‌ సింఘ్వీ నామినేషన్..

నేడు కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. నానక్ రామ్‌గూడలోని హోటల్ షెరటన్‌లో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలను ఆహ్వానించారు. ఈ భేటీలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీని పరిచయ కార్యక్రమంతోపాటు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. సీఎల్పీ సమావేశంలో తన రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని సింఘ్వీ పార్టీ ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కోరనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో సింఘ్వీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.

పోలవరం ప్రాజెక్టు దస్త్రాల దహనం.. అధికారులపై మంత్రి కందుల దుర్గేశ్ ఆగ్రహం!

ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఫైళ్లను దగ్ధం చేసిన ఘటనపై నిర్లక్ష్యంగా ఉన్న అధికారులు, సిబ్బందిపై మంత్రి కందుల దుర్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దహనమైన వాటిని రాజమహేంద్రవరం ఆర్డీవో శివజ్యోతి జిరాక్స్‌ పేపర్లుగా ప్రకటించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి కాల్చివేసిన కాగితాలను నేడు మంత్రి దుర్గేష్ పరిశీలించారు. జిరాక్స్ కాగితాలని చెప్పుతున్న వీటిలో ఒరిజినల్ కాగితాలు ఉన్నట్లుగా ప్రజలు అనుకుంటున్నారని, ఈ అపోహలను నివృత్తి చేయాలని అధికారులకు మంత్రి కందుల దుర్గేశ్ విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్నారని విమర్శించారు. బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని జాయింట్ కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌కు మంత్రి దుర్గేశ్ సూచన చేశారు. బాధ్యులైన సిబ్బందిని రక్షించవద్దని, పూర్తిస్థాయి విచారణ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

గుండెలు పిండే విషాదం.. తల్లి అంత్యక్రియల కోసం కూతురు భిక్షాటన..

కూతురు పుట్టిన కొద్దిరోజులకే తండ్రి చనిపోయాడు.. అయితే ఆ కూతురికి అన్నీ తానే ఉండి చూసుకుంది ఓ తల్లి. కూతురి ఆలనా పాలనా చూసుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తూ వచ్చింది. ఇంతలోనే ఏమైందో ఏమో తెలియదు.. ఆ తల్లి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దమైంది. అయితే తన కన్న కూతురు ఏమైపోతుంది అనే మాట మరిచిపోయింది. ఆర్థిక పరిస్థితులతో కుటుంబాన్ని, తన కూతురుని పెంచలేను అనుకుందో ఏమో ఇంట్లో కూతురు లేని సమయంలో ఆ తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్ తరోడ గ్రామంలో గుండెలు పిండే విషాదం జరిగింది. తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిని విగత జీవిగా చూసిన ఆ కూతురుకి ఏం చేయాలో అర్థకాని పరిస్థితి నెలకొంది. స్థానికులకు ఈ వార్త తెలియడంతో మృత దేహాన్ని కిందికి దించారు. అయితే పూట గడవడమే కష్టంగా మారిని ఆ కుటుంబానికి అంత్యక్రియలకు కాసులు కరువయ్యాయి. ఆ కూతురు తల్లి మృతదేహం వద్ద ఎవరైనా సహాచం చేస్తారేమో అంటూ దీనంగా చూసింది. కానీ.. ఎవరూ తన తల్లి అంత్యక్రియలకు డబ్బులు ఇవ్వకపోవడంతో చివరకు తల్లికోసం కూతురు భిక్షాటన చేసింది. ఇంటి ముందు ఓ దుప్పటిని పరిచి అంత్యక్రియలకు సహాయం చేయాలను కోరుకుంటూ దీనస్థితిలో కూర్చున్న ఆ బాలికను చూసి.. అక్కడున్న వారందరికి కన్నీరు తెప్పించింది.

రాహుల్, ఖర్గేకి కేటీఆర్ లేఖ..

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ పేరుతో చేసిన మోసంపైన రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో రుణమాఫీ అందని లక్షలాదిమంది రైతుల తరఫున ఈ లేఖ రాస్తున్నానని కేటీఆర్ తెలిపారు. సీఎం చెప్పిన అబద్ధాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను కేటీఆర్ ఈ లేఖలో పొందుపరుస్తునన్నట్లు వివరించారు. తెలంగాణలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకి రెండు రక్షల రుణమాఫీ హామీ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం అనేక షరతులు పెట్టి 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని తెలిపారు.

విషాదం.. హంసలదీవి బీచ్‌లో ఇద్దరు పర్యాటకులు గల్లంతు

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం హంసలదీవి బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. గుడివాడకు చెందిన ఐదుగురు సముద్రంలో కొట్టుకుపోతుండగా.. ముగ్గురిని తోటి పర్యాటకులు, మెరైన్‌ పోలీసులు కాపాడారు. ఇద్దరు సముద్రంలో గల్లంతు కాగా.. ఒకరి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. మరో ముగ్గురు సముద్రం నీరు తాగేయడంతో ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మహిళను షేక్‌ ఫజల(26)గా గుర్తించారు. గల్లంతైన వ్యక్తిని ముషారఫ్ (20)గా గుర్తించారు. ఈరోజు ఉదయం గుడివాడ నుంచి హంసలదీవి బీచ్ వద్దకు వారు విహారయాత్రకు వచ్చినట్లు తెలుస్తోంది. గల్లంతయిన వ్యక్తి కోసం మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాపాడిన ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

దారుణం.. భార్యను హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేసిన భర్త

జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్తే ఆమెపాలిట కాలయముడై భార్యను అతి కిరాతకంగా చంపాడు. భార్యను చంపడమే కాకుండా ఎవరికీ అనుమానం రాకుండా రైల్వే ట్రాక్‌పై పడేశాడు ఆ దుర్మార్గపు భర్త. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని దూళ్లవానిగూడెంలో చోటుచేసుకుంది. దూళ్లువానిగూడెంకు చెందిన రాజేష్, సునీతలు భార్యాభర్తలు. వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలోనే రాజేష్‌ ఆమెను హత్య చేయాలని ప్లాన్‌ రచించాడు. ఇంటి దగ్గర ఉన్న కాల్వలో ముంచి సునీతను భర్త రాజేష్ కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ప్లాన్‌ ప్రకారం మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశారు. ట్రాక్‌పై మృతదేహం ఉన్న విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సునీతను భర్త రాజేష్ హత్య చేశాడని తెలుసుకున్నారు. ప్రస్తుతం భర్త రాజేష్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు!

కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ కేసు అధికార పార్టీకి సవాల్ గా మారింది. సొంత పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి. మొదటగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించగా.. ఇప్పుడు కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆరోగ్య సలహాదారు పదవి నుంచి కూడా తొలగించారు. అయితే.. ఈ ఘటనలో టీఎంసీ పార్టీ నేతలే పరస్పరం తప్పు పట్టుకునే పరిస్థితి దాపరించింది. తాజాగా ఆ పార్టీ నేత సుఖేందు శేఖర్‌ రాయ్‌ ఈ కేసు విచారణలో సీబీఐ నిక్కచ్చిగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.

మా అక్క చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోం

కామారెడ్డి క్లాసిక్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ సన్మాన సభ. ఈ సభలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ పాల్గొన్నారు. ఎంపీగా మొదటిసారి కామారెడ్డికి వచ్చిన సురేష్ షెట్కార్‌ను షబ్బీర్‌ అలీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఆడవాళ్ళకు బ్రేక్ డాన్స్ చేయిస్తా అన్న వారికి బుద్ధి చెబుతామన్నారు. మా అక్క చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోమని ఆయన వ్యాఖ్యానించారు. 200 యూనిట్స్ కరెంటు కొన్ని చోట్ల పొరపాట్లు జరుగుతున్నాయి..దానిని టీఆర్ఎస్ వాళ్ళు పెద్దగా చేస్తున్నారని, అధికారులు సరి చేస్తున్నారన్నారు షబ్బీర్‌ అలీ. రుణమాఫీ కొందరికి అందలేదు…అందరికీ మాఫీ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, జిల్లాలో రుణమాఫీ కోసం 6 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు షబ్బీఆర్‌ అలీ. అందరికీ మాఫీ అయ్యేలా కమిటీని వేస్తున్నామని ఆయన తెలిపారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రుణమాఫీ గురించి మాట్లాడని కేసీఆర్, కేటీఆర్ లు ఇప్పుడు ఇష్టమచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు, చేశాము ఏమాయే రాజీనామా అని ఆయన వ్యాఖ్యానించారు.

రాజ్యాధికారం కొరకు పాటుపడిన మహానుభావుడు పాపన్న గౌడ్

రాజన్న సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ బైపాస్ రోడ్డులో సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాజ్యాధికారం కొరకు పాటుపడిన మహానుభావుడు పాపన్న గౌడ్ అని ఆయన కొనియాడారు. భారత దేశానికి స్వాతంత్రం, తెలంగాణలో ఉన్న నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది పాపన్ననే అని ఆయన వ్యాఖ్యానించారు. సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలన్న సంకల్పంతో గౌడన్నల సంక్షేమం కొరకు ఆనాడు కేసీఆర్‌ ఎన్నో మంచి పనులు చేసాడని, గౌడన్నల కొరకు చెట్లపై పన్నులు తీసివేసి వారి కుల వృత్తిని కాపాడింది కేసీఆర్‌ ప్రభుత్వమన్నారు. గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించి వైన్ షాపులు కేటాయించామని, గత ప్రభుత్వం లో నీర ను ప్రోత్సహించి ట్యాంకు బండిపై నీరా కేఫ్ పెట్టీ నీర వల్ల ఉపయోగాలు ప్రజలకు చెప్పడం జరిగింది దానివల్ల ఉపాధి కూడా కల్గిందన్నారు. గత ప్రభుత్వంలో 1000 పైగా గురుకులాల ఏర్పాటుచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఆరున్నర లక్షల మంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించామని, సర్వాయి పాపన్న మహానీయుడి విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక జనగామ జిల్లాకు అతని పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

వైద్యురాలి హత్యాచారం కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

కోల్‌కతాలోని ఆర్‌జీకార్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్య, అత్యాచారం కేసును సుప్రీంకోర్టు స్వయంచాలకంగా స్వీకరించింది. ఈ కేసును ఆగస్టు 20న సుప్రీంకోర్టు విచారించనుంది. మంగళవారం, ఆగస్టు 20న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఇప్పటి వరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్త ఆగ్రహావేశాలు, వైద్యుల సమ్మె మధ్య ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలయ్యింది. ఆగస్టు 9న కోల్‌కతాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం, హత్య ఘటనను స్వయంచాలకంగా పరిగణించాలని ప్రధాన న్యాయమూర్తికి లేఖ పంపారు. ఈ కేసును విచారించాలని అభ్యర్థిచారు.