బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలి..
ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని బరిలోకి దించాలని గోనెగండ్ల మాజీ సర్పంచ్ రంగముని పోతలపాటి అభ్యర్థించారు. ఆయనతో పాటు నాయకులు బాబు నాయుడు, లక్ష్మీనారాయణ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గం వారికి కేటాయిస్తే.. తాము గెలిపించుకోవడానికి తమ శాయ శక్తుల కృషి చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు.. గోనెగండ్ల మండలంలోని కాశీ నీలకంఠేశ్వర దేవాలయం, చింతలముని నల్లారెడ్డి ఆశ్రమంలో పూజలు చేసి మండలంలో విస్తృత ప్రచారం చేశారు. పెద్దమర్రి వీడు, చిన్నమర్రి వీడు, కులుమాల గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.
పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలి
తుమ్మల నాగేశ్వర రావు ఇటీవల ప్రధాన మంత్రి ప్రకటించిన జాతీయ పసుపు బోర్డును తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని తేదీ 17 ఫిబ్రవరి 2024 నాడు లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు పసుపు రైతుల చిరకాల ఆకాంక్ష. గత పార్లమెంట్ ఎన్నికలలో పసుపు రైతులు పెద్ద ఎత్తున నిజామాబాద్ ఎం.పీ స్థానానికి నామినేషన్లు వేసి నిరసన తెలిపిన విషయము అందరికి విదితమే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి పసుపు బోర్డు ఏర్పాటుకు స్పష్టమైన వాగ్దానం ఇచ్చి, తర్వాత 4 అక్టోబర్ 2023 నాడు పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. అందులో ఎక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రదేశంకాని, దానికి అవసరమగు బడ్జెట్ ప్రతిపాదన కానీ లేకుండా కేవలం కమిటీ సభ్యుల నియామకమునకు సంబందించి మాత్రమే వివరాలను గెజిట్లో పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లాలో విష జ్వరాలు విజృంభణ..
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నూతక్కి వారి కండ్రికలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ ఒకరిద్దరు జ్వరాలతో సతమతవుతున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి. చాలా మంది నెల్లూరు వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. వారం రోజుల నుంచి జ్వరాలు తగ్గకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పారిశుద్ధ్య లోపంతో దోమలు పెరగడంతో.. డెంగీ జ్వరాలేమోనని భయపడుతున్నారు. అంతేకాకుండా.. ఒళ్లు నొప్పులతో కదల్లేకపోతున్నామని నీరసంగా ఉంటోందని బాధితులు వాపోతున్నారు.
చంద్రబాబుకు చీరాల ఎమ్మెల్యే స్ట్రాంగ్ కౌంటర్..
చంద్రబాబుపై చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ రిజెక్ట్ చేసిన వాళ్ళందరిని పార్టీలోకి తీసుకున్న ఘనత చంద్రబాబుదని ఆరోపించారు. పార్టీలో పక్క నియోజకవర్గానికి పంపితే చెత్త అంటున్నాడని.. మరి అలాంటి చెత్తను టీడీపీలో చేర్చుకుంటే సెంటా అని నిలదీశారు. మరి అలాంటి చెత్తను మీరు మీ పార్టీలో చేర్చుకుని ఎంత మందిని పునీతులు చేస్తారో చెప్పాలని కౌంటర్ ఇచ్చారు.
ఇంకొల్లు రా కదలిరా సభలో కరణం బలరాం పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. 2019 వరకు కరణం బలరాంను తామే గెలిపించుకుంటూ వచ్చామన్నారు. దుర్మార్గుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో పాముకోవచ్చని పార్టీ వదిలి వెళ్ళాడన్నారు. మోసం చేసిన వాళ్లకు బుద్ది చెప్పాలన్నారు. వ్యాఖ్యలకు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను, చంద్రబాబు 1978లో ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామన్నారు. తాను యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఓ బ్లాక్ కి అధ్యక్షుడిగా మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. ఏదో కాలం కలిసొచ్చి కిందా మీదా పడి స్థాయి పెరిగినంత మాత్రాన ఇలా చౌకబారు విమర్శలు చేయటం సరికాదన్నారు. చంద్రబాబు చరిత్ర మొత్తం తనకు తెలుసని.. తనపై అవాకులు, చెవాకులు పేలితే గట్టిగా సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు.
తెలంగాణలో భారీగా ఏసీపీ అధికారులు బదిలీ
తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచన మేరకు ఈ బదిలీలు జరుగుతున్నాయి. అయితే.. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాష్ట్రంలోని పలు కీలక శాఖలో భారీగా బదిలీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా 61 మంది ఏసీపీ అధికారులను బదిలీ చేస్తున్నట్లు డీజీపీ రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే శనివారం 12 మంది అడిషనల్ ఎస్పీలను బదిలీ చేశారు. ఎన్నికల సంఘం సూచనలతో ప్రభుత్వ అధికారులు.. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లు, డీఎస్పీలు, ఆర్డీవోలు, ఐపీఎస్ అధికారులు, అడిషనల్ కలెక్టర్లను బదిలీ చేశారు.
ఇక నుంచి రైలు టికెట్ కన్ఫర్మ్ అయ్యే వరకు బుకింగ్ ‘ఉచితం’!
IRCTC : మీరు IRCTC నుండి ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకుంటే.. మీరు ఈ ప్రత్యేక సేవ గురించి తెలుసుకోవాలి. ఈ సేవ సహాయంతో మీరు IRCTC సైట్‌లో మీ టిక్కెట్‌ను ‘ఉచితంగా’ బుక్ చేసుకోవచ్చు. మీరు రైలు టికెట్ కన్ఫర్మ్ అయినప్పుడు మాత్రమే మీరు డబ్బు చెల్లించాలి. మీరు కన్ఫర్మ్ టికెట్ బదులుగా వెయిటింగ్ టిక్కెట్‌ను పొందినట్లయితే.. అది కనుక క్యాన్సిల్ అయితే తక్షణమే వాపసు పొందుతారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) దాని స్వంత చెల్లింపు గేట్‌వే ఐ-పేను కలిగి ఉంది. మీరు ఈ చెల్లింపు గేట్‌వే ద్వారా IRCTCలో చెల్లింపు చేస్తే, మీరు ‘ఆటోపే’ ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. మీరు క్రెడిట్-డెబిట్ కార్డ్, UPI ద్వారా కూడా ఆటో-పే ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. ఆటోపే ఎలా పని చేస్తుందో.. మీరు ‘ఉచితంగా’ టిక్కెట్‌లను బుక్ చేసుకునే సదుపాయాన్ని ఎలా పొందుతారో తెలుసుకుందాం.
జైన సన్యాసి ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ కన్నుమూత… స్పందించిన మోడీ
జైన సన్యాసి ఆచార్య విద్యాసాగర్ మహరాజ్ ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌ఘర్‌లో కన్నుమూశారు. విద్యాసాగర్ మహారాజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహరాజ్ జీ అసంఖ్యాక భక్తులకు నా ప్రార్ధనలు అని ట్వీట్లో ప్రధాని రాసుకొచ్చారు. సమాజానికి ఆయన చేసిన ఎనలేని సేవలను రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయి. ఆధ్యాత్మిక మేల్కొలుపు, పేదరిక నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఇతర పనులలో ఆయన చేసిన కృషికి ఆయన గుర్తుండిపోతారని ప్రధాని అన్నారు.
ఆయన ఆశీస్సులు అందుకున్న ఘనత నాకు దక్కిందని ప్రధాన మంత్రి అన్నారు. గత ఏడాది చివర్లో ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌ఘర్‌లోని చంద్రగిరి జైన దేవాలయాన్ని సందర్శించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సమయంలో నేను ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహరాజ్ జీతో గడిపాను. ఆయన ఆశీస్సులు కూడా పొందాను. అదే సమయంలో బీజేపీ సమావేశంలో జేపీ నడ్డా కూడా తన సంతాపాన్ని తెలియజేసి నివాళులర్పించారు.
తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన సిరిసిల్ల రాజయ్య
తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ గా సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు చేపట్టారు. ఎర్రమంజిల్ లోని కమిషన్ కార్యాలయంలో రాజయ్య బాధ్యతలు తీసుకున్నారు. సంకేపల్లి సుధీర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, నెహ్రు నాయక్ కమిషన్ మెంబర్స్ గా చార్జ్ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ స్మితా సబర్వాల్ హాజరయ్యారు. రాజయ్య మాట్లాడుతూ.. గ్రామ పంచాయితీలు ఆర్థికంగా బలోపేతం కావాలని రాజీవ్ గాంధీ ఫైనాన్స్ కమీషన్స్ ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ ను నిర్వీర్యం చేసిందన్నారు. నిధులు లేక గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు విలవిలలాడుతున్నారని అన్నారు. గ్రామ పంచాయితీలను, మున్సిపాలిటీలను బలోపేతం చేస్తామన్నారు. మూలన పడిన ఫైనాన్స్ కమిషన్ ను సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ధరించారని తెలిపారు. నాపైన ఎంతో విశ్వాసం ఉంచి నాకు బాధ్యతలు ఇచ్చిన సీఎంకు ధన్యవాదాలని తెలిపారు. రేపటి నుంచే పని ప్రారంభిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు.
రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమితో పని చేస్తాం..
రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమితో పని చేస్తామని స్పష్టం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. దేశంలో రాజకీయ పార్టీలను భయపెట్టి పాలన సాగిస్తున్న బీజేపీకి ప్రజల చేతిలో ఓటమి ఖాయమన్నారు. ఈవీఎం టాంపరింగ్‌లను నమ్ముకున్న బీజేపీ 400 సీట్ల మాట మాట్లాడుతుందని, రాష్ట్రంలో జగన్, చంద్రబాబు,తో సహా దేశంలో అనేక మంది సీఎంలు బిజెపికి మోడీకి లొంగిపోయారు అని నారాయణ అన్నారు. వైసీపీ, టీడీపీలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పోటీ చేసేందుకు సిద్ధం అంటున్నారు.
నేటితో ముగియనున్న నుమాయిష్
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కొనసాగుతున్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) ఆదివారంతో ముగియనుంది. శనివారం నాటికి సందర్శకుల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దాదాపు 2400 స్టాల్స్‌తో ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈసారి స్టాల్ హోల్డర్ల విజ్ఞప్తి మేరకు నుమాయిష్ ను మూడు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రకటించారు. దీంతో నుమాయిష్ 18న ముగియనుంది.