NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం చిట్ చాట్..

బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం తథ్యమని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు తన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండించినా.. అది ఎప్పటికీ జరుగి తీరుతుందని అన్నారు. విలీనం అయిన వెంటనే కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్రమంత్రి పదవి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో హరీష్ రావు ప్రతిపక్ష నేత అవుతారని అన్నారు. విలీనం, పదవులు రాగానే.. కవితకు నాలుగు రాజ్యసభ సీట్లతో సమానంగా బెయిల్ వస్తుందని వెల్లడించారు. అదేవిధంగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు.

వాజ్‌పేయికి నివాళులర్పించిన ప్రధాని మోడీ

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని 2018 ఆగస్ట్ 16న దేశం కోల్పోయింది. ఈరోజు అటల్ జీ ఆరవ వర్ధంతి. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని సాద్వీ అటల్ వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వచ్చారు. ఈ సందర్భంగా భారతరత్న వాజ్‌పేయి చిత్రపటానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు కేంద్ర మంత్రులు, అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) భాగస్వామ్యానికి చెందిన నేతలు కూడా వాజ్‌పేయికి నివాళులర్పించారు.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని స్మరించుకుంటూ ప్రధాని మోదీ సోషల్ మీడియా హ్యాండిల్‌లో రాశారు.. తన జీవితమంతా దేశసేవకే అంకితం చేశారు. భారతదేశం గురించి అతని కలను నెరవేర్చడానికి మేము నిరంతరం పని చేస్తూనే ఉంటాము. దీనితో పాటు నివాళి కార్యక్రమానికి సంబంధించిన కొన్ని చిత్రాలను కూడా ప్రధాని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రార్థనా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. 2018లో ఈ రోజున ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో దీర్ఘకాల అనారోగ్యంతో మరణించారు. దేశ నిర్మాణంలో ఆయన చేసిన కృషికి లెక్కలేనంత మంది ప్రజలు ఆయనను గుర్తుంచుకుంటారు.

బీజేపీ లో బీఆర్‌ఎస్‌ విలీనం అనేది అబద్ధం.. అలాంటి చర్చ లేదు..

బీజేపీ లో బీఆర్ఎస్ విలీనం అనేది శుద్ధ అబద్ధమని.. అలాంటి చర్చ బీజేపీ లో లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఏమైనా మాట్లాడుకుంటునరేమో.. దాన్ని బట్టి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉండొచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ మమ అనిపించిందని మండిపడ్డారు. పూర్తి స్థాయి లో రుణమాఫీ ఈ ప్రభుత్వం చేయలేదు.. ప్రజల్ని రైతుల్ని సీఎం మోసం చేశారని అన్నారు. హైడ్రా పేరుతో అడ్డగోలుగా కూల్చివేతలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అడ్డగోలుగా కూలగొట్టి అధికారం వారికి ఎవరు ఇచ్చారన్నారు.

రేపు దేశవ్యాప్తంగా 24 గంటల పాటూ వైద్య సేవలు బంద్‌..

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో 31 ఏళ్ల జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్ హత్యకేసులో నిందితులను శిక్షించాలని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడు రోజులుగా ఆరోగ్య సేవలు స్తంభించగా, తోటి విద్యార్థికి న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్, అత్యవసర సేవలు నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. కాగా, ఆసుపత్రిని సందర్శించిన గవర్నర్ బోస్ సంబంధిత జూనియర్ వైద్యులతో మాట్లాడారు. దేశంలోని అన్ని నగరాల్లో వైద్యులు నిరసనలు తెలుపుతున్నారు. విధుల నుంచి బహిష్కరించిన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రైనీ డాక్టర్ హత్యకు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. 17వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఉంటుంది. ఈ మేరకు అర్ధరాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

ఏపీ సీఎంతో టాటా గ్రూప్ చైర్మన్ భేటీ.. పెట్టుబడులపై కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్.. పారిశ్రామిక అభివృద్దికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు, ఆయా రంగాల నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు కానుంది.. సీఎం చంద్రబాబు చైర్మన్‌గా, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో-చైర్మన్‌గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు.. పారిశ్రామికాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఈ టాస్క్ ఫోర్స్ పనిచేయనుంది.. ఇక, అమరావతిలో సీఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం.

భయపెడుతున్న మంకీపాక్స్.. ఎలా వ్యాపిస్తుంది.. లక్షణాలేంటి..?

‘మంకీపాక్స్’ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తుంది. దీని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మధ్య మరియు తూర్పు ఆఫ్రికా నుండి మొదలైన ఈ ఇన్ఫెక్షన్ ఇప్పుడు భారతదేశానికి చేరువైంది. పాకిస్థాన్‌లో 3 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. సౌదీ అరేబియా నుండి వచ్చిన వ్యక్తిలో మొదటి కేసు కనుగొన్నారు. ముఖ్యంగా ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ విజృంభిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఆ దేశంలో ఏడాది కాలంలో 548 మంది మరణించారు.

2 రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

దేశ వ్యాప్తంగా రెండు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.  హర్యానా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూలను ఈసీ విడుదల చేసింది. జమ్మూకాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో 90 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొదటి ఫేజ్ ఎన్నికలకు ఆగస్టు 20-08-2024న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ చివరి తేది 27-08-2024న ముగియనుంది. పోలింగ్ మాత్రం 18-09-2024న జరగనుంది. ఇక రెండో విడత పోలింగ్‌కి 29-08-2024న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్‌కు చివరి గడువు 05-09-2024న ముగియనుంది. పోలింగ్ మాత్రం 25-09-2024న జరగనుంది. చివరి విడత పోలింగ్ కోసం 05-09-2024న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ గడువు 12-09-2024న ముగియనుంది. పోలింగ్ మాత్రం 01-10-2024న జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4న విడుదల కానున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ బోగస్

కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ బోగస్ అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఇవాళ ఆయన ఆదిలాబాద్‌లో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. 59 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, రైతులకు దగా చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతులకు దగా, మోసం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని, రాష్ట్ర మొత్తం మీద కేవలం 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు జోగు రామన్న. మిగతా రైతుల సంగతేంటో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరిట ఒక సంవత్సరానికి 15 వేల కోట్ల రూపాయలను రైతులకు అందజేసిందని ఆయన వెల్లడించారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా రైతులను ఇలా పచ్చిగా మోసం చేయలేదని ఆయన పేర్కొన్నారు.

కలకలం రేపుతున్న హరీష్ రావు ఫ్లెక్సీలు

హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. రుణమాఫీ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయలేదని, అలాగానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని గతంలో హరీష్‌ రావు వ్యాఖ్యలపై ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మైనంపల్లి అభిమానుల పేరిట వెలసిన ఫ్లెక్సీల్లో ఈ ఫ్లెక్సీల్లో దమ్ముంటే రాజీనామా చెయ్.. రుణ మాఫీ అయి పోయే.. నీ రాజీనామా ఏడ బోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు’ అని రాశారు. ఈ ఫ్లెక్సీలను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్ పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. మరోవైపు తన రాజీనామా సవాల్‌పై హరీశ్‌రావు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. రుణమాఫీ కోతలతో మోసాలతో కూడుకుని ఉందని రైతులను, దేవుళ్లను కూడా రేవంత్‌రెడ్డి మోసం చేశారంటూ హరీశ్‌రావు విమర్శించారు. ఇదిలా ఉంటే.. నిన్న రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఖమ్మంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ చేస్తానన్న హరీష్‌ రావు బేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సిగ్గుంటే అన్నమాటపై నిలబడి రాజీనామా చేయాలని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

రూ.40 వేల కోట్ల రుణాలు ఉన్నాయని చెప్పి మాఫీ చేసిందెంత.?

రుణమాఫీ అంతా బోగస్ అని తేలిపోయిందని, స్వతంత్ర భారతదేశంలో నే ఇది అతి పెద్ద మోసమన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకే సంతకంతో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అన్నారని, రైతులను రేవంత్ రెడ్డి అడ్డంగా మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు ప్రతి రైతు కు రుణమాఫీ చేస్తాము అన్నారని, రేషన్ కార్డు కావాలని చెప్పలేదన్నారు కేటీఆర్‌. వెంటనే వెళ్లి రెండు లక్షలు తెచ్చుకోండి అన్నారని, నలభై వేల కోట్లు అన్నారు కానీ చాలా కటింగ్ లు పెట్టారన్నారు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ అని నిరూపించారని, ఎన్నికల ముందు చెప్పని కొర్రీలు ఇప్పుడు పెడుతున్నారన్నారు. పంద్రాగస్టు వరకు రుణమాఫీ అన్నారు కదా అని మేము కూడా వెయిట్‌ చేశామని, కానీ ఇప్పుడు అంతా మోసం అని అర్థం అయ్యిందని ఆయన మండిపడ్డారు. రుణమాఫీ నలభై శాతం మాత్రమే అయిందని, నిన్నటి వరకు 17 934 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. brs ప్రభుత్వం మొదటి దఫా లో 35 లక్షల మందికి 17 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని, మేము ఉన్నప్పుడు రుణమాఫీ చేశాము, రైతు బంధు ఇచ్చామన్నారు కేటీఆర్‌.