ట్యాంక్ బండ్ పై నిమజ్జనం లేదు… హైదరాబాద్ సీపీ ప్రకటన..
గణేష్ నిమర్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మండపం నిర్వాహకులు పోలీసులకు సహకరిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ సిటీ పరిధిలో 15 వేలు, ఇతర జిల్లాల నుంచి మరో 3 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని క్లారిటీ ఇచ్చారు. హై కోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై నిమర్జం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు లో నిమర్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరో 8 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారని తెలిపారు. ఇదే సమయంలో మిలాద్ ఉన్ నబీ ప్రోగ్రామ్ ఉంది మత పెద్దలతో సమన్వయం చేస్తున్నామన్నారు. 17న పబ్లిక్ గార్డెన్ లో ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమం, పెరేడ్ గ్రౌండ్లో మరో కార్యక్రమం ఉందని సీపీ ప్రకటించారు. నిమజ్జనకు వచ్చే భక్తులు పోలీసులకు సహరించి, నిబంధనలు అనుగుణంగా వ్యవహరించాలని కోరారు.
చంద్రబాబుకు లేఖ రాశారు.. ఆమోదం రాగానే పనులు..
సీఎం చంద్రబాబుకు కేంద్ర లేఖ రాసింది.. ఆమోదం రాగానే రైల్వే జోన్ పనులు జరుగుతాయన్నారు బీజేపీ ఎంపీ.. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావంతులతో సమావేశం అయిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే బీజేపీ విధానం అన్నారు.. ప్రధాని మోడీ సారథ్యంలో దేశ ప్రజల సంతోషంగా ఉన్నారు.. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, వక్ఫ్ బోర్డులో మార్పులు చేర్పులు వంటి అంశాలను మోడీ ధైర్యంగా అమలు చేశారు.. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది.. ఏపీకి అన్యాయం చేయాలనే ఆలోచన బీజేపీకి ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు..
కౌశిక్ రెడ్డి హద్దు మీరి మాట్లాడుతున్నాడు.. సవాల్ విసిరితేనే గాంధీ స్పందించారు
అరికెపూడి గాంధీ ఇంటికి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి హద్దు మీరి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. వార్తల్లో నిలవాలని తాపత్రయం కౌశిక్ రెడ్డి ది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవాళ్లు విసిరితేనే ఎంఎల్ఏ గాంధీ స్పందించారని స్పష్టం చేశారు. ఉద్యమంలో ఎక్కడా కూడా లేని కౌశిక్ రెడ్డి ఈ రోజు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చ గొట్టే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న హైదరబాద్ లో చిచ్చు పెట్టే విధంగా బి.ఆర్.ఎస్ ప్రవర్తిస్తుందని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా బి.ఆర్.ఎస్ వాక్యాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ కి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు.
ధ్వంసమైన రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టండి.. సీఎం ఆదేశాలు
వర్షాలు.. వరదలతో ధ్వంసమైన రోడ్ల మరమ్మతులపై దృష్టి సారాలించాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. వరదలకు ధ్వంసమైన రోడ్ల మరమ్మత్తులపై దృష్టి సారించాలన్నారు.. మొత్తం ఎన్ని కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బ తిన్నాయనే విషయంపై ఆరా తీశారు.. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 4 వేల కిలో మీటర్లకు పైగా రోడ్లు దెబ్బ తిన్నాయన్న సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.. దీంతో.. ప్రాధాన్యాతల వారీగా దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేయాలన్న చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనా కార్యక్రమంపై రివ్యూ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత విజయవాడ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లనున్నారు.. వరద బాధితుల సాయంలో భాగంగా బ్యాంకర్లు, ఇన్ స్యూరెన్స్ ఏజెన్సీల ప్రతినిధులతో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా వరదలు మిగిల్చిన నష్టంపై దృష్టిసారిస్తూనే.. విజయవాడలో సహాయక చర్యలు.. మరోవైపు జరిగిన నష్టాన్ని పూడ్చే పనిలో పడిపోయింది ప్రభుత్వం.. వేలాది వాహనాలు దెబ్బతిన్న నేపథ్యంలో బీమా ఏజెన్సీలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం విదితమే..
సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన కౌశిక్ రెడ్డి..!
సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు. గాంధీ కి ఎస్కార్ట్ ఇచ్చి పోలీసులు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను గాంధీ గుండాలతో చంపించే ప్రయత్నం చేశారు పోలీసులు అని ఆరోపించారు. ఎందుకు ఆపలేక పోయారు ? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం .. నన్ను హత్య చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపణలు గుప్పించారు. నన్ను ఇంత దారుణంగా తిడుతున్నారు.. మరి గాంధీ మాట్లాడేది భాషేనా..? అని ప్రశ్నించారు. మా విల్లా లోకి వచ్చి భయబ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. గాంధీ మొఖం చూసి ఓటేయలేదని.. కేసీఆర్ మొఖం చూసి ఓటేశారని గుర్తు చేశారు. గాంధీ మా ఇంటికి వచ్చి నా వెంట్రుక కూడా టచ్ చేయలేకపోయాడని తెలిపారు.
వైద్యురాలికి న్యాయం చేయాలి.. జోక్యం కోరుతూ రాష్ట్రపతి, ప్రధానికి ఆర్‌జీ కర్ వైద్యుల లేఖ..
కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఘటనపై ఇప్పటికీ పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతూనే ఉంది. 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన గురించి యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత యువతికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఇదిలా ఉంటే ఇప్పటికీ బెంగాల్ వ్యాప్తంగా మమతా బెనర్జీ ప్రభుత్వానికి వైద్యులు, సాధారణ ప్రజలు నిరసన తెలుపుతూనే ఉన్నారు. నిన్న వైద్యులతో సీఎం మమతా బెనర్జీ సమావేశం నిర్వహించాలని అనుకున్నప్పటికీ, వైద్యులు డిమాండ్లకు అంగీకరించకపోవడంతో ఈ సమావేశం జరగలేదు. ఇదిలా ఉంటే, ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ వైద్యులు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్యపై ప్రతిష్టంభన ముగించేందుకు జోక్యం చేసుకోవాలని కోరారు. పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రండ్ నాలుగు పేజీల లేఖను ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్, కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డాకు కూడా పంపారు.
తెలుగు ప్రజలకు ప్రధాని వినాయక నవరాత్రుల కానుక
తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వినాయక నవరాత్రులకు కానుకను అందించనున్నారు. ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే ఉద్దేశంతో రైలు కనెక్టివిటీని మరింత పెంచేందుకు తీసుకొచ్చిన వందేభారత్ రైళ్ల పరంపరలో భాగంగా మరో రెండు రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 4 వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సేవలందిస్తుండగా.. తాజాగా 5వ వందేభారత్ రైలును కూడా ప్రధానమంత్రి కేటాయించారు. ఈ రైలు సికింద్రాబాద్, నాగ్‌పూర్ మధ్య పరుగులు పెట్టనుంది. అదే సమయంలో విశాఖపట్టణం, దుర్గ్ (ఛత్తీస్‌గఢ్) మధ్య మరో వందేభారత్ రైలు సేవలందించనుంది. ఈ రెండు రైళ్లను సెప్టెంబర్ 16న ప్రధానమంత్రి అహ్మదాబాద్ నుంచి ప్రారంభించనున్నారు. ఆ రోజు ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా 10 వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తారు.
ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం..
కాకినాడ జిల్లా నాగులపల్లి నుంచి రమణక్కపేటకు ట్రాక్టర్లో వెళ్ళి ఏలేరు ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాలు పరిశీలన అనంతరం మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జగన్ ఆరోపించారు. చంద్రబాబుకు మానవతా విలువలు తెలిసి ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించే వారని అన్నారు. విజయవాడలో ఉన్న నిర్లక్ష్యం ఏలేరులో కనిపిస్తుంది.. వర్షాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉంది.. వాతావరణ శాఖ అలర్ట్ చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏలేరు రిజర్వాయర్కి వచ్చే ఇన్ ఫ్లోను ఎందుకు బ్యాలెన్స్ చేయలేదని జగన్ ప్రశ్నించారు.
ఎవరిమీద దాడి చేయాలని రివ్యూ చేస్తారా మీరు
రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, దీనికి కారణం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చేసేదంతా చేసి శాంతిభద్రతలపై రివ్యూ నిర్వహిస్తున్నారు అంటున్నారని, నిన్న ఏమైంది లా అండ్ ఆర్డర్ ? నిన్న ఆపి ఉంటే శాంతి భద్రతల సమస్యలు వచ్చేవి కావుకదా ! అని ఆయన అన్నారు. నిన్న యాక్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా డీజీపీ గారు.. ఎవరిమీద దాడి చేయాలని రివ్యూ చేస్తారా మీరు అని ఆయన ప్రశ్నించారు. పదిరోజులు అయినా ఖమ్మం లో మాపై దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదని, కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని రాచ మర్యాదలు చేశారన్నారు హరీష్ రావు. మీరే రెచ్చగోడుతున్నారు . సీఎం నోరు అదుపులో పెట్టుకోవాలని, బజారు భాష మాట్లాడుతున్నాడన్నారు హరీష్ రావు. కేసీఆర్ నాయకత్వం లో పనిచేసినప్పుడు గాంధీ, దానం ఇలా ఇప్పుడైనా మాట్లాడారా.. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తే దాడులు చేయమని చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.
వరద బాధితులను ఆదుకునేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం..
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి.. ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్యుమరేషన్ పక్కాగా జరగాలని.. నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం చేరాలని అన్నారు. సహాయ చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని.. పరిహారం విషయంలో శాస్త్రీయంగా ఆలోచన చేసి జాబితా రూపొందించాలని సీఎం తెలిపారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే.. 17వ తేదీ బాధితులకు సాయం అందిద్దామని సీఎం పేర్కొన్నారు.