Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

భారత క్రికెట్‌లో విషాదం.. మాజీ కెప్టెన్‌ కన్నుమూత!

భారత క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్‌ దత్తాజీరావు గైక్వాడ్ కన్నుమూశారు. ఆయన వయసు 95 ఏళ్లు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. గత 12 రోజులుగా ఐసీయులో ఉన్న దత్తాజీరావు ఈ తెల్లవారుజామున మరణించినట్లు కుటుంబ సభ్యులు పీటీఐకి తెలిపారు. భారత మాజీ ఓపెనర్, జాతీయ కోచ్ ఔన్షుమాన్ గైక్వాడ్ తండ్రే దత్తాజీరావు గైక్వాడ్.

దత్తాజీరావు గైక్వాడ్ పూర్తి పేరు దత్తాజీరావు కృష్ణారావు. అందరూ ఆయనను దత్తా గైక్వాడ్ అని పిలుస్తారు. 1952-1961 మధ్య భారత్ తరపున 11 టెస్టులు ఆడిన గైక్వాడ్‌.. 18.42 సగటుతో 350 పరుగులు చేశారు. 1959 ఇంగ్గండ్‌ పర్యటనలో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అయితే ఆ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ ఓడిపోయింది. 1952లో లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన దత్తాజీరావు.. 1961లో చెన్నైలో పాకిస్థాన్‌పై చివరి మ్యాచ్ ఆడారు.

కేశినేని నానిపై బోండా ఉమ సంచలన ఆరోపణలు.

ఎంపీ కేశినేని నానిపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు.. కేశినేని నాని ఆస్తులు.. అప్పల లెక్కలు మీడియాకు విడుదల చేసిన ఆయన.. 2014-19 మధ్య కాలంలో కేశినేని నాని ఆస్తులు పెంచుకుని.. అప్పులు తగ్గించుకున్నారని పేర్కొన్నారు. కేసుల భయంతోనే కేశినేని నాని తన ట్రావెల్స్ సంస్థను మూసేశారన్న ఆయన.. అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం కేశినేని నానికి అలవాటన్నారు. కేశినేని నాని అతి పెద్ద బ్యాంక్ స్కామర్.. బ్యాంకులు.. ఫైనాన్స్ సంస్థల్లో లోన్లు తీసుకుని ఎగవేస్తారు. కేశినేని నాని పేరుతో ఉన్న హోటల్ సహా ఆయన ఆస్తులు ఎన్పీఏ స్టేజీలో ఉన్నాయన్నారు. కేశినేని నాని అప్పుల అప్పారావు.. కేశినేని నాని బిల్డప్ బాబాయ్.. ఆంధ్రా అంబానీ అని చెప్పుకుంటూ.. టీడీపీలో చేరారు.. ఎంపీ టిక్కెట్ తీసుకున్నారు. ప్రజల కోసం.. పార్టీ కోసం పని చేస్తానంటే చంద్రబాబు కూడా కేశినేని నానిని నమ్మారు. ఆయనకు టిక్కెట్ ఇప్పించడంలో సుజనా చౌదరి పాత్ర కూడా ఉంది.. కానీ, 2014 ఎన్నికల్లో కేశినేని నాని పార్టీ కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు.

జేఈఈ మెయిన్‌ 2024 ఫలితాలు.. 10 మంది తెలుగు విద్యార్థులకు 100 శాతం స్కోరు!

దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్‌ 2024 సెషన్‌-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం విడుదల చేసింది. పేపర్‌ -1 (బీఈ/బీటెక్‌) ఫలితాల్లో దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100 శాతం స్కోరు సాధించారు. ఈ 23 మందిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 10 విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ నుంచి ఏడుగురు, ఏపీ నుంచి ముగ్గురు విద్యార్థులు 100 శాతం స్కోరు సాధించారు.

తెలంగాణకు చెందిన పబ్బ రోహన్‌ సాయి, ముతవరపు అనూప్‌, రిషి శేఖర్‌ శుక్లా, హుందేకర్‌ విదిత్‌, మదినేని వెంకట సాయి తేజ, తవ్వ దినేశ్‌ రెడ్డి, కల్లూరి శ్రియాషస్‌ మోహన్‌లు జేఈఈ మెయిన్‌ పేపర్‌ -1లో 100 శాతం స్కోరు సాధించగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్‌ సూరజ్‌, తోట సాయి కార్తిక్‌, అన్నారెడ్డి తనీశ్‌ రెడ్డిలు 100 శాతం స్కోరు సాధించారు. రాజస్థాన్‌, మహారాష్ట్రల నుంచి ముగ్గురు.. హర్యానా, ఢిల్లీ నుంచి ఇద్దరు.. గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు చొప్పున 100 శాతం స్కోరు సాధించారు.

మణిపూర్ సీఎం సంచలన వ్యాఖ్యలు.. వారందరినీ రాష్ట్రం నుంచి వెళ్లగొడతాం..

మణిపూర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత రాష్ట్రంలోకి వచ్చి జీవానం సాగిస్తున్న వారందరినీ గుర్తించి పంపించి వేస్తామని వెల్లడించారు. ఇంఫాల్‌లో ఓ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. కులం, మతంతో సంబంధం లేకుండా అలాంటి వారిని రాష్ట్రం నుంచి వెళ్లగొడతామని పేర్కొన్నారు. అయితే, మణిపూర్‌కు చెందిన తెగల ఉనికిని కాపాడేందుకే ఈ చర్యలు చేపడుతున్నామని సీఎం బీరెన్ సింగ్ చెప్పారు.

కాగా, ఇటీవల మణిపూర్ రాష్ట్రంలో జరిగిన హింస, అల్లర్లకు అక్రమ వలసదారులు, డ్రగ్స్‌, ముఖ్యంగా మయన్మార్‌ నుంచి వచ్చిన శరణార్థులు కారణమని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నాం.. ఇక్కడ ఉనికి కోసం పోరాటం జరుగుతోంది అని ప్రకటించారు. ప్రస్తుత తరం అభద్రతాభావంతో ముందుకు నడుస్తుంది.. భారత్‌- మయన్మార్‌ మధ్య ఫ్రీ మూమెంట్‌ రిజైమ్‌(ఎఫ్‌ఎమ్‌ఆర్‌)ఇక ఉండబోదు.. రెండు దేశాల మధ్య కంచె నిర్మిస్తామన్నారు. ఈ తరం ఎదుర్కొంటున్న అభద్రతాభావం ముందు తరాలకు ఉండకూడదు అని మణిపూర్ సీఎం బీరెన్‌సింగ్‌ వెల్లడించారు.

కేంద్రం ఇచ్చే సొమ్మును మింగేస్తున్నారు..

విజయవాడలో బీజేపీ కిసాన్ మోర్చా రైతు గర్జన సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సత్యకుమార్, కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి రైతులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ.. రైతులను ఆపి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా.. 11 కోట్ల రైతన్నలకు డీబీటి ద్వారా మోదీ ఇస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో మంత్రులు వందిమాగధులు నటులు అని సత్యకుమార్ విమర్శించారు. రాష్ట్రంలో బటన్ నొక్కుతున్నారా.. మోదీ వేసిన సొమ్ము లాగేసుకుంటున్నారా అని మండిపడ్డారు. రైతులేమైనా తీవ్రవాదులా.. పాకిస్తాన్ నుంచి వచ్చారా.. 1.76లక్షల కోట్లు రాష్ట్రానికి కేంద్రం ఇస్తే.. రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేంద్రం రైతులకు ఇస్తే ఇచ్చే సొమ్మును ఇక్కడ ప్రబుద్ధులు వాళ్ళ ఖాతాల్లో వేసుకుని ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్ధానంలో ఉందని సత్యకుమార్ పేర్కొన్నారు.

హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఉమ్మడి రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ కొంత కాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది మా ఆలోచనగా పేర్కొన్నారు.. ఎన్నికల తర్వత ముఖ్యమంత్రి, పార్టీ నాయకత్వం దీనిపై చర్చించి ఆలోచిస్తారన్న ఆయన.. రాజధాని కట్టే అవకాశం ఉన్నా.. ఐదేళ్లు తాత్కాలిక పేరుతో టీడీపీ కాలయాపన చేసింది.. రాజధానికి కట్టే ఆర్థిక వనరులు లేక.. విశాఖ రాజధానిగా ఏర్పాటు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయన్నారు. విశాఖ రాజధాని కార్య సాధన పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధాని ఉండాలనేది ఆలోచన.. విభజన చట్టం ప్రకారం మరికొంత కాలం హైదరాబాద్ ఉమ్మడిగా వుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు వైవీ సుబ్బారెడ్డి.

ఏపీ అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే తెలుస్తుంది..

తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే ఏపీ అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఏపీ రైతులకు జరిగిన మేలు తెలంగాణ అసెంబ్లీలో మంత్రులే చెబుతున్నారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నీరు నిలబెట్టారో, సీఎం వైఎస్ జగన్ దానికి రెట్టింపు నిలబెట్టారని తెలిపారు. టీడీపీ పతనావస్థకు చేరింది… ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు. టీడీపీ ఏమి చేసింది అని చెప్పుకునే పరిస్థితిలో కూడా లేదని దుయ్యబట్టారు.

రాప్తాడులో సిద్ధం సభ ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈనెల 18న రాప్తాడులో రాయలసీమ జిల్లాల ‘సిద్ధం’ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు భారీగా పార్టీ క్యాడర్, నాయకులు హాజరవుతారని చెప్పారు. ఎన్నికలకు ఇది శంఖారావం.. ఇప్పటికే భీమిలి, ఏలూరులో సభ విజయవంతంగా నిర్వహించామన్నారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని చెప్పారు.

6 నెలల రేషన్, గురుద్వారాల్లో రహస్య స్థావరాలు.. పక్కా ప్లాన్‌తో రైతుల నిరసన..

రైతులు తమ హామీలను నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కి పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీకి వెళ్లే ప్రయత్నంలో భాగంగా రైతులు పెద్ద సంఖ్యలో హర్యానా, పంజాబ్, ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. వీరిని అడ్డుకునేందుకు హర్యానా పోలీసులతో పాటు పోలీసులతో పాటు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. 200 రైతు సంఘాలు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ), రైతు ఉద్యమ సమయంలో కేసులు ఎత్తివేయాలని, లఖీంపూర్ ఖేరీ బాధితులకు సాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు పిలుపునిచ్చాయి.

మెట్రో అధికారుల అలర్ట్.. 8 మెట్రో స్టేషన్ల గేట్లు క్లోజ్

తమ డిమాండ్ల పరిష్కారం కోసం అన్నదాతలు దేశ రాజధాని ఢిల్లీకి (Delhi) కదం తొక్కారు. పెద్ద ఎత్తున కర్షకులు (Farmers protest హస్తినకు తరలివచ్చారు. ట్రాక్టర్లతో ర్యాలీగా బయల్దేరి వచ్చారు. మరోవైపు రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా సరిహద్దులో భారీ ఎత్తున భద్రతా బలగాలు మోహరించారు. రోడ్డుకి మధ్యలో బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలు, ఇనుప కంచెలు వేశారు. ఇంకోవైపు బలగాలను ఛేదించుకుంటూ నిరసనకారులు ఢిల్లీలోకి ప్రవేశిస్తు్న్నారు. దీంతో పోలీసులకు-రైతుల మధ్య తీవ్ర ఘర్షణతో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. అన్నదాతలను అదుపు చేసేందుకు వారి టియర్ గ్యాస్, జల ఫిరంగులు ప్రయోగించారు.

ఇదిలా ఉంటే రైతుల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ మెట్రో (Delhi Metro) అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధాన ప్రాంతాల్లో ఎనిమిది మెట్రో స్టేషన్లలో మెయిన్ గేట్లు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు DMRC ట్విట్టర్ ద్వారా తెలిపింది.

నా సర్వేలో ఆ పార్టీలు కలిసి పోటీచేస్తే.. వైసీపీకి 117సీట్లు వస్తాయి

కోవూరులో వైసీపీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయన్నారు. ‘సి’ ఓటర్ సర్వేలో మాత్రం చంద్రబాబు అధికారంలోకి వస్తారని చెబుతోందని తెలిపారు. సి ఓటర్ సర్వే చంద్రబాబు చెంచా లాంటిదని దుయ్యబట్టారు.

నల్ల చట్టాలు తెచ్చి రైతులను మోసం చేశారు మోడీ

నల్ల చట్టాలు తెచ్చి రైతులను మోసం చేశారు మోడీ అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల ఆందోళనతో వెనక్కి తీసుకుంటున్న అన్నారు
కానీ ఇప్పటికీ మూడు పార్లమెంట్ సమావేశాలు జరిగాయన్నారు. కానీ బిల్లులు వెనక్కి తీసుకోలేదని, నల్ల చట్టాలు తో రైతులు భూములు కౌలు కి ఇవ్వాలి అంటా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కౌలు కి ఇచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది తెలియదని కోదండరెడ్డి మండిపడ్డారు. గోదాముల్లో నిల్వలు ఉండొద్దనే చట్టం కూడా ఎత్తేశారని, అదానీ.. అంబానీకి లాభం చేసే పనిలో మోడీ ఉన్నారని ఆయన విమర్శించారు. నిల్వలు రైతులు.. జవాన్లకు అక్కరకు వస్తాయని కాంగ్రెస్ ఆలోచన అని, కానీ ఇప్పుడు దాన్ని ఆపేశారన్నారు. బడా బాబులకు లబ్ది చేకూర్చేలా మోడీ వ్యవహారం ఉందన్నారు.

హాస్పిటల్ బెడ్ పై ఉన్న నాకు ఫోన్ చేసి మోదీ తిట్టారు..

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురైన విషయం తెల్సిందే. శనివారం ఉదయం ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయనను కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో ఆయనను సోమవారం డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆయన కోలుకున్నారని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మిథున్ చక్రవర్తికి కొంత రెస్ట్ అవసరమని వైద్యులు తెలిపారు. కానీ, మిథున్ చక్రవర్తి మాత్రం తనకు షూటింగ్ ఉందని, త్వరలోనే షూట్ లో పాల్గోవాలి అని చెప్పడం ఆయన పనిని ఎంత గౌరవిస్తారో తెలుస్తోంది.

టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్‌గా అపూర్వరావు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నూతన జాయింట్ డైరక్టర్ గా కె.అపూర్వ రావు (ఐపీఎస్) బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బస్ భవన్ లోని తన ఛాంబర్ లో ఆమె మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఐడీ, ఎస్పీగా విధులు నిర్వర్తిస్తోన్న అపూర్వరావుని టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ గా ప్రభుత్వం సోమవారం నియమించింది. హైదరాబాద్ చెందిన ఆమె.. 2014 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి. వనపర్తి, గద్వాల, నల్లగొండ జిల్లాలకు ఎస్పీగా గతంలో పనిచేశారు. టీఎస్ఆర్టీసీకి జాయింట్ డైరెక్టర్ గా ఒక మహిళా ఐపీఎస్ అధికారిణి నియమితులవడం ఇదే తొలిసారి.

వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా జేఎన్టీయూ జీవీ తయారు కావాలి..

విజయనగరంలోని జేఎన్టీయూ జీవీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2007లో ఈ ఇనిస్టిట్యూట్ వంద ఎకరాలతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని తెలిపారు. వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా ఇది తయారు కావాలన్నారు. ఇందుకోసం ఏం కావాలన్నా అడగొచ్చని చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఏర్పాడు చేయడమే కాదు.. అక్కడ అన్ని వసతలు కల్పించాలని ప్రభుత్వం ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే పోటీ పరీక్షలో కూడా ముందుండాలని అనేక మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

 

Exit mobile version