NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ప్రభుత్వ పాఠశాలలకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుంది..

ప్రభుత్వ పాఠశాలలకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ పాఠశాల స్కూల్స్ బాగుకోసం కోట్ల రూపాయాలు కేటాయించామన్నారు. ఇప్పటికీ వున్న ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షన్సియల్ స్కూల్స్ కొనసాగిస్తామన్నారు. ఏవి కూడా ముసేసిది లేదన్నారు. అన్నింటికీ శాశ్వత భవనాలు కల్పిస్తామన్నారు. అడ్డంకులు సృష్టించేందుకు కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఉడుత ఊపులకు ఎవ్వరూ భయపడే పరిస్థితి లేదన్నారు. ఎవరు కూడా మేము చేసే అభివృద్ధిని అడ్డుకోనివ్వం అన్నారు. పాఠశాలలకి మంచి రోడ్ల ను కూడా వేస్తున్నామన్నారు. ప్రజలకు మంచి ఏమి చేస్తే బాగుంటుంది అని ఎవ్వరూ సలహాలు ఇచ్చిన తీసుకుంటామన్నారు. మంచి వుంటే అనుసరిస్తాం.. అమలు చేస్తామని తెలిపారు.

ఏపీకి భారీగా పెట్టుబడులు.. మీరు తరిమేసిన పరిశ్రమలన్నీ మళ్లీ తెస్తున్నాం..

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు మంత్రి నారా లోకేష్‌.. గత ప్రభుత్వ హయాంలో తరిమేసిన అన్ని పరిశ్రమలను మళ్లీ తీసుకొస్తాం అన్నారు.. టీసీఎస్‌ను తామే ఏపీకి తీసుకొచ్చామన్న వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు నారా లోకేష్‌.. రాయలసీమ తయారీ రంగానికి, ఉత్తరాంధ్ర సేవా రంగానికి కేంద్రాలుగా మారనున్నాయి అన్నారు.. పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలకు జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు.. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఇప్పుడిప్పుడే పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు.. బ్లూ బ్యాచ్ ఆగడాల వల్ల పరిశ్రమల స్థాపనకు ఇబ్బంది అనిపిస్తే ఎంతమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు..

రుణమాఫీ చేస్తాం కానీ అంతవరకు మాత్రమే..

రైతులు పంటలకోసం తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రెండు లక్షలకు పైన రుణం తీసుకున్న రైతులు కూడా ప్రభుత్వం మాఫీ చేస్తుంది కానీ.. పైన రుణం రైతులు చెల్లించాలన్నారు. రుణమాఫీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు బ్యాంకులలో సమస్యలు ఉన్నాయన్నారు. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులు పంటలకోసం తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయన్నారు. గ్రామాలలో ఉన్న బీఆర్ఎస్ వాళ్లకు ఎంత రుణం మాఫీ అయిందో లెక్కలు తీయాలని ఆగ్రహం వ్యక్తం చేశాఉ. వచ్చే సంవత్సరం జూన్ నెల వరకు అన్ని హంగులతో పాఠశాలను పూర్తి చేస్తామన్నారు.

తెలుగు రాష్ట్ర ప్రజలకు వైసీపీ అధినేత విజయ దశమి శుభాకాంక్షలు..

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైఎస్ జగన్‌ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగే విజయదశమి అని జగన్ అన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని పేర్కొన్నారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనక దుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అప్‌డేట్..

తెలంగాణ‌ గ్రూప్‌-3 అభ్యర్థుల‌కు టీజీపీఎస్సీ (తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌) బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. న‌వంబ‌ర్ 17, 18 తేదీల్లో ప‌రీక్షలు నిర్వహిస్తామ‌ని చెప్పిన బోర్డు.. తాజాగా షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. కాగా.. ఎగ్జామ్స్‌కు వారం రోజుల ముందు హాల్ టికెట్లను విడుదల చేస్తామని పేర్కొంది. మరోవైపు.. మోడ‌ల్ ఆన్సర్ బుక్‌లెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన‌ట్లు తెలిపింది. మొత్తం 1388 గ్రూప్‌-3 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం.. రాష్ట్రంలో దాదాపు 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష తేదీలను టీజీపీఎస్‌సీ ప్రకటించింది.

నోబెల్ శాంతి బహుమతి విజేత ప్రకటన..

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి దక్కుతుందనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణల మధ్య నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించారు. జపాన్‌కు చెందిన నిహాన్ హిడాంకియో సంస్థ నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. ఈ జపనీస్ సంస్థ ‘అణ్వాయుధాలు లేని ప్రపంచం’ని సమర్థిస్తుంది. వాస్తవానికి.. ఈ జపాన్ సంస్థ నిహాన్ హిడాంకియో రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన అణు బాంబు దాడుల బాధితుల కోసం పనిచేస్తోంది. అలాగే.. ఈ సంస్థ ప్రపంచం మొత్తం అణ్వాయుధాల నుంచి పూర్తిగా విముక్తి పొందేలా కృషి చేస్తుంది. ఇజ్రాయెల్-హిజ్బుల్లా యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య ఈ సంస్థకు 2024 నోబెల్ శాంతి బహుమతి లభించడానికి కారణం ఇదే. ఈ సంస్థ హిరోషిమా, నాగసాకి అణు బాంబు దాడుల బాధితులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. త‌మ అవార్డుతో హిరోషిమా, నాగ‌సాకి అణుబాంబు బాధితుల‌ను గౌర‌విస్తున్నట్లు నార్వేయ‌న్ నోబెల్ క‌మిటీ త‌న ప్రక‌ట‌న‌లో తెలిపింది.

మాజీ ఎంపీకి అస్వస్థత.. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు

మాజీ ఎంపీ నందిగం సురేష్కు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ అస్వస్థతకు గురి కావడంతో.. జిల్లా జైలు అధికారులు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. నిన్న రాత్రి నుండి షుగర్, బీపీ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నానని.. భుజం నొప్పి కూడా తోడవడంతో, ఛాతిలో నొప్పిగా ఉందంటూ నందిగం సురేష్ జిల్లా జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను హుటా హుటిన ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అయితే.. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఈసీజీ తదితర పరీక్షలు నార్మల్ గానే ఉన్నాయని.. భుజం నొప్పితో బాధపడుతున్న సురేష్ దానిని చాతి నొప్పిగా భావించారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. పరీక్షలన్నీ సాధారణంగా ఉండటంతో.. తిరిగి నందిగం సురేష్‌ను జిల్లా జైలుకు తరలించారు అధికారులు.

పిల్లలకు చదువు చెప్పడం.. పేదలకు వైద్యం అందించడం మా విధానం..

రంగారెడ్ది జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన చేసి.. శిలా ఫలకం ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈ దసరా నాలుగు కోట్ల తెలంగాణా ప్రజలకు సుఖ శాంతులు ఇవ్వాలని.. మంచి పంటలు ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రోజునే మేము వాగ్దానం చేసినం.. రాష్ట్రాన్ని విద్యాపరంగా వైద్య పరంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకు వస్తామని హామీ ఇచ్చిన అని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌ అప్పట్లో ఐదు వేల పాఠశాలలను మూసివేసి.. అణగారిన వర్గాలకు విద్యను దూరం చేసిందని, అందుకే ప్రతి పేదవారికి నాణ్యమైన విద్యను అందించాలని అనుకున్నామన్నారు. గతంలో పెట్టిన గురుకులాల్లో మౌళిక సదుపాయాలు ఉన్నాయా.. అది చూసారా.. వసతులు కల్పించలేదని, ఏ రోజూ కేసీఆర్ ప్రయత్నం చేయలేదు. కానీ ఆయన అనుచరులు ఈ విషయాన్ని తప్పు పడుతున్నారన్నారు. RS ప్రవీణ్ కుమార్ అంటే నాకు గౌరవం.. మీరు ఎక్కడ ఉంటారో మీ ఇష్టం. కానీ మీరు కూడా పేదలకు విద్య అవసరం లేదని అనుకుంటున్నారా. అప్పట్లో గొర్రెలు బర్రెలు అన్నాడు కానీ.. చదువు కో మని చెప్పాడా అని ఆయన అన్నారు.

మునిసిపాలిటీలలో ఇంటింటికి తాగునీరు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాం..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పర్యటించారు. నెల్లూరు నగరానికి తాగునీటిని అందించే పథకాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలలో ఇంటింటికి తాగునీరు ఇచ్చేందుకు ప్రణాళికను రూపొందించామని తెలిపారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆర్థిక సహాయంతో ఈ తాగునీటి పథకం పనులను చేపడతామన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభత్వంతో పాటూ ప్రపంచ బ్యాంక్ కు నివేదించామని.. 2028 లోగా ఆ నిధులను వినియోగించి పథకాన్ని పూర్తి చేస్తామన్నారు. గతంలో అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 8 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం ఆ నిధులను వినియోగించుకోలేదన్నారు. ఆ పథకాన్ని కూడా తీసుకువచ్చేందుకు కేంద్రంతో చర్చిస్తున్నాం.. రెండేళ్లు ఓపిక పడితే అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. కేంద్రంతో మళ్లీ సంప్రదించి ఈ నిధులను కూడా తీసుకు వస్తామని మంత్రి పేర్కొన్నారు.

పరిపాలనను పరుగులు పెట్టించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు..

ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రగతి వైపు అడుగులు వేస్తోంది. గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణ, రాజధాని అమరావతిలో అసంపూర్తి నిర్మాణాల పూర్తికి చర్యలు, రాజధాని నిర్మాణం పై ప్రణాళికలు సిద్ధం చేయడం, ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేయించి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎప్పుడు ఎక్కడనుంచి తిరిగి ప్రారంభించాలనే అంశాలను చాలా కీలకంగా తీసుకుంది ప్రభుత్వం. ఈ క్రమంలో మరో ముందడుగు వేసింది. పరిపాలనను పరుగులు పెట్టించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను విభజించి పరిష్కారంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొత్తంగా 49 విభాగాల్లో ఆర్థికేతర సమస్యలను అధికారులు గుర్తించారు. వివిధ అంశాలపై మొత్తంగా 24 పాలసీలు రూపొందించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. రాష్ట్రాభివృద్ధి, విజన్ డాక్యుమెంట్లు, గ్రోత్ పాలసీలో భాగంగా విధాన పత్రాల రూపకల్పన చేస్తోంది. ఆర్థికేతర అంశాల పరిష్కారంపై తీసుకోవాల్సిన చర్యలు, పాలసీల రూపకల్పనపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ శాఖలకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 30వ తేదీలోగా పరిష్కారంపై తీసుకున్న చర్యల వివరాలు.. పాలసీల రూపకల్పన వివరాలను అందివ్వాలని సీఎస్ సూచించారు. వచ్చే కేబినెట్ భేటీలో ఆర్థికేతర అంశాల పరిష్కారం, పాలసీల రూపకల్పనపై చర్చ ఉంటుందని సీఎస్ వెల్లడించారు.