NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

తప్పించుకునే ప్రయత్నం.. చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిపై కేసు పెట్టాలి..

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఇక్కడ చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిలోని అందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. అంతేకాదు.. దేశంలో ఉన్న కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఆరు మంది భక్తులు చనిపోయారు, 60 మంది గాయపడ్డారు. అసలైన నిందితులపై కేసులు ఎందుకు పెట్టలేదు? అని నిలదీశారు.. మూడు రోజులు అయ్యింది, ఎందుకు పట్టించు కోవడం లేదు? సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, ఎస్పీతో సహా అందరిపై కేసు నమోదు చేయాలన్నారు.. ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంకి ఇంకా బుద్ధిరాలేదన్న ఆమె.. దీనికి కారణమైన వారిని ఇంకా కాపాడాలి అని చూస్తున్నారు.. హిందువులు అనే గౌరవం లేదా? భక్తులు ప్రాణాలకు విలువ లేదా? అని నిలదీశారు.

2029లో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారు..

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లో ఆదివాసి ప్రజా ప్రతినిధుల సాధికారత శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తండాల్లో సమస్యలు నాకు బాగా తెలుసు.. ఎంపీగా ఉన్నప్పుడు చాలా సార్లు పార్లమెంటులో ప్రస్తావించాను.. బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను నిర్వీర్యం చేసింది.. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి ఎవరు ఆపలేరు.. ఎస్సీ, ఎస్టీల కోసం 10 శాతం కంటే ఎక్కువ నిధులను బడ్జెట్లో కేటాయిస్తాం.. తండాలను గ్రామ పంచాయతీగా మార్చిన గత ప్రభుత్వం.. నిధులను మాత్రం విడుదల చేయలేదని ఆయన ఆరోపించారు. ప్రతి తండాలో గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడి స్కూల్, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాల, హాస్పిటల్ ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది.. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం అదే.. 2029లో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.

నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్ కు ఊరట..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్​ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో డిసెంబరు 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్​ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్​ హైకోర్టులో క్వాష్​ పిటిషన్​ వేయగా దీనిపై విచారించిన హైకోర్టు గత నెల 30 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. ప్రతి ఒక్కరూ ఊరెల్లి నలుగురితో కలవాలి..

సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. ముందుగానే తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మీడియాతో చిట్ చాట్‌లో ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలని ఆకాక్షించారు.. ఇక, పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఊరు వెళ్లి నలుగురితో కలవటం అలవాటు చేసుకోవాలి అని సూచించారు.. నేను అందుకే మా ఊరికి ప్రతీ సంక్రాంతికి వెళ్తున్నాను అన్నారు.. సమాజంలో పై స్థాయిలో ఉన్నవారు దీనిని పాటిస్తే, మిగిలిన వారికి అది ప్రేరణ అవుతుందన్నారు.. నేను మా ఊరు వెళ్లే సంప్రదాయానికి భువనేశ్వరే కారణం.. పాతికేళ్ల క్రితం ఆమె పట్టుబట్టి మొదలు పెట్టిన ఈ సంప్రదాయాన్ని క్రమo తప్పకుండా పాటిస్తున్నాం అని గుర్తుచేసుకున్నారు..

ధరణి పేరుతో కొంప ముంచారు.. దాని వల్ల ఒక కుటుంబమే లాభపడింది!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దివ్యాంగులకు 70 లక్షల రూపాయల విలువ గల 675 పరికరాలను అందజేయడం సంతోషదాయకంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మనుషులలో కల్మషం లేని వారంటే, వారు కేవలం దివ్యాంగులే.. ఐదు సంవత్సరాలలో సిరిసిల్ల కలెక్టరేట్ కు ఒక్కసారి కూడా రాలేదు.. గతంలో ఎవరైనా కలెక్టర్ పిలిస్తే బదిలీ అయ్యే భయం ఉండేది అన్నారు. అటెండర్ పార్లమెంట్ సభ్యుడు కావొచ్చు.. కానీ, ఎంపీ అటెండర్ కాలేడు అని ఆయన తెలిపారు. ఇక, కబ్జా అయిన భూమిని స్వాధీనం చేసుకొని దివ్యాంగులకు కాలనీ కట్టించాలి.. ఇష్టారీతిన మాట్లాడితే సమాజం గుర్తించదు అన్నారు.

కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష

కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా గోషామహల్ లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన ఉస్మానియా ఆసుపత్రి, ఇతర నిర్మాణాలకు సంబంధించి నమూనా మ్యాప్ లను సీఎంకు వివరించిన అధికారులు. పలు మార్పులు, చేర్పులను రేవంత్ రెడ్డి సూచించారు.

వైసీపీకి పోలవరంపై మాట్లాడే అర్హత లేదు.. ఆ సమయానికి ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం..

వైసీపీకి పోలవరంపై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు.. పోలవరం ప్రాజెక్ట్ కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు మంత్రి.. రాజీవ్ ప్రతాప్ రూఢీ నేతృత్వంలోని 30 మంది పార్లమెంటరీ కమిటీ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలికారు మంత్రి నిమ్మల.. ఇక, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో 72 శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశాం, వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ను 20 ఏళ్ల వెనక్కి తీసుకుపోయింది. 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని విమర్శించారు.. పోలవరంను విధ్వంసం చేసిన, నిర్వాసితులను నిర్లక్ష్యం చేసిన, డయాఫ్రమ్ వాల్ ను ధ్వంసం చేసిన జగన్ కు, వైసీపీకి పోలవరం పై మాట్లాడే అర్హత లేదన్నారు..

పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. టోల్ ప్లాజాల దగ్గర రద్దీ

సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలు సొంతూళ్లకు పయనమవుతారు. ఈ క్రమంలో.. హైదరాబాద్-విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి పల్లెలకు వాహనాలు బారులు తీరాయి. ప్రతీసారి ఉన్నట్లే భారీ వాహనాల రద్దీతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుంది. సంక్రాంతి సందర్భంగా సొంత ఊర్లకు పయనమైన వాహనాలతో టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీ కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు కూడా టోల్ గేట్స్ దగ్గర వాహనాల తాకిడి భారీగా ఉంది. ఏపీ బార్డర్ జగ్గయ్యపేట దగ్గర చిలకల్లు, నందిగామ దగ్గర కీసర, గన్నవరం దగ్గర పొట్టిపాడు చెక్ పోస్టుల దగ్గర వాహనాల రద్దీ నెలకొంది. దీంతో సాధారణ రోజుల కంటే ఎక్కువ గేట్లను అందుబాటులో తెచ్చి వాహనాలను అనుమతి పంపిస్తున్నారు. రోజుకి సాధారణ రోజుల్లో 15 వేల వాహనాలు టోల్ గేట్ల నుంచి బయటకు వెళ్తుండగా.. ఇప్పుడు పండగ సీజన్ కావటంతో వాటి సంఖ్య 40,000 వరకు ఉంటుందని టోల్ గేట్ సిబ్బంది చెబుతున్నారు.

తెలంగాణ ప్రజానికానికి దిల్‌రాజు క్షమాపణలు..

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను లాంచ్ చేయగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ మైదానంలో సోమవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేశారు. ఈవెంట్లో దిల్‌రాజు మాట్లాడుతూ.. “తెలంగాణలో సినిమాలు తక్కువ కాబట్టి జనాల నుంచి రియాక్షన్ తక్కువ వస్తుందని నేను డైరెక్టర్ కి చెప్పాను. అదే ఆంధ్రకు వెళితే సినిమాకు ఒక మంచి వైబ్ ఇస్తారు. ఇక్కడ తెల్ల కల్లు, మటన్ ను జనాలు ఆ రేంజ్ లో ఇష్టపడతారు.” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అయ్యాయి. తెలంగాణ ప్రజలను అమానించారంటూ సోషల్ మీడియాలో వీడియో, వార్తలు వైరల్‌గా మారాయి. దీంతో తాజాగా స్పందించిన నిర్మాత దిల్‌రాజు క్షమాపణలు చెప్పారు.

కొండపోచమ్మ ప్రాజెక్టులో ఐదుగురు గల్లంతు.. ఘటనపై సీఎం ఆరా

సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. సెల్ఫీ సరదా యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. సంక్రాంతి సెలవులు కావడంతో సరదాగా స్నేహితులు కలిసి కొండపోచమ్మ ప్రాజెక్టు చూసేందుకు వెళ్లారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు కొండపోచమ్మ ప్రాజెక్టు చూడటానికి వచ్చారు. ఈ క్రమంలో.. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ప్రాజెక్టు దగ్గర సెల్ఫీ దిగడానికి వెళ్లి ఫోటోలు దిగుతూ ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. మరో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. క్షేమంగా బయటపడ్డ యువకులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. దీంతో.. హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం.. గజ ఈతగాళ్ల సాయంతో ఐదుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈత రాకపోవడంతో ఒకరి చేయి పట్టుకుని మరొకరు డ్యామ్ లోకి దిగారు. ప్రాజెక్టు లోపల మునిగిపోతుండగా భయతో ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకోవడంతో యువకులు నీటిలో మునిగిపోయారు. యువకులంతా 20 ఏళ్ల లోపు వారే ఉన్నట్లు గుర్తించారు. గల్లంతైన యువకులలో ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ గా ఉన్నారు.

 

Show comments