NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ తరగతి గదిలో విద్యార్థి అరుణ్ (19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ తదితర విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద నిరసన తెలిపాయి. తరగతులు నుంచి బయటకు వచ్చి విద్యార్థులు కూడా కళాశాల వద్దకు చేరుకున్నారు. మరోవైపు మృతుని బంధువులు, విద్యార్థులు యూనివర్సిటీ లోపల ఉన్న ఫర్నిచర్ తో పాటు అద్దాలను ధ్వంసం చేశారు. ఫర్నిచర్ ని బయట వేసి తగలబెట్టారు. చనిపోయిన విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

వైసీపీకి రాజీనామా.. టీడీపీలోకి రీ ఎంట్రీ కోసం మాజీ మంత్రి గట్టి ప్రయత్నాలు..!

ఇటీవలే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు టీడీపీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట.. వ్యక్తిగత కారణాలతో వైసీపీని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖను ఇటీవలే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‎కు పంపిన ఆయన.. గత నెల రోజులుగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట.. గతంలో ఆయన టీడీపీలో మంత్రిగా ఉన్న సమయంలో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల ద్వారా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు రాయబారాలు పంపుతున్నారట.. వారందరూ ఇతర జిల్లాలకు చెందిన నేతలు కావటంతో ఆయనకు టీడీపీలోకి ఎంట్రీకి వర్కవుట్ కావటం లేదట.. ఎక్కే గడప.. దిగే గడప అంటూ తేడా లేకుండా తిరుగుతున్నా అడుగులు ముందుకు పడటం లేదట.. దీంతో ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కలసి టీడీపీ చేరేందుకు అధినేత వద్ద మాట్లాడాలని కోరారట..

చిన్న వయసులో ఒలింపిక్ పతకం విజేతగా అమన్..టాప్ 5లో ఎవరంటే?

పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి ఆరో పతకాన్ని అందించిన అమన్ సెహ్రావత్.. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన దేశంలోని అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు ఈ ఘనత పీవీ సింధు పేరిట ఉంది. పివి సింధు 21 సంవత్సరాల, 1 నెల.. 14 రోజుల వయస్సులో రియో ​​ఒలింపిక్స్ 2016లో పతకం సాధించింది. ఇప్పుడు అమన్ 21 సంవత్సరాల 24 రోజుల వయస్సులో పతకం సాధించడం ద్వారా భారతదేశానికి అత్యంత పిన్న వయస్కుడైన ఒలింపిక్ పతక విజేతగా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో సైనా నెహ్వాల్ పేరు మూడో స్థానంలో నిలిచింది. 22 సంవత్సరాల 4 నెలల 18 రోజుల వయస్సులో 2012 లో లండన్‌లో పతకాన్ని గెలుచుకుంది.

సిసోడియాకి మేం బెయిల్ ఇచ్చామా..? కవితకు ఇవ్వడానికి..

కవిత బెయిల్ కు బీజేపీకి ఏం సంబంధం?.. సిసోడియాకు బెయిల్ వస్తే… బీజేపీకి సంబంధముందా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సీరియస్ అయ్యారు. కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్డడం సరికాదని.. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో చిట్ చాట్ లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందన్నారు. కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసన్నారు. నాతోసహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించిన, జైల్లో వేసిన తీరును ఎవరూ మర్చిపోలేదని గుర్తు చేశారు. రేవంత్ పై నమ్మకం పోయిన రోజు నుండి కాంగ్రెస్ తో జరగబోయేది యుద్దమే అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైనా బీజేపీ ధాటికి తట్టుకోలేనంతగా యుద్దం చేస్తామన్నారు. బీఆర్ఎస్ తో బీజేపీ చర్చలు ఫేక్ న్యూస్ అని తెలిపారు. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అన్నారు. నిజాయితీగా పనిచేసే ఐఏఎస్ లకూ నేటికీ పోస్టింగ్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు కొమ్ముకాసిన ఐఏఎస్ లకే మళ్లీ మంచి పోస్టింగులిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు తేడా లేకుండా పోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు.

వినేశ్ ఫొగట్ అప్పీల్పై ఈరోజు రాత్రి తీర్పు..!

అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.. కాగా.. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసిన వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై ఈరోజు రాత్రి 9:30 గంటలలోపు తీర్పు వెలువడే అవకావం ఉంది. కాగా.. ఈ తీర్పు కోసం భారతదేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆమెకు మెడల్ రావాలని కోరుకుంటున్నారు. కాగా.. 50 కేజీల మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరినందుకు కంబైన్డ్ సిల్వర్ మెడల్ ఇవ్వాలని వినేష్ ఫొగట్ విజ్ఞప్తి చేసింది.

ఎదురుతిరిగిన హిందువులు.. బంగ్లా వ్యాప్తంగా నిరసనలు..

బంగ్లాదేశ్ రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకం మొదలైన అల్లర్లు దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలకు కారణమయ్యాయి. ఈ ఘటనల్లో 500 మందికి పైగా ప్రజలు మరణించారు. చివరకు షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియాకు పారిపోయి రావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ విజేత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. షేక్ హసీనా గద్దె దిగినా కూడా ఆ దేశంలో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మైనారిటీలైన హిందువులపై దాడులు, అకృత్యాలు చోటు చేసుకున్నాయి. హిందూ ఆలయాలకు నిప్పు పెట్టడంతో పాటు హిందువుల వ్యాపారాలను దోచుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల్ని కిడ్నాప్ చేసి అత్యాచారాలకు తెగబడుతున్నారు.

క్వార్టర్ ఫైనల్కు భారత రెజ్లర్..

మహిళల 76 కిలోల ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌ విభాగంలో భారత మహిళా రెజ్లర్ రితికా హుడా క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆమె 12-2తో హంగేరీకి చెందిన బెర్నాడెట్ నాగిని టెక్నికల్ సుపీరియారిటీను ఓడించింది. మొదటి రౌండ్ నుంచి రితికా ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించింది. ఈ క్రమంలో భారీ తేడాతో విజయం సాధించింది. కాగా.. ఈరోజు సాయంత్రం 4 గంటలకు క్వార్టర్ ఫైనల్స్‌లో కిర్గిజ్‌స్థాన్‌కు చెందిన రెజ్లర్‌ ఐపెరి మెడెట్ కీజీతో రెజ్లర్ రితికా తలపడనుంది. ఫ్రీస్టైల్ 76 కేజీల ప్రీక్వార్టర్ ఫైనల్‌తో తన ప్రచారాన్ని ప్రారంభించిన మహిళా రెజ్లర్ రితికా.. ఈ రోజు పారిస్ ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది.

అమెరికాలోని గూగుల్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు పెట్టుబడులు, ఒప్పందాలను కుదుర్చుకోవడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు ఉన్నతాధికారుల బృందంతో కలిసి గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. . ఈ పర్యటనలో తెలంగాణ బృందం గూగుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో ఉత్పాదక చర్చలు జరిపింది. తెలంగాణలో టెక్ సేవల విస్తరణ, AI సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ స్థాపన , ఈ ప్రాంతంలో శ్రామిక శక్తి సంసిద్ధతను పెంపొందించేందుకు రూపొందించిన ఇతర అభివృద్ధి ప్రాజెక్టులతో సహా పలు కీలక కార్యక్రమాలపై చర్చలు జరిగాయి.

ఇల్లు పీకి పందిరి వేసిన చందంగా ఉంది కేసీఆర్ నిర్వాకం

ఎనకట ఒకడు ఉన్న ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పనితనం కూడా ఆలాగే ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. తన పుట్టినిల్లు అయిన చింత మడక గ్రామంలో సిఎం హోదాలో ఐదేళ్ల క్రితం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని పేదోళ్ల ఇండ్లన్నీ కూల్చి వేసి ఇప్పటివరకు వారికి నిలువ నీడ లేకుండా చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి దశ దిశ చూపిస్తా అని ప్రగల్పాలు పలికిన ఆయన ఉన్న ఉరోళ్లకే పంగ నామాలు పెట్టారని విమర్శించారు.

వయనాడ్ బాధితుల కష్టాలు విని చలించిన ప్రధాని మోడీ

ప్రకృతి విలయంతో వయనాడ్ కకావికలం అయింది. ఊహించని విపత్తుతో ఆప్తుల్ని కోల్పోవడంతో పాటు ఆస్తుల్ని పోగొట్టుకుని దు:ఖ సముద్రంలో ఉన్న బాధితులకు ప్రధాని మోడీ అండగా నిలిచారు. వారి కష్టాలను, బాధలను తెలుసుకుని చలించిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శనివారం వయనాడ్‌లో ప్రధాని మోడీ పర్యటించారు. కొండచరియలు విరిగిపడి కొట్టుకుపోయిన గ్రామాలను, పరిసరాలను మోడీ కలియ తిరిగి చూశారు. ఈ సందర్భంగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే దెబ్బతిన్న ప్రభుత్వ జీవీహెచ్‌ఎస్‌ పాఠశాలను సందర్శించారు. పిల్లలను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలను చూసి మోడీ చలించిపోయారు. ఈ స్కూల్‌లో 582 మంది విద్యార్థులు ఉండగా అందులో 27 మంది విద్యార్థులు గల్లంతైనట్లు సమాచారం. దాదాపు పాఠశాలలో 15 నిమిషాల పాటు ప్రధాని మోడీ గడిపారు. అలాగే కొత్త పాఠశాల భవనానికి సంబంధించిన ప్రణాళికలను కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితుల పునరావాస కేంద్రాన్ని, ఆస్పత్రిలో కోలుకుంటున్న బాధితుల్ని ప్రధాని పరామర్శించారు. ప్రధాని వెంట ముఖ్యమంత్రి పినరాయి విజయన్, కేంద్రమంత్రి సురేష్ గోపి, అధికారులు ఉన్నారు.

Show comments