NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @1pm

Top Headlines @1pm

నేడు సచివాలయంలో ఏపీ బ్యాంకర్ల కమిటీ సమావేశం

నేడు సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ జరగనుంది. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై సమావేశంలో చర్చించనున్నారు. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపై ఎస్​ఎల్‌బీసీ తో చర్చించే అవకాశం ఉంది. అనంతరం విద్యుత్‌శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తారు. ఈ సమావేశంలో.. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై కీలకంగా చర్చ సాగనుంది.. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాల పైనా ఎస్ఎల్బీసీలో చర్చించే అవకాశం ఉందంటున్నారు.. ఎన్నికల ప్రచార సమయంలో.. ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం.. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ అందజేసింది.. ఇక, మిగతా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేయడంపై దృష్టి సారిస్తున్నారు చంద్రబాబు.

నేడు బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి కల్యాణం.. పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం ఇవాళ జరగనుంది. ఎల్లమ్మ తల్లి కల్యాణానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దీంతో అలయ అధికారులు సాదరంగా ఆహ్వానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సోమవారం నుంచి ప్రారంభమైన వేడుకలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. సోమవారం ఉదయం గణపతి పూజతో కల్యాణోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం శాస్త్రోక్తంగా సభలు నిర్వహించారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, ముఖా నక్షత్రయుక్త అభిజిత్ లగ్న సుముహూర్తం 11.34 నిమిషాలకు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ ఈవో కె.అంజనీదేవి తెలిపారు. లక్షలాది మంది భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రేపు (బుధవారం) ఉదయం ఎనిమిది గంటలకు మహాశాంతి చండీ హోమం, సాయంత్రం ఆరు గంటలకు ఎల్లమ్మ అమ్మవారిని రథంపై తిరువీధుల్లో ఊరేగిస్తారు. రథోత్సవ కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి.

మగువలకు శుభవార్త.. వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన బంగారం ధరలు!

మగువలకు శుభవార్త. వరుసగా రెండోరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. సోమవారం స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.220 తగ్గగా.. నేడు రూ.350 తగ్గింది. ఇటీవలి రోజుల్లో పసిడి ధరలు పెరగడమే తప్ప.. తగ్గని విషయం తెలిసిందే. మంగళవారం (జులై 9) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,200గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,350గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.67,100 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.73,200గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.67,700గా.. 24 క్యారెట్ల ధర రూ.73,850గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళ, హైదరాబాద్​, విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల ధర రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,200గా నమోదైంది.

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన తెలుగు విద్యార్థి అమెరికాలో మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం గద్దె శ్రీనివాసరావు కుమారుడు అయిన సూర్య అవినాష్ శశి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు.. అనంతరం ఉన్నత చదువులకై అమెరికా లోని న్యూ జెర్సీలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు… సోమవారం ఉదయం తన సన్నిహితులతో కలిసి వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళగా కాలుజారి పడి మృతి చెందినట్లుగా తెలియజేశారు…. చిట్యాల గ్రామంలో రెండు నెలల కాలంలో ఇద్దరు విద్యార్థులు అమెరికాలో మృతి చెందడం పట్ల తీవ నిరాశలో ఉన్నారు.

కశ్మీర్లో ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఫైర్

జమ్మూ కాశ్మీర్‌లోని కతువా జిల్లా మచెడి ప్రాంతంలో ఆర్మీ ట్రక్కుపై సోమవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా ఐదుగురు జవాన్లు మరణించాగా.. మరో ఐదుగురు గాయపడడంతో వారిని పఠాన్‌కోట్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదులు ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని గ్రెనేడ్‌తో కాల్పులు జరిపారని అధికారులు చెప్పుకొచ్చారు. కతువా నగరానికి 150 కిలోమీటర్ల దూరంలోని లోహై మల్హర్‌లోని బద్నోటా గ్రామ సమీపంలోని మాచెడి- కిండ్లీ- మల్హర్ రహదారిపై సైనిక వాహనం సాధారణ పెట్రోలింగ్‌లో ఉన్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ కేటీఆర్

బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి రామారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం నేత కార్మికులను వదిలిపెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏడేళ్లుగా కొనసాగిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీని పునఃప్రారంభించాలని ఆయన కోరారు. ఈ వార్తా కాలమ్‌లలో ప్రచురితమైన వార్తా కథనం – “బతుకమ్మ చీరల పథకానికి శ్రీకారం చుట్టిందా?” అని రామారావు స్పందిస్తూ, కష్టాల్లో ఉన్న పేద నేత కార్మికుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు మరో చరమగీతం పాడిందన్నారు.

సుల్తాన్ పూర్ జేఎన్టీయూ కాలేజీ క్యాంపస్ లో చట్నీలో ఎలుక..

సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ జేఎన్టీయూ కాలేజీ క్యాంపస్ లో చట్నీలో ఎలుక దర్శనమిచ్చింది. దీంతో విద్యార్థులు అందరూ షాక్ అయ్యారు. చట్నీలో ఎలుక అటు ఇటు తిరుగుతూ విద్యార్థులను కాసేపు బెంబేలెత్తించింది. చట్నీ పాత్రపై మూత పెట్టకపోవడంతో ఎలుక చట్నీలో పడి అటు ఇటు పరుగులు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎలుకని చూసిన విద్యార్థులు భయబ్రాంతులకు లోనయ్యారు. చట్నీలో వండిన మిరపకాయ, కరివేపాకు లాగానే ఎలుక కూడా కనిపించింది. దీంతో చట్నీ వండిన వారికి అనుమానం రాలేదని తెలుస్తుంది. ఒకవేళ ఆ ఎలుక చట్నీలోనే చనిపోయి వున్నా ఎలుక అని గమనించే విధంగా లేదని విద్యార్థులు చెబుతున్నారు. సుల్తాన్ పూర్ జేఎన్టీయూ కాలేజీ క్యాంపస్ లోనే ఇలా వుంటే మిగతా హాస్టల్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని తెలుపుతున్నారు. ఇలాంటి ఆహారాలు తినే విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆహారాలన్నే రోజూ వండి మాకు పెడుతున్నారా? ఇలాంటి ఆహారమే మనం రోజూ తింటున్నామా? అనే ప్రశ్నలు విద్యార్థుల్లో మొదలయ్యాయి. ఇలా సుభ్రత లేకుండా ఆహారం వండటంతో అనారోగ్య బారిన పడవల్సి వస్తుందని వాపోతున్నారు.

కేవలం దుష్ప్రచారం చేయడం దారుణం…

వైఎస్ఆర్ జిల్లా కడపలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పులివెందుల ఎమ్మెల్యే గా వైఎస్ జగన్ రాజీనామా, కడప ఎంపీ గా వైఎస్ అవినాష్ రాజీనామా అంటూ వచ్చిన వార్తలను ఖండించారు. కేవలం దుష్ప్రచారం చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సురేష్ బాబు.. 2011 లో జరిగిన కడప పార్లమెంట్ ఉప ఎన్నికలలో కడప దెబ్బ ఢిల్లీ అబ్బా అనేలా ప్రజల తీర్పు ఇచ్చారన్నారు. వైఎస్ జగన్ కు వచ్చిన మెజారిటీ ఒక చరిత్రాత్మకమని, ఇది దేశమంతా చూశారు.. కానీ ఇప్పుడు ఏదో కడప ఉప ఎన్నిక అంటూ తప్పుడు కథనాలు రాగానే ఆయన స్పందించడం సిగ్గుచేటన్నారు సురేష్‌ బాబు.

పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ..!

రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. నిన్న ముంబయిలో భారీ వర్షాల దెబ్బకు జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇక అస్సాం, మేఘాలయ రాష్ట్రాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. అయితే, జులై 12వ తేదీన పశ్చిమ బెంగాల్‌, సిక్కిమ్‌లలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. బిహార్‌లో రానున్న మూడు రోజులు వానలు పడతాయని చెప్పుకొచ్చింది. అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో మాత్రం జులై 11 వరకు పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. జులై 12న ఢిల్లీ, హరియాణ, జమ్మూ అండ్ కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌ , ఛత్తీస్‌గఢ్‌లో కూడా జడి వానలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ సూచించింది.

గత ప్రభుత్వం చేసిన ఇసుక దోపిడీకి ముసుగు తొలగించాం

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉచిత ఇసుక అమ్మకాలను రాష్ట్ర టూరిజం మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి ప్రారంభించారు. రాజమండ్రి లాలాచెరువు స్టాక్ పాయింట్ వద్ద క్యూ కట్టారు ఇసుక వినియోగదారులు. టన్ను ఇసుక ధర 270 రూపాయలుగా నిర్ణయించారు. ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా కేవలం నిర్వహణ ఖర్చులు చట్టబద్ధమైన పనులు మాత్రమే వసూలు చేస్తోంది. ఇసుక అక్రమ రవాణా చేసిన వారికి రెండు లక్షల వరకు జరిమానా రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం.

సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్ కోసం చైనా నుంచి ఇంజనీర్ లు..

సీతారామ ప్రోజెక్ట్ కు సంబంధించి ఫస్ట్ పంపు హౌస్ ట్రయల్ రన్ అయ్యాయని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. రెండు, మూడు పంపు హౌస్ లు చైనా నుంచి ఇంజనీర్ లు రావల్సి ఉందని అన్నారు. చైనా నుంచి ఇంజనీర్ లు రాగానే వారం రోజుల్లోనే ట్రయల్ రన్ పూర్తి అవుతుందన్నారు. ఆగస్టు నెలలో గోదావరి జలాలను వైరా ప్రోజెక్ట్ కు గోదావరి జలాలు తరలింపు పూర్తి చేస్తామన్నారు. సాగర్ నుంచి నీళ్లు రాకపోయినా వైరా ప్రోజెక్ట్, లంకాసాగర్ సత్తుపల్లి, సాగర్ కాలువలకు నీటి నీ పంపిస్తామన్నారు. మోటార్ లు రన్ చేయకపోతే పంప్ లు చెడిపోతాయన్నారు.