చిరంజీవికి కొడాలి నాని కౌంటర్.. ఆ ఇద్దరికి సలహాలిస్తే బాగుంటుంది
మెగాస్టార్ చిరంజీవి చేసిన తాజా వ్యాఖ్యలకు మాజీమంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది పకోడీగాళ్లు ఉన్నారని.. వాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాళ్లకు కూడా ‘ప్రభుత్వం గురించి మనకెందుకు’ అని సలహాలు ఇవ్వొచ్చు కదా అని సూచించారు. మనం డాన్స్‌లు, ఫైట్స్, యాక్షన్ గురించి చూసుకుందామని చెప్పొచ్చు కదా అని చిరుకి కౌంటర్ ఇచ్చారు. ఆ ఇద్దరికీ సలహాలు ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు.
కాగా.. అంతకుముందు చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్‌లో పరోక్షంగా మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ ప్రభుత్వంపై చురకలు అంటించారు. ‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, ప్రాజెక్టులు గురించి ఆలోచించాలి. పేదల కడుపునింపే దిశగా ప్రయత్నాలు చేయాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడతారేంటి’’ అని చిరంజీవి వ్యాఖ్యానించారు. అలాగే.. డిమాండ్ ఉన్న వారికి పారితోషికం ఎక్కువే ఇస్తారని కూడా చెప్పారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
రేపు మహారాష్ట్రకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
జాతీయ రాజకీయాల్లో గులాబీ బలం పెంచేందుకు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలనే రేపు మహారాష్ట్రకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఓ సామాజికవర్గం ఆధ్వర్యంలో కేసీఆర్ కు సన్మానం జరుగనుంది. అయితే.. జాతీయంగా బీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు ముందుగా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో పగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు సీఎం కేసీఆర్. అయితే… ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నేతలు భారీగా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. అయితే నిన్న మహారాష్ట్రలోని సోలాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచ్‌లు సోమవారం తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.
గద్దర్ మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు
గద్దర్ మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. సమాజంలో మార్పు కోసం అన్ని వర్గాల కోసం గద్దర్ పాటలు రాసారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆట, పాట, మాట ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపింది గద్దర్ అని అన్నారు. గద్దర్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారని గుర్తు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో కూడా గద్దర్ క్రియాశీలకంగా పాల్గొన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని భావించిన గద్దర్, కాంగ్రెస్ నేతల సభలకు సంఘీభావం ప్రకటించారని అన్నారు. కార్ల్ మర్క్స్ ఎలాగైతే సమాజం కోసం పని చేసి మార్గదర్శకం అయ్యారో.. గద్దర్ ఆలోచన విధానం సామాజిక న్యాయం కోసం కృషి చేసారని తెలిపారు. గద్దర్ మరణం పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరపున సానుభూతి తెలియజేస్తున్నామని మల్లు రవి అన్నారు.
పుంగనూరు ఘటన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
పుంగనూరులో ఇటీవల చెలరేగిన హింస.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు-టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం మొదలై.. చివరకు లాఠీ ఛార్జ్ వరకు వెళ్లింది. అయితే.. చిత్తూరు పుంగనూరు అల్లర్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ప్రెస్ మీట్ లో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. పుంగనూరు ఘటనలో గాయపడ్డ పోలీసులకు, ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటన లో తీవ్రంగా గాయపడి ఒక కన్ను పోగొట్టుకొని, మరొక కన్ను కూడా పోగొట్టుకునే పరిస్ధితిలో ఉన్న రణధీర్ అనే కానిస్టేబుల్ కు పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. చంద్రబాబు, తన కుమారుడు ముఖ్యమంత్రి కాలేడన్న అక్కసుతోనే పధకం ప్రకారం, ముందస్తు ప్రణాళికతో అల్లర్లకు పురిగొల్పాడని ఆయన మండిపడ్డారు.
రేషన్ డీలర్లకు తీపికబురు.. హెల్త్ కార్డులు కూడా మంజూరు..!
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీలర్ల కమీషన్ పెంపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం డీలర్ల నుంచి రూ. 70 కమీషన్ ఇస్తుండగా.. ఆ రెట్టింపు చేస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. అంటే ఇక నుంచి రూ. 140 కమీషన్ గా ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సచివాలయంలో రేషన్ డీలర్ల సంఘాల జేఏసీ ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు, గుంగుల కమలాకర్, పలువురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. రేషన్ డీలర్లకు కమీషన్ పెంచడంతో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, కరోనా కష్టకాలంలో ప్రాణాలు కోల్పోయిన రేషన్ డీలర్ల స్థానంలో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇవ్వాలని సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
‘వండర్ విమెన్’ కు తెలుగు నేర్పిన అలియా.. మీకు నా ముద్దులు అంటూ రచ్చ
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. వండర్ విమెన్ గాల్ గాడోట్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హార్ట్ ఆఫ్ స్టోన్. జామీ డోర్నన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అలియా విలన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు టామ్ హార్పర్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 11 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు. ఈ నేపథ్యంలోనే గాల్ గాడోట్, జామీ డోర్నన్ తో అలియా ఒక ఇంటర్వ్యూ చేసింది. ఇందులో సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఇంకొక ఆరు నెలల్లో చంద్రబాబుకు ప్రజలు పూర్తిగా విశ్రాంతి ఇస్తారు
విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నేతల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి 12 సంఘాల ప్రతినిధులు వచ్చారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసుని బంధనల ప్రకారం పదోన్నతులు కల్పించాలని, కస్తూర్భా పాఠశాల ఒప్పంద ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేలు అమలు చేయాలి, అలాగే వారిని క్రమబద్దీకరించాలని, పదోన్నతి, బదిలీలు పొందిన ఉపాధ్యాయుల సవరించిన కేడర్ వివరాలు ఆమోదించాలని, బకాయి ఉన్న జూన్, జూలై వేతనాలు చెల్లించాలిని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు వెల్లడించారు. అయితే.. ఈ క్రమంలో మంత్రితో ఉపాధ్యాయ సంఘాల నాయకులు చర్చిస్తున్నారు.
రాంగోపాల్‌పేట డివిజన్‌లో పర్యటించిన బండారు విజయలక్ష్మి
బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్‌పేట డివిజన్‌లో పర్యటించారు. రాంగోపాల్ పేట డివిజన్‌లోని బీజేపీ సీనియర్ నేతలను ఆమె కలిశారు. రాంగోపాల్‌పేట డివిజన్ కార్పొరేటర్ చీర సుచరిత శ్రీకాంత్‌ను కార్యాలయంలో కలిశారు. ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్‌లో జరిగే అభివృద్ధి పనుల గురించి, పార్టీ కార్యక్రమాల గురించి ఆరా తీశారు.
కార్పొరేటర్‌తో పాటు డివిజన్ జనరల్ సెక్రటరీ సందీప్ శర్మ, బీజేపీ సీనియర్ నాయకులు ఆనంద్ వ్యాస్, ఆకుల ప్రతాప్, సంగంశెట్టి మహేందర్ ఇళ్లను సందర్శించి వారి ఆరోగ్యం, యోగక్షేమాలు, పార్టీ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి ఆమె ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలనే కుట్ర.. చంద్రబాబుది శకుని మెదడు
చంద్రబాబు అధికారం కోసం ఎంత చెడ్డ పని చేయటానికి అయినా ఒడికడతాడని అందరికీ తెలుసు.. కానీ ఇప్పుడు మరింత బరితెగింపు చూపిస్తున్నాడంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైతే 10 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయినా పర్వాలేదు అనే రౌడీయిజం చంద్రబాబు చేస్తున్నారని, పోలీసుల పై దాడులు చేసి అల్లర్లు సృష్టించాలని కుట్ర పన్నాడని పేర్ని నాని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలనే కుట్ర పన్నాడు చంద్రబాబు అని, చంద్రబాబుది శకుని మెదడంటూ ఆయన మండిపడ్డారు.
రాహుల్‌కు అధికార నివాసంగా ఆ బంగ్లానే కేటాయింపు !
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి పార్లమెంటరీ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్ బంగ్లాను తిరిగి కేటాయించినట్లు వర్గాలు మంగళవారం తెలిపాయి. ఎంపీగా అనర్హత వేటు పడటంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాను ఖాళీ చేశారు. 2019 నాటి “మోదీ ఇంటిపేరు” పరువు నష్టం కేసులో సుప్రీం కోర్టు తన శిక్షపై స్టే విధించిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంటేరియన్‌గా తిరిగి నియమించబడిన ఒక రోజు తర్వాత ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను తిరిగి కేటాయించినట్లు సమాచారం.
వైన్ షాపుల టెండర్లకు భారీ స్పందన.. మూడు రోజుల్లోనే 2000 దరఖాస్తులు..!
తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్లకు భారీ స్పందన లభిస్తోంది. వైన్ షాపుల కోసం భారీ పోటీ నెలకొంది. ఎంతలా అంటే.. మూడు రోజుల్లోనే రెండువేలకు పైగానే దరఖాస్తులు వచ్చాయంటే మనవాళ్లతోటి అట్లుంటది అనిపిస్తుంది. వైన్ షాపుల కోసం భారీ పోటీ నెలకొంది. ఎంతలా అంటే.. మూడు రోజుల్లోనే రెండు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలకు డిమాండ్ మామూలుగా లేదు. దీంతో… ఈసారి మద్యం దుకాణాలను స్వాధీనం చేసుకుంటే.. కాసుల వర్షం కురుస్తుందని పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలో టెండర్ల ప్రక్రియలో భాగంగా రాష్ట్రం నలుమూలల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో విశేష స్పందన లభిస్తోంది. తెలంగాణలో మొత్తం 2,620 మద్యం దుకాణాలకు గాను సోమవారం (ఆగస్టు 8) 2000కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఒక్కో దరఖాస్తుకు నాన్ రిఫండబుల్ ఫీజు కింద 2 లక్షలు చెల్లిస్తున్నారు. 2023-25 నాటికి తెలంగాణలో మద్యం దుకాణాలకు కొత్త లైసెన్సులు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న వైన్ షాపుల లైసెన్సుల గడువు నవంబర్ 30తో ముగియనుండగా.. కొత్త లైసెన్సుల కోసం ఈ నెల 4 నుంచి ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు.
ఈ తొమ్మిదేళ్లు సంక్షేమంలో స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు
రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ నిర్వహించిన బీసీ బంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ తొమ్మిదేళ్లు సంక్షేమంలో స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చని వ్యాఖ్యానించారు. పేదలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కులవృత్తులను నమ్ముకున్న వారి కోసం పథకాలు అందుబాటులోకి తెచ్చామని ఆయన అన్నారు. అందరి కంటే ఆర్థికంగా అడుగున ఉన్న వారి కోసం దళితబంధు అమలు చేస్తున్నామని, అంతే కాకుండా 14 వృత్తులపై ఆధారపడిన వారి కోసం బీసీ బంధు అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. జిల్లాలో ఈ పథకం కింద 10 వేల దరఖాస్తులొచ్చాయి.. ఇవాళ తొలివిడతలో 600 మందికి ఇస్తున్నామని ఆయన అన్నారు. వచ్చే నెలలో మరికొందరికి ఇస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు.
మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం.. ఈనెల నుంచే చెక్కుల పంపిణీ..
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మైనారిటీల సంక్షేమంలో భాగంగా ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయం కార్యక్రమం అమలుకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మొదటి దశలో భాగంగా ఎంపికైన 10 వేల మంది లబ్ధిదారులకు ఈ నెల 16 నుంచి లక్ష రూపాయల చెక్కుల పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు. కాగా..కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మైనార్టీల సమస్యలపై చర్చించేందుకు సచివాలయంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు, శ్మశాన వాటికల స్థలాల కేటాయింపు, ఇమామ్‌లకు గౌరవ వేతనం, మౌజామ్‌ల సంఖ్య పెంపు, క్రైస్తవ శ్మశాన వాటికలు, ఆర్‌టిఎఫ్, ఎంటిఎఫ్ తదితర అంశాలపై చర్చించారు.