NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

రేపే క్వాలిఫికేషన్ రౌండ్‌.. ‘గోల్డ్’ ఆశలు నీరజ్‌ చోప్రా పైనే! భారత్ నుంచి మరో ప్లేయర్

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఇప్పటి వరకు మూడు పతకాలు మాత్రమే సాధించింది. షూటింగ్‌లోనే ఆ మూడు పతకాలు దక్కాయి. అయితే ఇప్పటి వరకు ఒక్క గోల్డ్ మెడల్ కూడా భారత్ ఖాతాలో చేరలేదు. దాంతో ఇప్పుడు అందరి ఆశలు టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. నీరజ్ ఈసారి కూడా గోల్డ్ మెడల్ తెస్తాడని భారత అభిమానులు ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం నీరజ్ చోప్రా నామస్మరణతో ఊగిపోతోంది.

పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ ఈవెంట్ మంగళవారం ప్రారంభం కానుంది. జావెలిన్ త్రోలో అథ్లెట్లను రెండు గ్రూపులుగా విభజించారు. భారత్ నుంచి నీరజ్ చోప్రాతో పాటు 2022 ఆసియా క్రీడల రజత పతక విజేత కిషోర్ జెనా కూడా పోటీపడనున్నాడు. ఇద్దరు రెండు వేర్వేరు గ్రూపులలో ఉన్నారు. మధ్యాహ్నం 1.50, మధ్యాహ్నం 3.20కి జరిగే క్వాలిఫికేషన్ రౌండ్‌లలో మనోళ్లు బరిలోకి దిగనున్నారు. ఆగష్టు 6న జరిగే క్వాలిఫికేషన్ రౌండ్‌లో అర్హత సాధిస్తే.. ఆగష్టు 8న జరిగే ఫైనల్‌లో ఆడతారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లలో స్టార్ అట్రాక్షన్‌గా నీరజ్ ఉన్నాడు.

మధిరలో ఆగ్రో ఇండస్ట్రీస్ కేంద్రం.. రింగ్ రోడ్ల నిర్మాణాకి ప్రణాళికలు..

మధిర చుట్టూ రింగ్ రోడ్ల ను ఏర్పాటుచేసి నగరాన్ని అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో 25 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సభలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలకి సరిహద్దుగా ఉన్న మధిర పట్టణం ఇండస్ట్రియల్ పార్కు ద్వారా ఇంకా నగర స్థాయిలోకి అభివృద్ధి చేస్తామన్నారు. ఇటు జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులకి జంక్షన్ గా మదిర కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. మదిరని పెద్ద నగరంగా తయారు చేయడానికి కృషి చేస్తామన్నారు. మధిర చుట్టూ రింగ్ రోడ్ల ను ఏర్పాటుచేసి నగరాన్ని అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. దీనికోసం ఒక కార్యచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. విద్యా వైద్య పరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామని తెలిపారు.

చంద్రబాబుపై సీఐడీ పిటిషన్‌.. విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ఏపీ స్కిల్‌ కేసులో అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ సాగింది.. అయితే, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.. ప్రభుత్వం తరపు న్యాయవాది మారినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాదులు.. ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకోవాల్సి ఉన్నందున.. విచారణ వాయిదా వేయాలని కోరారు న్యాయవాదులు.. రెండు వారాలు వాయిదా వేయాలని.. తర్వాత విచారణ చేపట్టాలని కోరారు చంద్రబాబు తరపు సీనియర్‌ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా. ఇక, లూథ్రా విజ్ఞప్తితో తదుపరి విచారణ రెండు వారాల పాటు వాయిదా వేసింది జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం. కాగా, గత ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్‌ వ్యవహారంలో చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది.. ఆ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబు.. 50 రోజులకు పైగా జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. ఆ తర్వాత మధ్యంతర బెయిల్‌.. కొన్ని రోజుల తర్వాత పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.. దీంతో.. చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలంటూ.. ఏపీ సీఐడీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.

కేటీపీఎస్‌ పాత ప్లాంట్‌ కూలింగ్‌ టవర్ల కూల్చివేత..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి విద్యుత్‌ను అందించిన పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌) ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం) ప్లాంట్‌ కూల్చివేత తుదిదశకు చేరుకుంది. ఓ అండ్ ఎంకు చెందిన 8 యూనిట్ల ఎనిమిది కూలింగ్ టవర్లు నేలకొరిగాయి. అధికారులు ముందుగా నాలుగు టవర్లను కూల్చివేసి, మరో నాలుగు టవర్లను తొలగించారు. ఓఅండ్‌ఎం ఫ్యాక్టరీ మూతపడటంతో ఆ ప్రాంతంలోని కూలింగ్ టవర్ల విస్తీర్ణాన్ని వినియోగించుకునేందుకు యాజమాన్యం టవర్లను పేల్చివేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల మోడల్ కోడ్ అమలులో ఉన్నందున కూలింగ్ టవర్ల కూల్చివేతకు అనుమతి ఆలస్యమైంది.

పవన్‌ కల్యాణ్‌ చర్యలు తీసుకోవాలి.. సీఎం సూచన..

ఏపీ సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ కొనసాగుతోంది.. అయితే, ప్రాథమిక రంగంపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.. వచ్చే వందరోజుల్లో తాము చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు వ్యవసాయ, ఆక్వా, ఫిషరీస్, ఉద్యానవనం, అటవీ శాఖల అధికారులు. ఇక, భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు చేశారు.. మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేలా భాద్యత తీసుకోవాలని కోరారు ఏపీ సీఎం.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ సంపదను పెంచాలి. వనభోజనాలకు మనందరం వెళ్లాలి. భారీ ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాలి. ఒకేసారి ఐదు లక్షలు.. పది లక్షల చెట్లు నాటేలా వన మహోత్సవాలను కార్యక్రమం చేపట్టాలి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.. గతంలో హైదరాబాద్ లో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం.. 20 లక్షల హెక్టార్లలో 20 లక్షల మంది రైతులతో నేచురల్ ఫార్మింగ్ కు వెళ్తున్నాం. హై ప్రోటీన్ ప్యాడీ విషయంలో ఇప్పుడు డిమాండు ఉంది.. దీన్ని గుర్తుపెట్టుకోవాలి.. ఎక్కడికక్కడ సాయిల్ టెస్టింగ్ చేయాలి. ప్రతి రంగంలోనూ సాంకేతికతను ఉపయోగించుకోవాలి.. గత ప్రభుత్వ విధానాల వల్ల ఫైబర్ నెట్ పరిస్ధితి ఏంటో తెలియడం లేదు, సీసీ కెమెరాలు ఎక్కడున్నయో క్లారిటీ లేదు. ఫైబర్ నెట్ ఇంటిగ్రేషన్ సీసీ కెమెరాల స్టేటస్ వివరించాలి.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జమ్ములో ఎన్నికలు నిర్వహించాలి..

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రంలో ఎన్నికలు జరపాలని డిమాండ్‌ చేశారు. తద్వారా అక్కడి ప్రజలు తమ నాయకులను ఎన్నుకుంటారని చెప్పుకొచ్చారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసి.. ఐదేళ్లు పూర్తైన సందర్భంగా మల్లికార్జున ఖర్గే ఈ కామెంట్స్ చేశారు. కాగా, ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్ము కశ్మీర్ ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుండటంతో పాటు తీవ్రవాదాన్ని అరికట్టే ఛాన్స్ ఉంటుందని గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.. కానీ, ప్రస్తుతం ఆయన మాటలకు భిన్నంగా జమ్ములో ఉగ్రదాడులు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు 683 ఉగ్రదాడులు జరిగాయని.. 258 మంది జవాన్లు, 170 మంది పౌరులు ప్రాణాలు విడిచారని ఖర్గే తెలిపారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జమ్ములో 25 ఉగ్రదాడులు జరిగ్గా.. 15 మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయి.. 27 మంది గాయపడ్డారని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌.. క్లాస్‌ తీసుకున్న సీఎం చంద్రబాబు..

కలెక్టర్ట కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల అధికారులకు చురకలు అంటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాంతిలాల్ దండేకు క్లాస్ తీసుకున్నారు సీఎం చంద్రబాబు. దండే ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కొన్ని అంశాలు ప్రస్తావించ లేదన్న సీఎం.. ఏపీలో మొత్తం 12 వేల కిలోమీటర్ల మేర స్టేట్ హైవేస్ ఉంటే.. 1000 కిలో మీటర్ల పీపీపీ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు దండే పేర్కొనడంపై స్పందిస్తూ.. 1000 కిలో మీటర్లు ఏ మూలకు సరిపోవన్నారు చంద్రబాబు. అధికారులకు ఇంకా మూస పద్దతిలోనే వెళ్తున్నారన్న సీఎం.. కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలతో వెళ్తోంటే దాన్ని అందిపుచ్చుకోలేక పోతున్నారని.. రైల్ ఓవర్ బ్రిడ్జిలపై కాంతి లాల్ దండే తన ప్రజెంటేషనులో ప్రస్తావించ లేదంటూ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు..

తెలంగాణ ప్రజల గొంతు ఎండిపోయేలా చేస్తున్నారు

ఎల్లంపల్లి నుంచి కేవలం 11 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు నుంచి ఒక్క చుక్క నీరు రాలేదని, కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయమని మేం సూచిస్తున్నామని, వరద వస్తేనే నీటిని ఇస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు గంగుల కమలాకర్‌. గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతోందని, ఎస్సారెస్పీ నుంచి నీళ్లు లేవు. కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయరన్నారు. చాలా జిల్లాల్లో తాగునీరు, సాగు నీరు లేకుండా పోయిందని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సాకు చూపుతూ నీటిని లిఫ్ట్ చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల గొంతు ఎండిపోయేలా చేస్తున్నారని, ఇప్పటికైనా కన్నేపల్లి పంప్ ఆన్ చేసి మిడ్ మానేరు నింపాలని డిమాండ్ చేస్తున్నానన్నారు గంగుల కమలాకర్‌. గోదావరి నీరు వృథాగా సముద్రంలోకి పోతోందని చెప్పారు. ఎస్సారెస్పీ నుంచి నీళ్లు లేవని చెప్పారు. కన్నెపల్లి నుంచి నీటిని ఎందుకు లిఫ్ట్ చేయరని ప్రశ్నించారు.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్‌పర్సన్‌గా ఆనంద్ మహీంద్రా

రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో అభివృద్ధి చేయనున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్‌పర్సన్‌గా మహీంద్రా చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆగస్టు 5వ తేదీ సోమవారం తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి అమెరికాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఇటీవల ముఖ్యమంత్రి ఆనంద్ మహీంద్రాతో సమావేశమై రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. మహీంద్రా చైర్‌పర్సన్ తమ కంపెనీ పెట్టుబడి పెట్టి స్కిల్ యూనివర్సిటీకి ఒక బృందాన్ని పంపుతుందని పేర్కొన్నారు.

ఫుట్‌పాత్‌​ల ఆక్రమణలపై బల్దియా కొరడా

ఫుట్‌పాత్​ల ఆక్రమణలపై బల్దియా కొరడా ఝళిపించింది. ఇష్టారాజ్యంగా ఆక్రమించుకున్న దుకాణాలను తొలగించారు. అబిడ్స్ నుంచి బషీర్ బాగ్ వరకు ఉన్న ఫుట్​పాత్​పై ఉన్న బండ్లను దుకాణాలను కూల్చివేశారు. హైదరాబాద్​ మహా నగరపాలక సంస్థ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఫుట్​పాత్​లపై ఉన్న జ్యూస్ బండ్లు, చాయ్ బండ్లు మిర్చి , టిఫిన్ బండ్లను తొలగించారు. ఈ సందర్భంగా… జీహెచ్ఎంసీ అధికారులతో చిరు వ్యాపారులు వాగ్వివాదానికి దిగారు. పొట్టకూటి కోసం చిరు వ్యాపారాలు చేస్తున్న తమపై అధికారులు ప్రతాపం చూపింస్తున్నారని ఆరోపించారు. అక్రమ కూల్చివేతలను నిరసిస్తూ… అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు ఆందోళన చేపట్టారు.