Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్, సిద్దిపేట గడ్డ

సిద్దిపేటకి కేసీఆర్, హరీష్ రావు ఏం చేశారని రేవంత్ చెబుతున్నారని, కళ్ళుండి సీఎం రేవంత్ రెడ్డి చూడలేకపోతున్నారా అర్థం కావట్లేదన్నారు హరీష్‌ రావు. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులు లేకుండా సిద్దిపేట లేదని, సిద్దిపేట అభివృద్ధి కాలేదని సీఎం రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు హరీష్‌. తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్, సిద్దిపేట గడ్డ అని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే కారణం సిద్దిపేట అని ఆయన హరీష్‌ రావు అన్నారు. తెలంగాణ రాకపోతే రేవంత్ సీఎం అయ్యేవాడా…? తెలంగాణ లేకపోతే ఆయన గురువు చంద్రబాబు అడుగులకు మడుగులు వత్తేవాడని ఆయన విమర్శించారు. రేవంత్ కి మతిమరుపు వ్యాధి ఉన్నట్టు ఉందని, ఆగస్ట్ 15 న సిద్దిపేట కు వస్తాను అన్న సీఎం వ్యాఖ్యలని స్వాగతిస్తున్నానని, నేను మరోసారి సీఎం రేవంత్ కి ఛాలెంజ్ విసురుతున్నానని. నేను నా రాజీనామా మాటపై నిలబడుతున్నా అని ఆయన తెలిపారు.

హిందీ, ఇంగ్లీష్‌ రాదు నువ్వు కరీంనగర్‌ ఎంపీ.. బండి సంజయ్‌ పై పొన్నం ఫైర్‌..

కనీసం నీకు హిందీ ఇంగ్లీష్ రాని నిన్ను కరీంనగర్ ఎంపీగా చెప్పుకోవడం సిగ్గుగా ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావుకు మద్దతుగా రాజీవ్ చౌక్ లో ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో అన్ని అమలు చేస్తామన్నారు. ఇప్పటికీ అమలు కానీ 4000 పింఛన్ రేషన్ కార్డులు 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను త్వరలోనే అమలు చేస్తామన్నారు. ఇంతకుముందున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ చేసింది ఏమిటి? అని ప్రశ్నించారు.

దేవుళ్ల పేరుతో బీజేపీ రాజ‌కీయం చేస్తూ.. దేవుళ్లకే శ‌ఠ‌గోపం పెట్టింది..

దేవుళ్ల పేరుతో రాజ‌కీయం చేస్తూ.. దేవుళ్ల‌కే శ‌ఠ‌గోపం పెట్టిన బీజేపీ అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలోని నిర్మల్ జిల్లా లో లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మంలో సీత‌క్క మాట్లాడుతూ.. గ్రామాల్లో జ‌రుగుతున్న‌ ఉపాధి హామీ ప‌నులు ప‌రిశీలించి, కూలీల‌తో స‌మావేశం అయ్యారు. మంత్రి సీత‌క్క మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకు నిత్యవసర స‌రుకుల ధరలు విపరీతంగా పెరిగినా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన వంద రోజులు పనికి గత పది ఏళ్ల నుంచి బీజేపీ ప్ర‌భుత్వ కూలీ పెంచ‌లేద‌ని అన్నారు.

పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇక అంతే.. జగన్‌ వార్నింగ్‌

ఎన్నికల్లో జగన్ కి ఓటు వేస్తే పథకాలను కొనసాగింపు.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు అంటూ మరోసారి వార్నింగ్‌ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. మరో 10 రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది.. జరగబోయే ఎన్నికలు కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిపించడానికి మాత్రమే కాదు.. ఇంటింటి సంక్షేమం పథకాల కొనసాగింపు కోసం అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే అమలు చేయడానికి సాధ్యం కానీ హామీలతో మోసపోతారని హెచ్చరించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే ఐదేళ్లపాటు మీ రక్తం తాగేందుకు చంద్రముఖి వస్తుందన్నారు. 14 ఏళ్ల పాటు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశా అంటున్న చంద్రబాబు పేరు చెబితే.. రాష్ట్రంలో ఏ పేదలకు ఒకటంటే ఒక్క మంచి గుర్తుకురాదన్నారు. గత ప్రభుత్వాల్లో అవ్వాతాతల ఇంటికి నేరుగా 3000 పెన్షన్ గతంలో ఎప్పుడైనా అందిందా..? అని నిలదీశారు. 59 నెలల కాలంలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని వెల్లడించారు సీఎం జగన్‌.

రాయ్‌బరేలీలో రాహుల్ నామినేషన్.. వెంట సోనియా, ప్రియాంక

ఉత్తరప్రదేశ్‌లో రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాహుల్ వెంట సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, తదితరులు ఉన్నారు. ఇక బీజేపీ నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ బరిలోకి దిగారు. రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు కుంచుకోటలాంటిది. ఇక్కడ నుంచి సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఈ స్థానంలో రాహుల్ రంగంలోకి దిగారు. వాస్తవానికి ఈ స్థానం నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. చివరికి రాహుల్ బరిలోకి దిగారు.

రాయ్‌బ‌రేలిలో రాహుల్‌ గాంధీ ఓటమి ఖాయం..

రాహుల్ గాంధీ వయ‌నాడ్‌తో పాటు రాయ్‌బ‌రేలి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఓటమి భ‌యంతోనే రెండు స్ధాన్నాల్లో బరిలోకి దిగుతున్నాడని కమలం పార్టీ నేతలు మండిపడుతున్నారు. కర్ణాటకలోని చిక్కోడిలో ఇవాళ ( శుక్రవారం) ఎన్నికల ప్రచారానికి హాజ‌రైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ అంశంపై స్పందించారు. రాహుల్ బాబాను సోనియా గాంధీ 2-20 సార్లు లాంఛ్ చేసినా ఇప్పటి వ‌ర‌కూ సక్సెస్ కాలేద‌ని ఎద్దేవా చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ అమేథి నుంచి పారిపోయి రాయ్‌బ‌రేలిలో నామినేష‌న్ దాఖ‌లు చేశార‌ని అమిత్ షా పేర్కొన్నారు.

బాలయ్యపై లక్ష్మీపార్వతి హాట్‌ కామెంట్స్‌.. అభిమానం వేరు.. అభివృద్ధి వేరు..!

నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి.. కుప్పం నియోజకవర్గంలో పర్యటించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డ ఆమె.. ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లాకు వెళ్లారు.. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే బాలకృష్ణను ఓడించాలంటూ పిలుపునిచ్చారు. హిందూపురం అభివృద్ధి కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని గెలిపించండి అని కోరారు.. అభిమానం వేరు.. అభివృద్ధి వేరు.. అభివృద్ధి కోసం వైసీపీకీ ఓటెయ్యండి అని విజ్ఞప్తి చేశారు. ఇక, తన తండ్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌)కి అండగా నిలబడని బాలకృష్ణ.. ప్రజలకు ఏరకంగా అండగా ఉంటారు..? అని ప్రశ్నిస్తూ హాట్‌ కామెంట్లు చేశారు.. గతంలో బాలకృష్ణ హత్య కేసుల్లో ఇరుక్కున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిని తాను స్వయంగా కలిసి.. కేసు లేకుండా చేయించాను. అందుకు బాలకృష్ణనే సాక్ష్యంగా చెప్పుకొచ్చారు. ఆపదలో ఉన్న ఎన్టీఆర్ కుటుంబ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు.. హిందూపురం అభివృద్ధి జరగాలంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలవాలి.. టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఓడిపోవాలి అని పిలుపునిచ్చారు లక్ష్మీపార్వతి. కాగా, హిందూపురంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేస్తూ.. బాలయ్య ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న విషయం విదితమే.

సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగనన్నే రావాలి..

ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని.. అవకాశం కల్పించండని, మీలో ఒక్కరిగా మీ అడుగుజాడల్లో నడుస్తూ మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తానని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. గురువారం కొనకనమిట్ల మండలంలోని సిద్ధవరం, ఉత్తరపల్లి, చెర్లోపల్లి, కుమ్మరపల్లి, చేరెడ్డిపల్లె, చిన్నారికట్ల, పెద్దారికట్ల గ్రామాల్లోని పలు వీధుల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏపీఐఐసీ చైర్మన్ జంకే వెంకట రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లోని ప్రతి గడపకు వెళ్లి జగన్‌ పాలనలో అందించిన మంచిని వివరించారు. అనంతరం ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.

సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత బహిరంగ లేఖ

సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. పెన్షన్ దారులు పడుతున్న ఇబ్బందులపై లేఖలో ప్రస్తావించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు సామాజిక పెన్షన్ల లబ్దిదారుల్ని వేధిస్తున్నారని.. అధికార పార్టీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించడం బాధాకరమని లేఖలో చంద్రబాబు తెలిపారు. ప్రజల కోసం పని చేయాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వ అధికారులు ఆ దిశగా ఆలోచన చేయడం లేదన్నారు. ప్రజలకు మేలు చేసే అవకాశాలను కనీసం ఆలోచించడం లేదన్నారు. ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసేలా నిర్ణయాలు తీసుకోవడం అభ్యంతరకరం, అత్యంత దుర్మార్గమన్నారు. వృద్దులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర పెన్షన్‌ దారులు ఇబ్బందులు పడుతున్నారని.. పెన్షన్‌ పంపిణీ సకాలంలో జరగాలని ఎన్నికల కమిషన్‌ 02.04.2024న ఇచ్చిన మెమోలో పేర్కొన్నదన్నారు.

కైకలూరు బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర భవిష్యత్‌కు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని, ఆలోచించి ఓటేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం గళమెత్తిన పార్టీ జనసేన అని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఠా కూలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పవన్ హమీ ఇచ్చారు. ప్రజలు భయం లేకుండా బతకాలన్నదే తన కోరిక అన్నారు.

Exit mobile version