NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

హైదరాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి భార్యాభర్తలు ఆత్మహత్య..

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు పిల్లలను చంపి.. భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు మంచిర్యాలకు చెందిన వెంకటేష్ (40), వర్షిణి (33)గా గుర్తించారు. వీరికి రిషికాంత్ (11), విహంత్ (3) పిల్లలు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆన్ లైన్ బెట్టింగ్ వ్యాపారం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంకటేష్, వర్షిణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇవాళ ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఇంటికి ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు.

ఎలుకలు కరిచి 14 మంది విద్యార్థులకు గాయాలు

నల్గొండ జిల్లా దేవరకొండ గురుకుల హాస్టల్‌లో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేవరకొండలోని కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం జరిగింది. నిద్రిస్తున్న విద్యార్థులపై ఎలుకలు కొట్టడంతో 14 మందికి గాయాలయ్యాయి. ఉదయం గమనించిన సిబ్బంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన రెండు రోజుల క్రితమే జరిగినప్పటికీ గురుకుల పాఠశాల సిబ్బంది ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. సమాచారం ఆలస్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు చేరడంతో వారు హాస్టల్‌కు చేరుకుని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీ వావిరాజి రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు హాస్టల్‌ను సందర్శించారు. చిన్నారులను ఎలుకలు కొరికితే.. తల్లిదండ్రులకు తెలియకుండా ఎలా దాస్తారని బీఆర్‌ఎస్‌ నాయకులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థినులను అడిగి వివరాలు సేకరించారు. గురుకుల విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు.

నగరంలో రెడ్ అలెర్ట్.. ప్రజలకు ఆమ్రపాలి సూచన..

నగరంలో రెడ్ అలెర్ట్ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి సూచించారు. సిటీలో 141 వాటర్ లాగింగ్ పాయింట్ ల వద్ద స్టాటిక్, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు ఎప్పటికప్పుడు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయకూడదన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. హైడ్రా జిహెచ్ఎంసి సమన్వయంతో పని చేసి ఎవ్వరికీ సమస్యలు రాకుండా చూస్తామన్నారు. నగరంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షం తగ్గేవరకు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలన్నారు. చిన్నపిల్లలు వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్త వహించాలన్నారు. రోడ్లపై ఏర్పడ్డ గుంటలతో ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా జిహెచ్ఎంసి సిబ్బంది పనిచేస్తుందన్నారు. ప్రజలకు అత్యవసరమైతే 040 21111111, 9000113667 నెంబర్ ల ద్వారా సంప్రదించాలని తెలిపారు.

అధికారులు ఎవరూ సెలవులు పెట్టొద్దు.. టెలి కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌..

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసర టెలికాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. అధికారులెవరూ సెలవు తీసుకోవద్దని సీఎం రేవంత్ ఆదేశించారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓ కార్యాలయానికి పంపాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అత్యవసర పని ఉంటే తప్ప బయటకు రావద్దని రేవంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అవసరం ఉంటే అధికారులకు ఫోన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక రాజధాని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. పట్టణాలు, నగరాల్లోని రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమై ఇళ్లు జలమయమయ్యాయి. గ్రామాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, జొన్నలు నీటమునిగాయి.

వర్షాల ఎఫెక్ట్.. రద్దైన రైళ్ల వివరాలు ఇవే..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు వణుకుతున్నాయి. వర్షాలు, వరదల ముప్పు పెరుగుతోంది.. దీంతో వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో ప్రభుత్వం, అధికారులు సహాయక చర్యలకు సిద్ధమయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల రోడ్లు, రైలు పట్టాలు చెరువులుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో భారీగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే 20 పైగా రైళ్లను రద్దు చేసిన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. కొన్నింటిని దారి మళ్లించడంతో పాటు మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేసింది.

కోల్‌కతా ఘటన మరవకముందే.. బెంగాల్ హాస్పిటల్‌లో నర్స్‌పై వేధింపులు..

కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఘటన యావత్ దేశాన్ని ఆగ్రహావేశాలకు గురిచేసింది. నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. కాలేజ్ సెమినార్ హాలులోనే దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా వైద్యులు, హెల్త్ వర్కర్లకు తోడు సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. ఇప్పటికీ బెంగాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తో్ంది. ఇదిలా ఉంటే, ఈ ఘటనను ఇంకా మరవకముందే బెంగాల్‌లోని ఓ ఆస్పత్రిలో నర్సుపై రోగి వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి బీర్భూమ్‌లోని ఇలంబజార్ హెల్త్ సెంటర్‌లో నర్సు విధి నిర్వహణలో ఉండగా, రోగి వేధింపులకు పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో చికిత్స చేస్తున్న సమయంలో రోగి తనని వేధించాడని నర్సు ఆరోపించింది. ఈ ఘటన జరిగిన సమయంలో నిందితుడి వెంట అతడి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

హైదరాబాద్- విజయవాడ మధ్య రాకపోకలు బంద్..

బంగాళఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలను వరద నీరు ముంచెత్తాయి. ఆంధ్రప్రదేశ్ లో 294 గ్రామాలు ముంపు బారిన పడగా.. ఇప్పటి వరకు 13, 227 మంది ప్రజలను పునరావాస శిబిరాలకు ఏపీ సర్కార్ తరలించింది. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందారు. అయితే, భారీ వర్షాల వల్ల రోడ్లు అన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఇక, హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. మున్నేరు వరద ఉదృతితో నేషనల్ హైవే పై వరద నీరు చేరింది. దీంతో నందిగామ మండలం ఐతవరం గ్రామం దగ్గర 65వ జాతీయ రహదారి పైకి వరద ప్రవాహం కొనసాగుతుంది. నేషనల్ హైవేపై వరద నీరు చేరటంతో నందిగామ పోలీసులు రాకపోకలను పూర్తిగా నిలిపి వేశారు. నిన్న (శనివారం) కూడా జాతీయ రహదారి పైకి వరద నీరు చేరడంతో రాకపోకలు క్లోజ్ చేశారు. వరద తగ్గిన తరువాతనే మళ్లీ వాహనాలు రాకపోకలు ముందుకు సాగాయి. తాజాగా మళ్లీ వరద ఎక్కువ కావడంతో హైదరాబాద్- విజయవాడ మధ్య రాకపోకలు బంద్ చేశారు.

ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదురుకోవడానికి సిద్ధంగా ఉండండి

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు నేపద్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి నది తీరం వెంబడి అధికారులు 24/7 అప్రమత్తంగా ఉండాలన్నారు. *రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు గురించి ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సచివాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి లు పాల్గొన్నారు. సోమవారం కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ చేసిన సూచనలను పాటించి లోతట్టు ప్రాంతాలు వరద ప్రభావిత ముంపు గ్రామాల్లో విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. చెరువుల ఆక్రమణలు తొలగించే పనిలో నిమగ్నమైన హైడ్రా ప్రస్తుతం తొలగింపులను రెండు మూడు రోజుల పాటు విరామం ప్రకటించి ఈ విపత్తును ఎదుర్కొనేందుకు రెస్క్యూ ఆపరేషన్ టీమ్ లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యల గురించి హైడ్రా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని పేర్కొన్నారు.

సెప్టెంబర్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు- వాతావరణ శాఖ..

దేశంలో వర్షాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ(IMD) కొత్త నివేదికను విడుదల చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సెప్టెంబర్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నివేదిక ప్రకారం.. ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో.. అక్కడ వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టులో భారతదేశంలో సగటు కంటే 16 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. 2001 నుండి ఇంత వర్షపాతం నమోదు కావడం ఇది ఐదవసారి. అయితే.. ఆగస్టు నెలలో 287 మిల్లీమీటర్ల మంచి వర్షపాతం కూడా వేడిని చల్లార్చలేకపోయింది. ఆగస్టు నెలలో కనిష్ట ఉష్ణోగ్రత అత్యధికంగా ఉంది.

వరదలో కొట్టుకుపోయిన కూలీ కుటుంబం.. కన్నీరు పెట్టుకున్న మంత్రి పొంగులేటి…

రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు సెలవులు పెట్టొద్దన్నారు. స్థానిక పరిస్థితుల మేరకు రేపు స్కూల్స్ కు సెలవులు ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఖమ్మంలో నాకు కావాల్సిన ఓ ముస్లిం కుటుంబం వరదల్లో చిక్కుకుందని, వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉందని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దన్నారు. వరద భారీగా వస్తుంది. ప్రకృతి సహరించడం లేదు. NDRF బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయన్నారు.