NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

5న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌.. వీటిపై ఫోకస్‌ పెట్టిన సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు సిద్ధం అవుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నెల 5వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.. ఈ సమావేశానికి మంత్రులు హాజరుకానున్నారు.. సచివాలయంలో ఈ నెల ఐదో తేదీన జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణ ఏర్పాట్లపై రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సమీక్ష చేపట్టారు.. ఈ సమావేశానికి సీసీఎల్ఏ జయలక్ష్మి, గుంటూరు కలెక్టర్.. నాగలక్ష్మి, జీఏడీ అధికారులు హాజరు కాగా.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పెషల్ సీఎస్ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు..

సీఎం ఛాంబర్‌ ఎదుట బీఆర్‌ఎస్ ధర్నా.. కేటీఆర్‌, హరీశ్‌రావు అరెస్ట్‌..

అసెంబ్లీలో సీఎం ఛాంబర్ వద్ద ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. దీంతో సీఎం ఛాంబర్ బీఆర్ఎస్ నిరసనలతో అట్టుడికింది. సీఎం ఛాంబర్‌ ఎదుట ధర్నాకు దిగిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీలోని వెల్‌లో బైఠాయించిన వారిని మార్షల్ అసెంబ్లీ వెలుపలికి తీసుకొచ్చారు. అనంతరం వారిని పోలీసులు వాహనంలో సభ నుంచి తీసుకెళ్లారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, పద్మారావుగౌడ్‌తో పాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్‌ జాదవ్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు సభ్యులను అరెస్టు చేశారు.

భారత్‌ ఖాతాలో మరో పతకం.. షూటింగ్‌లో కాంస్యం గెలిచిన స్వప్నిల్! తొలి షూటర్‌గా రికార్డు

పారిస్ ఒలింపిక్స్‌ 2024లో భారత యువ షూటర్‌ స్వప్నిల్ కుసాలే సత్తా చాటాడు. గురువారం ఛటౌరోక్స్‌లోని నేషనల్ షూటింగ్ సెంటర్‌లో జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్‌లో మూడో స్థానంలో నిలిచి.. కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. దాంతో భారత్‌ ఖాతాలో మూడో పతకం చేరింది. ఇప్పటికే షూటింగ్ విభాగంలో భారత్‌కు రెండు 2 పతకాలు వచ్చిన విషయం తెలిసిందే.

తీవ్రమైన పోటీ మధ్య స్వప్నిల్ కుసాలే అసాధారణ ప్రదర్శనచేశాడు. ఫైనల్‌లో 451.4 పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించాడు. కాస్త నెమ్మదిగా ప్రారంభించిన స్వప్నిల్.. కీలక సమయంలో మాత్రం పుంజుకొన్నాడు. ఓ దశలో 4, 5 స్థానాల్లో కొనసాగిన అతడు టాప్‌-3లోకి వచ్చాక వెనక్కి తిరిగిచూడలేదు. మూడు పొజిషన్లలో జరిగిన ఈ పోటీల్లో ప్రోన్‌ (బోర్లా పడుకొని), నీలింగ్‌ (మోకాళ్ల మీద), స్టాండింగ్‌ (నిల్చొని) షూటింగ్‌ చేయాలి. మోకాళ్లపై 153.5 పాయింట్లు, ప్రోన్‌లో 156.8 పాయింట్లు, స్టాండింగ్‌లో 141.1 పాయింట్లను సాధించాడు.

అసెంబ్లీలో స్కిల్‌ యూనివర్సిటీ బిల్లు పై సీఎం రేవంత్ రెడ్డి..

అసెంబ్లీలో స్కిల్‌ యూనివర్సిటీ బిల్లు పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీలో స్కిల్‌ యూనివర్సిటీ బిల్లు పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ దేశంలో కరువు విలయతాండవం చేస్తుంది. ఆనాడు దేశంలో 90శాతం పైగా జనాభా వ్యవసాయం, కులవృత్తులు, చేతి వృత్తుల మీద అధారపడి జీవిస్తున్న క్రమంలో పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పంచవర్ష ప్రణాళిక విధానం తీసుకుని వచ్చారన్నారు. ఇందులో వ్యవసాయం, విద్యకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తెచ్చారు. ఇందిరాగాంధీ చదువుకునే విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇచ్చి ప్రోత్సహించారు. రాజీవ్ గాంధీ దేశానికి సాంకేతికను అందుబాటులోకి తీసుకొచ్చారు.హైదరాబాద్ లో ఐటీ రంగ అభివృద్ధికి ఆనాడు రాజీవ్ గాంధీ పునాదులు వేశారని తెలిపారు. ప్రపంచంలో మార్పులకు అనుగుణంగా మన విధానాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో నైపుణ్యం ఉన్నవారి కొరత ఉందన్నారు. వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల నిరుద్యోగం పెరుగుతోందన్నారు.

సున్నిపెంటలో ప్రజా వేదిక సభ.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి.. కృష్ణా నదికి నది హారతి ఇచ్చారు.. అనంతరం సున్నిపెంటలో ప్రజా వేదిక సభలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.. రాబోయే రోజులు అన్ని మంచి రోజులు ఉండాలని కోరుకుంటున్నాను అని ఆకాక్షించారు.. భ్రమరాంభ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకున్నా.. శ్రీశైలం జలాశయం జులై నెలలో నిండింది.. రాయలసీమలో కరువు లేకుండా చేయడం మన సంకల్పం కావాలి అన్నారు. కృష్ణా మిగులు జలాలని మనం వాడుకోవచ్చని చెప్పిన తొలి నాయకుడు ఎన్టీఆర్‌అని గుర్తుచేసిన ఆయన.. రాయలసీమకు నీళ్లిచ్చిన తర్వాతనే చెన్నై కి నీళ్లు వెళ్తాయని చెప్పిన నాయకుడు చంద్రబాబు అన్నారు. రాయలసీమలో పనికిరాని పార్టీకి 7 సీట్లు గెలిపించారు.. ఎక్కడో చిన్న లోపం ఉంది అన్నారు.

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఓటమి

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు బెల్జియం చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్స్‌లో కూడా బెల్జియం భారత్‌ను ఓడించింది. పూల్-బిలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బెల్జియం 2-1తో భారత్‌ను ఓడించింది. భారత్ తరఫున అభిషేక్ సింగ్ 18వ నిమిషంలో గోల్ సాధించాడు. బెల్జియం తరఫున తిబౌట్ స్టాక్‌బ్రూక్స్, జాన్ డోహ్మెన్ గోల్స్ చేశారు. తొలి క్వార్టర్‌లో భారత్ పొరపాట్లు చేయగా 8వ నిమిషంలో బెల్జియంకు తొలి పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే, మొదటిసారి అమిత్ రోహి దాస్ సేవ్ చేయగా, మళ్లీ శ్రీజేష్ అద్భుతమైన సేవ్ చేశాడు. 10వ నిమిషంలో అభిషేక్ సింగ్ ఫీల్డ్ గోల్ చేసేందుకు ప్రయత్నించగా.. బెల్జియం గోల్ కీపర్ గోల్ అనుమతించలేదు. తొలి క్వార్టర్‌లో గోల్‌లు నమోదు కాలేదు.

తెలంగాణలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి

రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇటీవల మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. కేవలం 48 గంటల్లోనే సామూహిక అత్యాచారాలు, దాడులు సహా నాలుగు దారుణ ఘటనలు చోటుచేసుకోవడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. ఈ క్రూరమైన చర్యలు మహిళలకు తీవ్రమైన భద్రత లేకపోవడం , రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిని ఎత్తి చూపుతున్నాయని కేటీఆర్‌ మండిపడ్డారు. ఎనిమిది నెలలు గడిచినా రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవడం, నేరాలు పెరగడం ప్రత్యక్ష ఫలితమే అని కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. వనస్థలిపురం, శాలిగౌరారం, నిర్మల్, పుప్పాలగూడలో జరిగిన దారుణ ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారని, సత్వర న్యాయం, దోషులను కఠినంగా శిక్షించాలని, మహిళల భద్రతకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు కేటీఆర్‌.

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక అహంకారి, ఫ్యాక్షనిస్ట్, ఫ్యూడల్ గా లాగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి తాలిబన్ సంస్కృతికి వారసుడిలా ఉందని ఆయన విమర్శలు గుప్పించారు. మహిళలు అంటే రేవంత్ రెడ్డికి గౌరవం లేదని ఆయన ధ్వజమెత్తారు. గతంలో రేవంత్ రెడ్డి డీకే అరుణపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, మంత్రిగా పని చేసిన సునీతా లక్ష్మారెడ్డి పట్ల రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు జుగుప్సాకరమని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ మహిళా సమాజం అసహ్యించుకుంటోందని, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు ప్రశాంత్‌ రెడ్డి. కేవలం రెండు నిమిషాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వమంటే కూడా ఇవ్వని పరిస్థితి అని, స్పీకర్ కి సమయం ఇవ్వాలని ఉన్నప్పటికీ సిఎం రేవంత్ రెడ్డి నుంచి వస్తున్న ఇన్స్ట్రెక్షన్ వల్ల ఇవ్వలేదు అని అనుకుంటున్నామన్నారు. మహిళ ఎమ్మెల్యేలను రెండున్నర గంటలు నిలబెట్టారని, మమ్మల్ని మార్షల్స్ తో బయటకు పంపి… మమ్మల్ని తెలంగాణ భవన్ లో పోలీసు వాహనంలో డ్రాప్ చేశారన్నారు. మా మహిళా శాసనసభ్యుల ఉసురు మీకు తగులుతుంది రేవంత్ అని ఆయన అన్నారు.

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై తెచ్చిన ఆర్డినెన్స్‌ చట్ట విరుద్ధం ఎలా అవుతుంది..?

వైఎస్ జగన్‌ రెడ్డి ఖాళీ చేసిన ప్రజల జేబులను నింపేలా కూటమి పాలన ఉంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌పై వైసీపీ నేతలకు అవగాహన లేదు.. రాజ్యాంగం ప్రకారం శాసనసభ నియమాలకు లోబడి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై తెచ్చిన ఆర్డినెన్స్‌ చట్ట విరుద్ధం ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు అవగాహనా రాహిత్యంతో విమర్శలు చేస్తున్నారు.. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక అరాచకత్వం వల్లనే ఆర్డినెన్స్‌ తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది అని మండిపడ్డారు. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వం పన్నులు, ఛార్జీల రూపంలో ఒక్కో కుటుంబంపై రూ.7 లక్షల మేర భారం విధించి ప్రజల రక్తాన్ని పీల్చారు.. జగన్‌ ముఠా లక్షల కోట్లు స్వంత ఆదాయం పెంచుకున్నారు.. రూ.35 వేల కోట్ల విలువైన 1.75 లక్షల ఎకరాలను కబ్జా చేశారు అంటూ యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో తొలి రోజే 96 శాతం మేర పూర్తైన పెన్షన్ల పంపిణీ..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండగ జోరుగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 96 శాతం మేర పెన్షన్ల పంపిణీ పూర్తి అయిందని అధికారులు తెలిపారు. తొలి రోజునే 96 శాతం పెన్షన్లను పంపిణీ చేసి ఎన్డీయే కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఒక్క రోజులోనే పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టింది.. సాయంత్రం 4 గంటల సమయానికి 96 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. మిగిలిన నాలుగు శాతం పెన్షన్ల పంపిణీని పూర్తి చేసేలా సచివాలయ ఉద్యోగుల ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లా, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో పెన్షన్ల పంపిణీ చేశారు.