కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆర్ధికశాఖ అలెర్ట్..
కేంద్ర బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ అలెర్ట్ అయ్యింది.. బడ్జెట్ లో రాష్ట్రానికి వస్తున్న ప్రయోజనాలు.. నిధులకు సంబంధించి మద్యాహ్నం 3 గంటలలోగా నివేదిక ఇవ్వాలని అన్నిశాఖలకు ఆర్ధికశాఖ సూచనలు చేసింది.. అన్ని శాఖల నుంచి సమాచారం వచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇవ్వనుంది ఆర్థిక శాఖ.. ఆంధ్రప్రదేశ్ లో నదుల అనుసంధానానికి కేంద్రాన్ని నిధులు కోరింది ఏపీ ఆర్ధిక శాఖ. తుఫాన్‌లు, రాయలసీమ ప్రాంతంలో కరువు ప్రాంతంతో పాటు.. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి భారీగా నష్టం జరిగిందని కేంద్రానికి ఆర్ధిక శాఖ వివరణ ఇచ్చింది.. ఏపీకి కేంద్ర ప్రయోజిత పథకాల్లో 90 శాతం నిధులు వచ్చేలా చూడాలని ఆర్ధిక శాఖ కోరింది.. రోడ్లు.. పోర్టులు.. విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది ఏపీ ప్రభుత్వం..
చిరంజీవి, పవన్, బాలయ్యపై కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నటసింహం నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ధర్మవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నందమూరి బాలకృష్ణ హిందూపూర్‌లో కాబట్టి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడని పేర్కొన్నారు.. హిందూపూర్‌లో కాకుండా.. అదే గుడివాడ అయితే మూడు సార్లు గెలవలేరని చెప్పుకొచ్చారు.. సినిమా హీరోగా ఉన్న చిరంజీవి కూడా రెండు చోట్ల నిలబడి సొంత నియోజకవర్గంలో పాలకొల్లులో ఓడిపోయారు.. తిరుపతిలో గెలిచారని గుర్తుచేశారు..
బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రభావం.. ఇప్పటికే 15వేల కోట్లు..
బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రభావం ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడు నెలలుగా రాష్ట్రంలోని సమస్యలను కేంద్రానికి చెప్పారని తెలిపారు. వాటికి కేంద్ర బడ్జెట్ ద్వారా పరిష్కారమయ్యాయన్నారు. జల్‌జీవన్ మిషన్ ప్రధానికల నిజం కాకుండా గత సర్కార్ చేసిందని విమర్శించారు. జల్‌జీవన్ మిషన్ ను పొడిగించారని చెప్పారు. మాన్యుఫాక్చర్ రంగంలో ఏపీకి మేలు జరగనుందని స్పష్టం చేశారు ఉడాన్ స్కీంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సివిల్ ఏవియేషన్ రంగంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని కొనియాడారు. ఉడాన్ స్కీం 120 కొత్త డెస్టినేషన్ లకు కనెక్ట్
చేసేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు.
తెలుగు కోడలైనా కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదు..
తెలుగు మహిళ అయిన నిర్మలా సీతారామన్ కేంద్రంలో వరసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ఆమెకు టీపీసీసీ తరపున శుభాకాంక్షలు తెలిపారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తెలుగు కోడలైనా కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదని, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు తీరని అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ కు కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందన ఆయన మండిపడ్డారు. బీహార్ ఎన్నికల బడ్జెట్ లాగా ఉంది. ఎన్నికల కోసమే బీహార్ కు నజరణాలు ఇచ్చారని, బీజేపీ తెలంగాణ పై వివక్ష చూపిస్తుంది… రాజకీయంగా తెలంగాణ ను దెబ్బతీయలని చూస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. 50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్రం తెలంగాణ ఒక్క పైసా ప్రత్యేక కేటాయింపు జరపలేదని, త్వరలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం తో అక్కడ రాజకీయ లబ్ది కోసమే బీజేపీ కేంద్ర బడ్జెట్ ను ఉపయోగించుకుంటుందన్నారు.
ఇది ప్రజల బడ్జెట్.. పొదుపు, పెట్టుబడుల్ని పెంచుతుంది..
కేంద్ర బడ్జెట్ 2025 ‘‘ప్రజల బడ్జెట్’’ అని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని బడ్జెట్ ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ బడ్జెట్ పెట్టుబడుల్ని పెంచుతుందని, ఇది ‘‘వికసిత భారత్’’ లక్ష్యానికి మార్గం సుగమం చేస్తుందని అన్నారు. రూ. 12 లక్షల వరకు ఆదాయపన్ను లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ఈ బడ్జెట్ ప్రజల పొదుపుని పెంచుతుందని చెప్పారు. “ఈ బడ్జెట్‌లో, సంవత్సరానికి రూ. 12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా చేశారు. అన్ని ఆదాయ వర్గాలకు, పన్నులు తగ్గించబడ్డాయి. ఇది మన మధ్యతరగతికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఇటీవల శ్రామిక శక్తిలో చేరిన వారికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది.’’ అని అన్నారు.
‘దేశమంటే కొన్ని రాష్ట్రాలు కాదోయ్.. దేశమంటే 28 రాష్ట్రాలోయ్’ అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి
కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన మాజీ ఆర్థికమంత్రి హరీష్ రావు.. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారని. కానీ దేశమంటే కొన్ని రాష్ట్రాలు కాదోయ్ దేశమంటే 28 రాష్ట్రాలోయ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. దేశానికి 5.1 జీడీపీ ఇచ్చి దేశాన్ని తెలంగాణ పోషిస్తుందని, కానీ పోయినసారి ఆంధ్రకు, ఈసారి బీహార్ కి బడ్జెట్ లో పెద్దపీట వేసి తెలంగాణకి మొండిచేయి చూపారన్నారు. బడేభాయ్ అని ప్రధాని మోడీని సీఎం రేవంత్ మెచ్చుకుంటున్నారని, కానీ బడేభాయ్ ఈ చోటే భాయ్ ని పట్టించుకోవడం లేదని సెటైర్ వేశారు.
పేదల ఆదాయాన్ని పెంచడమే నా అభిమతం
పేదల ఆదాయాన్ని పెంచడమే తన అభిమతం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లె గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ‘‘నేను ఆ రోజు అందరినీ ఐటీ చదువుకోమన్నాను. అమెరికాలో ఉండే వారి తలసరి ఆదాయం కంటే మన వారి తలసరి ఆదాయం రెండింతలు ఎక్కువగా ఉంది. నన్ను అరెస్టు చేశారు. నేను ఎక్కడ భయపడను. భయం అనేది నా జీవితంలో లేదు. 53 రోజులు నన్ను జైల్లో పెట్టారు. నా కోసం ఐటీ ఉద్యోగులు 80 దేశాల్లో నిరసన చేశారు. ప్రతి దేశంలో బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వెళ్తే అక్కడ మన తెలుగు వారు ఉంటారు. సంబేపల్లి మీదుగా కాలువ నిర్మాణం చేపట్టి చిత్తూరుకు తీసుకెళ్తాం. హంద్రీనీవా కాలువ నిర్మాణం త్వరగా పూర్తి చేస్తాం. రాయలసీమ ఈరోజు ఇలా ఉందంటే దానికి స్ఫూర్తి ఎన్టీఆర్. ఎవరు ఈ ప్రాంతానికి ముందు చూపుతో ఆలోచన చేశారు. ఎవరు మన కోసం మంచి చేశారు అని ఆలోచిస్తే మరో పార్టీకి ఓటు వేయరు.’’ అని చంద్రబాబు అన్నారు.
పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్
కేంద్ర బడ్జెట్ అద్బుతంగా ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పేద, మధ్యతరగతి, రైతులు, చిరు వ్యాపారుల, యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్ ఇది అని ఆయన అన్నారు. మధ్యతరగతి ఉద్యోగుల, వ్యాపారులకు ఈ బడ్జెట్ ఓ వరమని, ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం విప్లవాత్మక చర్య అని ఆయన పేర్కొన్నారు. గత 75 ఏళ్లలో మధ్య తరగతి ప్రజల కోసం ఇంత అనుకూలమైన బడ్జెట్ ఎన్నడూ రాలేదని, అట్లాగే ఇది సంస్కరణల బడ్జెట్ అని, 2027నాటికి అమెరికా, చైనా తరువాత భారత్ ను మూడో ఆర్ధిక వ్యవస్థగా అవతరించే ఆ దిశగానే ఈ బడ్జెట్ ను రూపొందించడం గొప్ప విషయమన్నారు. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీగారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ప్రత్యేక ధన్యవాదాలు, బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల పక్షపాతి అనడానికి నిదర్శనమిదన్నారు. తెలంగాణసహా దేశంలో లక్ష రూపాయల లోపు జీతభత్యాలు పొందే ఉద్యోగులంతా ఇకపై పన్ను కట్టాల్సిన అవసరం లేకపోవడం గొప్ప విషయం. తద్వారా ఒక్కో ఉద్యోగికి సగటున రూ.80 వేలు ఆదా అయ్యే అవకాశముంది. పేద, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసే టీవీ, మొబైల్స్, లెదర్ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గబోతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై ధరలు కూడా తగ్గబోతున్నాయి. తద్వారా కాలుష్యం తగ్గే అవకాశముందన్నారు.
నిర్మలమ్మ బడ్జెట్‌ను స్వాగతించిన చంద్రబాబు.. ప్రగతిశీల బడ్జెట్ అంటూ కితాబు
పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప విషయం అని కొనియాడారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్ దార్శనికతకు బడ్జెట్ ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని కితాబు ఇచ్చారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి ఆరు కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందని చంద్రబాబు పేర్కొన్నారు. జాతీయ శ్రేయస్సు దిశగా ఈ బడ్జెట్ కీలక అడుగులు సూచిస్తోందని చెప్పారు. దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తూ సమగ్రమైన బ్లూప్రింట్‌గా పని చేస్తుందని.. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.
ఏనుముల రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి అంటున్నారు..!
ఇవాళ ఈ రాష్ట్రంలో ట్విట్టర్‌కు టిక్‌టాక్‌కు తేడా తెలియని వాడు, పాలన చెయ్యమంటే ఫాల్తూ మాటలు, పాగల్ మాటలు మాట్లాడుతూ, అచ్చోసిన ఆంబోతులా ఊరేగేవాడు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇవాళ ఆయన తెలంగాణ భవనలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ పెట్టి తెలంగాణ ప్రజల చేత తన్నించుకొన్నడని, మీరు పెట్టిన సర్వేలోనే KCR కు 70% నీకు 30% ఓట్లు పడేసరికి రేవంత్ రెడ్డి మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు. నిన్న షాద్ నగర్ మీటింగ్‌లో ఫ్రస్టేషన్ తో ఊగి పోతూ ఎప్పటిలాగే ఆ కంపునోరుతో అవే అబద్దాలు అవే సంస్కారం లేని మాటలు అదే బూతులు మాట్లాడిండని ఆయన మండిపడ్డారు. అందుకే నిన్న ప్రజలు ఏనుముల రేవంత్ రెడ్డి గా కాకుండా బూతుల రేవంత్ రెడ్డి అంటున్నారని ఆయన విమర్శించారు.