NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

పద్మ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం సత్కారం.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సన్మానించింది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర మంత్రులు హాజరయ్యారు. పద్మ అవార్డు గ్రహీతలను సత్కరించిన ముఖ్యమంత్రి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల నగదును అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంవత్సరాలుగా నంది అవార్డులు ఇవ్వలేదని, అది కొంచెం బాధగా ఉందని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో గద్దర్ పేరుతో ఆ అవార్డ్ ఇస్తాము అని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలన్నారు. పద్మభూషణ్ వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం పద్మవిభూషణ్ వచ్చినందుకు అంత ఉస్తాహం లేదన్నారు. పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా సన్మానం చేయడం ఇదే ప్రథమం అన్నారు. తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయన్నారు. నంది అవార్డుల ప్రోత్సహం అనేది చాలా ఏళ్ళు అవుతోందన్నారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇవ్వటం సంతోషమన్నారు. తెలుగు భాషను గొప్పగా నిలబెట్టిన వాళ్ళలో వెంకయ్య నాయుడు ఒకరని తెలిపారు. వెంకయ్య నాయుడు వాగ్ధాటికి నేను పెద్ద అభిమానిని అన్నారు.

ఐఎస్ఐ ఏజెంట్ సత్యేంద్ర సివాల్‌ ను మీరట్ లో అరెస్ట్ చేసిన ఏటీఎస్

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాకు చెందిన సత్యేంద్ర సివాల్‌గా గుర్తించిన ఐఎస్ఐ ఏజెంట్‌ను ఏటీఎస్ అరెస్ట్ చేసింది. సత్యేంద్ర 2021 సంవత్సరం నుండి రష్యా రాజధాని మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. సత్యేంద్ర ఎంబసీలో ఇండియాస్ బెస్ట్ సెక్యూరిటీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అరెస్టయిన సత్యేంద్ర భారత రాయబార కార్యాలయం, రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత సైనిక సంస్థలకు సంబంధించిన ముఖ్యమైన రహస్య సమాచారాన్ని ఐఎస్ఐ హ్యాండ్లర్లకు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఏటీఎస్‌ విచారణలో సత్యేంద్ర నేరం అంగీకరించాడు. సత్యేంద్ర స్వస్థలం హాపూర్. అతడి నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఆధార్ కార్డు, పాన్ కార్డులను ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది. వాస్తవానికి, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హ్యాండ్లర్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులను ప్రలోభపెట్టి, డబ్బు ఎర చూపుతూ వారిని హనీ-ట్రాప్‌కు గురిచేస్తున్నారని యూపీ ఏటీఎస్ కి అందింది.

ఆటో EMI కట్టలేకపోతున్నాం.. హరీష్‌ రావుతో ఆటో డ్రైవర్లు

సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పర్యటించారు. పటాన్ చెరు బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు హరీశ్ రావు. ఈ సందర్భంగా పలువురు ఆటో కార్మికులు ఈఎంఐలు కూడా చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడ్డామని వాపోయారు. మాకు సహాయం చేయాలని కోరారు. ప్రభుత్వాన్ని వేడుకున్నట్లు తెలిపారు. కుటుంబ పోషణకు ఆటో నడపడం ఒక్కటే మార్గమని దిక్కని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఉచిత బస్సు మంచిదే అయినా కస్టమర్లు లేక ఆటోలు నడపలేకపోతున్నామని అన్నారు. రోజుకు రూ.100 కూడా సంపాదించే పరిస్థితి లేదని వాపోయారు. కొత్త తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన హరీష్ రావు.. ఆటో డ్రైవర్లకు అండగా నిలుస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసమస్యల కోసం బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగిస్తుందని ఆటోడ్రైవర్‌లకు హితవు పలికారు. 6.5 లక్షల మంది ఆటోడ్రైవర్ల తరపున అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ గళం వినిపిస్తామన్నారు. ఆత్మహత్యల వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ప్రభుత్వం నెలకు 10 వేలు ఇచ్చే వరకు పోరాడుతామని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, ఆటో కార్మికులు తదితరులు ఉన్నారు.

అందుకే జనసేనలో చేరుతున్నా: ఎంపీ బాలశౌరి

రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు గత ఐదేళ్లలో అనుకున్నంతగా జరగలేదు అని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఎన్నిసార్లు చెప్పినా అభివృద్ధిపై స్పందించడం లేదన్నారు. రాష్ట్రంను అభివృద్ధి చేస్తారన్న ఆలోచనతోనే జనసేనతో కలిసి నడుస్తున్నానని వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు. 2004లో వైఎస్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చానని, గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బందర్ నుంచి పోటీ చేసి గెలిచానన్నారు. పవన్ కల్యాణ్ సమక్షంలో ఆదివారం జనసేనలో చేరనున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.

ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ… ‘నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో నడిచిన వ్యక్తిని. వైఎస్ ఎంతో గొప్ప వ్యక్తి. రాజశేఖర్ రెడ్డితో ఏ నాయకుడిని పోల్చలేము. నేను రాజకీయాల్లో క్రమశిక్షణగా ఉంటాను కాబట్టి ఎవరికైనా నచ్చుతాను. అందరితో సన్నిహితంగా ఉంటాను. వైయస్ హయాంలో డెల్టాకు జీవనాధారమైన పులిచింతల ప్రాజెక్టును పూర్తి చేయగలిగాం. వైఎస్ జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని భావించా. కానీ డయాఫం వాల్ రిపేరు పేరుతో రెండు సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది’ అని అన్నారు.

నేటి నుంచి ఈ నెల 11 వరకు.. 23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

హైదరాబాద్ వాసులకు ఎంఎంటీఎస్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. నగరంలో 23 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల కారణంగా ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మౌలాలి-సనత్ నగర్ మధ్య నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. నేటి 4వ తేదీ (ఆదివారం) నుంచి ఈ నెల 11వ తేదీ వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మొత్తం 51 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. టైమ్ టేబుల్ ప్రకారం ఈ రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. ఈ నెల 9 వరకు మూడు ఎంఎంటీఎస్ రైళ్లు, 10 వరకు మరో రెండు, ఈ నెల 11 వరకు 18 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేసినట్లు వారు పేర్కొన్నారు. వీటితోపాటు మౌలాలి-అమ్ముగూడ-సనత్‌నగర్‌ మార్గంలో నడిచే హైదరాబాద్‌-సిర్పూర్‌-కాగజ్‌నగర్‌, వికారాబాద్‌-గుంటూరు, రాయపల్లె-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను షెడ్యూల్‌ ప్రకారం నిలిపివేస్తారు.

“నన్ను బీజేపీలో చేరమని బలవంతం చేస్తున్నారు”.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు..

ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తనను బీజేపీలో చేరాలని బలవంతం చేస్తు్న్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయినా కూడా తాను ఒత్తిళ్లకు లొంగబోనని తేల్చి చెప్పారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కేజ్రీవాల్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ కేసును ఢిల్లీ క్రైం బ్రాంచ్ విచారిస్తోంది. ఇప్పటికే కేజ్రీవాల్‌కి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ విచారణ మధ్యే కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే, ఎమ్మెల్యేల కొనుగోలు కేసును విచారిస్తున్న క్రైంబ్రాంచ్ ఇందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాల్సిందిగా సీఎం కేజ్రీవాల్‌ని కోరింది. ఇదే రకమైన ఆరోపణలు చేసిన ఢిల్లీ మంత్రి అతిషిని కూడా ఆధారాలు సమర్పించాల్సిందిగా అడిగింది. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయాలని చూసిందని, మా 7 మంది ఎమ్మెల్యేలను వారు సంప్రదించారని, 21 మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారని, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ. 25 కోట్లు ఇవ్వడంతో పాటు రానున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ ఇస్తామని ఆశ చూపినట్లు కేజ్రీవాల్ ఆరోపించారు.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో…ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా.. ఏపీ పదిహేనవ అసెంబ్లీకి ఇవే చివరి సమావేశాలు.

వారి పాపాలు కప్పిపుచ్చి.. కాంగ్రెస్ మీద నెట్టే పనిలో ఉన్నారు

KRMB కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన పాపాలను కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నెట్టేస్తున్నారన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్‌, హరీష్‌ రావు మాపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.. ప్రజలను గందరగోళానికి గురిచేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏపీ సర్కార్‌కు లొంగిపోయిందన్నారు. విభజన చట్టంలోని ప్రతీ అక్షరం నన్ను అడిగే రాశారని కేసీఆరే చెప్పారని, కేసీఆరే ఈ చట్టానికి, పుస్తకానికి రచయిత అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రాజెక్ట్‌లను కేంద్రానికి అప్పజెప్పడానికి పునాది పడిందే 2014లో అని సీఎం రేవంత్‌ అన్నారు.

ముగిసిన చంద్రబాబు – పవన్ భేటీ..

చంద్రబాబు నివాసంలో పవన్ కల్యాణ్ తో భేటీ ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్‌.. దాదాపు మూడు గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన.. ఈ అంశంపై చర్చలు కొనసాగాయి. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో.. జనసేనకు ఎంత సీటు షేర్ ఇవ్వాలి.. ఏఏ నియోజకవర్గాలకు సంబంధించి గెలుపువకాశాలు ఉన్నాయన్న సర్వేల ఆధారంగానే తుది కసరత్తులు చేసినట్లు తెలుస్తోంది.

సీట్ల కోసం భేటీ అయ్యారో.. నోట్ల కోసం భేటీ అయ్యారో.. చంద్రబాబు-పవన్ భేటీపై సెటైర్లు

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అవ్వటం కొత్త కాదని విమర్శించారు. సీట్ల కోసం భేటీ అయ్యారో.. నోట్ల కోసం భేటీ అయ్యారో వాళ్లే చెప్పాలని కీలక వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల నుండి కలిసి పోటీ చేస్తాం అని చెప్తున్న వాళ్ళు.. ఇప్పటివరకు సీట్ల వ్యవహారం తేల్చుకోలేకపోయారని మంత్రి ఆరోపించారు. మేం సిద్ధం అని జగన్ అంటుంటే.. టీడీపీ, జనసేన దగ్గర నుంచి సమాధానం లేదని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లతో వైసీపీ అఖండ విజయం ఖాయం అని మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. తమ టార్గెట్ గెలవటం కాదు.. 175 సీట్లు గెలవటం అని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు ఓడిపోవడమే తమ టార్గెట్ అని దుయ్యబట్టారు. సీఎం జగన్ ను ఓడించడం మీ వల్ల కాదని.. పేద ప్రజానీకం తమకు అండగా ఉందని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేసినా.. వైసీపీ విజయం ఖామమని అన్నారు. ఎన్నికల ముందు టికెట్లు రాని జంపింగ్ నాయకులు పార్టీలు మారటం సాధారణమేనని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.