NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు.. మహా అయితే 4 కేసులు పెడతారు..!

మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు.. మహా అయితే 4 కేసులు పెట్టగలుగుతారు.. అంతకు మించి వాళ్లు ఏంచేయగలుగుతారు? అని ప్రశ్నించారు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వైసీపీ ఎమ్మెల్సీలతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఈ ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. గడచిన ఐదేళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏకంగా 99శాతం వాగ్దానాలు అమలు చేశాం. ఏపీ చరిత్రలో కాని, దేశంలోకాని ఎప్పుడూ ఇలా జరగలేదు. మేనిఫెస్టోను బైబిల్లా, ఖురాన్లా, భగవద్గీతలా ఒక పవిత్రగ్రంధంలా భావించి అమలు చేశాం. మేనిఫెస్టోను చూపించి.. ప్రతి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ.. ఇది అమలు జరిగిందా? లేదా? అని అడిగి మరీ టిక్ పెట్టించాం. ఏ రోజూ ఈ మాదిరిగా చేసిన పరిస్థితులు లేవు. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు.

ఏపీ సచివాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ సచివాలయానికి చేరుకున్నారు.. తన భార్య నారా భువనేశ్వరితో కలిసి సచివాలయంలో అడుగుపెట్టారు.. అయితే, చంద్రబాబు ఐదేళ్ల తర్వాత సచివాలయానికి వచ్చారు.. మరోవైపు తన నివాసం నుంచి సచివాలయం వరకు దారిపొడవునా చంద్రబాబుకు స్వాగతం లభించింది.. రోడ్డు వెంట, కూడళ్లలో భారీ హోర్డింగులు ఏర్పాటు చేసి టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆయనక స్వాగతం పలికారు.. ఇక, అమరావతి ప్రాంతంలో రైతులు.. ధర్నా శిబిరాలను తొలగించి.. చంద్రబాబుకు స్వాగతం పలికారు.. వెంకటాపాలెం వద్ద భారీ సంఖ్యలో చంద్రబాబు వద్దకు వచ్చారు అమరావతి రైతులు, మహిళలు.. కాన్వాయ్ లో డోర్ తీసుకుని బయటకు వచ్చారు చంద్రబాబు.. ఆయనపై పూలవర్షం కురిపించారు అమరావతి రైతులు, మహిళలు.. మరోవైపు.. ఆయన సచివాలయానికి చేరుకోగా.. ఘనంగా స్వాగతం పలికారు మంత్రులు, ఉద్యోగులు..

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి ఐదు సంతకాలు వీటిపైనే..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు నారా చంద్రబాబు నాయుడు.. తన నివాసం నుంచి సచివాలయం వరకు చంద్రబాబుకు స్వాగతం లభించింది.. టీడీపీ శ్రేణులు, కూటమి నేతలు, అభిమానులు, అమరావతి రైతులు.. ఇలా దారి పొడవునా భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. ఇక, చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ.. కొన్ని చోట్ల పూల వర్షం కురిపించారు అమరావతి రైతులు.. రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు ఉన్న శిబిరాలను వారే తొలగించుకున్నారు.. ఇక, సచివాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు, సచివాలయ ఉద్యోగులు స్వాగతం పలికారు.. తన చాంబర్‌కు చేరుకున్న చంద్రబాబు.. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.. ఆ తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పనిలో మునిగిపోయారు.. సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే.. వరుసగా ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు చంద్రబాబు నాయుడు.. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్‌పై మొదటి సంతకం చేసిన చంద్రబాబు.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేస్తూ రెండో ఫైల్‌పై సతకం చేశారు.. ఇక, పెన్షన్లు రూ.4వేలకు పెంచుతూ మూడో ఫైల్‌పై సంతకం చేశారు.. అన్న క్యాంటీన్ల ఏర్పాటు కోసం 4వ సంతకం పెట్టారు.. నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు..

లాసెట్, పీజీ ఎల్సెట్ ఫలితాలు విడుదల..
తెలంగాణ లాసెట్/ పీజీ ఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ప్రొఫెస‌ర్ లింబాద్రి ఫలితాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల కోసం 50,684 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మూడేళ్ల లా కోర్సు కోసం 36,079 మంది, ఐదేళ్ల లా కోర్సు కోసం 10,197 మంది, ఎల్‌ఎల్‌ఎం పరీక్ష కోసం 4,408 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 50,684 మంది అభ్యర్థులకు గాను.. 40,268 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో 72.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. టీజీ లాసెట్ ప్రవేశ పరీక్షలో కనీస అర్హత మార్కులను 35 శాతంగా నిర్ణయించారు. 120 మార్కులకుగాను 42 మార్కులు తప్పనిసరిగా రావాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు. పీజీ ఎల్ సెట్ 2024 ప్రవేశ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. 120 మార్కులకుగాను 30 మార్కులు తప్పనిసరిగా రావాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.

తడసానా వీడియో విడుదల చేసిన ప్రధాని.. ఉపయోగాలివే!
యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో వేరే చెప్పనక్కర్లేదు. సాధారణ మనుషులకు.. యోగా చేసే వాళ్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రతి రోజు యోగా చేసే వాళ్లు ఉత్సాహంగా.. ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అంతేకాకుండా ఎక్కువ కాలం కూడా జీవిస్తారని చెబుతుంటారు. శాస్త్రీయంగా కూడా ఇది నిజమని నిరూపిస్తుంటారు. ఇదంతా ఎందుకంటారా? తాజాగా ప్రధాని మోడీ గురువారం విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాలు తెలియాలంటే ఈ వార్త చదవండి. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా యోగాసనాలు చేయనున్నారు. దీన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఒక వీడియో సందేశం విడుదల చేశారు. శక్తి కోసం ప్రతి ఒక్కరూ తడసానా సాధన చేయాలని మోడీ ప్రజలను కోరారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో వీడియో విడుదల చేశారు. ఆయా భంగిమల్లో కలిగే లాభాలను కూడా క్లియర్‌గా వివరించారు. పలు రకాలైన రోగాల బారిన పడకుండా తప్పించుకోవచ్చని.. ఆరోగ్య పరంగా కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలియజేశారు. తడసానా లేదా తాటి చెట్టు భంగిమ వీడియోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆరోగ్య ప్రయోజనాలు, నిలబడి ఆసనం చేయడంలోని దశలను వివరించారు. ఇక తడసానా శరీరానికి చాలా మంచిదని.. ఇది మరింత బలాన్ని మరియు మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.

అందుకోసమే ప్రధాని మోడీ ఇటలీ వెళ్తున్నారు.. కాంగ్రెస్ నేత విమర్శలు..
ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన ఇటలీకి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. జూన్ 13-14 తేదీల్లో ఇటలీలోని అపులియా వేదికగా జరిగే జీ-7 సమ్మిట్‌‌లో పాల్గొనేందుకు మోడీ అక్కడికి వెళ్తున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్వయంగా నరేంద్రమోడీకి ఆహ్వానం పంపించారు. ఈ పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ విమర్శించారు. అంతర్జాతీయంగా నరేంద్రమోడీ ప్రతిష్ట తగ్గిందని, తన ప్రతిష్టను కాపాడుకునేందుకే ఆయన ఇటలీకి వెళ్తున్నారని జైరాం రమేష్ అన్నారు. 2007లో అప్పటి ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ పర్యటను పోలుస్తూ.. మన్మోహన్ సింగ్ ‘‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్’’గా ఉద్భవించారని, స్వీయ ప్రగల్భాల ద్వారా కాదని ప్రధాని మోడీని విమర్శించారు. అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూకే, జపాన్ దేశాల జీ-7 సమ్మిట్ 1970ల చివరి నుంచి జరుగుతోందని, 1997,2014 మధ్య రష్యా కూడా ఇందులో సభ్యదేశంగా ఉండేదని, 2003 నుంచి ఇండియా, చైనా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికాలను కూడా జీ -7 సమావేశాలకు ఆహ్వానించబడ్డాయని ఎక్స్ వేదికగా జైరాం రమేష్ అన్నారు.

71 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సప్..ఎందుకో తెలుసా?
ప్రముఖ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారులపై శ్రద్ధవహిస్తూనే ఉంది. వాట్సాప్ కి పోటీగా చాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి మార్కెట్లో నిలదొక్కుకోలేలపోయాయి. యూజర్స్ అవసరాలు, అభిరుచిని బట్టి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ఇవ్వటమే ఇందుకు కారణమని చెప్పచ్చు. ఇవే కాకుండా తమ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకునే వారిపై వాట్సప్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. తాజాగా కొన్ని భారతీయ ఖాతాలపై వాట్సాప్ నిషేధించింది. ఇప్పటికే దాదాపు 71 లక్షల భారతీయుల ఖాతాలను పూర్తిగా మూసేసింది. వాటిలో అత్యధిక ఖాతాలు సైబర్ ఫ్రాడ్, మోసాలకు సంబంధించినవని, మరికొన్ని వాట్సాప్ విధానాలను ఉల్లంఘించినవని వాట్సప్ నివేదిక వెల్లడించింది.

ఇది ట్రైనా లేక ఓయోనా? రైలులో ఇద్దరు ప్రేమికులు ఏం చేశారో చూడండి..!
ప్రేమ నిజంగా గుడ్డిది. అయితే ప్రేమికులు కొన్ని విషయాల్లో గుడ్డితనం ప్రదర్శిస్తే మాత్రం జనాల నుంచి విమర్శలు రావడం ఖాయం. ఎందుకంటే బస్సు, రైలు, మెట్రో, పార్క్ ఇలా పలు బహిరంగ ప్రదేశాల్లో కొందరు ప్రేమికులు అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి దుష్ప్రవర్తపపై ప్రజల ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే తరహాలో ఇద్దరు ప్రేమికులు రైలులో రొమాన్స్ చేసి తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టారనే వార్త వైరల్‌గా మారింది. దీనికి సంబంధంచిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. బహిరంగ ప్రదేశాల్లో అతని దారుణంగా ప్రవర్తించినందుకు చాలా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల, బహిరంగ ప్రదేశాల్లో ప్రేమికుల సరసాల కథనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనే చోటు చేసుకుంది, లోకానికి తెలియకుండా ఇద్దరు ప్రేమికులు రైలులో ఉద్వేగభరితమైన గొడవకు దిగారు. “Oyo సౌకర్యం ఇప్పుడు భారతీయ రైల్వేలలో కూడా అందుబాటులో ఉంది” అనే శీర్షికతో X ఖాతా HasnaZarurihaiలో వీడియో భాగస్వామ్యం చేయబడింది.

నసావు కౌంటీ స్టేడియంను కూల్చివేయడానికి వచ్చిన బుల్డోజర్లు.. ఎందుకో తెలుసా..?
న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం టీ20 ప్రపంచ కప్ 2024 వేదికగా ఎనిమిది మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. న్యూయార్క్ లో క్రికెట్ స్టేడియం లేకపోవడంతో తాత్కలికంగా దీన్ని ఏర్పాటు చేశారు. 250 కోట్ల రూపాయలతో నిర్మించిన నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం.. అందరూ ఊహించినట్లుగానే ఇక్కడి పిచ్ బ్యాటర్లుకు పెద్దగా సహకరించలేదు. అయితే.. ఈ స్టేడియంలో బుధవారం జరిగిన ఇండియా-అమెరికా మ్యాచ్ చివరిది. ఆ తర్వాత ఈ స్టేడియాన్ని కూల్చివేయనున్నారు. స్టేడియంను కూల్చివేయడానికి బుల్డోజర్లు సిద్ధంగా ఉన్న వీడియోను ANI సోషల్ మీడియా హ్యాండిల్‌ షేర్ చేసింది. న్యూయార్క్ లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అంటే టోర్నీ ప్రారంభానికి కేవలం 5-6 నెలల ముందు నిర్మాణం చేపట్టారు. ఈ స్టేడియంలో స్టాండ్లతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు.

దుల్కర్ “లక్కీ భాస్కర్” మ్యూజికల్ ప్రమోషన్స్ పై స్పెషల్ అప్డేట్..
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ “మహానటి”సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.ఈ సినిమాలో జెమిని గణేశన్ గా దుల్కర్ అద్భుతంగా నటించి మెప్పించారు.ఆ తరువాత దుల్కర్ సల్మాన్ టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో “సీతారామం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో వీరిద్దరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో తెలుగులో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో దుల్కర్ “లక్కీ భాస్కర్” అనే సినిమా ను చేస్తున్నాడు.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తుంది. దర్శకుడు వెంకీ అట్లూరి రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా “సార్” అనే సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమా ప్రేక్షలను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా అద్భుత విజయం సాధించింది.ప్రస్తుతం ఈ దర్శకుడు దుల్కర్ సల్మాన్ తో చేస్తున్న “లక్కీ భాస్కర్ ” సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 27, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది.అలాగే ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ని జూన్ 17న నుండి మొదలు పెట్టనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.రీసెంట్ గా ఈ చిత్రం నుండి రిలీజ్ చేసిన గ్లింప్సె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.