బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ హాట్ కామెంట్లు.. నేను అర్హుడిని కాదా..?
తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతుంది..! ఏమో జరగబోతోంది..! అధ్యక్షుడిని మార్చేస్తారు..! ప్రస్తుత అధ్యక్షుడిని సెంట్రల్‌లో ఉపయోగించుకుంటారు..! ఇలా రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.. కొంతమంది కీలక నేతలు అలకబూనారు..! పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు..! ఇంతకీ బీజేపీలో ఉంటారా? మరో పార్టీలో చేరతారా? అనే చర్చ కూడా సాగుతోంది.. అలాంటి వ్యక్తుల్లో బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఒకరు.. అయితే, ఢిల్లీలో ప్రత్యక్షమైన ఆయన.. బీజేపీలో పరిస్థితులపై హాట్ కామెంట్లు చేశారు.. తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. మూడు పదవుల్లో ఎదో ఒక పదవి ఇవ్వాల్సిందే అనే తరహాలో.. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్.. లేదంటే జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వండి అంటూ స్పష్టం చేశారు. తాను పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నా, నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాదు? అని ప్రశ్నించారు రఘునందన్.. కొన్ని విషయాల్లో నా కులమే నాకు శాపం కావచ్చు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందన్నారు.. రెండో సారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యే గా గెలుస్తా అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నేను పార్టీలో ఉండాలని అనుకుంటున్నా అని స్పష్టం చేశారు.. 100 కోట్లు ఖర్చుపెట్టినా మునుగోడులో గెలవలేదు.. అదే 100 కోట్లు నాకిస్తే తెలంగాణను దున్నేసేవాణ్ణి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో నన్ను చూసే గెలిపించారు.. కేసీఆర్‌ను కొట్టె మొగోణ్ణి నేనేనని జనాలు నమ్మారని.. అంతేకాని బీజేపీని చూసి కాదు అంటూ తేల్చేశారు.
చిత్తూరు డెయిరీని అమూల్‌కు కట్టబెట్టొద్దు.. సీఎస్‌కు లేఖ
చిత్తూరు డైయిరీని అమూల్ కు ధారాదత్తం చేయడం సరికాదంటూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. చిత్తూరు డెయిరీని అమూల్ కు అప్పగించడమంటే తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే.. ఇక్కడి ప్రజాసంపద, సహకార డైయిరీల వేలకోట్ల విలువైన ఆస్తులను అమూల్ కు కట్టబెట్టడతారా..? దశాబ్దాల కాలం నుంచి ఉన్న సహకార వ్యవస్థను మూసివేసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత సహకార డైయిరీలతో పాటు మూతపడిన చిత్తూరు డైయిరీని పునరుద్ధరిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చి.. సీఎం కాగానే మాట మార్చారు అంటూ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు అని విమర్శించారు అచ్చెన్నాయుడు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహకార డెయిరీలను బలహీనపర్చేలా గుజరాత్ కు చెందిన అమూల్ ను తీసుకువచ్చారు. ఇప్పుడు చిత్తూరు డైయిరీ పునరుద్ధరణ పేరుతో అమూల్ కు కట్టబెడుతుండటం దుర్మార్గం. ప్రభుత్వ నిర్ణయాలతో పాడి రైతులకు ద్రోహం చేస్తున్నారు. ఇప్పటికే మౌలిక వసతులు, ఇతర సహకార డైయిరీల ఆస్తులు కలిపి రూ.6వేల కోట్ల ప్రజాసంపదను అమూల్ కు దోచి పెడుతున్నారు అని ఆరోపించారు. చిత్తూరు డైయిరీని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. అమూల్ కు ఏడాదికి రూ.కోటి లీజుపై 99 ఏళ్లకు అప్పగించారు. చిత్తూరు డెయిరీకి చెందిన రూ.650 కోట్ల ఆస్తులు సైతం కట్టబెట్టారు అని విమర్శించారు.
జులై 13న చంద్రయాన్-3 ప్రయోగం.. ఇస్రో చీఫ్ కీలక ప్రకటన
చంద్రయాన్-3 మిషన్‌ను జూలై 13న ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రకటించింది. జూలై 13న ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు భారత అంతరిక్ష సంస్థ చీఫ్ ఎస్.సోమనాథ్ ధృవీకరించారు. ఇది జూలై 19 వరకు కొనసాగవచ్చు. “మేము చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలుగుతాము. జూలై 13 మొదటి ప్రయోగ రోజు అని, జూలై 19 వరకు కొనసాగవచ్చు” అని ఇస్రో చీఫ్ ప్రకటించారు. అంతకుముందు, సోమనాథ్ మాట్లాడుతూ జూలై 12 నుంచి జూలై 19 మధ్య కాలం ప్రయోగానికి సరైనదని, అలాగే ల్యాండింగ్ సమయంలో కిందికి దిగి సమయంలో సాంకేతికంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా టెక్నాలజీని వినియోగించినట్లు తెలిపారు. చంద్రయాన్-3 భారతదేశపు అత్యంత బరువైన ప్రయోగ వాహనం GSLV Mk-IIIతో అనుసంధానం చేయబడే చివరి దశలో ఉంది. ఇది దానిని చంద్రునికి కక్ష్యలో ఉంచుతుంది. చంద్రయాన్-3 మిషన్ లక్ష్యం చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్-ల్యాండ్ చేయడం.ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా అనే మూడు దేశాలు మాత్రమే చంద్రుడి ఉపరితలంపై అంతరిక్ష నౌకను దించగలిగాయి. ఈ మైలురాయిని సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పెళ్లికి ముందే వరకట్న వేధింపులు.. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే..
నగరానికి చెందిన రోహిత్ డెవిడ్ పాల్ అనే యువకుడికి గతేడాది మార్చి 1వ తేదీన ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థం వేడుకను యువతి కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఏకంగా రూ.10 లక్షలు వెచ్చించి, పెళ్లి వేడుక తరహాలోనే గ్రాండ్‌గా చేశారు. గతేడాది జులైలోనే పెళ్లి చేయాలని ఇరువురి కుటుంబీకులు నిర్ణయించారు. అయితే.. నిశ్చితార్థం జరిగిన తర్వాత రోహిత్‌తో పాటు అతని తల్లి వనిత తమ అసలు స్వరూపం బయటపెట్టారు. పెళ్లి గురించి మాట్లాడితే.. మాట దాటవేస్తూ వచ్చారు. అంతేకాదు.. రూ.2 కోట్లు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని, లేకపోతే లేదంటూ రోహిత్ తెగేసి చెప్పాడు. తమకు అంత స్థోమత లేదని, అంత డబ్బు ఇచ్చుకోలేమని చెప్పినా.. అడిగినంత ఇస్తేనే పెళ్లికి రెడీ అంటూ రోహిత్, అతని తల్లి వనిత డిమాండ్ చేశారు. ఎంత బుజ్జగించినా వాళ్లు ఒప్పుకోకపోవడంతో, యువతి సహనం కోల్పోయింది. నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. రోహిత్ కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేసింది. నిశ్చితార్థం వరకు మంచి వ్యక్తులుగా నటించి, ఆ తర్వాతి నుంచి వరకట్నం కోసం వేధించడం మొదలుపెట్టారంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో.. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. రోహిత్ తల్లి అనిత డాక్టర్‌గా పని చేస్తుంది.
అజిత్ పవార్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు.. ముగ్గురిని తొలగించిన ఎన్సీపీ
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఆదివారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనందుకు ముగ్గురు పార్టీ నేతలను తొలగించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటుదారుడు అజిత్ పవార్‌కు మద్దతు ఇచ్చిన వారిని తొలగించినట్లు తెలుస్తోంది. బహిష్కరణకు గురైన నాయకులు ముంబై డివిజనల్ ఎన్‌సీపీ చీఫ్ నరేంద్ర రాథోడ్, అకోలా సిటీ జిల్లా చీఫ్ విజయ్ దేశ్‌ముఖ్, రాష్ట్ర మంత్రి శివాజీరావు గార్జే. ముగ్గురూ అజిత్ పవార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అధికారంలో ఉన్న శివసేన-బీజేపీ కూటమితో పొత్తు పెట్టుకునేందుకు అజిత్ పవార్ తిరుగుబాటుకు మద్దతు ఇచ్చిన 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎన్సీపీ క్రమశిక్షణ కమిటీ పిలుపునిచ్చింది. “9 మంది ఎమ్మెల్యేల ఈ చర్యలు తక్షణం అనర్హత వేటు వేయాలి. ఒకవేళ సభ్యులుగా కొనసాగడానికి అనుమతిస్తే, వారు పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం కొనసాగించే అవకాశం ఉంది” అని ఎన్సీపీ క్రమశిక్షణ కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. అజిత్ పవార్ అనూహ్యం తిరుగుబాటు చేసిన ఎన్సీపీ అధినేత, బాబాయ్ శరద్ పవార్‌కు షాక్ ఇచ్చారు. ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ రమేష్ బైస్, అజిత్ పవార్ చేత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలోని బీజేపీ-శివసేన ప్రభుత్వంలో ఎనిమిది మంది ఎన్సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024లో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న 83 ఏళ్ల మరాఠా నాయకుడు శరద్ పవార్ ధైర్యంగా అజిత్ పవార్ తిరుగుబాటును “దోపిడీ”గా పేర్కొన్నాడు. బీజేపీతో అధికారాన్ని పంచుకోవాలన్న తన నిర్ణయాన్ని అజిత్ పవార్ సమర్థించుకున్నారు. శివసేనతో కలిసి వెళ్లగలిగితే బీజేపీతో కూడా వెళ్లగలమని, నాగాలాండ్‌లో కూడా అదే జరిగింది అని అజిత్ పవార్ అన్నారు. కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన తర్వాత 1999లో తన బాబాయ్ స్థాపించిన ఎన్‌సీపీలో ఎటువంటి చీలిక లేదని ఆయన నొక్కి చెప్పారు.
జూలై 17, 18 తేదీల్లో బెంగళూరులో విపక్ష నేతల రెండో సమావేశం.. స్పష్టం చేసిన కాంగ్రెస్..!
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనల మధ్య విపక్షాల రెండో సమావేశం వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సమావేశం ఈనెల 17, 18 తేదీల్లో బెంగళూరులో జరగనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా జరిగే సన్నాహకానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీల సమావేశం రెండోసారి నిర్వహిస్తుంది. అంతకుముందు సమావేశానికి సంబంధించి జనతాదళ్ యునైటెడ్ (జెడియు) నేత కేసీ త్యాగి మాట్లాడుతూ.. వచ్చే వారం బెంగళూరులో జరగాల్సిన ప్రతిపక్ష పార్టీల ముఖ్యమైన సమావేశం వాయిదా పడిందని.. వర్షాకాల సమావేశం తర్వాతకు వాయిదా వేసినట్లు చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తర్వాత.. సమావేశానికి సంబంధించి కొత్త తేదీ నిర్ణయించబడుతుందని తెలిపారు. మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్ (RJD) ఎంపీ మనోజ్ ఝా ఈ సమావేశంపై ANIతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల సమావేశం 2 నుంచి 4 రోజులు ఆలస్యం కావచ్చని.. లేదా ముందుగానే నిర్వహించవచ్చు అని తెలిపారు. చాలా మంది నేతలు బిజీగా ఉండటంతో.. ఇంకా తేదీని నిర్ణయించలేదన్నారు. అయితే వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రోజురోజుకు పెరుగుతున్న టమాటా ధరలు.. ఇప్పుడు కేజీ 120 కాదు 160..!
టమాటా ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. టమాటా ధరలు ఆకాశాన్నంటడంతో దానిని కొనుగోలు చేయడమే మానేశారు. గత రెండు వారాల్లో దేశంలోని వివిధ నగరాల్లో టమాటా ధర జెట్ స్పీడ్ వేగంతో పెరిగి 100ను దాటింది. దీంతో కొన్ని నగరాల్లో కిలో రూ.120 ధరకు విక్రయించడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు టమోటాలు మరింత ఖరీదైనవిగా మారాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో టమోటా రిటైల్ ధర కిలో రూ. 160కి చేరుకుంది. అకాల వర్షాలు కూరగాయలపై చెడు ప్రభావం చూపాయి. ఈ కారణంగా దాదాపు అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. అందులో ఎక్కువగానైతే టమోటాల ధరలు మండిపోతున్నాయి. తక్కువ దిగుబడి రావడం, వర్షం కారణంగా పంట దెబ్బతినడంతో డిమాండ్ మేరకు సరఫరా చేయడం లేదు. దీంతో టమాట ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భోపాల్‌లోని విఠల్ మార్కెట్‌లో టమోటా ధర ఇప్పటికే అత్యధికంగా కిలో రూ.140 ఉండగా.. ఆదివారానికి ఆ ధర రూ.160కి చేరుకుంది. మరోవైపు టొమాటోతో పాటు ఉల్లి, బంగాళదుంప, బెండకాయ, అల్లం, పచ్చిమిర్చి-పచ్చికొత్తిమీర కూడా ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మిర్చి, కొత్తిమీర హోల్ సేల్ మార్కెట్ లో కిలో రూ.125కు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా వర్షం, తుపాను ప్రభావంతో కిలో అల్లం ధర రూ.200-250కి చేరింది. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో బీన్స్ కిలో రూ.110-120, క్యారెట్ రూ.100, క్యాప్సికం కిలో రూ.80కి విక్రయించారు. మొత్తంమీద గత రెండు వారాల్లో చాలా కూరగాయల ధరలు రిటైల్ మరియు హోల్‌సేల్ మార్కెట్‌లో పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న టమాటా ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కూడా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. టొమాటో గ్రాండ్ ఛాలెంజ్‌ను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ప్రపంచంలోనే టొమాటో ఉత్పత్తిలో భారతదేశం రెండవ అతిపెద్ద దేశంగా ఉంది.
తన పెళ్లి తేదీ పై స్పందించిన రకుల్..
రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ బ్యూటీ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటించి మెప్పించింది.టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.ఇక ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానితో ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే.ఇదే విషయాన్ని ఆమె అధికారికంగా కూడా ప్రకటించింది. గత ఏడాది తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలలో బిజీ బిజీగా ఉంటూనే సమయం దొరికినప్పుడల్లా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెకేషన్ లు తిరుగుతూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసినప్పటి నుంచి ఆమె పెళ్లి పై రక రకాల వార్తలు వస్తూనే వున్నాయి.. ఇప్పటికే గతంలో ఎన్నో సార్లు పెళ్లి విషయంపై స్పందించిన రకుల్ తాజాగా మరోసారి పెళ్లి విషయంపై స్పందించింది. తాజాగా సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ ఆమె ప్రియుడు జాకీ భగ్నాని అక్టోబర్లో మూడు ముళ్ళు బంధంతో ఒక్కటి కాబోతున్నారు అంటూ వార్తలు తెగ వినిపిస్తున్నాయి. అక్టోబర్ నెలలో వారి పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.తాజాగా ఇదే విషయంపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. ఇంకా పెళ్లి గురించి మేము ఏమీ అనుకోలేదు. నేను పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో, మా అమ్మ నాన్నలు నన్ను ఎప్పుడు అడగలేదు. మీడియా మాత్రం డేట్స్ కూడా ఫిక్స్ చేసేస్తోంది.. భగ్నానితో ప్రేమ గురించి చెప్పినట్టే, ఈ రిలేషన్షిప్ కి తరువాత స్టెప్ అయిన మ్యారేజ్ గురించి కూడా నేను త్వరలోనే అందరితో పంచుకుంటాను అంటూ సమాధానం ఇచ్చింది రకుల్..
డిస్నీ+హాట్ స్టార్‌లో సందడి చేస్తున్న ‘గుడ్ నైట్’
ఈ మధ్య చాలా చిన్న విషయాలు బేస్ చేసుకుని కూడా సినిమా తెరకెక్కిస్తున్నారు, అవి కూడా మంచి హిట్ అవుతున్నాయి. నిజానికి మనలో చాలా మంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతుంటారు, కదా ఇది చిన్న విషయమే అయినా ప్రతిరోజూ అనుభవించే వారు మాత్రం నరకంలా ఫీల్ అవుతారు. ఇది చెప్పుకునేంత పెద్ద సమస్య కాదు అలా అని చిన్న సమస్య కూడా కాదు, ఇలాంటి గురక బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచన రావడమే కాదు ఏకంగా దానిమీదనే సినిమా కూడా చేశారు. తమిళ దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్ ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించగా తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయింది. కేవలం తమిళం మాత్రమే కాదు తెలుగు, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లోకి కూడా అందుబాటులోకి వచ్చేసింది. అసలు ఈ సినిమా కథ ఏంటంటే ఈ సినిమాలో హీరోకి గురక సమస్య ఉంటుంది, అక్కాబావతో కలసి నివసించే అతనికున్న గురక సమస్య వల్ల నిత్యం ఎవరొకరితో తిట్లు తింటూ ఉంటాడు. కొన్నాళ్లకు హీరోయిన్ పరిచయం అయ్యి ప్రేమలో పడి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. తనకు గురక సమస్య ఉందనే విషయం ముందు నుంచీ హీరోయిన్ దగ్గర దాస్తూ రాగా పెళ్లి తర్వాత అసలు విషయం బయటపడుతుంది. ఈ క్రమంలో గురక వల్ల వారి మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? ఈ క్రమంలో ప్రేమించి పెళ్లి చెసుకున భర్త సమస్య భార్య అర్థం చేసుకుందా లేదా తర్వాత ఏం జరిగింది? అనేది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో మణికందన్, మీరా రఘునాథ్ హీరో, హీరోయిన్లు కాగా రమేష్ తిలక్, రేచల్ రెబెక్కా, బాలాజీ శక్తివేల్, భగవతి పెరుమాళ్ వంటివారు కీలక పాత్రలు పోషించారు. యువరాజ్ గణేశన్, మగేష్ రాజ్ పసిలియన్, నజెరత్ పసిలియన్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.
