బ్రేకింగ్: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఎంతో కాలంగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేశారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. 6,100 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నెల 12వ తేదీ నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. 6,100 ఉపాధ్యాయుల పోస్టుల్లో 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 2,280 ఎస్‌జీటీ పోస్టులు, 42 ప్రిన్సిపల్ పోస్టులు, 1,264 టీజీజీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయి.. ఈ రోజు సచివాలయంలో మీడియాతో మాట్లాడిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. డీఎస్సీ -2024ను ప్రకటిస్తున్నాం.. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.. ఈ నెల 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ ఉంటుందన్నారు. మార్చి 5వ తేదీ నుంచి హాట్‌టికెట్లు డౌల్‌నోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.. ఇక, మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 31వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేస్తాం.. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ. మరోవైపు, రేపటి నుంచి టెట్ పరీక్షల షెడ్యూల్ ప్రారంభం అవుతుందన్నారు.. మొత్తంగా ఏడు రకాల మేనేజ్మెంట్ పాఠశాల పరిధిలో 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నాం అని వెల్లడించారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.
టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే..! యూనివర్సిటీలోనే చంద్రబాబు విద్యార్థులను రెండుగా చీల్చాడు..!
టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అంటూ సంచలన ఆరోపణలు చేవారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. నన్ను చంద్రబాబు.. నారాయణ స్వామి ఒక బానిస లాగా ప్రవర్తిస్తున్నాడు అంటున్నాడు.. ఎక్సైజ్ ని పెద్దిరెడ్డి చూస్తున్నాడు.. నారాయణ స్వామికి టీ, కాఫీ నీళ్లు దక్కడం లేదు అన్నారు.. నాకు ఇచ్చిన మంత్రి పదవినీ ఎలా చేశానో ప్రజలకు, డిపార్ట్ మెంట్ కు తెలుసు అన్నారు. నేను ఎప్పుడూ బానిసగా ఎవ్వరి కిందా పని చేయడం లేదన్న ఆయన.. చంద్రబాబు.. యూనివర్సిటీలోనే విద్యార్థులను రెండుగా చీల్చాడని మండిపడ్డారు.. చంద్రబాబు మమ్మల్ని అడి పోసుకుంటాడన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ ఎప్పుడు తిరుపతి వచ్చినా ఆయన హెలికాప్టర్ లో నన్ను తిప్పుతాడు.. పెద్దిరెడ్డిని పాపాల పెద్దిరెడ్డి అని చంద్రబాబు అంటున్నాడు.. అవినీతి గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.
24 గంటల్లో స్పందించాలి.. చంద్రబాబుకు ఇదే నా సవాల్..
టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. చంద్రబాబు తనపై ఉన్న కేసుల్లో ఒక్క దానికేనా సీబీఐ విచారణకు సిద్ధం అని ప్రకటించగలరా? 24 గంటల్లో స్పందించాలని చంద్రబాబుకు సవాలు విసురుతున్నా అన్నారు. ఈ రోజు సచివాయలంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కోర్టు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్ ల చోరీ కేసులో సీబీఐ నాకు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. సీబీఐ విచారణకు సిద్ధమని ఏపీ హై కోర్టుకు కూడా నేను తెలియచేశా.. అసలు గోవర్ధన్ రెడ్డి ప్రమేయం లేదని సీబీఐ తన చార్జిషీట్ లో స్పష్టంగా చెప్పిందన్నారు. సీబీఐ అంటే చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ కాదు.. టీడీపీ చేసిన ఆరోపణలు వాస్తవం కాదని సీబీఐ చెప్పిందన్నారు.
చంద్రబాబు ఢిల్లీ టూర్.. మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు హస్తినలోనే ఉండనున్నా ఆయన.. బీజేపీ పెద్దలతో సమావేశమై.. పొత్తులు, సీట్లపై చర్చించనున్నారట.. ఇక, చంద్రబాబు పర్యటన తర్వాత.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. మొత్తంగా.. త్వరలోనే జరగనున్న ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లే దిశగా అడుగులు పడుతున్నాయి.. అయితే, చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎవరితో పొత్తు పెట్టుకున్నా మాకు సంబంధం లేని విషయం అన్నారు మంత్రి బొత్స.. ఎవరు..? ఎవరితో వెళ్లినా మా పై ప్రభావం ఉండదన్న ఆయన.. కానీ, మా పార్టీ ఎవరినీ వదులుకోదని స్పష్టం చేశారు. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా వారందరికి తగిన అవకాశాలు కల్పిస్తాం అని పేర్కొన్నారు. అసలు, అసంతృప్తికి నిర్వచనం ఏముంటుంది? అని ఎదురు ప్రశ్నించారు. ఇక, 2014లో తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు నా గన్ మెన్‌లను కూడా తీసేశారు అని గుర్తుచేసుకున్నారు.. నాకు థ్రెట్ లేదు గనుక భయం లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
అద్భుతం జరిగేటప్పుడు అందరూ సహకరించాలి.. పవన్ కోసం నేను ఏమి చేయడానికైనా రెడీ..
అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం అయ్యింది.. ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతం జరగబోతోంది.. అద్భుతం జరిగేటప్పుడు అందరూ సహకరించాలి.. పవన్ కల్యాణ్ కోసం నేను ఏమి చేయడానికి అయినా రెడీ అని ప్రకటించారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ జనసేన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర జాతికి ప్రమాదకరం అన్నారు. కరోనా వైరస్ తరువాత ప్రమాదకర వైరస్ వైసీపీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వైరస్ కు జనసేన, టీడీపీయే అసలైన మందుగా అభివర్ణించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు తప్ప.. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి లేదని దుయ్యబట్టారు నాగబాబు.. భూ కబ్జాల కోసం రాజధాని అన్నారా..!? అని ప్రశ్నించారు. యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అద్భుతం జరిగేటప్పుడు అందరూ సహకరించాలి. పవన్ కోసం నేను ఏమి చేయడానికి అయినా రెడీ అని వెల్లడించారు. పవన్ కల్యాణ్ కు ఓటు వేసే ముందు మమ్మల్ని చూసి కాకుండా.. భావితరాల భవిష్యత్ ను, మీ బిడ్డలను చూసి ఓటేయ్యండి అని పిలుపునిచ్చారు. అధికార, అహంకారంతో ఉన్న వైసీపీని గద్దె దించాల్సిందే అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్‌నే అక్కడ ప్రజలు ఓడించారు.. అలాంటిది ఎటువంటి అభివృద్ధి చేయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా? అని ప్రశ్నించారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు.
తప్పు చేసిన వాడు ఎప్పుడైనా భయపడతారు
కేసీఆర్ కృష్ణా నది జలాల కోసం పోరాటం చేస్తాం అని అంటున్నాడు.. తప్పు చేసిన వాడు ఎప్పుడైనా భయపడతారని.. అందుకే కేసీఆర్ భయపడుతున్నాడని వ్యాఖ్యానించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇవాళ ఆయన గాంధీ భవన్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్.. ఇరిగేషన్ మంత్రి ఐదేళ్లు చేశారని, మామా.. అల్లుళ్లు ఇద్దరు ఇరిగేషన్ మంత్రి గా చేశారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోవడం కోసం ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. పునర్విభజన బిల్లు రాసింది నేనే అని కేసీఆర్ చెప్పాడని, బచావత్ ట్రిబ్యునల్ కి అనుగుణంగా కేటాయింపులు అని రాశారని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు ఎందుకు వెనక్కి తీసుకున్నారని, ఎస్‌ఎల్‌బీసీ పాలమూరు ప్రాజెక్టుల పేర్లు కూడా గెజిట్ లో లేవని, మా హక్కులు మాకు కావాలి అని ఎందుకు డిమాండ్ చేయలేదన్నారు జూపల్లి.
“కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా యువరాజు లాంచ్ కావడం లేదు”.. రాహుల్ గాంధీపై సెటైర్లు..
రాజ్యసభలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ యువరాజును స్టార్-అప్‌గా ప్రజెంట్ చేసిందని, కానీ నాన్ స్టార్టప్ అని తేలిందని’’ అన్నారు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నించిన అతడిని లాంచ్ చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నేను స్వతంత్ర దేశంలో పుట్టానని, నా ఆలోచనలు స్వతంత్రంగా ఉంటాయని ప్రధాని మోడీ అన్నారు. తాను బానిసత్వానికి వ్యతిరేకమని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని నాశనం చేస్తున్నామని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, బీఎస్ఎన్ఎల్ నాశనం చేసింది ఎవరు.. హెఏఎల్, ఎయిర్ ఇండియాను దెబ్బతీసింది ఎవరని ప్రశ్నించారు. ప్రస్తుతం హెచ్ఏఎల్ రికార్డ స్థాయి లాభాలను సాధిస్తుందని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎల్ఐసీ ఎక్కడుంది.. ఇప్పుడు ఎల్ఐసీ షేర్ రికార్డు స్థాయిని అందుకుందని ప్రధాని అన్నారు. 2014లో 234 పీఎస్‌యూలు ఉంటే నేడు అవి 254కి చేరాయని ప్రధాని చెప్పారు. పదేళ్లలో పీఎస్‌యూల విలువ రూ.9.5 లక్షల కోట్ల నుంచి రూ. 17 లక్షల కోట్లకు చేరిందని ప్రధాని వెల్లడించారు.
భారతీయులకు కేంద్రం అలర్ట్.. మయన్మార్ వెళ్లొద్దని సలహా
మయన్మార్ (Myanmar) పర్యటనకు వెళ్లే భారతీయులను కేంద్రం హెచ్చరించింది. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రానికి (Rakhine State) వెళ్లొద్దంటూ ఇండియన్స్‌కి కేంద్రం (India issues) సలహా ఇచ్చింది. రఖైన్ రాష్ట్రంలో భద్రతా పరంగా పరిస్థితులు బాగోలేవని తెలిపింది. అలాగే టెలికమ్యూనికేషన్లతో పాటు నిత్యవసర వస్తువుల కొరత తీవ్రంగా ఉందని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో రఖైన్ రాష్ట్రానికి వెళ్లొద్దని సిటిజన్స్‌కి భారత్ సూచించింది. అలాగే రఖైన్ రాష్ట్రంలో ఉన్న భారతీయ పౌరులు కూడా వెంటనే రాష్ట్రం విడిచి వెళ్లాలని సూచించింది. ఇటీవల మయన్మార్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అక్కడ పరిస్థితులు తీవ్ర కలవరం రేపుతోంది.
మెట్రోలో రాష్ట్రపతి పర్యటన.. సడన్ ఎంట్రీతో షాకైన ప్యాసింజర్స్
దేశ ప్రథమ పౌరురాలు ఢిల్లీ మెట్రోలో (Delhi Metro) ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక సామాన్యురాలిలో ప్రయాణికులతో కలిసి కూర్చుని జర్నీ చేయడంతో ప్యాసింజర్స్ అంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఎలాంటి హడావుడి.. హంగామా లేకుండా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) మెట్రో రైలు ఎక్కి ప్రయాణించారు. అంతేకాకుండా విద్యార్థుల ప్రక్కన కూర్చుని వాళ్లతో ముచ్చటించారు. రైల్లో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhawan)కు సమీపంలో ఉన్న సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్‌ను తొలుత ద్రౌపదీ ముర్ము సందర్శించారు. ఈ సందర్భంగా మెట్రో పనితీరు, ఇతర వివరాలను మెట్రో అధికారులు రాష్ట్రపతికి వివరించారు. అనంతరం కొంతదూరం మెట్రో ట్రైన్‌లో ప్రయాణించారు. సడన్‌గా రాష్ట్రపతి మెట్రో రైలు ఎక్కడంతో ప్రయాణికులు అవాక్కైయ్యారు.
పోలింగ్‌కి ఒక రోజు ముందు పేలుళ్లతో దద్ధరిల్లిన పాక్.. 22 మంది మృతి..
పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు గురువారం జరగబోతున్నాయి. ఎన్నికలకు ఒక రోజు ముందు పాకిస్తాన్ ఉగ్రదాడులతో నెత్తురోడుతోంది. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఎన్నికల అభ్యర్థుల కార్యాలయాల సమీపంలో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటన బుధవారం జరిగింది. ఈ జంట పేలుళ్లలో 22 మంది మృతి చెందారు. గురువారం ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన భద్రతపై ఆందోళన పెంచుతోంది. పిషిన్ జిల్లాలోని ఇండిపెండెంట్ అభ్యర్థి కార్యాలయం వద్ద మొదటి బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. ఆఫ్ఘన్ సరిహద్దు పట్టణమైన ఖిల్లా సైఫుల్లాలో రెండో పేలుడు సంభవించింది. జమియాత్ ఉలేమా ఇస్లాం కార్యాలయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ దాడుల వెనక ఎవరున్నారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఇస్లామిక్ తాలిబాన్, బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులు ఇటీవల పాక్ వ్యాప్తంగా దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాల్లో పోలీసులు, పాక్ ఆర్మీ లక్ష్యంగా దాడులకు దిగుతున్నాయి.
10 శాతం ఉద్యోగులను తొలగించనున్న స్నాప్ చాట్…
ఇటీవల చాలా మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు.. ఇప్పటికే పలు ఐటీ దిగ్గజ కంపెనీలు ఆర్థిక సంక్షోభంను తట్టుకోవడానికి తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి.. వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు.. అందులో మైక్రో సాఫ్ట్, అమెజాన్, విప్రో, ఫ్లిప్ కార్ట్ వంటి కంపెనీలు సైతం ఉన్నాయి.. ఇప్పుడు మరో కంపెనీ వందల మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తుంది.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 32000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు, ఉద్యోగాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.. ఇంకా లేఆఫ్ లు కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ మాతృ సంస్థ, స్నాప్ కూడా 10 శాతం మంది ఉద్యోగులను తొలగించనుంది.. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా తమ ఉద్యోగులను తగ్గించుకోవాలని యోచిస్తున్న కంపెనీల జాబితాలో.. స్నాప్ కూడా చేరింది.
ఓటీటీలో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న యానిమల్ మూవీ..
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ మూవీ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమాకు ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఇప్పటికీ ఓటీటీలోనూ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉంది.జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ మూవీ.. రిలీజైనప్పటి నుంచీ టాప్ ట్రెండింగ్స్ లోనే ఉండటం విశేషం. అంతకు వారం ముందు వచ్చిన సలార్ మూవీని వెనక్కి నెట్టి ఈ మూవీ ఓటీటీలో అన్ని ఇండియన్ మూవీస్ రికార్డులను బ్రేక్ చేసింది.రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా కలిసి నటించిన యానిమల్ మూవీకి 10 రోజుల్లోనే ఏకంగా ఏకంగా 3.93 కోట్ల గంటల వ్యూయర్‌షిప్ నమోదు కావడం విశేషం. తొలి వారంలోఈ సినిమా ఇండియన్ టాప్ ట్రెండింగ్ చార్ట్స్ లో నంబర్ వన్ గా నిలిచింది… రెండో వారం కూడా అదే దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆల్ టైమ్ అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించిన ఇండియన్ సినిమాగా యానిమల్ మూవీ నిలిచింది.
ఏమైనా.. విజయ్- రష్మిక జోడీకున్న అందం విజయ్-మృణాల్ కు రాలేదురా..
ది విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఒక పెద్ద హిట్ కావాలి అన్నది అందరికి తెల్సిందే. గత కొన్నేళ్లుగా విజయ్ మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. గతేడాది ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందివ్వలేకపోయింది. ఇక దీంతో విజయ్ ఆశలన్నీ ది ఫ్యామిలీస్టార్ సినిమాపైనే పెట్టుకున్నాడు. విజయ్ కెరీర్ లో గీతగోవిందం లాంటి హిట్ ను అందించిన పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. అదే సినిమాను నిర్మించిన దిల్ రాజు ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని మొదటి సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నందనందనా అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. గోపిసుందర్ సంగీతం అందించిన ఈ సాంగ్ ను మ్యూజిక్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. గీతగోవిందం లో ఇంకేం ఇంకేం కావాలే అంటూ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపిన సిద్ .. మరోసారి నందనందనా తో ఆ మ్యాజిక్ ను క్రియేట్ చేసేటట్లే ఉన్నాడు. ఇక విజయ్- మృణాల్ జంట ఫ్రెష్ గా ఉంది. ఫ్యామిలీ మ్యాన్ లా విజయ్ కనిపించగా.. అతడిని ఇష్టపడే అమ్మాయిగా మృణాల్ కనిపించింది. తనపై ఉన్న ప్రేమను చెప్పి చెప్పనట్టుగా ఒక్క మాటలో చెప్పడంతో విజయ్ తన మనసులోని మనోభవాలను ఇలా సాంగ్ రూపంలో బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఇక విజయ్ హుక్ స్టెప్ అదిరిపోయింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఆకట్టుకొంటుంది.
రాజమౌళిపై అవతార్ డైరెక్టర్ ప్రశంసలు.. ఇది కదరా అసలైన కిక్కు అంటే
తెలుగు చిత్ర పరిశ్రమను హాలీవుడ్ వరకు తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలితో దేశాన్ని మొత్తం ఒక ఊపు ఊపేసిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచాన్ని షేక్ చేశాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా 2022 లో మార్చి 24 న రిలీజ్ అయ్యి.. ఇండస్ట్రీని షేక్ చేసింది. రికార్డు కలక్షన్స్ తో పాటు ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా రాజమౌళి పనితనానికి ఫిదా అయిపోయారు. ఆర్ఆర్ఆర్ చూసాకా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సైతం జక్కన్న పై ప్రశంసలు కురిపించడం జరిగింది. రాజమౌళి వర్క్ కు తాను మంత్రం ముగ్దుడ్ని అయ్యినట్లు జేమ్స్ చెప్పుకొచ్చాడు. అవతార్ లాంటి సినిమా తీసిన డైరెక్టరే.. రాజమౌళి గురించి తెలుగు సినిమా గురించి చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక మరోసారి జేమ్స్ కామెరూన్.. రాజమౌళి పనితనాన్ని ప్రశంసించాడు. తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న జేమ్స్ కామెరూన్ కు ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. గతేడాది మీరు ఆర్ఆర్ఆర్ సినిమా చూసి ఎస్ఎస్ రాజమౌళి గురించి మాట్లాడారు.. దాని గురించి చెప్పండి అన్న ప్రశ్నకు.. జేమ్స్ మాట్లాడుతూ.. “ఆర్ఆర్ఆర్ మూవీ చూసినప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. నిజంగా చాలా నిజాయతీగా అనిపించి ఈ విషయాన్ని చెప్పాను. అది చాలా అద్భుతమైన సినిమాగా అనిపించింది. ఇండియన్ సినిమా ప్రపంచ వేదిక స్థాయికి చేరడం చాలా గొప్ప విషయం” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై ఆర్ఆర్ఆర్ టీమ్ స్పందించింది. జేమ్స్ కామెరూన్ తమకెప్పుడు ఆదర్శమని చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఇది కదరా అసలైన కిక్కు అంటే .. హాలీవుడ్ మొత్తం టాలీవుడ్ ను చూసి ప్రశంసించాలి అని కామెంట్స్ చేస్తున్నారు.
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మూత.. మాకేం సంబంధం లేదంటున్న యంగ్ హీరోయిన్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుమారి ఆంటీ అనే పేరు వైరల్ అవుతుంది. నిజానికి హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగుండా ఒక ఫుడ్ స్టాల్ నడుపుకునే ఆమె అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కింది. ఆమె ట్రోలింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెతో వీడియో చేస్తే పబ్లిసిటీ వస్తుందని ఊరు పేరు భైరవకోన సినిమా టీం భావించింది. అందులో భాగంగానే హీరో హీరోయిన్లు సందీప్ కిషన్ వర్ష బొల్లమ్మ ఇద్దరు ఆ స్టాల్ కి వెళ్లి భోజనం చేసి దాన్ని వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఎప్పుడైతే హీరో హీరోయిన్లు ప్రమోషన్స్ కోసం ఆమె స్టాల్ కి వెళ్లారో, ఒక్కసారిగా మీడియా దృష్టి మీద పడింది. మీడియాలో సోషల్ మీడియాలో మరింత వైరల్ కావడంతో ఆమె ఫుడ్ స్టాల్ కోసం జనం ఎగబడి రావడం మొదలుపెట్టారు. ట్రాఫిక్ జామ్ అవుతుందనే ఉద్దేశంతో పోలీసులు ఒకరోజు మొత్తం ఆమెని వ్యాపారం కూడా చేసుకోనివ్వలేదు. తర్వాత రేవంత్ రెడ్డి దృష్టికి ఆ విషయం వెళ్లడంతో ఆయన ఆమెను ఇబ్బంది పెట్టవద్దని పోలీసులకు సూచనలు చేశారు. అయితే ఇదే విషయం మీద వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ ఆమె స్టాల్ ఒకరోజు మూత పెట్టడానికి తాము ఏమాత్రం కారణం కాదని అని చెప్పుకొచ్చారు. నిజానికి ఆమె ఫేమస్ అయ్యాకనే మేము అక్కడికి వెళ్ళాము ఆమెతో వీడియో చేసి రిలీజ్ చేశాము అందులో ఆమెను మేము ఫేమస్ చేయాల్సిన అవసరం లేదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఒకవేళ మేము వెళ్ళినా వెళ్లకపోయినా సరే ఆవిడ పాపులర్ అయ్యేదని వర్ష సమాధానం ఇచ్చారు. ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాని ఈ శుక్రవారం విడుదల చేయాలని ప్లాన్ చేసినా ‘ఈగల్’ సినిమాకు సోలో రిలీజ్ కావాలని ఫిల్మ్ ఛాంబర్ కోరడంతో తమ సినిమాను వారం వాయిదా వేశారు. ఇప్పుడు ఈ సినిమాను ఫిబ్రవరి 16న విడుదల చేస్తున్నారు.
