NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

రేపటి నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్.. టార్గెట్‌ ఇదే..!
ఆంధ్రప్రదేశ్‌ మరోసారి అధికారమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. అందులో భాగంగా ఇప్పటికే గడపగడపకు ప్రభుత్వం పేరుతో ప్రతీ ఇంటికి ప్రజాప్రతినిధులు వెళ్లి తమ ప్రభుత్వ హయాంలో చేకూర్చిన లబ్ధిని తెలియజేస్తున్నారు. ఇక, మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్‌ ప్రారంభం కానుంది.. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాంపెయిన్‌ జరుగుతందని తెలిపారు. మా పార్టీ సైనికులు గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు ఏడు లక్షల మంది.. 14 రోజుల్లో కోటి 80 లక్షల ఇళ్లను సందర్శిస్తారు.. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతినిధులుగా వెళ్తారు.. 10 నిమిషాల పాటు వారితో మాట్లాడతారు.. వైఎస్‌ జగన్ తరపున ప్రజల నుంచి మద్దతు కోరతారు.. గత ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు మీకు జరిగిన లబ్ది ఏంటి? అని అడుగుతారు వెల్లడించారు. ‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్‌లో ప్రజా మద్దతు పేరుతో ప్రజా అభిప్రాయం సేకరిస్తారని తెలిపారు సజ్జల.. ముఖ్యంగా ఐదు ప్రశ్నలు వేస్తారు.. దీనిలోనే జగన్ పట్ల ప్రజా మద్దతు తెలిసిపోతుందన్న ఆయన.. 82960 82960 ఫోన్ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వమని అడుగుతారు.. వారికి సీఎం వైఎస్‌ జగన్ వాయిస్ తో ధన్యవాదాల మెసేజ్ వెళ్తుందన్నారు. ఇక, అభ్యంతరం లేకపోతే ఇంటికి, మొబైల్ ఫోన్ కు పెట్టుకోవటానికి స్టిక్కర్ ఇస్తారని పేర్కొన్నారు. ఇంత వరకు ఇంత విస్తృతంగా ప్రతి గడపను తట్టే విధంగా ప్రజా మద్దతును కోరే రాజకీయ కార్యక్రమం జరగలేదన్నారు సజ్జల.

పవన్ 2 రోజులు కనబడితే 3 రోజులు కనిపించరు.. ఢిల్లీకి పిలిచారా? ఆయనే వెళ్లారా..?
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై హాట్‌ కామెంట్లు చేశారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్‌.. అసలు పవన్.. టీడీపీ అధినేత చంద్రబాబు అజెండా మోసుకుని ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళాడా..? లేదా వాళ్లే పిలిచారా..? అనే విషయం తెలియాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ఇద్దరిలో విశ్వసనీయత అనేది లేదని విమర్శించిన ఆయన.. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్‌ను మిత్రపక్షంగా గెలిపించే ప్రయత్నం కూడా జనసేన చేయకపోవటం విచిత్రమని వ్యాఖ్యానించారు.. ఇదెక్కడ పొత్తని మాధవ్ కూడా బాధపడ్డారని తెలిపారు. రాజమండ్రిలో మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ పెద్దలు పవన్ కల్యాణ్‌కు అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదని జనం అనుకుంటున్నారని అన్నారు.. తెలుగు ప్రజల గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టొద్దని సూచించారు. ఇక, పవన్ ఢిల్లీలో చేసే పనులన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయని కామెంట్‌ చేశారు. మిత్ర ధర్మం పాటించని మిమ్మల్ని ఢిల్లీ పెద్దలు ఎందుకు గౌరవిస్తారని పవన్‌ కల్యాణ్‌ని ప్రశ్నించారు ఎంపీ భరత్‌.. మూడు రోజుల నుంచి ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నాడు.. ఇది దేనికోసమో ప్రజల ఆలోచించాలని అన్నారు. గతంలో పాచిపోయిన లడ్డూలు అని చెప్పి బీజేపీ పెద్దలతో చెప్పిన పవన్ కల్యాణ్‌.. మళ్లీ ఏ సఖ్యత కోసం ఢిల్లీ వెళ్లారో తెలపాలని డిమాండ్ చేశారు. పవన్ రెండు రోజులు కనబడితే మూడు రోజులు కనబడడు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబును ప్రజలు విశ్వసించరు.. ఆయనపై ఏ మాత్రం ప్రజలకు నమ్మకం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా మా నమ్మకం నువ్వే జగన్, మా భవిష్యత్తు నువ్వే జగనన్న అంటున్నారని, ఇదే నినాదంతో ఎన్నికలకు వెళ్లబోతున్నామని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై క్లారిటీ ఇచ్చిన ఇరిగేషన్‌ మంత్రి
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రకరకాల ప్రచారం సాగుతోంది.. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని కొందరు? యథావిథంగా ఉంటుందని మరికొందరు చెబుతున్న మాట.. అయితే, పోలవరం ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ.. ప్రాజెక్టు ఎత్తుపై క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలవరం ఎత్తు తగ్గిస్తామని అధికారులు సంతకాలు పెట్టారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పాడు.. ఇలా పచ్చి అబద్ధాలు మాట్లాడటానికి బుద్ధి, జ్ఞానం ఉందా? అంటూ మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆయన.. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను సవాల్ చేస్తున్నాను.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్వయంగా అసెంబ్లీ వేదికపైనే చెప్పారు.. పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని అని గుర్తుచేశారు. పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్లు 41.15కు ఎత్తు కుదించారన్నది పచ్చి అబద్ధం అని తిప్పికొట్టారు అంబటి రాంబాబు.. అధికారులు సంతకాలు చేశారని చేసిన తన వ్యాఖ్యలను నాదెండ్ల నిరూపిస్తే నేనే స్వయంగా పోలవరం ప్రాజెక్టు దగ్గరకు తీసుకుని వెళ్తానన్నారు.. గొడవ చేయటానికి వెళ్తే పోలవరం ప్రాజెక్టు దగ్గరకు ఎందుకు అనుమతిస్తాం? అని ప్రశ్నించారు. ఇంతకు ముందు చంద్రబాబు రాత్రి ఏడు గంటలకు పోలవరం ప్రాజెక్టు దగ్గరకు వెళ్ళి గొడవ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిన విషయం తెలియకే 2022 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని.. గతంలో ఇరిగేషన్‌ శాఖా మంత్రిగా ఉన్న అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రకటించారని పేర్కొన్నారు మంత్రి అంబటి రాంబాబు.

బండి సంజయ్ కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు
పదో తరగతి పరీక్ష పత్రాలు లేకేజీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్‌ కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. పదవ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయని, బండి సంజయ్ కాల్ డేటా పూర్తిగా తీసుకోవాల్సి ఉందని పోలీసులు కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా.. కొంతమంది నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. నిజాలను రాబట్టడానికి సాక్ష్యులను విచారించాల్సి ఉందని, బండి సంజయ్ కు బెయిల్ ఇస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని పోలీసులు పేర్కొన్నారు. బండి సంజయ్ బెయిల్ రద్దుకు ప్రాసిక్యూషన్ వాదనలు.. బండి సంజయ్ కు బెయిల్ ఇస్తే మళ్లీ మాల్ ప్రాక్టీస్ జరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. 10వ తరగతి విద్యార్థుల పేరెంట్స్ బండి సంజయ్‌పై దాడి చేసే అవకాశం ఉందని, పరారీలో ఉన్న నిందితులను ప్రభావం చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. టెక్నికల్ డేటా ఇంకా రికవరీ చేస్తున్నామని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయొచ్చని పోలీసుల కస్టడీ పిటిషన్‌లో విన్నవించారు.

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. బీజేపీలో చేరిన ఏకే ఆంటోనీ కుమారుడు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ గురువారం బీజేపీలో చేరారు. బీజేపీ నేతలు పీయూష్ గోయల్, వి మురళీధరన్, బిజెపి కేరళ రాష్ట్ర చీఫ్ కె సురేంద్రన్ సమక్షంలో అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరారు. మాజీ కాంగ్రెస్ నాయకుడిని అధికారిక కార్యక్రమంలో బీజేపీ నాయకులు పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కుటుంబం కోసం పనిచేస్తున్నామని నమ్ముతారు. కానీ నేను కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నానని నమ్ముతున్నాను అని అనిల్ ఆంటోనీ ఈరోజు విలేకరులతో అన్నారు. భారతదేశాన్ని అగ్రగామి స్థానంలో ఉంచడంపై ప్రధాని నరేంద్ర మోడీకి చాలా స్పష్టమైన దృష్టి ఉంది అని ఆయన అన్నారు. 2002 గుజరాత్ అల్లర్లు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై వివాదాస్పదమైన బీబీసీ డాక్యుమెంటరీని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించిన అనిల్ ఆంటోనీ జనవరిలో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. అనిల్ ఆంటోనీ బీబీసీ డాక్యుమెంటరీపై వివాదం తర్వాత పార్టీని వీడే ముందు కేరళలో కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్‌ను నడిపారు. ఈ డాక్యుమెంటరీ గుజరాత్ అల్లర్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత్రను విస్మయాత్మకంగా పరిశీలిస్తుంది. భారత రాజకీయాల్లో విపక్షాల స్థానాన్ని కుదించేందుకు ప్రధాని మోడీ ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై దాడి చేసేందుకు కాంగ్రెస్ ఈ డాక్యుమెంటరీని ఉదహరించింది. అయితే, అనిల్ బిబిసి డాక్యుమెంటరీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ, అనిల్ ఆంటోనీ భారతీయ సంస్థలపై బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్ అభిప్రాయాలను ఉంచడం దేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడం అని అన్నారు.

భోజ్‌పురి నటి ఆత్మహత్య… సింగర్ పై లుక్ అవుట్ నోటీసు
ప్రముఖ భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్యకు పాల్పడిన కేసులో గాయకుడు సమర్ సింగ్, మరో వ్యక్తిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇద్దరు నిందితులు సమర్ సింగ్, సంజయ్ సింగ్ లు దేశం విడిచి వెళ్లకుండా అన్ని విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేశారు. నటి కేసును స్వీకరించిన న్యాయవాది శషక్ శేఖర్ త్రిపాఠి పోస్ట్‌మార్టం నివేదికపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సీబీసీఐడీతో విచారణ జరిపించాలని త్రిపాఠి డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. 25 ఏళ్ల నటి మరణం ఆత్మహత్య వల్ల కాదని, హోటల్ గదిలో కొంతమంది ఆమెను చంపారని ఆరోపించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే దహన సంస్కారాలు జరపాలని ఆమె తల్లి పట్టుబట్టినప్పటికీ ఆకాంక్ష మృతదేహాన్ని బలవంతంగా దహనం చేశారని ఆరోపించారు.

రాజస్థాన్ రాయల్స్‌కు పెద్ద ఝలక్.. ఆ విధ్వంసకర ఓపెనర్ దూరం
నిన్న పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైన రాజస్థాన్ రాయల్స్‌కు ఆ బాధ నుంచి కోలుకోకముందే ఒక పెద్ద ఝలక్ తగిలింది. ఏప్రిల్ 7వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు.. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ జాస్ బట్లర్ దూరం కానున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బట్లర్ చేతి వేలుకు గాయమైంది. ఈ గాయం కారణంగానే అతడు ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్‌కి రాలేదు. అతని స్థానంలో అశ్విన్ వచ్చాడు. అయితే.. వెంటనే తొలి వికెట్ పడటంతో బట్లర్‌ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బట్లర్ కాస్త ఇబ్బంది పడుతున్నట్టు కనిపించాడు. అప్పటికీ భారీ షాట్‌లు బాదేందుకు ప్రయత్నించాడు. 19 పరుగులు చేయగలిగాడు. అయితే.. ఆ గాయం తీవ్రమైతే మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి, తదుపరి మ్యాచ్‌లో బట్లర్‌కు విశ్రాంతి ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్టు తెలిసింది. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలోనూ.. బట్లర్ పూర్తిగా ఫిట్‌గా లేడని ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ కూడా తెలిపాడు. దీన్ని బట్టి.. ఆ గాయం తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అతనికి విశ్రాంతి ఇవ్వడమే సరైన నిర్ణయమని జట్టు యాజమాన్యం భావించింది. బట్లర్ స్థానంలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ డోనవాన్ ఫెరీరాను జట్టులో తీసుకోనున్నారని సమాచారం.

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ధవన్.. తొలి భారత క్రికెటర్‌గా రికార్డ్
ఐపీఎల్‌లో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంతవరకూ ఏ ఒక్క భారత క్రికెటర్‌ ఇప్పటివరకూ సాధించని రికార్డ్‌ని తన సొంతం చేసుకున్నాడు. బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్థశతకంతో (86) శివాలెత్తిన శిఖర్‌కి ఇది ఐపీఎల్‌లో 48వ అర్థశతకం. దీంతో.. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్‌గా అతడు రికార్డ్ నెలకొల్పాడు. అయితే.. డేవిడ్ వార్నర్ మాత్రం 54 అర్థశతకాలతో అగ్రస్థానంలో ఉండగా, కింగ్ కోహ్లీ 45 అర్థశతకాలతో మూడో స్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌పై శిఖర్ ధవన్‌కు ఇదో ఏడో హాఫ్ సెంచరీ. అయితే.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 8 అర్థశతకాలు చేసి, ఆ జట్టుపై అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అనంతరం ప్రస్తుతం తాను ఏ జట్టు (పంజాబ్ కింగ్స్) తరఫున అయితే ఆడుతున్నాడో, గతంలో ఆ జట్టుపైనే ఏడు అర్థశతకాలు బాదాడు. ఇక ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లపై ఆరు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

సుదీప్ ప్రైవేట్ వీడియోలు.. తీసింది అతనే ..?
ఈగ సినిమాతతో తెలుగువారికి కూడా సుపరిచితుడుగా మారిపోయాడు కన్నడ నటుడు సుదీప్. ఇక విక్రాంత్ రోణ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సుదీప్ రాజకీయ రచ్చ కన్నడ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. గత కొన్ని రోజులుగా సుదీప్ పొలిటికల్ ఎంట్రీ హీట్ తెప్పిస్తోంది. ఈ మధ్యనే ఈయన సీఎం బసవరాజు బొమ్మైను కలిసి ఆయన తరుఫున ప్రచారం చేస్తున్నట్లు తెలిపిన సంగతి తెల్సిందే. ఇక ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అప్పటి నుంచు సుదీప్ కు బెదిరింపు లేఖలు మొదలయ్యాయి. సుదీప్ కనుక బీజేపీ లో చేరితే తన ప్రైవేట్ వీడియోలను లీక్ చేస్తామని, బహిరంగంగా అతని ప్రైవేట్ వీడియోలు, ఫోటలను పంచుతామని ఆ లేఖలో రాశారు. అసలు సుదీప్ ను అంత డీప్ గా ఫాలో అయినవారు ఎవరు..? బీజేపీకు మద్దతు తెలిపితే వారికేంటి సంబంధం అని అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. ఇక ఈ విషయం తెలియడంతో సీఎం బసవరాజు బొమ్మై సీరియస్ అయ్యారు. తానే స్వయంగా ఈ కేసును సీసీబీ కి అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో పోలీసులు సుదీప్ కారు డ్రైవర్ ను అనుమానిస్తున్నట్లు సమాచారం. ఈ మధ్యనే సుదీప్ తన కారు డ్రైవర్ ను పనిలో నుంచి తీసేశాడు. తనను ఉద్యోగంలోంచి తీసేశారనే కోపంతోనే మాజీ కారు డ్రైవర్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిత్యం సుదీప్ తో ఉండే కారు డ్రైవరే ఇలాంటి పని చేసి ఉండొచ్చని అంటున్నారు. అంతేకాకుండా ఈ అనుమానాలకు ఆజ్యం పొసే విధంగా కారు డ్రైవర్ ఫోన్ స్విచాఫ్ రావడం, అతడు కనపడకుండా పోవడంతో ఇది అతని పని అయ్యి ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఇంకోపక్క సుదీప్ బీజేపీ లో చేరడం ఇష్టంలేనివారు కూడా ఈ పని చేసి ఉండొచ్చని, కారు డ్రైవర్ దొరికితే అన్ని బయటపడతాయి అని అంటున్నారు. ప్రస్తుతం కారు డ్రైవర్ కోసం బెంగుళూరు పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే అతడిని పట్టుకొని నిజానిజాలు బయటపెట్టనున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు.