మహారాష్ట్రలో పవన్ ప్రచారం.. మరాఠీ, హిందీ, తెలుగులలో ప్రసంగం
మహారాష్ట్ర బల్లార్‌పూర్ బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. మరాఠీ, హిందీ, తెలుగులలో ఆయన ప్రసంగించారు. తన మరాఠీలో ఏమైనా తప్పులు దొర్లితే క్షమించాలన్నారు. ఈ రెండు రోజుల్లో మరాఠీ బాగానే తెలుసుకున్నానని అన్నారు. శివాజీ మహరాజ్ భూమి ఐన మరాఠా గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తానన్నారు. అయోధ్య రామమందిరం ప్రతీ అంగుళం ఇక్కడి వారు మహత్వపూర్ణం చేశారని పేర్కొన్నారు. 500 సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా రాముడికి తన స్థానం దక్కిందన్నారు. మోదీ, అమిత్ షా, హైవే మేన్ ఆప్ ఇండియా నితిన్ గడ్కరీల ప్రయత్నాల ఫలితం ఇక్కడి రహదారులను చూస్తే తెలుస్తుందన్నారు. ఇక వేయడానికి రోడ్లు లేవనేంతగా రోడ్లు వేసామని చెప్పారన్నారు. నేనిక్కడకి ఓట్లు అడగడానికే రాలేదని.. ఈ నేలకు తన గౌరవం తెలపడానికి వచ్చానన్నారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం మీ అందరి సహకారం కోరడానికి వచ్చానన్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలలో ఐదో స్ధానంలో ఉన్నాం.. మూడో స్ధానానికి చేరుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నామని పేర్కొన్నారు. బాహుబలిలో శివగామి నడక ఆగలేదు మహేంద్ర బాహుబలిని రాజ్యాధికారానికి చేర్చడానికి.. అదే విధంగా ఇక్కడ పది సంవత్సరాల ఎన్డీఏ అధికారం కూడా కొనసాగించాలన్నారు. శివసేన, జనసేన ప్రజల రక్షణ కోసం ఏర్పాటైన సేనలు అని అన్నారు. హిందూ హృదయ సామ్రాట్ బాలా సాహెబ్ ఠాక్రే నడిచిన భూమికి వచ్చే అవకాశం తనకు దక్కిందన్నారు పవన్ కల్యాణ్. ప్రాంతీయాన్ని విస్మరించని జాతీయవాదం జనసేనదంటూ వ్యాఖ్యానించారు. ఇవాళ బాలా సాహెబ్ ఠాక్రే స్మృతిదినం అని తెలిపారు. స్ధానిక వనరులు, మానవవనరులు కోల్పోకూడదనే తాను తెలంగాణకు కూడా మద్దతిస్తానన్నారు. ప్రాంతీయత బలం ఉండాలి.. జాతీయతా భావాలని చంపకూడదన్నారు. బాలా సాహెబ్ ఠాక్రే లాగా సిద్ధాంతం కోసం నిలబడాలి.. పదవులు, అధికారం వస్తాయా రావా అని కాదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ లేని భారతదేశం ఇంత బలంగా ఉండేదా అనిపిస్తుందన్నారు. “నెల్లూరు దగ్గర తుఫాను సమయంలో నా చిన్నపుడు, RSS కార్యకర్తలు చేసిన శుభ్రతకు హ్యాట్సాఫ్ చెప్పాలనిపించింది. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడానికి NDA కృషి చేస్తోంది. 2028 నాటికి మహారాష్ట్రని ఒక ట్రిలియన్ డాలర్ ఆర్ధిక వ్యవస్థగా ఎన్డీఏ మార్చనుంది. ఏపీలో వైసీపీని కొట్టాం అంటే మామూలుగా కొట్టామా.. ఇక్కడ హ్యాట్రిక్ కొట్టాలి మనం. బాలా సాహెబ్ థాక్రే జాతీయవాదం పెరగాలి, సనాతన ధర్మం రక్షింపబడాలి అని కోరుకున్నారు. మోదీ రాకూడదని ఎందరో కోరుకున్నారు.. మూడోసారి తీసుకొచ్చిన సత్తా ఆంధ్ర నుంచీ వచ్చింది. మహాయుతీ సర్కార్ మహారాష్ట్రలో రావాలి.” అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు చకచకా!
రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ప్రయాస అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు చకచకా జరిగిపోతుందన్నారు. రైతన్నలు ధాన్యం విక్రయించుకొనేందుకు వాట్సాప్ సేవలు వినియోగించుకోవచ్చని వెల్లడించారు. 73373-59375 నెంబర్‌తో ఇక సేవలు ఉండనున్నాయని తెలిపారు. రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తామన్నారు. రైతులు నెంబర్‌కు Hi అని సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్‌తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందన్నారు. రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తరువాత… రైతు పేరును ధృవీకరించాలని చెప్పారు. అనంతరం ధాన్యం అమ్మదలచిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాలన్నారు. తరువాత ధాన్యం అమ్మదలిచిన తారీఖుకు సంబంధించి మూడు ఆప్షన్లుంటాయన్నారు. దానిలో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాలన్నారు. అనంతరం సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలన్నారు. ఆ పైన ఎలాంటి రకం ధాన్యం అమ్మదలిచారో ప్రత్యేక ఆప్షన్ ఉంటుందన్నారు. అనంతరం వచ్చే సందేశంలో ఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మదలిచారు అన్నది నమోదు చేయాలన్నారు. అనంతరం ఓ ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేయబడిన కూపన్ కోడ్ వస్తుందన్నారు. ప్రతి ఆప్షన్ కేవలం ఒక క్లిక్‌తో రైతు సులభంగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సప్ ఆప్షన్లు అందరికీ అర్ధమయ్యే రీతిలో ఇవ్వడం విశేషమని పేర్కొన్నారు.
ప్రధాని మోడీ ఖాతాలో మరో అత్యున్నత అవార్డ్.. క్వీన్ ఎలిజబెత్ తర్వాత రెండో వ్యక్తిగా హిస్టరీ..
ప్రధాని మూడు దేశాల పర్యటనలో భాగంగా నైజీరియా వెళ్లారు. నైజీరియాతో పాటు జి-20 సమ్మిట్ జరిగే బ్రెజిల్‌తో పాటు దక్షిణ అమెరికా దేశమైన గయానాలో కూడా పర్యటించబోతున్నారు. ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీ ఖాతాలో మరో అత్యున్నత విదేశీ పురస్కారం చేసింది. నైజీరియా ప్రభుత్వం ప్రధాని మోడీని గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజర్(జికాన్)తో సత్కరించనుంది. దీంతో ఈ అవార్డు అందుకున్న రెండో విదేశీ వ్యక్తిగా ప్రధాని చరిత్ర సృష్టించారు. 1969లో జికాన్ అవార్డును క్వీన్ ఎలిజబెత్ పొందారు. ఈ అవార్డు అందుకున్న మొదటి విదేశీ వ్యక్తిగా ఆమె నిలిచారు. ప్రధాని నరేంద్రమోడీకి ఒక దేశం ప్రధానం చేస్తున్న 17వ అత్యున్న పురస్కారం ఇది. ప్రధాని మోడీకి రాజధాని అబుజాలో ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి నైసోమ్ ఎజెన్‌వో వైక్ ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోడీకి అబుజా ‘కీ టు ది సిటీ’ని బహుకరించారు. కీ నైజీరియా ప్రజలు ప్రధానమంత్రిపై ఉంచిన విశ్వాసం మరియు గౌరవానికి ప్రతీక. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయడానికి నైజీరియాతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు.’’ నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలో మా సన్నిహిత భాగస్వామి అయిన నైజీరియాకు ఇది నా మొదటి పర్యటన. ప్రజాస్వామ్యంపై భాగస్వామ్య నమ్మకంపై ఆధారపడిన మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి నా పర్యటన ఒక అవకాశం. నేను భారతీయ సమాజాన్ని, నైజీరియాలోని స్నేహితులను కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని ప్రధాని పర్యటనకు ముందు ట్వీట్ చేశారు. 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఓ భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి.
మణిపూర్‌లో నిరసనలు తీవ్రం.. మరో నలుగురు ఎమ్మెల్యేల ఇళ్లు దగ్ధం
మరోసారి మణిపూర్ రగిలిపోతుంది. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ క్రమంలో.. శనివారం ముగ్గురు భారతీయ జనతా పార్టీ, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసాలపై దాడి చేశారు. ఆందోళనకారులు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.నవంబర్ 11న భద్రతా దళాలు 10 మంది హ్మార్ పురుషులను చంపారు. ఆ ప్రదేశానికి సమీపంలోని నిర్వాసిత ప్రాంతం శిబిరం నుంచి ఆరుగురు మైతే జాతి వారు అదృశ్యమై చివరికి వారి మృతదేహాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిణామాలు మణిపూర్‌లో తాజా హింసకు కారణమైయ్యాయి. హతమైన వారిని భద్రతా దళాలు మిలిటెంట్లుగా అభివర్ణించాయి. ఈ క్రమంలో.. శనివారం ఇంఫాల్ లోయలోని వివిధ ప్రాంతాలలో హింసాత్మక నిరసనలు చెలరేగాయి. ఫలితంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. ఇంఫాల్ లోయలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పుపెట్టి ఆస్తులను ధ్వంసం చేశారు. నింగ్‌తౌఖోంగ్‌లో పబ్లిక్ వర్క్స్ మంత్రి గోవిందదాస్ కొంతౌజామ్, హ్యాంగ్లామ్ బజార్‌లో బీజేపీ ఎమ్మెల్యే వై రాధేశ్యామ్, తౌబాల్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే పవోనమ్ బ్రోజెన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే లోకేశ్వర్ ఇళ్లకు నిప్పుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ సమయంలో ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
గోద్రా విషాదంపై తెరకెక్కిన ‘‘ది సబర్మతి రిపోర్ట్’’పై ప్రధాని ప్రశంసలు..
గోద్రా రైలు దుర్ఘటనపై ఆ తర్వాత చెలరేగిన అల్లర్ల ఆధారంగా తెరకెక్కిన ‘‘ది సబర్మతీ రిపోర్ట్’’ సినిమాపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన వెనక ఉన్న నిజాన్ని వెల్లడించినందుకు చిత్రాన్ని కొనియాడారు. ‘‘నకిలీ కథనం పరిమిత కాలం మాత్రమే కొనసాగుతుంది’’ అని మోడీ అన్నారు. “ఈ నిజం బయటకు రావడం మంచిది, అది కూడా సాధారణ ప్రజలు చూడగలిగే విధంగా” అని విక్రాంత్ మాస్సే నటించిన చిత్రాన్ని ప్రశంసిస్తూ ప్రధాని మోదీ అన్నారు. 2002 గోద్రా విషాదం వెనక దాడి ఉన్న నిజాన్ని బహిర్గతం చేయడంపై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ ఘటనలో మహిళలు, పిల్లలతో సహా 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ధీరనజ్ సర్నా దర్శకత్వం వహించిన ఈ సినిమా.. 2002లో గుజరాత్‌లోని అనేక ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లు, దారితీసిన విషాదం గురించి వివరించింది. విక్రాంత్ మాస్సే నటించిన ఈ సినమా నవంబర్ 15న విడుదలైంది.
గోద్రా విషాదం:
ఫిబ్రవరి 27, 2002 ఉదయం సబర్మతి ఎక్స్‌ప్రెస్ గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్‌కి వచ్చింది. బీహార్‌లోని ముజఫర్ పూర్ నుంచి గుజరాత్‌లో అహ్మదాబాద్ వరకు నడుస్తున్న ఈ రైలులో వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రైలులోనే అయోధ్యలో మతపరమైన సమావేశం నుంచి తిరిగి వస్తున్న కరసేవకులు ఉన్నారు. రైలు గోద్రా నుంచి బయలుదేరే సమయంలో ఎమర్జెన్సీ చైన్‌ని చాలా సార్లు లాగినట్లు డ్రైవర్ తెలిపారు. దీనివల్ల స్టేషన్ వెలువలి సిగ్నల్ వద్ద రైలు ఆగిపోయింది. ఆ తర్వాత భారీ దాడి జరిగింది. 2000 మంది వ్యక్తుల గుంపు రైలుపై రాళ్లను రువ్వారు. నాలుగు కోచ్‌లను తగలబెట్టారు.S-6 కోచ్ ఎక్కువగా ప్రభావితమైంది మరియు అగ్నిప్రమాదంలో 27 మంది మహిళలు మరియు 10 మంది పిల్లలు సహా 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరో 48 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గోద్రా తర్వాత గుజరాత్ అంతటా అల్లర్లు జరిగాయి. తీవ్రమైన మతకలహాల్లో హిందువులు, ముస్లింలు చనిపోయారు.
రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు..
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం అన్నారు. నవంబర్ 20న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిపై విశ్వాసం ఉంచుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని, ఆయన మాటల్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోరని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లా మెమోరీ లాస్‌తో బాధపడుతున్నారు’’ అని ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై.. రాహుల్ బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గందరగోళానికి దారితీశాయని, దీంతోనే మహారాష్ట్రలో అనుకున్న స్థాయిలో ఎన్డీయే ప్రదర్శన చేయలేకపోయిందని చెప్పారు. ‘‘మేము 400 సీట్లు గెలిస్తే అంబేద్కర్ రాజ్యాంగాన్ని సవరిస్తామని తప్పుడు కథనాలనున ప్రచారం చేశారు’’ అని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని మార్చే ప్రశ్నే లేదని, బీజేపీ అలా ఎప్పటికీ చేయదని, లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు చేసిన ప్రచారం తప్పు అని ఇప్పుడు ప్రజలు గ్రహించారని, ప్రధాని మోడీ నాయకత్వంలోని మహాయుతికి మహారాష్ట్ర ప్రజలు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని గడ్కరీ అన్నారు. యోగి ‘‘ బాటేంగే తో కటేంగే’’ గురించి మాట్లాడుతూ.. ‘‘అభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.. మనమంతా ఒక్కటే.. కొందరు గుడికి, మరికొందరు మసీదు, గురుద్వారాలకు వెళ్తారు. కానీ మనమందరం భారతీయులం, దేశం మనకు అన్నింటికంటే ముఖ్యం ” అని అన్నారు. రాహుల్ గాంధీ లేవనెత్తిన కులగణన గురించి ప్రస్తావిస్తూ.. అసలు సమస్య గ్రామాలు, పేదలు, రైతుల సంక్షేమమేనని, పేదలకు కులం, మతం ఉండవని, ముస్లింలకు ఇతరులతో సమానంగా పెట్రోల్ లభిస్తుందని గడ్కరీ అన్నారు. బీజేపీ అధ్యక్షుడిగా తాను ఇంతకుముందు పనిచేశానని, ఇప్పుడు ఆ పదవిపై కోరిక లేదని గడ్కరీ చెప్పారు.
ఉక్రెయిన్‌పై 60 క్షిపణులతో రష్యా దాడి..
ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా భారీ వైమానిక దాడి చేసింది. రాజధాని కీవ్‌పై ఈ దాడి చేసినట్లు పేర్కొనింది. ఈ వైమానిక దాడిలో రష్యా 60 క్షిపణులను ప్రయోగించింది. ఉక్రెయిన్‌పై ఇప్పటి వరకు రష్యా జరిపిన దాడుల్లో ఇదే అతి పెద్దదిగా చెప్తున్నారు. అయితే, ఈ దాడుల సమయంలో కీవ్ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలోకి వెళ్లిపోయారు. గత కొద్దిరోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా తరచూ దాడులు చేస్తునే ఉంది. కీవ్ లోనే కాకుండా మరికొన్ని చోట్ల కూడా రష్యా దాడులకు దిగింది. ఈ దాడులకు ఇరాన్ నుంచి తీసుకు వచ్చిన డ్రోన్లను పుతిన్ సైన్యం వినియోగించినట్లు తెలుస్తుంది. అయితే, కీవ్‌లోని ప్రజలు ఇంకా బంకర్లలోనే ఉన్నట్లు సమాచారం. ఈ వైమానిక దాడులు కొనసాగుతున్నంత కాలం వారు బంకర్లలోన ఉండాలని ఉక్రెయిన్ అధికారులు సూచించారు. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టంపై అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఈ యుద్ధాన్ని శాంతింపజేయడంపై నజర్ పెడతామని అతడు చెప్పుకొచ్చారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు తమ సర్కార్ తగిన కృషి చేస్తుందని ట్రంప్ వెల్లడించారు.
జైలుకు తమిళ నటి కస్తూరి.. ఈ నెల 29 వరకు రిమాండ్
తమిళ నటి కస్తూరికి చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు పుఝల్ సెంట్రల్ జైలుకు కస్తూరిని తరలించారు. నిన్న(శనివారం) రాత్రి హైదరాబాద్‌లో కస్తూరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో కస్తూరికి ఎగ్మోర్ కోర్టు రిమాండ్ విధించింది. బ్రాహ్మణుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, అవమానితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌తో నవంబర్ 4న చెన్నైలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో నటి కస్తూరి అంతఃపురంలో సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగువాళ్లని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఈ సందర్భంలో తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పి ఆ మాటలు వెనక్కి తీసుకున్నానన్నారు. ఇక్కడ తెలుగు మాట్లాడేవారు అంతఃపురంలో రాజ మహిళలకు సేవ చేసేందుకు వచ్చారంటూ కామెంట్ చేయడంతో పలువురి నుంచి వ్యతిరేకత వచ్చింది.
ఛాంపియన్స్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లు భారత్‌లోనే..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి కీలక అప్‌డేట్స్ వస్తున్నాయి. జనవరిలో భారత్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ వస్తుందని ఐసీసీ ప్రకటించింది. ఈ ట్రోఫీకి హోస్టింగ్‌తో సంబంధం లేదు.. పెద్ద టోర్నమెంట్‌లకు ముందు ఐసీసీ ఈ ట్రోఫీ పర్యటనను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ నుంచి భారత్‌కు రానుంది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ట్రోఫీ టూర్ నవంబర్ 16 నుండి ప్రారంభమైందని.. 2025 జనవరి 26 వరకు కొనసాగుతుందని ఐసీసీ మీడియా ప్రకటనలో తెలిపింది. ఛాంపియన్స్ ట్రోఫీ చివరిగా భారత్‌కు రానుంది. ఈ ట్రోఫీ షెడ్యూల్ నవంబర్ 16 నుండి 25 వరకు పాకిస్తాన్‌లోని వివిధ నగరాల్లో జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 26 నుండి 28 వరకు ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతుంది. డిసెంబర్ 10 నుండి 13 వరకు బంగ్లాదేశ్‌లో ఉంటుంది. ఆ తర్వాత.. డిసెంబర్ 15 నుంచి 22 వరకు దక్షిణాఫ్రికాలో ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ జరగనుంది. దక్షిణాఫ్రికా తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పర్యటన ఆస్ట్రేలియాకు చేరుకుంటుంది. అక్కడ ట్రోఫీ డిసెంబర్ 25 నుండి జనవరి 5 వరకు దేశంలోని వివిధ నగరాలలో నిర్వహిస్తుంది. ఆ తర్వాత.. ట్రోఫీ జనవరి 6 నుండి 11 వరకు న్యూజిలాండ్‌లో ఉంటుంది. ఆపై ట్రోఫీ జనవరి 12 నుండి 14 వరకు ఇంగ్లాండ్‌కు వెళుతుంది. ఆ తర్వాత భారత్‌కు రానుంది. జనవరి 15 నుంచి 26 వరకు భారత్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఆ తర్వాత ట్రోఫీ పాకిస్థాన్‌లో జరుగుతుంది. జనవరి 27న పాకిస్థాన్‌లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత టోర్నీకి మిగిలిన సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి-మార్చిలో జరగాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు వస్తున్న రిపోర్టుల ప్రకారం ఈ టోర్నీని పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనుంది. భారత్ మూడు లీగ్ మ్యాచ్‌లు.. ఒక సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో ఆడనుంది.