NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు
ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. మాజీ సీఎం వైఎస్‌ జగన్ తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఆయన.. జగన్‌కు ఇంకా తత్వం బోధ పడలేదని ఎద్దేవా చేశారు.. నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెబుతూ కుట్రలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు.. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలను రెచ్చకొట్టడం.. ఇదంతా అతని అహంకార ధోరణికి నిదర్శనం అన్నారు.. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతానని భ్రమ నుంచి ప్రజలు బయట పడేసినా.. వైఎస్‌ జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో..? అని సెటైర్లు వేశారు.. రాష్ట్రాభివృద్ధి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు నేను, నా పార్టీ నూటికి నూరు శాతం సహకరిస్తుందని స్పష్టం చేశారు పవన్‌ కల్యాణ్‌. మరోవైపు.. ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర సహకారంతో రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకుందాం అన్నారు.. ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలా సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఆయన.. రాష్ట్రానికి ఉన్న నిధుల కొరతను అధిగమించేందుకు కలసి కట్టుగా ప్రయత్నిద్దాం అని సూచించారు.. ఇక, వైఎస్‌ జగన్ ఇదే ధోరణి కొనసాగిస్తే అతనికి భంగపాటు తప్పదు అని హెచ్చరించారు.. ఢిల్లీలో జగన్ ఎన్ని విన్యాసాలు చేసినా అతణ్ని పట్టించుకునేవారు లేరంటూ ఎద్దేవా చేశారు మంత్రి సత్యకుమార్‌ యాదవ్.

వైసీపీకి మరో షాక్‌.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై..
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.. ఇప్పటికే వైసీపీకి గండి కొట్టి పలు మున్సిపాల్టీలను తన ఖాతాలో వేసుకుంది తెలుగుదేశం పార్టీ.. మరికొందరు నేతలు కూడా పార్టీని వీడుతున్నారు.. ఇక, తాజాగా, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు.. 2019లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి.. గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మద్దాలి గిరి.. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.. ప్రస్తుతం వైసీపీ గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కొందరు నేతలు పార్టీని వీడుతున్న తరుణంలో.. ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు నగర పార్టీ అధ్యక్ష పదవితో పాటు వైసీపీ క్రియాశీలక సభ్యతానికి కూడా రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి.. రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ఆలోచనతోనే వైసీపీకి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. మరి, ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటారా..? తిరిగి టీడీపీ గూటికి చేరుతారా? అనే విషయం తెలియాల్సి ఉంది.

మంత్రి నారా లోకేష్‌.. బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ.. వారిచూపు బీజేపీ వైపు..!
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు.. ఇక, అసెంబ్లీలోని మంత్రి నారా లోకేష్‌ చాంబర్‌ను ఆయనతో సమావేశం అయ్యారు మంత్రి సత్యకుమార్, బీజేపీ ఎమ్మెల్యేలు.. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌, బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది.. చాలామంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారంటూ.. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందట.. అయితే, పార్టీలో చేరికలపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవట్లేదని బీజేపీ నేతలు తెలిపారట.. అలాంటిది ఏదైనా ఉంటే ఉమ్మడిగా నిర్ణయిద్దామని.. లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారట బీజేపీ నేతలు.. పార్టీలో చేరికలపై కూటమి పక్షాల నేతలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే మంచిదని బీజేపీ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని లోకేష్‌ ముందు పెట్టారట.. ఇక, ఈ ప్రతిపాదన మంచిదని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.. తోట త్రిమూర్తులు చేరికపై వస్తున్న ఊహగానాలను ప్రస్తావించారట అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి. బీజేపీలో చేర్చుకుంటున్నారా? అని మంత్రి సత్యకుమార్ ను ప్రశ్నించారు నల్లమిల్లి… అయితే, తనకు తెలిసి అటువంటిదేదీ లేదని సత్య కుమార్ బదులిచ్చారట.. మొత్తంగా మంత్రులు నారా లోకేష్‌, సత్యకుమార్‌ (బీజేపీ), బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో.. పార్టీలో చేరికలపై కీలక చర్చ జరిగిందని.. బీజేపీ నేతలు చెబుతున్నారు.

జ‌ల్‌శ‌క్తి మంత్రితో ముఖ్యమంత్రి భేటీ.. జ‌ల్‌జీవ‌న్ మిష‌న్ నిధులు కేటాయించాలని వినతి
జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప‌డుతున్న మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోంద‌ని, దానిని శుద్ధి చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం సంక‌ల్పించింద‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా.. జాతీయ న‌ది ప‌రిర‌క్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ధి ప‌నులకు రూ.4 వేల కోట్లు.. గోదావ‌రి న‌ది జ‌లాల‌ను ఉస్మాన్ సాగ‌ర్‌, హిమాయ‌త్ సాగ‌ర్‌ల‌తో నింపే ప‌నుల‌కు రూ.6 వేల కోట్లు కేటాయించాల‌ని కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ను ముఖ్యమంత్రి కోరారు. ఉస్మాన్ సాగ‌ర్‌, హిమాయ‌త్ సాగ‌ర్‌ను గోదావ‌రి నీటితో నింపితే హైద‌రాబాద్ నీటి ఇబ్బందులు ఉండ‌వ‌ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2019లో జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప్రారంభ‌మైనా ఈ ప‌థ‌కం కింద ఇప్పటి వ‌ర‌కు తెలంగాణ‌కు నిధులు ఇవ్వలేద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ‌లో 7.85 ల‌క్షల ఇళ్లకు న‌ల్లా క‌నెక్షన్ లేద‌ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు సీఎం. న‌ల్లా లేని 7.85 ల‌క్షల‌ ఇళ్లతో పాటు పీఎంఏవై (అర్బన్‌), (రూర‌ల్‌) కింద చేప‌ట్టే ఇళ్లకు న‌ల్లా క‌నెక్షన్లు ఇచ్చేందుకు రూ.16,100 కోట్ల వ్యయ‌మ‌వుతుంద‌ని తెలిపారు. ఈ ఏడాది నుంచి జ‌ల్‌జీవ‌న్ మిష‌న్ నిధులు తెలంగాణ‌కు కేటాయించాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

హరీష్ రావు.. ప్రభుత్వం మీద ఆరోపణలు మానుకో
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మీద ఆరోపణలు మానుకోవాలని సూచించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద నోరు పారేసుకోకు అని అన్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్లు సముద్రం పాలు చేసిన ఘనత బీఆర్ఎస్ది అని దుయ్యబట్టారు. సన్నాయి నొక్కులు నొక్కడం మానుకో హరీష్ రావు అని విమర్శించారు. మేడిగడ్డలో కుంగిన బ్లాకులు మీరు ఎందుకు రిపేర్ చేయలేదని ప్రశ్నించారు. హరీష్ స్థాయి తగ్గించుకుంటున్నాడని మండిపడ్డారు. కుంగిన ప్రాజెక్టు, పిల్లర్ల గురించి ఎన్నడూ మాట్లాడని కేటీఆర్.. హరీష్ లు ఇప్పుడు మాట్లాడుతున్నారని బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ఆరడుగుల హరీష్కి మెదడు తలలో ఉందా.. మోకాలులోకి వచ్చిందా..? తీవ్ర స్థాయిలో విమర్శించారు. NDSA ఓ వైపు హెచ్చరిస్తుంటే.. మళ్ళీ తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వారం రోజుల్లో 73 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైంది.. దీని పాపం మీది కాదా..! అని అన్నారు. రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.. దమ్ముంటే అక్కడికి వచ్చి మాట్లాడండని బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు రైతులను ఎలా మోసం చేశారు.. సబ్సిడీలు ఎలా రద్దు చేశారు అనేది చర్చ చేద్దామన్నారు. గవర్నర్ వ్యవస్థ అంటేనే గౌరవం లేని మీరు గవర్నర్ నీ కలిశారని బీర్ల ఐలయ్య తెలిపారు.

రహదారుల నిర్మాణాలపై సెక్రటరీతో మంత్రి చర్చలు..
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా.. జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అనురాగ్ జైన్కు మంత్రి తెలిపారు. అలాగే.. నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా చేపట్టేందుకు ఎస్ఎఫ్సీ (స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ) మీటింగ్ ఏర్పాటు చేసి త్వరగా టెండర్లు పిలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో 16 రాష్ట్ర రహదారులను.. జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి అనురాగ్ జైన్కు అభ్యర్ధించారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు ఆర్&బీ స్పెషల్ సెక్రెటరీ దాసరి హరిచందన, ఇతర అధికారులు పాల్గొన్నారు. రహదారుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెక్రటరీతో కులంకుషంగా చర్చించారు. నల్గొండ బైపాస్ నిర్మాణంపై వారంలో ఎస్ఎఫ్సీ ఏర్పాటు చేస్తామని అనురాగ్ జైన్ హామీ ఇచ్చారు.

నితీష్‌ సర్కార్‌కు కేంద్రం ఝలక్.. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని వెల్లడి
ఎన్డీఏ మిత్రపక్ష రాష్ట్రమైన బీహార్‌కు మోడీ ప్రభుత్వం గట్టి ఝలక్ ఇచ్చింది. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని కేంద్రం తాజాగా తేల్చిచెప్పింది. ఇటీవలే బీహార్‌లోని నితీష్‌ సర్కార్.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని తీర్మానం చేసింది. తాజాగా పార్లమెంట్‌లో జేడీయూ ఎంపీ రామ్‌ప్రీత్ మండల్ ఇదే అంశాన్ని లేవనెత్తారు. దీనికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందిస్తూ.. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జేడీయూ ఎంపీ రామ్‌ప్రీత్ మండల్.. ఆర్థికంగాను, పారిశ్రామికంగాను బీహార్ సహా ఇతర వెనుక బడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉందా? లేదా? అని ఆర్థిక మంత్రిత్వ శాఖను అడిగారు. దీనికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చిరు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రణాళిక ఏదీ లేదని తేల్చిచెప్పారు.

యూట్యూబ్‌కు అంతరాయం.. యూజర్ల ఆందోళన
గత శుక్రవారం మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్యతో ప్రపంచ మంతా అల్లాడిపోయింది. తాజాగా భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వీడియో ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, ముంబై సహా పలు నగరాల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. అప్‌లోడ్ చేసిన వీడియోలు కనిపించడం లేదని, ఇంకొందరు అప్‌లోడ్ చేయలేకపోతున్నామని కంప్లంట్ చేస్తున్నారు. మరికొందరు డౌన్‌లోడ్ కావడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. మధ్యాహ్నం 1:40 గంటల నుంచి ఈ సమస్య ఉన్నట్లుగా వినియోగదారు పేర్కొన్నారు. గత శుక్రవారం మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్య కారణంగా మార్కెట్లు, బ్యాంకులు, ఎయిర్‌లైన్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొత్తానికి 24 గంటల తర్వాత సమస్యను పరిష్కరించారు. తాజాగా యూట్యూబ్ సమస్యతో ఇండియాలోని పలు ప్రాంతాల్లో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఫ్యాషన్ షోలో దేశాధినేతల ర్యాంప్ వాక్.. మాములుగా లేదుగా..
ప్రతి నిత్యం ఎన్నో విషయాలపై చర్చలు జరిపే దేశాధినేతలు బిజీబిజీగా జీవితాన్ని గడిపేస్తుంటారు. అలాంటి దేశాధినేతలు చిత్ర విచిత్రమైన దుస్తులు వేసుకొని ఫ్యాషన్ షో లో ఉండే ర్యాంప్ పై వాకింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏంటి..? దేశాధినేతల ర్యాంప్ వాక్ చేయడం ఏంటి అని భావిస్తున్నారా..? అయితే అది నిజం కాకపోవచ్చు.. కాకపోతే., ప్రస్తుతం వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉపయోగించి చేసిన వీడియోలో వివిధ దేశాలకు చెందిన దేశాధినేతలు ర్యాంప్ వాక్ చేసినట్లుగా కనపడుతుంది. ఈ వీడియోను తాజాగా ఎక్స్ అధినేత ఎలాన్ మాస్క్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో.. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరక్ ఒబామా, రష్యా అధినేత పుతిన్ ఇలా అనేక దేశాల నేతలను రకరకాల దుస్తులను వేసుకొని ర్యాంపు పై వాక్ చేస్తున్నట్లుగా ఏఐ రూపొందించిన వీడియోను ఎలన్ మస్క్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియోకి మస్క్ ఇది ” ఏఐ ఫ్యాషన్ షో సమయం ” అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియో 40 మిలియన్స్ కు పైగా వ్యూస్ ని పొందింది.

ప్రభాస్ సరసన పాకిస్తానీ భామ.. ఇదే ప్రూఫ్!
సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. అదే సమయంలో, ఈ సినిమా తర్వాత ప్రభాస్ తదుపరి సినిమాకు సంబంధించిన సన్నాహాల్లో బిజీగా ఉన్నాడు. కల్కి తర్వాత మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే హారర్ కామెడీ చిత్రంలో ప్రభాస్ నటించనున్నాడు. దీనితో పాటు, ప్రభాస్ హను రాఘవపూడితో ఒక సినిమా చేయనున్నారు. ఇక ఈ సినిమా గురించి ఇప్పుడు అనేక విషయాలు తెరమీదకు వస్తున్నాయి. హను రాఘవపూడితో ప్రభాస్ సినిమా పీరియాడికల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఉండనుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న నటి పేరు గురించి సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. ప్రభాస్‌తో రొమాన్స్‌ను జోడించే నటిని మేకర్స్ ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. రిపోర్టుల ప్రకారం ప్రభాస్ సరసన పాకిస్థాన్ నటి సజల్ అలీ నటిస్తుందని ప్రచారం మొదలైంది. దివంగత నటి శ్రీదేవి నటించిన మామ్ చిత్రంలో సజల్ అలీకి మంచి గుర్తింపు వచ్చింది. ఈ వార్త నిజం అవునో కాదో అధికారిక సమాచారం లేదు కానీ మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఇమాన్ ఇస్మాయిల్ అనే పాకిస్థానీ నటిని హను రాఘవపూడి సోషల్ మీడియాలో ఫాలో అవుతుండగా ఆమె ప్రభాస్ ను ఫాలో అవడం మొదలు పెట్టింది. దీంతో ఆమె హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా పెట్టుబడి పెడుతున్నారు. ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. స్వరకర్త విశాల్ చంద్రశేఖర్ హను రాఘవపూడితో కలిసి ‘సీతా రామం’ విజయవంతమైన తర్వాత ఈ చిత్రం కోసం మళ్లీ కలిసి పని చేయనున్నారు.

లావణ్య బండారం బట్టబయలు చేసిన రాజ్ తరుణ్ ఫ్రెండ్… అతను రేప్ చేస్తే?
సినీ హీరో రాజ్ తరుణ్, లావణ్య అనే అమ్మాయితో సహజీవనం అనే అంశం తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. తనను పెళ్లి కూడా చేసుకుని ఇప్పుడు మాల్వితో తిరుగుతూ తనను వదిలేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అసలు లావణ్య క్యారెక్టర్ మంచిదికాదని ఆమె అబద్దాల కోరని, ఆమె డ్రగ్స్ ను అమ్మేదనని.. ఈ విషయంలో కేసు కూడా బుక్ అయిందని రాజ్ తరుణ్ స్నేహితుడుగా చెప్పుకుంటూ శేఖర్ బాషా అనే ఆర్జే పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. మస్తాన్ రావ్ అనే వ్యక్తి నునుచి లావణ్య మత్తు పదార్థాలను కొని బయట ఎక్కువ రేటుకు అమ్మేదని, ఆ పరిచయంతో ఇద్దరూ ఒకటయ్యారని కూడా శేఖర్ చెబుతున్నారు. మస్తాన్ రావు, లావణ్య తరచూ కలుస్తుండేవారు. మస్తాన్ రావ్ కి వేరే అమ్మాయిలతో ఎఫైర్స్ వున్నాయని లావణ్యకు తెలిసి లావణ్య నిలదీస్తే ఇద్దరూ కలిసిన పర్సనల్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడని ఇప్పుడు లావణ్య కూడా రాజ్ తరుణ్ ను అదే రూటులో బ్లాక్ మెయిల్ చేస్తుందని ఆరోపించారు. గత ఏడాది గుంటూరులోని పట్టాభిపురంలో లావణ్య మస్తాన్ రావు మీద ఎఫ్.ఐ.ఆర్. బుక్ చేయించిందని కూడా బయట పెట్టాడు. మస్తాన్ చెల్లె పెళ్ళికి అని గుంటూరు పిలిపించి తన మీద దాడి చేశాడని, రేప్ కూడా చేశాడని ఆమె కంప్లైంట్ లో పేర్కొంది. అదే విషయాన్ని చెబుతూ ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా శేఖర్ బయటపెట్టాడు.