NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

అలా చేస్తేనే.. మేం కాల్పుల విరమణకు ఒప్పుకుంటాం..

దాదాపు మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియటం లేదు. అటు కీవ్‌ సైనికులు కూడా రష్యా దూకుడును ఎదుర్కోలేక దేశం వదిలి పారిపోతున్నారు. ఈ పరిణామాల వేళ కాగా, బ్రిటన్‌ మీడియా సంస్థ ‘స్కై న్యూస్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. కీవ్‌ అధీనంలో ఉన్న భూభాగాన్ని నాటో పరిధిలోకి తీసుకుంటే యుద్ధాన్ని ముగించే అవకాశం ఉందన్నారు.

నేటితో ముగియనున్న ఓటీఎస్ ఆఫర్.. రేపటి నుంచి బాదుడే

జలమండలి ఓటీఎస్ ఆఫర్ నేటితో ముగియనుంది. పెండింగ్‌లో ఉన్న వాటర్ బిల్లులు చెల్లించేందుకు వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని జలమండలి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నీటి బకాయిలు పెరుగుతుండటంతో వన్ టైమ్ సెటిల్మెంట్ ఆఫర్ ను తెచ్చింది. జలమండలికి రూ.1700 కోట్ల రూపాయల బకాయిలు ఉండంతో.. ఎలాంటి ఆలస్య రుసుము, వడ్డీ లేకుండా బకాయిలు చెల్లించేలా ఆఫర్ తీసుకువచ్చింది.

అయితే.. ఓటీఎస్ ద్వారా రెండు నెలల్లో 75 కోట్లు మాత్రమే వసూలు చేశారు. బిల్లులు పెండింగులో ఉన్న వినియోగదారులపై డిసెంబర్ 1 నుంచి చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. OTSని ఉపయోగించిన వినియోగదారులు ఈ గడువులోపు అంటే నేడు అసలు మొత్తాన్ని చెల్లిస్తే, వారు ఎలాంటి వడ్డీ లేదా ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. గడువు ముగిసిన తర్వాత అంటే (డిసెంబర్ 1)నుంచి చెల్లిస్తే పెండింగ్‌లో ఉన్న బిల్లులపై వడ్డీ, పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఈరోజు చివరి రోజు కావడంతో ఓటీఎస్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జలమండలి అధికారులు సూచించారు.

ఫెంగల్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌.. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో ఈరోజు తెల్లవారుజామున నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. నెల్లూరు.. కోవూరు.. అల్లూరు.. వాకాడు..కోట. ముత్తుకూరు మండలాల్లో కొనసాగుతోంది. తీర ప్రాంతంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో.. బీచ్ ల వద్దకు ప్రజలు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది.

లగచర్లలో పారిశ్రామిక పార్కు భూసేకరణకు నోటిఫికేషన్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండస్ట్రియల్ పార్క్‌ను వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి మండలంలోని లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు. లాగాచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాలలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూసేకరణ అధికారిగా తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ నియమించింది. ఇటీవల రైతులు, స్థానికుల ఆందోళనల నేపథ్యంలో గతంలో ఇక్కడి ఫార్మా గ్రామాల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఫార్మా కంపెనీల ఏర్పాటుతో పచ్చని పల్లెలు కాలుష్యంగా మారతాయని లగచర్ల ప్రజలు భూసేకరణను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో లగచర్ల, పోలేపల్లిలో కాలుష్య రహిత సంస్థలు నెలకొల్పితే స్వచ్ఛందంగా భూములు ఇస్తామని స్థానిక ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

కాలేజీ బస్సులో మంటలు.. పూర్తిగా దగ్ధం..

బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని గూడవల్లి వద్ద ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజి బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. రేపల్లె పట్టణంలోని ఐఆర్ఈఎఫ్ సంస్థలకు చెందిన నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థినులకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రం గుంటూరు కావడంతో, 30 మంది విద్యార్థినులను పరీక్ష రాయించేందుకు బస్సులో తీసుకువెళ్లారు. సరిగ్గా గూడవల్లి వద్దకు రాగానే బస్సులో పొగలు వచ్చాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తై బస్సును ఆపాడు. విద్యార్థులను హుటాహుటిన కిందకు దించి కొద్దిసేపటికే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధం అయింది.

నేడు వయనాడ్కు ప్రియాంక, రాహుల్.. కాంగ్రెస్ భారీ బహిరంగ సభ

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్ సభ నియోజక వర్గంలో ఈ రోజు (నవంబర్ 30) కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వయనాడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. ఈ సభలో వారు ప్రసంగిస్తారని ఇప్పటికే హస్తం పార్టీ నేతలు వెల్లడించారు. కాగా, కోజికోడ్ జిల్లాలోని ముక్కమ్‌లో ఈ రోజు మధ్యాహ్నం బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు.

గుట్కా తింటూ వంట చేస్తావా.. వంట మనిషిపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆగ్రహం

గురుకుల హాస్టల్లలో విద్యార్థులు పుడ్‌ పాయిజన్‌ ఘటనలు వెలుగులోకి రావడంతో అధికారులు దృష్టి సారించారు. స్థానికంగా ఫిర్యాదులు రావడంతో స్వయంగా రంగంలోకి దిగి చర్యలు చేపడుతున్నారు. ఈనేపథ్యంలో ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు గురుకుల హాస్టల్‌లో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గురుకుల హాస్టల్ విద్యార్థులతో మాట్లాడారు. హాస్టల్‌ లో వసతులు, భోజనంపై ఆరా తీశారు. అయితే విద్యార్థులు చెప్పిన మాటలకు షాక్‌ తిన్నారు. వంట మనిషిపై ఫిర్యాదు చేశారు. గుట్కా, మద్యం సేవించి వంట చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బీర్ల ఐలయ్య వంట మనిషి పిలిపించి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యాసంస్థలు బంద్‌, విమాన రాకపోకలకు అంతరాయం

తమిళనాడు ప్రజలను ఫెంగల్ తుఫాన్ తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. హిందు మహా సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం శుక్రవారం నాడు తుఫానుగా మారింది. దీంతో ఈరోజు ( నవంబర్ 30) పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాగే ఛాన్స్ ఉంది. కారైకాల్- మహాబలిపురం మధ్య పుదుచ్చేరికి సమీపంలో గంటకు 70 నుంచి 90 కిలో మీటర్ల వేగంతో నేటి మధ్యాహ్నం తీరం దాటనున్నట్లు ఐఎండీ తెలిపింది. తుఫాన్‌ ప్రభావంతో పుదుచ్చేరి, చెన్నైతో సహా తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చింది.

ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు.. సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ వైరల్‌..

ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడని గుర్తుచేశారు. ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందని తెలిపారు. ఒక్క ఏడాదిలో 54 వేల కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చామన్నారు. ఇది నెంబర్ కాదు రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం అన్నారు. ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కలిసి రైతు పండుగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా అని సీఎం రేవంత్ ట్విట్ వైరల్‌గా మారింది.

పీడీఎస్ పై పవన్ కల్యాణ్ చర్యలు సరైనవే

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు అంకితభావంతో పని చేస్తున్నారని తెలిపారు. 2024 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తక్కువ సమయంలోనే 11 కోట్ల మంది సభ్యత్వం పొందారని, ఆంధ్రప్రదేశ్‌లో 25 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చగలిగినందుకు పార్టీ కార్యకర్తల కృషిని కొనియాడారు. కార్యకర్తల ప్రతిష్ఠాభిమానంతోనే ఇది సాధ్యమైందని, భవిష్యత్తులో పారదర్శకంగా, సమర్థవంతంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని వివరించారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోందని, సుపరిపాలన, అవినీతి రహిత పాలన అందించడంలో ప్రజలు గమనించారని అన్నారు. హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ అద్వితీయ విజయాలు సాధించిందని, జార్ఖండ్‌లో ఓటు శాతం 33% పెరిగిందని పేర్కొన్నారు.

 

Show comments