జొమాటో వుమెన్ డెలివరీ భాగస్వాములకు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్
దేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో తన మహిళా డెలివరీ భాగస్వాములకు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ బీమా పథకం ద్వారా తమ మహిళా డెలివరీ భాగస్వాముల గర్భం, ప్రసవం, సంబంధిత ఖర్చులను తామే భరిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది మొత్తం గర్భధారణ సమయంలో వారికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఈ పథకం గురించి Zomato చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, రాకేష్ రంజన్ మాట్లాడుతూ.. అటువంటి ప్రణాళికను ప్రవేశపెట్టడం ద్వారా గర్భధారణ సమయంలో గిగ్ కార్మికులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. దీనితో పాటు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మహిళా డెలివరీ భాగస్వాములు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు. ఈ బీమా ప్రయోజనాన్ని అందించడం ద్వారా వారికి ఆర్థిక భద్రత కల్పించిన వారమవుతామన్నారు.
శ్రీలంకతో పోరు.. ఇంగ్లండ్‌కు ఆఖరి అవకాశం!
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు శ్రీలంక, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నేటి మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచులలో ఒక విజయం సాధించిన శ్రీలంక, ఇంగ్లండ్ జట్లకు సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇక నుంచి అన్ని గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.
ప్రపంచకప్ 2023లో మిణుకుమిణుకుమంటున్న ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు చివరి అవకాశం. మూడు ఓటములతో ఇప్పటికే సెమీస్ మార్గాన్ని క్లిష్టంగా మార్చుకున్న ఇంగ్లీష్ జట్టు పేలవ ఫామ్ కనబర్చుతున్న లంకతో చావోరేవో తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ఇంగ్లండ్ పని అయిపోయినట్లే. టోర్నీలో ఇప్పటివరకూ బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. డేవిడ్ మలన్, జో రూట్ పర్వాలేదనిపించారు. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.
శంషాబాద్ లో రోబోల సేవలు.. GMR ఇన్నోవెక్స్ పేరుతో సెంటర్..!
భారతదేశంలోని విమానాశ్రయాలలో శంషాబాద్ విమానాశ్రయం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయ ప్రయాణికులకు రోబోల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇకపై ప్రయాణికులు విమానాశ్రయంలోకి ప్రవేశించినప్పటి నుంచి విమానం ఎక్కే వరకు రోబోలు వారికి అవసరమైన సేవలను అందించనున్నాయి. ఈ మేరకు జీఎంఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది! అవును… ప్రయాణికులకు అవసరమైన సేవలతో పాటు పరిశుభ్రతను మరింత మెరుగుపరిచేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో రోబోటిక్ పరికరాలు, యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం 6 నెలల క్రితం జీఎంఆర్ ఇన్నోవెక్స్ పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం రోబోటిక్ సేవలకు సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు కేంద్రం యోచిస్తోంది!
సామాజిక బస్సు యాత్రలో కోడి కత్తి శ్రీను ఫోటో పెట్టాలి
సామాజిక సాధికారత పేరిట వైసీపీ నేటి నుంచి బస్సు యాత్రను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత జవహర్ మాట్లాడుతూ.. సామాజిక బస్సు యాత్రలో కోడి కత్తి శ్రీను ఫోటో పెట్టాలన్నారు. మరో ప్రక్క డ్రైవర్ సుబ్రహ్మణ్యం శవం ఫోటో ఉంచాలన్నారు. దళితులపై దాడులు చేసిన వారిని వైసీపీ దూరంగా పెట్టి యాత్ర చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. రద్దైన 120 పధకాలు ఎందుకు రద్దు చేశారో చెప్పగలరా..? అని ఆయన ప్రశ్నించారు. జగన్ దళిత ద్రోహి కాదని చెప్పగలరా..? అని ఆయన అన్నారు. వర ప్రసాద్ అనే వ్యక్తికి గుండు ఎందుకు కొట్టించారో చెప్పాలని, 1.40 లక్షల కోట్ల సబ్ ప్లాన్ నిధులు ఎక్కడికి పోయాయో చెప్పాలన్నారు. సామాజిక యాత్రకాదు సమాజంపై దండ యాత్ర అని జవహర్ వ్యాఖ్యానించారు. జగనుకు.. వైసీపీకి యాత్ర చేసే అర్హత లేదంటూ విమర్శించారు.
నేడు తిరుపతిలో ‘నిజం గెలివాలి’
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తిరుపతిలో ‘నిజం గెలవాలి’ యాత్రను కొనసాగిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో నష్టపోయిన కుటుంబాలను గురువారం ఆమె పరామర్శిస్తున్నారు. శుక్రవారం ఆమె శ్రీకాళహస్తికి రానున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం అగరాలలో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భువనేశ్వరి మాట్లాడుతూ.. తాను రాజకీయాల గురించి మాట్లాడేందుకు రాలేదని, సత్యం ప్రాముఖ్యాన్ని చాటిచెప్పేందుకు రాలేదన్నారు. ఈ పోరాటం తన కోసం కాదని, రాష్ట్ర ప్రజల కోసం, వారి భవిష్యత్తు కోసం అని ఆమె పేర్కొన్నారు. సత్యం గెలుపొందాలంటే ఐక్యంగా ఉండాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. చంద్రబాబుపై తనకంటే ప్రజలకు మంచి అవగాహన ఉందని ఆమె అంగీకరించారు.
తెలంగాణలో అమిత్ షా టూర్.. షెడ్యూల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణకు రానున్నారు. రాత్రికి అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేషనల్ పోలీస్ అకాడమీకి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసిన అనంతరం రేపు నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగే పాసింగ్ ఔట్ పరేడ్ కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. రేపు మధ్యాహ్నం సూర్యాపేటలో జనగర్జన సభలో పాల్గొంటారు. ఈ పర్యటనలో తెలంగాణలోని ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి!
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్‌బళ్లాపూర్ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది వలస కూలీలు మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన 44వ జాతీయ రహదారిపై చిక్కబళ్లాపుర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం… దసరా పండగకు కూలీలు అందరూ గోరంట్ల మండలంలోని సొంత ఊళ్లకు వెళ్లారు. ఉపాధి కోసం తిరిగి బెంగళూరులోని హొంగసంద్ర వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున పొగమంచు బాగా ఉండటంతో టాటా సుమో డ్రైవర్ నరసింహులు రోడ్డుపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీ కొట్టాడు. దీంతో టాటా సుమోలో ప్రయాణిస్తున్న 14 మందిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
రోజు రోజుకు పెరుగుతున్న ఉల్లి ధర
రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కిలో ఉల్లి ధర నిరంతరం పెరుగుతూనే ఉంది. కూరగాయలు సరసమైన ధరకు లభించే రైతు బజార్లలో కూడా ఉల్లి కిలో రూ.46కు చేరింది. రిటైల్ మార్కెట్‌లో రూ.60 నుంచి రూ.70 వరకు లభిస్తోంది. అధిక ధర ఉన్నప్పటికీ, కూరగాయల నాణ్యత తక్కువగా కనిపిస్తుంది. మర్రిపాలెం రైతు బజార్ ఎస్టేట్ అధికారి కె వరహాలు తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు నుంచి సరఫరా నిలిచిపోయింది. “అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా, మహారాష్ట్ర నుండి సరఫరా కూడా ప్రభావితమైంది.
టాంక్ బండ్ పై ట్రాఫిక్ జామ్.. దుర్గామాత వాహనాలతో నిండిన పరిసర ప్రాంతాలు..
తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న అమ్మవారి విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో వినాయక నిమజ్జనాలను తలపించే విధంగా భారీ స్థాయిలో దుర్గా మాత వాహనాలు టాంక్ బండ్ పై భారీగా తరలి వచ్చాయి. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలంగాణ సెకరటేరియట్ రోడ్, నెక్లెస్ రోడ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, టెలిఫోన్ భవన్ రోడ్ వరకు పూర్తిగా వాహనాలు నిలిచిపోయాయి. నిమజ్జన వాహనాలతో నిండిపోయిన టాంక్ బండ్ పరిసరాలన్నీ కిక్కిరిపోయాయి. పండగ తరువాత అంతా ఆఫీస్ లకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ కావడంతో తో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కాగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఇంకా ట్యాంక్ బండ్ లో దుర్గామాత నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. సిటీ లో ఈసారి దాదాపు 3వేలకు పైగా అమ్మవారి విగ్రహాలు ట్యాంక్ బండ్ వద్దకు తరలివచ్చాయి. ఇప్పటివరకు దాదాపు 1500 నుంచి 2000 విగ్రహాలు నిమజ్జనం పూర్తైంది. గత మూడు రోజుల నుంచి నిమజ్జనం కొనసాగుతుంది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున్న నిమజ్జనం కోసం టాంక్ బండ్ పై దుర్గామాత విగ్రహాలు తరలివస్తున్నాయి. నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ చుట్టూ 11 క్రెన్ ల ఏర్పాటు చేశారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ దగ్గర భారీగా విగ్రహాలు క్యూ కట్టారు.
నాలుగున్నర ఏళ్లలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పబొతున్నాం
నేటి నుంచి వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలో నేడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. 175 నియోజక వర్గాలలో సామాజిక సాధికార యాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. ఉత్తరాంధ్ర బస్సు యాత్ర ఇచ్చాపురంలో ప్రారంభమవుతుందని, సీఎం ప్రమాణ స్వీకారం తరువాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎలాంటి సముచిత స్థానం ఇచ్చారొ చెబుతామన్నారు బొత్స సత్యనారాయణ. బడుగు బలహీన వర్గాలకు ఆర్దిక పరిపుష్డి చేసే కార్యక్రమాలు చేపడుతున్నామని, నాలుగున్నర ఏండ్లలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్ప బొతున్నామన్నారు బొత్స సత్యనారాయణ. గత ఐదేళ్లలో ఏవిధంగా ప్రజా దనం దుర్వినియొగం చేసారో చెబుతామన్నారు. రాబోయే రోజులలో ఏం చేయబోతున్నామో తెలియజేస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
నేడు న్యూఢిల్లీకి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చ..!
బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోన్ చేసింది. ఢిల్లీకి రావాలని కోరారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని కూడా ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. కాగా.. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. రేపు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి టికెట్‌పై కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కోమటిరెడ్డి ఫోన్ చేశారు. ఈరోజు ఢిల్లీకి రావాలని కోరారు. అది కుదిరితే ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. కుదరని పక్షంలో రేపు కాంగ్రెస్‌లో చేరనున్నారు.