NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

చైనా మరో ఘనత.. భూమి మీదకు జాబిల్లి ఆవలి వైపు నమూనాలు

చంద్రమండల యాత్రల్లో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి జాబిల్లికి ఆవలి వైపు నమూనాలు సేకరించి.. వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుడి రెండో వైపు నుంచి మట్టి, శిథిలాలను మోసుకుని చాంగే-6 వ్యోమనౌక భూమిని చేరుకుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతాల్లో ఇది సురక్షితంగా ల్యాండ్ అయింది. మే 3వ తేదీన చాంగే-6 నింగికెగిరి దాదాపు 53 రోజుల పాటు ప్రయాణించి జాబిల్లిని చేరింది. జూన్ 2న చంద్రుడి ఆవలి వైపున సౌత్‌ పోల్‌-అయిట్కిన్‌ ప్రాంతంలో ఉన్న అపోలో బేసిన్‌లో సురక్షితంగా దిగింది. ఈ మిషన్ లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అనే నాలుగు భాగాలు ఉన్నాయి. జాబిల్లి ఉపరితలంపై ఉన్న నమూనాలను రోబోటిక్‌ హస్తం సాయంతో సేకరించింది. డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి దిగువన ఉన్న ప్రాంతం నుంచి మట్టిని తీసుకుంది. అనంతరం వాటిని తీసుకుని భూమికి తీసుకొచ్చింది. చాంగే-6 వ్యోమనౌక తీసుకొచ్చిన నమూనాలను 2.5 మిలియన్ ఏళ్ల పురాతన అగ్ని పర్వత శిలలు కూడా ఉండొచ్చని చైనా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

నేడు తెలంగాణలో పాఠశాలల బంద్‌

నేడు తెలంగాణలో పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలునిచ్చింది. ప్రైవేటు స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే పాఠశాలల బంద్‌కు పిలుపునిస్తూ.. అందుకే హైదరాబాద్‌లోని అన్ని పాఠశాలలు మూసివేయనున్నారు. బుధవారం పని చేయని రోజు అని పేర్కొంటూ హైదరాబాద్‌లోని పాఠశాలలు వాట్సాప్ సందేశాల ద్వారా తల్లిదండ్రులకు సెలవు నోటీసులు పంపాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, డీఈవో, ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు పాఠశాలల ఫీజుల పెంపును అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైనందుకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చారు. కార్పొరేట్‌, ప్రైవేట్‌, ఇంటర్నేషనల్‌ పాఠశాలల యాజమాన్యం తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయని, వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు జి జీవన్‌ డిమాండ్‌ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, యూనిఫాంలు విక్రయిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది.

జగ్గయ్యపేటలో ఇంకా అదుపులోకి రాని డయేరియా..

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు. ఆరు రోజులుగా డయేరియా కేసులు ప్రభుత్వాస్పత్రికి వస్తూనే ఉన్నాయి. జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన కొందరు వాంతులు, విరేచనాలతో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ప్రస్తుతం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు పేషేంట్లకు విజయవాడలో చికిత్స అందిస్తున్నారు. కొంత మందికి పరిస్థితి సాధారణమై డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే.. డయేరియా కేసులపై వైద్యాధికారులతో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు. వారం రోజులుగా జగ్గయ్యపేట, నవాబ్ పేట పరిసర ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే వైద్య శిబిరాలు నిర్వహించి పారిశుధ్యం మెరుగుపరచటంపై అధికారులు చర్యలు చేపట్టారు.

కుప్పంలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం.. అన్ని ప్రాంతాలకు సర్వీసులు

చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డీజిల్ రెట్లు తగ్గినా కూడా బస్సు చార్జీలు పెంచిన ఘనత జగన్ ది అని ఆరోపించారు. జగన్ మాటలు ప్రజలు వినే పరిస్థితి లేదని అన్నారు. మరోవైపు.. శాఖల్లో ఏదైనా అవినీతి జరిగి ఉంటే, తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా.. ఏ రాజకీయ సభలకు ఫ్రీగా బస్సులు ఉపయోగించమని అన్నారు. మరోవైపు.. కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. కుప్పం బస్ డిపోలో ఆధునీకరణ పనులు చేపడుతామని తెలిపారు. 5 కొత్త బస్సులను ప్రారంభించామని.. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులు కుప్పం డిపోకు వచ్చాయన్నారు. 5 బస్సులను ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం..?

ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్ బుధవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఢిల్లీలో ఉండగా , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. తన రాజకీయ ప్రత్యర్థి, జగిత్యాల ఎమ్మెల్యే ఎం. సంజయ్‌కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవాలన్న రేవంత్‌రెడ్డి నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డితో పార్టీని, పదవిని వదులుకునే యోచనను వెల్లడించిన తర్వాత భట్టి విక్రమార్క పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న ఇతర రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధుల ఫిరాయింపులను ప్రోత్సహించడంలో ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలపై కూడా పార్టీ నాయకత్వం చర్చించే అవకాశం ఉంది.

విభజన చట్టంలో మిగిలి పోయిన సమస్యలు సాధించాలి

విభజన చట్టంలో మిగిలి పోయిన సమస్యలు సాధించాలన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదని, ఛార్జ్ తీసుకున్న మూడో రోజే నేను తెలంగాణా భవన్ ను పరిశీలించానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. ఢిల్లి లోనిఆంధ్ర భవన్ విభజన పై స్పష్టత వచ్చిందని, హైదారాబాద్ హౌజ్ పక్కన తెలంగాణ భవన్ నిర్మాణం జరగనుందన్నారు. ఇప్పటికే కొన్ని మోడల్స్ పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఫైనల్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. రెండు నెలల్లో డిల్లీలో తెలంగాణ భవన్ కు టెండర్లు పిలుస్తామని, ఢిల్లీలో భవన నిర్మాణాల అనుమతులకు కొంత సమయం పడుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. త్వరగా అనుమతులు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు.

ప్రతిపక్ష స్వరాన్ని అనుమతించండి.. రాజ్యాంగాన్ని రక్షిస్తారని మా నమ్మకం..

లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు. ఈ రోజు జరిగిన స్పీకర్ ఎన్నికల్లో మూజువాణి ఓటులో ఓం బిర్లా గెలుపొందారు. కోటా నుంచి మూడుసార్లు వరసగా ఎన్నికైన ఓం బిర్లా, గత పార్లమెంట్‌లో కూడా స్పీకర్ బాధ్యతలు చేపట్టారు, వరసగా రెండోసారి స్పీకర్ అయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు కలిసి ఓం బిర్లాను స్పీకర్ చైర్ వరకు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. లోక్‌సభ స్పీకర్ ప్రజల గొంతుకకు మధ్యవర్తి అని, గతం కన్నా ఈ సారి ప్రతిపక్ష ఆ స్వరానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ఆయన అననారు. ప్రతిపక్షాలు స్పీకర్ పని చేయడంలో సహకరిస్తాయని, సభ పనిచేయాలని కోరుకుంటున్నామని అన్నారు. సభలో ప్రతిపక్షాల స్వరాన్ని అనుమతించాలని అన్నారు. ‘‘మీరు మమ్మల్ని మాట్లాడేందుకు అనుమతిస్తారనే నమ్మకం ఉంది. ససభను ఎంత సమర్ధవంతంగా నడిపిస్తున్నారనేది ప్రశ్న కాదు. భారతదేశం యొక్క వాణిని ఎంతవరకు వినిపించడానికి అనుమతిస్తున్నారన్నది ప్రశ్న. ప్రతిపక్షాల స్వరాన్ని సైలెంట్ చేయడమనేది అప్రజాస్వామిక ఆలోచన. ఈ ఎన్నికల ద్వారా రాజ్యాంగాన్ని రక్షించాలని ప్రజలు తీర్పు ఇచ్చారు’’ అని అన్నారు. ప్రతిపక్షాలను మాట్లాడటానికి అనుమతించడం ద్వారా, రాజ్యాంగాన్ని రక్షించే మీ కర్తవ్యాన్ని మీరు చేస్తారనే నమ్మకం ఉందని రాహుల్ గాంధీ అన్నారు.

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన జితేందర్ రెడ్డి

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యావాదాలు తెలిపారు. నన్ను నమ్మి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం కల్పించారు, కేబినెట్ ర్యాంక్ ఇచ్చారన్నారు. ఎన్నో పోరాటాలు చేసి, రాష్ట్రాన్ని సాధించుకున్నామని, విభజన చట్టంలో పెట్టిన అంశా పై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు జితేందర్‌ రెడ్డి. కృష్ణా నుంచి రావలసిన నీటి వాటా కూడా రాలేదని, సాగునీరు, త్రాగు నీరు సాధించడం కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ విషయంలో కూడా కేంద్రం చాలా అంశాలను పెండింగ్ లో పెట్టిందని జితేందర్‌ రెడ్డి అన్నారు. కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖల పై ఒత్తిడి తెస్తాం.. ఎన్నో పెండింగ్ సమస్యలు ఉన్నాయని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్నారు. తెలంగాణ ను స్పోర్ట్స్ హబ్ గా తీర్చి దిద్దేందుకు ప్రయత్నం చేస్తామని, ఏపీ నుంచి భవన్ విషయంలో ఎటువంటి అనుమతి అవసరం లేదన్నారు. ఢిల్లి లో తెలంగాణ భవన్ నిర్మాణం కోసం కసరత్తు మొదలైందని, త్వరలోనే ఢిల్లీలో తెలంగాణా కు కొత్త భవనం నిర్మాణం జరుగుతోందన్నారు.

స్పీకర్ ఓం బిర్లాపై ప్రధాని మోడీ ప్రశంసలు..

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ పదవికి ప్రధాని నరేంద్ర మోడీ తన పేరును ప్రతిపాదించారు. ఎన్డీయేలోని అన్ని భాగస్వామ్య పార్టీలు ఆయన పేరుకు మద్దతు పలికాయి. ఆ తర్వాత.. వాయిస్ ఓటు ద్వారా ఈ పదవికి ఎంపికయ్యారు. మరోవైపు.. కాంగ్రెస్ తరుఫు నుంచి ఎంపి కె. సురేష్‌ను లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నుకునే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాగా.. ముజువాణీ ఓటుతో ఓం బిర్లా గెలిచినట్లు ప్రకటించారు. దీంతో.. వరుసగా రెండోసారి స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో.. ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓం బిర్లాను స్పీకర్ కుర్చీలో కూర్చోపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఓం బిర్లాకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రధాని బిర్లాపై ప్రశంసలు కురిపించారు. సభ ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉండేలా చూడడంలో బిర్లా ముఖ్యమైన పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్ల పాటు మీ మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తున్నానని మోడీ తెలిపారు. మీ మధురమైన చిరునవ్వు సభ మొత్తాన్ని సంతోషంగా ఉంచుతుందని ప్రశంసల జల్లు కురిపించారు. మీరు రెండవసారి స్పీకర్ పదవికి ఎన్నిక కావడం గౌరవప్రదమైన విషయం అని బిర్లాను అభినందించారు. 70 ఏళ్ల స్వాతంత్య్రంలో జరగని పనులు మీ అధ్యక్షతన ఈ సభ వల్లే సాధ్యమయ్యాయని ప్రధాని మోడీ అన్నారు. కీలక బిల్లులు మీ నాయకత్వంలో ఆమోదం పొందాయని.. ప్రజాస్వామ్య సుదీర్ఘ ప్రయాణంలో అనేక మైలురాళ్లు వచ్చాయని తెలిపారు. 17వ లోక్‌సభ సాధించిన విజయాల గురించి దేశం గర్విస్తుందని తనకు చాలా నమ్మకం ఉందని స్పీకర్ ఓం బిర్లాపై పొగడ్తలతో ముంచెత్తారు.