NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @1pm

Top Headlines @1pm

పాకిస్థాన్‌లో కలకలం రేపుతున్న కాంగో వైరస్..

పాకిస్థాన్‌లో కాంగో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. క్వెట్టా నుంచి తాజాగా మరో కొత్త కాంగో వైరస్ కేసు నమోదైంది. 32 ఏళ్ల రోగి ఫాతిమా జిన్నా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేరారు. ఇప్పుడు వైద్య సంరక్షణలో ఉన్నారు. పాక్ కి చెందిన ఓ న్యూస్ ఛానెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. రోగి పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని కిలా సైఫుల్లా జిల్లా కిలా సైఫుల్లా నగరంలో నివాసి అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఇప్పటివరకు పాకిస్థాన్‌లో కాంగో వైరస్‌ సోకిన 13వ కేసు ఇది. ఈ సంవత్సరం వైరస్ సోకిన ఓ రోగి కూడా ప్రాణాలు కోల్పోయాడు.

జూడాలకు సర్కార్ గుడ్ న్యూస్.. స్టైఫండ్‌ విడుదల చేసిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ రెసిడెన్స్‌ వైద్యులు, మెడికల్‌ కాలేజీ, పారమెడికల్‌ వాళ్లకు 2024-25కి సంబంధించిన స్టైఫండ్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.406 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఏడాదికి సరిపడా స్టైఫండ్‌ ను ముందే విడుదల చేస్తున్నట్లు సర్కార్‌ ప్రకటించింది. సమ్మెను విరిమించుకోవాలని తెలిపింది. 2024-25 సంవత్సరానికి గాను స్టెఫెండ్ ను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పూర్తి చేసే దిశగా పూర్తి ప్రణాకంగా వ్యవహరించి వెల్లడిస్తామని తెలిపారు.

అత్యాచార బాధితురాలు ఈశ్వరమ్మను పరామర్శించిన భట్టి విక్రమార్క..

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెందిన చెంచు గిరిజన మహిళ ఈశ్వరమ్మ పై జరిగిన అత్యాచారం ఘటన అమానవీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఉదయం నిమ్స్ హాస్పిటల్ లో బాధితురాలు ఈశ్వరమ్మను కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన స్థానికంగా మంత్రి జూపల్లితో కలిసి మీడియాతో మాట్లాడారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు తలదించుకునే ఘటన ఇది అని పేర్కొన్నారు. యావత్ సమాజం తీవ్రంగా ఖండించాల్సిన అంశం ఇది అన్నారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు బాధితురాలను నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారని, మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి సైతం తరలించారని వివరించారు. ఘటన విషయాన్ని మంత్రి జూపల్లి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు ఈశ్వరమ్మ తిరిగి పూర్తిగా ఆరోగ్యంతో కోలుకునే వరకు ఉచితంగా ప్రభుత్వం వైద్య సహాయం అందిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు.


మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్‌

మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా నారా లోకేష్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించి, మెగా డీఎస్సీ నిబంధనల తొలి ముసాయిదాపై సంతకం చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లోని 208వ నంబర్‌ గదిలోకి లోకేష్‌ ప్రవేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన ఐదు ఫైళ్లను పరిశీలించేందుకు మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ సంతకం చేసి, సోమవారం సమావేశం కానున్న మంత్రివర్గానికి పంపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


ఇవాళ టీజీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు..

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి బోర్డు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఇప్పటికే మూల్యాంకాన ప్రక్రియ పూర్తయ్యింది. సాంకేతికపరమైన అంశాలను పరిశీలన సైతం పూర్తవ్వడంతో ఇవాళ మధ్యహ్నం 2గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇక.. ఫలితాలకోసం www://tgbie.cgg.gov.in, http://results.cgg. gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలని సూచించారు.

ప్రారంభమైన ఏపీ కేబినెట్‌ సమావేశం

ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. సూపర్‌-6 పథకాల అమలుపై కేబినెట్‌ చర్చించనుంది. పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే.. చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాల ఫైళ్లను ఆమోదించనుంది కేబినెట్‌. అన్న క్యాంటీన్లకు ఇప్పటికే రూ. 164 కోట్ల కేటాయింపు. వచ్చే నెలలో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించే అంశంపై కేబినెట్లో చర్చ జరుగనుంది. హామీ మేరకు పెంచిన పెన్షన్లను వచ్చే నెల నుంచి అమల్లోకి తేనున్న ఏపీ ప్రభుత్వం. రూ. 4 వేల పెన్షనుతో పాటు పెండింగులో ఉన్న రూ. 3 వేలను పంపిణీ చేయనుంది.

సైదాబాదులో పోలీసుల కాల్పులు.. అదుపులో చైన్‌ స్నాచర్‌..

చైన్ స్నాచర్లపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఒక వైపు హత్యలు, ఆత్మహత్య, మరో వైపు దొంగతనాలతో నగరం అట్టుడుకింది. వారం రోజుల్లోనే 7 హత్యలు 2 హత్యా యత్నాలు జరగడంతో రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. గల్లీ..గల్లీలో తనిఖీలు చేస్తున్నారు. అనుమాతులను ప్రశ్నిస్తూ ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలుపుతున్నారు. అయితే సైదాబాద్ లో చైన్ స్నాచర్లు, పోలీసుల దాడి సంచలనంగా మారింది. స్నాచర్లను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరుపుతున్నారు.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్‌ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సోమవారం తన మొదటి సమావేశాన్ని ప్రారంభించింది, ఎన్నికల హామీలను నెరవేర్చడం, అమరావతి రాజధాని ప్రాజెక్టు పునఃప్రారంభం, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు, పెరిగిన సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ వంటి పెద్ద అంశాలు చర్చకు వచ్చాయి. అమరావతిలోని వెలగపూడిలోని సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఐదు ఫైళ్లపై సంతకం చేయగా, ఈ ఫైళ్లలో మెగా డీఎస్సీ, భూ పట్టాదారు చట్టం రద్దు, పెన్షన్ మొత్తాన్ని రూ.4,000కు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్, ఈ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డీఎస్సీ షెడ్యూల్‌ను అధికారులు మంత్రివర్గం ముందు ఉంచడంతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను సమావేశంలో ఆమోదించారు. ఈ ప్రక్రియ జూలై 1న ప్రారంభమై 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన షెడ్యూల్ డిసెంబర్ 2024 నాటికి ముగుస్తుంది. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేందుకు శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.

రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించిన ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్

కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి రాహుల్ గాంధీ చేసిన రాజీనామా ఆమోదం పొందింది. సోమవారం 18వ లోక్‌సభ మొదటి సెషన్ ప్రారంభంలో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఈ సమాచారాన్ని అందించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల నుంచి గెలిచారు. రెండింటిలో ఆయన రాయ్‌బరేలీ నుంచే కొనసాగాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కేరళలోని వయనాడ్‌ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. రాహుల్‌ గాంధీ రాజీనామాను ఆమోదించినట్లు లోక్ సభ సెక్రటేరియట్‌ ప్రకటించింది. ఈ మేరకు బులిటెన్‌ విడుదల చేసింది. రాహుల్‌ వయనాడ్‌, రాయ్‌బరేలీ.. ఈ రెండు స్థానాల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారని, వయనాడ్‌ ఎంపీగా ఆయన చేసిన రాజీనామాకు ఆమోదం లభించినట్లు పేర్కొంది.

రాజమండ్రి మీదుగా నడిచే 26 రైళ్లు రద్దు

నేటి నుండి రాజమండ్రి మీదుగా నడిచే 26 రైళ్లను 45 రోజులపాటు రద్దు చేశారు. రైల్వే అధికారులు రద్దు చేసిన వాటిలో రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ సహా ప్రయాణికులు డిమాండ్ ఉన్న రైళ్లు ఉన్నాయి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం – నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు చేపడుతున్న కారణంగా రైళ్లు రద్దు చేశారు. రద్దు చేసిన వాటిలో రత్నాచల్, జన్మభూమి , సింహాద్రి , సర్కార్ ఎక్స్‌ప్రెస్ సహా డిమాండ్ ఉన్న రైళ్లను అధికారులు రద్దు చేశారు. దీంతో విజయవాడ , విశాఖ , తిరుపతి , హైదరాబాద్ వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందులు కలగనున్నాయి. ఆకస్మికంగా రైళ్ల రద్దు చేయడంపై రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు మండిపడుతున్నారు. ఒక్క రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ప్రతి రోజూ 30 వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ప్రత్యామ్నాయంగా ఇంటర్ సిటీ రైళ్లు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రైళ్ల రద్దు సమస్యపై స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.