నేడు భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన.. పార్టీ నేతలతో కీలక భేటీ
నేడు భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం మంగళగిరి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 10 గంటలకు భీమవరం చేరుకోనున్నారు. అక్కడ తొలుత తోట సీతారామలక్ష్మీతో ఆయన సమావేశం కానున్నారు. మర్యాదపూర్వకంగానే ఆమెను కలుసుకుని ప్రస్తుత రాజకీయాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను కూడా పవన్ కలవనున్నారు. వీరిద్దరితో మర్యాదపూర్వకంగానే జనసేనాని భేటీ అవుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి!
బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం తెల్లవారుజామున రామ్‌గఢ్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లఖిసరాయ్ సమీపంలోని ఝూల్నా గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
బుధవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న టెంపోను రాంగ్ సైడ్ నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ టెంపో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నేడు మేడారం జాతరలో కీలక ఘట్టం..
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు అట్టహాసంగా ప్రారంభమైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జాతర కొనసాగనుంది. జాతరలో ముఖ్య ఘట్టమైన పగిడిద్దరాజు, గోవిందరాజులు నేడు గద్దెలపైకి రానున్నారు. అంతేకాకుండా.. మధ్యాహ్నం కన్నెపల్లి నుంచి గద్దెపైకి సారలమ్మను తీసుకురానున్నారు. అయితే.. మేడారం జాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మేడారం జాతరకు 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది టీఎస్‌ఆర్టీసీ. ఇవాళ సమ్మక్క కూతురైన సారలమ్మ సాయంత్రం 4 గంటలకు గద్దెపై కొలువు దీరనుంది. సారలమ్మతో పాటు, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెపైకి చేరుకుంటారు. సంప్రదాయబద్దంగా ఆదివాసి, గిరిజన పూజారులు ఈ అమ్మవారిని గద్దెలపైకి తొడ్కొని రానున్నారు. ఇక ఫిబ్రవరి 22న చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి రానుంది. ఫిబ్రవరి 23న గద్దెలపై కొలువుదీరని తల్లులకు పూజలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 24న దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి.
సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయనిపుణుడు నారిమన్ కన్నుమూత..
ప్రఖ్యాత న్యాయనిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ ఇవాళ ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. నారిమన్‌కు న్యాయవాదిగా 70 ఏళ్లకు పైగా పని చేసిన అనుభవం ఉంది. నారిమన్ 1950లో తొలుత బాంబే హైకోర్టు నుంచి న్యాయవాద వృత్తిని స్టార్ట్ చేశారు. 1961లో సీనియర్ అడ్వకేట్‌గా ఎన్నికయ్యారు. 70 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిని ఆయన చేపట్టారు. 1972లో సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తిని ఆరంభించారు. ఆ తర్వాత ఆయన భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమకం అయ్యారు. నారిమన్ తన విశేష కృషికి జనవరి 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ అవార్డులను కూడా అందుకున్నారు.
అణగారిన వర్గాల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి సర్కారు తీరని అన్యాయం చేస్తోంది
మరోసారి రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శనాస్త్రాలు సంధించారు. అణగారిన వర్గాల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి సర్కారు తీరని అన్యాయం చేస్తోందని, ఇటీవల జారీ చేసిన గ్రూప్ – 1 నోటిఫికేషన్ లో రోస్టర్ పాయింట్లు లేని హారిజంటల్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. దీని వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు ఉద్యోగావకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆమె మండిపడ్డారు. రోస్టర్ పాయింట్లు లేకుండా అసలు మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్ల కల్పించగలరా ? 546 గ్రూప్ -1 పోస్టుల్లో మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయించారు ? అని ఆమె ప్రశ్నించారు. రోస్టర్ పాయింట్లను రద్దు చేస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని ఆమె తెలిపారు. పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేసి మహిళల ప్రయోజనాలను, హక్కులను ప్రభుత్వం కాపాడాలని ఆమె ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ చేశారు.
ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం.. పోలీసుల పటిష్ట భద్రత
ఢిల్లీలో రైతులు మళ్లీ పోరుబాట పడుతున్నారు. మొత్తం 23 వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ఛలో చేపట్టేందుకు రెడీ అయ్యారు. శాంతియుతంగా దేశ రాజధానికి పాదయాత్ర కొనసాగిస్తామని రైతులు చెబుతున్నప్పటికీ.. అందుకు ఏమాత్రం అనుకూల పరిస్థితులు కనిపించట్లేదు.. రైతులను అడ్డుకునేందుకు మూడు అంచెల వ్యవస్థతో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. దీంతో ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక, కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో నాలుగు సార్లు చర్చలు చేసింది. అయితే నాలుగో విడత చర్చల్లో.. పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తికి ఐదేళ్ల పాటు కనీస మద్దతు ధర ఒప్పందం చేసుకుంటామని కేంద్ర సర్కార్ ప్రతిపాదించింది. అయితే, అన్ని పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీ కల్పించాల్సిందేనని రైతు సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. దీంతో చర్చలు విఫలం కావడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. ఇక, ఢిల్లీ వైపు వెళ్లే.. పంజాబ్ – హర్యానా సరిహద్దు దగ్గర రైతులను పోలీసులు నిలువరిస్తున్నారు. ఒకవైపు సిమెంట్ కాంక్రీట్ దిమ్మెలతో పాటు ముళ్ల కంచెలతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. చిత్తూరులో వైసీపీ మూకల దాడిలో వితంతు మహిళ కంటిచూపు కోల్పోవడం బాధాకరం అని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతియుగంలోకి వెళ్లిపోయింది అని విమర్శలు గుప్పించారు. అసమ్మతి గళాలపై దాడులను, అరాచకాన్ని ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. వైసీపీ రౌడీ మూకలకు అడ్డే లేకుండా పోయింది.. తెలుగుదేశం నేతలకు తన సమస్య చెప్పిన పాపానికి దాడి చేసి ఒక వితంతు మహిళ కంటి చూపు పోయేలా చేశారన్నారు. భర్త లేకున్నా.. దివ్యాంగుడైన కొడుకుతో జీవితాన్ని గడుపుతున్న ఒక పేద మహిళపై ఇంతటి దాష్టీకమా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ కృషితో.. 18 ఏళ్లకు స్వదేశానికి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పట్టువదలని కృషితో… 18 ఏండ్ల జైలు జీవితం అనంతరం దుబాయ్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు. అందరికీ విమాన టిక్కెట్లు సమకూర్చిన మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. ఆగని కన్నీళ్లు… 18 సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. 18 సంవత్సరాలుగా జైల్లో 5 గురు జిల్లా వాసులు మగ్గుతున్నారు. రెండు నెలల క్రితం దుబాయ్ జైల్ నుండి కోనరావుపేట మండలానికి చెందిన దండుగుల లక్ష్మణ్ విడుదల కాగా.. మరొకరు రెండు రోజుల క్రితం రుద్రంగి మండలం మనాల గ్రామానికి చెందిన శివరాత్రి హన్మంతు విడుదలై ఇంటికి చేరుకున్నాడు. దుబాయ్ కోర్టు క్షమాభిక్షతో ఇంటి బాట పడుతున్నారు జిల్లా వాసులు. ఇవాళ పెద్దూర్ గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశం, రవి అనే ఇద్దరు అన్నదమ్ములు విడుదలై ఇంటికి చేరుకున్నారు. చందుర్తి మండలానికి చెందిన మరో వ్యక్తి వెంకటేశ్ వచ్చే నెలలో విడుదల కానున్నాడు.
డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..
డీఎస్సీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎస్‌జీటీ పోస్టుల పరీక్షకు బీఈడీ అభ్యర్థులను అనుమతించమని న్యాయస్థానం ముందు ప్రభుత్వం తరపున లాయర్ తమ వాదనను వినిపించారు. దీంతో విచారణను ఎనిమిది వారాల పాటు విచారణ వాయిదా వేస్తూ ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఎస్టీజీ పోస్టుల భర్తీలో బీఈడీ అభ్యర్థులను అనుమంతిచే విషయంలో హైకోర్టు స్టే ఇచ్చింది. కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఇందులో బీఈడీ అభ్యర్థులు కూడా ఎస్‌జీటీ పోస్టులకు అర్హులేనని ప్రకటించడంతో కోర్టును ఆశ్రయించారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను ఎలా అనుమతిస్తారంటూ కొందరు పిటీషన్ వేయడంతో దీనిపై విచారించిన హైకోర్టు దానిపై స్టే ఇచ్చింది.
అనుభవం, సమర్ధత లేకుండా బటన్ నొక్కితే నాశనం తప్పదంటూ నాగబాబు ట్వీట్
సీఎం జగన్ చేస్తోన్న బటన్ కామెంట్లపై జనసేన నేత నాగబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. అనుభవం, సమర్ధత లేకుండా బటన్ నొక్కితే నాశనం తప్పదంటూ ఓ పిట్ట కథను ఆయన ట్వీట్ చేశారు. జగనుకు రెండోసారి అవకాశమిస్తే రాష్ట్రం సర్వనాశనం అనే అర్థం వచ్చేలా ఆయన పేర్కొన్నారు. ఈరోజు మీతో ఒక పిట్ట కథ పంచుకోవాలనిపించింది అని నాగబాబు ట్వీట్ లో తెలిపారు. ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు.. అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్లో, ‘విమానం నడపడం ఎలా?’ అన్న పుస్తకం కనపడింది.. అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు.. మొదటి పేజీలో ‘విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి’ అని ఉంది.. అతడు అది నొక్కాడు.. విమానం ఇంజన్ స్టార్ట్ అయింది.. అతడికి ఆసక్తి పెరిగింది.. రెండో పేజీ తిప్పాడు.. విమానం కదలాలంటే ‘పచ్చ బటన్ నొక్కండి’ అని ఉంది.. అతడు నొక్కి చూసాడు.. విమానం కదిలింది.. అతడు మరింత ఆసక్తిగా మూడో పేజీ తెరిచాడు.. విమానం వేగం అందుకోవాలంటే నీలం బటన్ నొక్కండి’ అని ఉంది.. అతడు నీలం బటన్ నొక్కాడు.. విమానం వేగం అందుకుంది.. అతడు మరింత ఉత్సాహంగా నాలుగో పేజీ తిప్పాడు.. విమానం గాలిలోకి ఎగరాలంటే ఆరెంజ్ బటన్ నొక్కండి’ అని ఉంది.. అతడు ఆరంజ్ బటన్ నొక్కాడు.. విమానం గాల్లోకి లేచింది.. యమా వేగంగా గాల్లో తేలుకుంటూ పోతున్న విమానంలో ఉన్న అతను ఐదో పేజీ తిప్పాడు.. విమానం కిందకు దిగాలంటే ‘ఈ పుస్తకం 2వ వాల్యూమ్ ‘ కొనండి’ అని ఉంది.. ఇందులో నీతి ఏంటంటే విమానం అయినా.. అధికారం అయినా.. ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే.. సర్వ నాశనం కాక తప్పదు.. అలాగే, నడపడం అంటే బటన్ నొక్కడమే కాదు.. సమర్ధత అనుభవం కూడా ఉండాలి అని నాగాబాబు పేర్కొన్నారు.
