NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

విద్యార్థులకు అలర్ట్‌.. తెలంగాణలో రెండు రోజులు విద్యాసంస్థలు బంద్‌

తెలంగాణలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల 72గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ ప్రకటించింది. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో వచ్చే మూడు రోజుల కుండపోత వానలు ఉండనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

పర్యాటకులకు గుడ్ న్యూస్..14 జలపాతాల పై నిషేధం ఎత్తివేత..

గోవా ప్రభుత్వం ఇటీవలి ఉత్తర్వులను సవరించడం ద్వారా రాష్ట్రంలోని వన్యప్రాణుల అభయారణ్యం లోపల ఉన్న 14 జలపాతాలను సందర్శించడానికి అనుమతించింది. దక్షిణ గోవా జిల్లాలోని మైనాపి జలపాతంలో ఇద్దరు వ్యక్తులు మునిగిపోవడంతో జలపాతాలు, వన్యప్రాణుల అభయారణ్యాల పరిసరాల్లోకి సందర్శకుల ప్రవేశాన్ని అటవీ శాఖ గత వారం నిషేధించింది. దక్షిణ గోవా జిల్లాలోని మైనాపి జలపాతంలో ఇద్దరు వ్యక్తులు మునిగిపోవడంతో జలపాతాలు, వన్యప్రాణుల అభయారణ్యాల పరిసరాల్లోకి సందర్శకుల ప్రవేశాన్ని అటవీ శాఖ గత వారం నిషేధించింది.

దీంతో పర్యాటక అప్పటి నుంచి గోవాకు పర్యాటకుల సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు.. ఈ క్రమంలో మంగళవారం, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్డర్‌ను సవరించారు, సత్తారి (ఉత్తర గోవా జిల్లా), ధర్‌బండోరా, సంగూమ్, కెనకోనా తాలూకాలలో (అన్నీదక్షిణ గోవాలో) 14 తక్కువ ప్రమాదాలు కలిగిన లోతు లేని జలపాతాలను పర్యాటకులు సందర్శించడానికి ప్రభుత్వం అనుమతించారు..

మణిపూర్‌ హింసపై ఇండియా మౌనంగా ఉండదు..

మణిపూర్‌లో జరుగుతున్న హింస దారుణమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్‌ ఘటనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఘర్షణలు చోటుచేసుకుంటే.. ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) మౌనంగా ఉండదని అన్నారు. మణిపూర్‌ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడంతో పాటు ఈశాన్య రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న హింసాకాండపై రాహుల్ గాంధీ స్పందించారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ఆ అంశంపై ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ ట్వీట్‌లో ప్రధానమంత్రి మౌనం.. నిష్క్రియాత్మకత మణిపూర్‌ను అరాచకం వైపు నెట్టిందని.. మణిపూర్‌లో చోటుచేసుకుంటున్న ఘర్షణలపై ఇండియా మౌనంగా ఉండదన్నారు. మణిపూర్ ప్రజలకు మేం అండగా ఉంటాం. శాంతి ఒక్కటే ముందున్న మార్గమని మణిపూర్‌లో కుల హింస ఇప్పుడు ‘అరాచకం’గా మారిందని.. మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు.

తలపాగా కట్టడంలో రెండు గిన్నిస్ రికార్డులు.. మూడో దానికోసం సన్నాహాలు 

మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌కు చెందిన ఓ యువకుడు ఏడాది వ్యవధిలో తన పేరిట రెండు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేసుకున్నాడు. ఈ రెండు రికార్డుల్లో ఒక రికార్డు అత్యంత వేగవంతమైన తలపాగా కట్టినందుకు, మరొకటి అతిపెద్ద శిరోభూషణా(తలపాగా)నికి సంబంధించినది. బేతుల్‌లో నివాసముండే ఆదిత్య పచౌలీ అనే వ్యక్తి వృత్తిరీత్యా లాయర్‌. తన వృత్తి కొనసాగిస్తూనే 15 ఏళ్లుగా తలపాగా కట్టే పని కూడా చేస్తున్నాడు. చాలా మంది ఇలా తలపాగా కట్టుకుంటారు కానీ, క్షణాల్లో తలపాగా కట్టేయగలగడం ఆదిత్యలో ఉన్న స్పెషాలిటీ. తలపాగా కట్టడంలో అతడికి నగరంలో మంచి పేరుంది. ఆదిత్య పచౌలీ తన నైపుణ్యాన్ని, కళను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ఓ అడుగు వేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం ప్రయత్నించాడు. ఆదిత్య పచౌలీ ఇటీవలే అత్యంత వేగంగా హెడ్‌డ్రెస్‌ను కట్టి రికార్డు సృష్టించాడు. ఫిబ్రవరి 22, 2022న, అతను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో అత్యంత వేగంగా శిరస్త్రాణం కట్టిన రికార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీని కోసం ప్రయత్నించడానికి వారికి మార్చి 26న తేదీ ఇవ్వబడింది. అదే రోజు ఛత్రపతి శివాజీ ఆడిటోరియంలో ఆదిత్య కేవలం 14 సెకన్ల 12 మైక్రో సెకన్లలో ఒక వ్యక్తి తలపై తలపాగా కట్టాడు.

హైదరాబాద్ ట్రాఫిక్ ను చూసి అసహనం వ్యక్తం చేసిన హాట్ బ్యూటీ..

డింపుల్ హయాతి..ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన అందంతో తెలుగులో మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ భామ. అయితే  ఈ భామ రీసెంట్ గాహైదరాబాద్ ట్రాఫిక్ లో ఇరుక్కుంది. ఆ ట్రాఫిక్ చూసి అసహనం వ్యక్తం చేసింది.ట్రాఫిక్ డీసీపీ ఎక్కడంటూ ప్రశ్నించింది. ఏకంగా మంత్రి కేటీఆర్ మరియు తెలంగాణా సీఎంఓ అకౌంట్స్ ని ట్యాగ్ చేస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ చాలా దారుణంగా ఉందంటూ ట్వీట్ చేసింది.డింపుల్ హయాతీ డేరింగ్ చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. డింపుల్ ట్రాఫిక్ జామ్ పై ఇంత డేరింగ్ గా మాట్లాడటానికి ఒక కారణం కూడా ఉంది.. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో డింపుల్ కి మధ్య రీసెంట్ గా ఒక వివాదం నడిచిన విషయం తెలిసిందే.ఆయన్ని టార్గెట్ చేస్తూ డింపుల్ ఈ తరహా ట్వీట్ చేశారనీ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి..డీసీపీ రాహుల్ హెగ్డే కారణంగా డింపుల్ హయాతీ, ఆమె ప్రియుడు చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటుంది.పార్కింగ్ ఏరియాలో ఉన్న తన కారును తన్నడంతో పాటు డ్రైవర్ ని కూడా దూషించిందంటూ రాహుల్ హెగ్డే డింపుల్ హయాతీ మీద కేస్ బుక్ చేశాడు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.

డ్రగ్స్‌ కేసులో హీరోయిన్‌కు ఊరట..

బాలీవుడ్‌ సినీ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతికి సంబంధించిన డ్రగ్స్‌ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి బెయిల్‌పై ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్ పై చర్చలు జరిగాయి.. రియాకు మంజూరైన బెయిల్‌ను సవాలు చేయడం లేదని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇదీ ఆమెకు ఓ రకంగా శుభవార్తనే చెప్పవచ్చు. అయితే.. ఆమెపై ఇప్పటికే ఉన్న నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టంలోని సెక్షన్ 27-ఎకి సంబంధించిన చట్టాన్ని తెరిచే ఉంచాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనానికి తెలిపారు. NCB రియా చక్రవర్తిపై అక్రమ మాదకద్రవ్యాలతో పాటు అక్రమ రవాణాకు సంబంధించి ఫైనాన్సింగ్ చేయడమే కాకుండా అలాంటి వారికి ఆశ్రయం కల్పించడం వంటి వాటికి సంబంధించిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టంలోని కఠినమైన సెక్షన్ 27-ఎ కింద అభియోగాలు మోపింది. ఇది గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు బెయిల్ మంజూరుపై నిషేధాన్ని కలిగి ఉంటుంది. అయితే.. చక్రవర్తి కేసులో డ్రగ్స్‌కు సంబంధంచి ఆమె ఫైనాన్సింగ్ లేదా ఆశ్రయం కల్పించినట్లు ఆధారాలు లేనందున సెక్షన్  27-A వర్తించదని హైకోర్టు పేర్కొంది.

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10 లోకి రోహిత్ శర్మ

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్ట్ బ్యాటర్ల కొత్త ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఈసారి కూడా అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమయ్యాడు.. అతని ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది.. ఇక ఆస్ట్రేలియాకు చెందిన ఎడమచేతి వాటం బ్యాటర్‌ ట్రావిస్ హెడ్ ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్, ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్‌లను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు. అలాగే ఈసారి టాప్ టెన్ లో చోటు దక్కించుకోవడంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే… భారత్‌ నుంచి హిట్‌మన్‌ మినహా మరే బ్యాటర్‌ టాప్-10లో కనిపించలేదు. ఇటీవల అరంగేట్రంలోనే విండీస్‌పై సెంచరీ సాధించిన యంగ్‌ సెన్సేషన్‌ యశస్వి జైస్వాల్‌ ఐసీసీ ర్యాంకిగ్స్ లో 73వ ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు.. రెండో స్థానంలో ఉన్న ప్యాట్ కమిన్స్ కేవలం 828 పాయింట్లతోనే ఉండటం గమనార్హం. డొమినికా టెస్టులో ఫర్వాలేదనిపించిన రవీంద్ర జడేజా కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మూడు స్థానాలు ఎగబాకిన అతను 779 రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఏడాదికిపైగా ఆటకు దూరంగా ఉంటున్న జస్‌ప్రీత్ బుమ్రా పదో స్థానంలో ఉన్నాడు.

జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ!

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్‌.. గురువారం ఉదయం నడ్డాతో భేటీ అయ్యారు. గంటకు పైగా కొనసాగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎన్నికలకు సమాయత్తం అవ్వాల్సిన వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను కూడా నడ్డా దృష్టికి పవన్ తీసుకెళ్లినట్టు సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మంగళవారం ఎన్‌డీఏ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. బుధవారం కేంద్ర మంత్రులు అమిత్‌ షా, మురళీధరన్‌తో పవన్ సమావేశం అయ్యారు. 25 నిమిషాల ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, సీఎం వైఎస్ జగన్‌ వ్యవహారంపై చర్చలు సాగించినట్లు తెలిసింది. పవన్ ఢిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ బయలుదేరారు.

అవసరమైతేనే ప్రజలు బయటకు వెళ్లండి.. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్‌ఎఫ్ టీంలు

గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు హైదరాబాద్‌ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లింగంపల్లి నుండి గచ్చి బౌలి వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో ఈ దారి గుండా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. వర్షపు నీరును అంచనా వేయకుండా కారు డ్రైవర్ ఈ దారి గుండా వర్షపు నీరులోకి వెళ్లడంతో బ్రిడ్జి కింద వర్షపు నీరులో కారు చిక్కుకు పోయింది. కార్ డ్రైవర్ కేకలు విన్న స్థానికులు జీహెచ్‌ఎంసీ సిబ్బంది వర్షపు నీటిలో నుండి కార్ డ్రైవర్ ప్రాణాలు కాపాడారు.. అయితే.. నగరంలో కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గోషామహల్ నియోజకవర్గంలోని నిజం కాలేజీ,ఉస్మాన్ గంజ్, మహరాజ్ గంజ్ , తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ బురదతో పెరుకుపోయాయి. పటేల్ నగర్ లోని సాయి కృష్ణ అపార్ట్ మెంట్ లోనికి మోకాళ్ళ లోతు నీరు చేరడంతో అపార్ట్ మెంట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.

మణిపూర్ ఘటనపై ప్రధాని మోడీ ప్రకటన.. దోషులను వదిలే ప్రసక్తే లేదు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మణిపూర్‌లో జరిగిన దారుణ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. ఇది 140కోట్ల మంది భారతీయులు సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటనగా అభివర్ణించారు. మణిపూర్‌లో జరిగిన ఘటన వల్ల తన గుండెల్లో బాధ, కోపం ఉందని ప్రధాని మోడీ తెలిపారు. నాగరిక సమాజంలో ఇలాంటి ఘటనలకు స్థానం లేదన్నారు. ఈ దారుణానికి పాల్పడిన దోషులను వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. శాంతిభద్రతలను పటిష్టంగా ఉంచాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మహిళల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోమని కోరారు. రాజస్థాన్ లేదా ఛత్తీస్‌గఢ్, మణిపూర్ లేదా దేశంలోని మరే ఇతర మూలలో జరిగిన సంఘటన అయినా, రాజకీయాలకు అతీతంగా పోరాడాలన్నారు. మణిపూర్ క్రూరత్వాన్ని సుప్రీం కోర్టు గుర్తించింది. దోషులను శిక్షించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్రాన్ని, మణిపూర్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేంద్రం, రాష్ట్రం తీసుకున్న చర్యలను కోర్టుకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇంతలో, మణిపూర్ సిఎం ఎన్ బీరెన్ సింగ్ ట్వీట్ చేసిన వెంటనే, వీడియో బయటపడిన వెంటనే, మణిపూర్ పోలీసులు ఈ సంఘటనను స్వయంచాలకంగా తెలుసుకుని చర్యకు దిగారు. ఈ ఉదయం మొదటి అరెస్టు చేశారు. ఈ విషయం ప్రస్తుతం విచారణలో ఉంది. దోషులందరిపై మరణశిక్ష విధించే అవకాశంతో సహా కఠిన చర్యలు తీసుకునే వీలున్నట్లు తెలుస్తోంది.

అంతకంతకు పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతుంది. గోదావరి పరివాహక ప్రాంతంలోని మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతంలో కురిసిన వర్షాలు వల్ల గోదావరి పెరుగుతుంది .ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 41 అడుగులకు చేరుకుంది. ఇది మరింత పెరుగుతే 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక చారి చేస్తారు. అయితే ప్రస్తుతం భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇప్పటికే అలర్ట్ అయ్యారు. గోదావరి వరదలు ఎదుర్కొనేందుకు కోసం అధికారులు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. మళ్ళీ గోదావరి కి ఎంత మేరకు వరదలు వస్తాయనేది ఇప్పటికిప్పుడు స్పష్టంగా చెప్పలేమని అధికారులు చెబుతుంది. ప్రస్తుతం ఉన్న వరద స్పీడ్ గా దిగువకు వెళ్లిపోవడంతో ఎటువంటి ప్రమాదం ఉండకపోవచ్చని అధికార యంత్రం భావిస్తుంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీకి పోటెత్తిన వరద

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజులకు వరద పోటెత్తింది. కాళేశ్వరం వద్ద జలకళ సంతరించుకుంది. మహారాష్ట్ర నుంచి తరలివస్తున్న ప్రాణహిత నది వరదతో గోదావరి పోటెత్తింది. మహారాష్ట్రలో ఎగువన గడ్చిరోలి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి 10.090 మీటర్ల ఎత్తుకు నీటిమట్టం పెరిగింది. వరదనీరంతా దిగువకు మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీకి వెళ్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లక్ష్మీపంపుహౌస్లో వర్షాల కారణంగా మోటార్లను సీఎంవో కార్యాలయం ఆదేశాలతో ఇంజనీరింగ్ అధికారులు నీటి పంపింగ్ నిలిపివేశారు. ఈనెల 3 నుంచి మంగళవారం రాత్రి వరకు నీటిని ఎత్తిపోశారు. ఇప్పటి వరకు 16 రోజుల్లో అన్నారం(సరస్వతీ) బ్యారేజీకి 9 టీఎంసీల నీటిని గ్రావిటీకాల్వ ద్వారా తరలించారు.