NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

వైఎస్ విజయమ్మను కించపరిచారు.. ముక్కు నేలకు రాసి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
టీడీపీ అధినేత చంద్రబాబు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.. చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ది తప్పుడు పుట్టుక అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.. వైఎస్ విజయమ్మ ను చంద్రబాబు కించపరిచారు.. చంద్రబాబు కడుపుకు అన్నం తింటున్నారు? లేదంటే ఇంకేమైనా తింటున్నారా…? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబును మహిళా లోకం క్షమించదన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ.. ముక్కు నేలకు రాసి చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌.

ఉప్పొంగిన కట్టలేరు వాగు.. ఆంధ్ర-తెలంగాణ మధ్య రాకపోకలు బంద్…
అటు ఆంధ్రప్రదేశ్‌, ఇటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసాయి.. దీంతో.. కుంటలు, కాలువలు, నదులు ఉప్పొంగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు రహదారులపైకి చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు దగ్గర కట్టలేరు వాగు పొంగిపొర్లుతోంది.. దీంతో.. రహదారి పైకి భారీగా చేరింది వరద నీరు. దాని ప్రభావంతో.. ఆంధ్ర – తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.. తెలంగాణలో రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో ఉన్న వీరులపాడు మండలానికి రాకపోకలు బంద్ అయ్యాయి.. అసంపూర్తిగా బ్రిడ్జి నిర్మాణం ఉండటం వల్ల ప్రతిసారి వరద వచ్చినప్పుడల్లా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి.. రెండు మండలాల ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.. వీలైనంత త్వరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరోసారి శ్రీవారి ఆలయం మీదుగా విమానం..
కొలిచినవారి కొంగు బంగారంగా భక్తులు విశ్వసించే కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది.. శ్రీవారి ఆలయం మీదుగా తరుచూ విమానాలు ఎగురుతూనే ఉండగా.. ఇవాళ కూడా ఆలయ గోపురం మీదుగా మరోసారి ప్రయాణించింది విమానం.. ఆలయం మీదుగా విమానాలు ఎగరకుండా చూడాలంటూ రేణిగుంట విమానాశ్రయం అధికారులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.. దీనికి తోడు.. తిరుమల నో ప్లై జోన్‌ కాదంటూ ఎయిర్‌ ట్రాఫికింగ్‌ అధికారులు చెబుతున్నారు.. ఎయిర్‌ ట్రాఫిక్‌ పెరిగితే.. తిరుమల మీదుగా విమాన ప్రయాణం తప్పదు అన్నట్లుగా ఏటీసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. అయితే, తరచూ విమానాలు శ్రీవారి ఆలయం మీదుగా ఎగరడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విషమంగా హోంగార్డ్ రవీందర్ ఆరోగ్యం.. పరామర్శించనున్న కిషన్ రెడ్డి
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌లో పనిచేస్తున్న హోంగార్డు రవీందర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. జీతం ఇవ్వకపోవడంతో బ్యాంకుకు చెల్లించాల్సిన ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైందని మనస్థాపానికి గురయ్యాడు. అనంతరం హోంగార్డు అధికారుల ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విషయం తెలిసిందే. అయితే హోంగార్డు రవీందర్ ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే హోంగార్డు రవీందర్ పరిస్థితిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. హోంగార్డు రవీందర్ ను కలిసి పరామర్శించేందుకు మధ్నాహ్నం ఒంటి గంటకు ఆసుపత్రికి రానున్నారు. రవీందర్ ను కుటుంబ సభ్యులను కలిసి సమస్యను తెలుసుకోనున్నారు. హోంగార్డు రవీందర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కంచన్ బాగ్ లోని హాస్పిటల్ వద్దకు హోంగార్డులు భారీగా చేరుకుంటున్నారు. మేము ప్రభుత్వం , ఉన్నతాధికారులకు వ్యతిరేకం కాదని తెలిపారు. గతంలో సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడుగుతున్నామని తెలిపారు. మా సహచర హోంగార్డ్ కుటుంభం ఇప్పుడు రోడ్ పై వుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ, రెవెన్యూ లో వీఆర్ఏ ల మాదిరి హోంగార్డ్ లను కూడా కూడా పర్మినెంట్ చేయాలని జేఏసీ నాయకుడు ధర్మారావు డిమాండ్ చేశారు. మాలో ఇంకొకరి ప్రాణాలు పొకముందే ప్రభుత్వం స్పందించాలని కోరారు. అయితే రవీందర్ ఆత్మహత్యపై జేఏసీ ఆందోళనకు పిలుపు నిచ్చింది. హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్య యత్నంపై హోమ్ గార్డ్స్ అందరు హాస్పిటల్ కు రావాలని పిలుపు నిచ్చింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఉస్మానియా హాస్పిటల్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

బైబిల్‌ని పంచిపెట్టడం మతమార్పిడి కిందకు రాదు..
అలహాబాద్ హైకోర్టు మతమార్పిడిపై కీలక వ్యాఖ్యలు చేసింది. పవిత్ర బైబిల్ గ్రంథాన్ని పంచిపెట్టడం, మంచి బోధనలను అందించడం మతమార్పిడికి ఆకర్షితం చేయడం కాదని అలహాబాద్ హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. అపరిచిత వ్యక్తి ఈ చట్టంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరని హైకోర్ట్ పేర్కొంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వర్గాల ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రలోభపెట్టిన ఆరోపణల్లో ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు లక్నో బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ షమీమ్ అహ్మద్ తో కూడి ధర్మాసనం జోస్ పాపచెన్, షీజా బెయిల్ పిటిషన్ తిరస్కరణపై అప్పీలుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 24న అంబేద్కర్ నగర్ జిల్లాలో బీజేపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఇద్దర్ని జైలుకు పంపారు. ఈ ఇద్దరు మతమార్పుడులకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకుడు ఆరోపించారు. ఈ కేసులో న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ.. బోధన అందించడం, పవిత్ర బైబిల్ పంపిణీ చేయడం, పిల్లలకు విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించడం, గ్రామస్తులు సభలు నిర్వహించడం, గొడవలకు దిగొద్దని, మద్యం తీసుకోవద్దని గ్రామస్తులకు సూచించడం 2021 మతమార్పిడి చట్టం కిందకు రాదని పేర్కొన్నారు. ఈ విషయంలో బాధిత కుటుంబం మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. మరోవైపు ఇద్దరి తరుపున వాదించిన లాయర్..వారు నిర్దోషులని, రాజకీయ వైరం కారణంగా కేసులో చిక్కుకుపోయారని వాదించారు.

సనాతన ధర్మం ఒక సామాజిక వ్యాధి.. హెచ్‌ఐవీలాంటిది
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేసే ప్రక్రియ ఆగడం లేదు. తమిళనాడు అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె)కి చెందిన ఉదయనిధి స్టాలిన్ తర్వాత డిఎంకెకు చెందిన ఎ రాజా సనాతన ధర్మాన్ని అవమానించారు. దానిని ఒక సామాజిక వ్యాధిగా అభివర్ణించారు. ఇంకా దానిని హెచ్‌ఐవితో పోల్చారు.ఎ రాజా ఇలా అన్నారు- ‘సనాతన ధర్మం ఒక సామాజిక వ్యాధి. ఇది కుష్టు వ్యాధి. హెచ్‌ఐవి కంటే ప్రాణాంతకమైనది.’ దీంతో ఈ వివాదం మరింత పెరుగుతోంది. సనాతన ధర్మంపై నేరుగా చర్చకు రావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఏ రాజా సవాల్ విసిరారు. ఈ మొత్తం వివాదంపై బుధవారం ఏ రాజా మాట్లాడుతూ ఉదయనిధి ఏం మాట్లాడినా చాలా తక్కువేనని అన్నారు. అతను మలేరియా, డెంగ్యూ గురించి మాత్రమే పేర్కొన్నాడు.కానీ సనాతన ధర్మం అనేది భయంకరమైంది. హెచ్‌ఐవి కంటే ప్రమాదకరమైందన్నారు. పీఎం కూడా సనాతన ధర్మాన్ని పాటించాలని, విదేశీ పర్యటనలకు వెళ్లవద్దని డీఎంకే ఎంపీ ప్రధాని నరేంద్ర మోడీని కూడా టార్గెట్ చేశారు. సనాతన ధర్మంపై చర్చకు రావాలని ప్రధానికి, అమిత్‌ షాకు సవాల్‌ చేస్తున్నాను. ఢిల్లీలో ఉన్న కోటి మందిని పిలవండి, శంకరాచార్యులను కూడా కూర్చోబెట్టండి అన్నారు.

“అందుకే గుడిలోకి ప్రవేశించలేదు”..మరో వివాదాన్ని రేపిన సీఎం
సనాతన ధర్మపై తమిళనాడు మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ డీఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఉదయనిధిపై విమర్శలు చేస్తోంది. ఈ వివాదం ముగియకముందే మరో వివాదానికి తెరలేపారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. కేరళలోని హిందూ దేవాలయంలో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు తన చొక్కా విప్పమని అడిగితే తాను ఆలయంలోకి ప్రవేశించలేదని అన్నారు. ‘‘నేను ఒకసారి కేరళకు వెళ్లానని.. ఓ ఆలయానికి వెళ్లగా చొక్కా తీసి లోపలికి రమ్మన్నారని.. అయితే తాను అందుకు నిరాకరించానని, బయట నుంచి ప్రార్థించి వచ్చాను’’ అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. అందర్ని చొక్కాలు తీయమనలేదని కొందరికి మాత్రమే ఇలా చెప్పారని ఆరోపించారు. ఇది అమానవీయమైన చర్యగా అభివర్ణించారు. దేవుడి ముందు అందరం సమానమే అని అన్నారు. సంఘసంస్కర్త నారాయణ గురు 169వ జయంతిని పురస్కరించుకుని బెంగళూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆదిత్య ఎల్ 1 సెల్ఫీ.. భూమి, చంద్రుడు ఎలా ఉన్నారో చూడండి..
భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్ దిగ్విజయంగా తన లక్ష్యం వైపు కదులుతోంది. సూర్యుడిపై పరిశోధనలకు చేయడానికి ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇది. తాజాగా ఆదిత్య ఎల్1 ఆన్ బోర్డ్ కెమెరాల సాయంతో సెల్ఫీ తీసింది. దీంతో భూమి, చంద్రుడు కనిపించడం చూడొచ్చు. చంద్రుడు భూమికి కుడి వైపున చిన్న చుక్కలా ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసింది. సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ఆదిత్య ఎల్1ని తీసుకెళ్లింది. చంద్రయాన్-3 సక్సెస్ అయిన తర్వాత ఇస్రో కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ సోలార్ మిషన్‌ని ప్రయోగించింది. భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న ఆదిత్య ఎల్1 శాటిలైట్ కక్ష్యను రెండుసార్లు విజయవంతంగా ఇస్రో పెంచింది.

విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే ఫార్మాట్‌లో తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు పూర్తి చేసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఆసియా కప్‌ 2023లో భాగంగా బుధవారం లాహోర్‌లో బంగ్లాదేశ్‌పై 22 బంతుల్లో 17 పరుగులు చేసిన బాబర్ ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డుని బ్రేక్ చేసాడు. కోహ్లీ 36 ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు పూర్తి చేయగా.. బాబర్ 31 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ మార్క్ అందుకున్నాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ మూడో స్థానంలో ఉన్నాడు. ఏబీ 41 ఇన్నింగ్స్‌లలో 2000 పరుగులు పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ (47 ఇన్నింగ్స్‌లు) 4వ స్థానంలో ఉన్నాడు. ఇక 2015లో అరంగేట్రం చేసిన బాబర్ ఇప్పటివరకు 106 వన్డేలు ఆడి 19 సెంచరీలు చేశాడు. పాకిస్థాన్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ రెండో స్థానంలో ఉన్నాడు. మరో సెంచరీ చేస్తే మాజీ ఓపెనర్ సయీద్ అన్వర్ (20 వన్డే సెంచరీలు) రికార్డును సమం చేస్తాడు.

యూపీఐ పేమెంట్స్‌ మరింత సులవు.. చెబితే చాలు..
భారత్‌ డిజిటల్‌ చెల్లింపులో క్రమంగా తన వాటాను పెంచుకుంటూ పోతోంది.. కరోనా మహమ్మారి తర్వాత ఇవి మరింత పెరిగాయి.. ఇక, యూపీఐ పేమెంట్స్‌లోనూ డిజిటల్‌ పేమెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌లో ఎన్నో మార్పులు చేస్తూ వస్తున్నాయి.. ఇప్పటి వరకు ఎవరికైనా పేమెంట్స్‌ చేయాలంటే సంబంధిత మొత్తాన్ని టైప్‌ చేయాల్సి ఉండేది.. ఇప్పుడు వాయిస్‌ ఆధారిత పేమెంట్స్‌ సహా పలు కొత్త రకాల చెల్లింపు విధానాలను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ఆవిష్కరించింది. గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ సందర్భంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో హెలో! యూపీఐ అనే విధానంతో యాప్స్, టెలికం కాల్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ పరికరాల ద్వారా వాయిస్‌ ఆధారిత యూపీఐ చెల్లింపులు చేసే వెసులుబాటు కలుగుతుంది.. ప్రస్తుంది ఈ సేవలు హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలోనే ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ప్రారంభించనున్నట్టు ఎన్‌పీసీఐ పేర్కొంది.

గవర్నమెంట్ కన్నా ముందే అక్షయ్ ‘భారత్’గా మార్చేశాడు
ప్రస్తుతం దేశం మొత్తం వినిపిస్తున్న ఒకే ఒక్క టాపిక్ ‘భారత్’. ఇండియా నుంచి భారత్ గా దేశం పేరు మారుస్తున్నారు, సెప్టెంబర్ 18న అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు అనే చర్చ దేశం మొత్తం వినిపిస్తోంది. ఈ పేరు మార్పుకి కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరేమో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు ఏం చేసినా నాకెందుకు… గవర్నమెంట్ కన్నా ముందు నేనే ఫిక్స్ చేస్తా అనుకున్నాడో ఏమో కానీ బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, తన నెక్స్ట్ సినిమాకి భారత్ గా టైటిల్ ఫిక్స్ చేసాడు. ఖిలాడీ అక్షయ్ కుమార్, డైరెక్టర్ తీను సురేష్ దేశాయ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘మిషన్ రాణిగంజ్’ అనే సినిమా చేస్తున్నాడు. అక్టోబర్ 6న రిలీజ్ కానున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అక్షయ్ కుమార్ సింగ్ లుక్ లో కనిపించాడు. బొగ్గు గనుల నేపధ్యంలో సాగనున్న ఈ సినిమాకి ‘ది గ్రేట్ భారత్ రెస్క్యూ’ అనే క్యాప్షన్ ని ఫిక్స్ చేసారు. నిజానికి ఈ టైటిల్ క్యాప్షన్ లో ఫస్ట్ ఉన్నది… ‘ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ’ అని, దీన్నే భారత్ గా మార్చారు మేకర్స్. భారత్ గా పేరు మారుస్తున్నారు అనే మాట వినిపించడం మొదలైన తర్వాత ఇలా ఒక సినిమా టైటిల్ మార్చడం ఇదే మొదటిసారి. మరి ఇకపై ఇలాంటి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో.

విజయ్… అల్లు అర్జున్ కాదు క్యామియో ప్లే చేసింది ఈ హీరోనే
షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా… చాలా వెయిట్ చేయించి ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకి వచ్చింది. అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు… యుఎస్ఏ నుంచి యూకే వరకూ అన్ని సెంటర్స్ లో సెన్సేషనల్ టాక్ ని సొంతం చేసుకుంది. షారుఖ్ ఇంట్రో, ఇంటర్వెల్ బ్లాక్స్ లో మూవీ లవర్స్ గూస్ బంప్స్ ఓవర్ లోడెడ్ అంటూ రివ్యూస్ ఇస్తున్నారు. బాలీవుడ్ సినిమా చూసిన ది బెస్ట్ కమర్షియల్ డ్రామాగా జవాన్ సినిమా నిలిచేలా ఉంది. హీరోయిజంతో పాటు శంకర్ మార్క్ సోషల్ ఎలిమెంట్స్ ని కూడా కలపడంతో జవాన్ సినిమా మరింత గ్రాండ్ గా కనిపిస్తోంది. అయితే జవాన్ సినిమా రిలీజ్ కి ముందు ఈ సినిమాలో అల్లు అర్జున్, దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోలు క్యామియో ప్లే చేసారు అనే వార్తలు వినిపించాయి. విజయ్ పేరు అయితే మరీ ఎక్కువగా వినిపించింది. ఫస్ట్ డే మార్నింగ్ షో థియేటర్స్ కి వెళ్లిన ఫ్యాన్స్ కి… అల్లు అర్జున్, విజయ్ కాకుండా ఇంకో హీరో కనిపించి సర్ప్రైజ్ చేసాడు. బాలీవుడ్ సంజూ బాబా… సంజయ్ దత్ జవాన్ సినిమాలో క్యామియో ప్లే చేసాడు. యంగ్ షారుఖ్ ఖాన్ ‘ఆజాద్’ పాత్రలో ఉండగా… జైలుని స్వాధీనం చేసుకుంటే… ఈ సమయంలో గవర్నమెంట్ ఆజాద్ తో నెగోషియేట్ చేయడానికి సంజయ్ దత్ ని రంగంలోకి దించింది. మాధవ్ నాయక్ అనే పాత్రలో సంజయ్ దత్ కనిపించడం విశేషం. ఈ క్యామియో తెరపై కనిపించగానే సంజూ బాబా అంటూ నార్త్ ఆడియన్స్ థియేటర్స్ లో విజిల్స్ వేస్తున్నారు. సంజయ్ దత్ గత కొంతకాలంగా సౌత్ సినిమాల్లో నెగటివ్ రోల్స్ ప్లే చేస్తున్నాడు, ఇప్పుడు జవాన్ సినిమాతో చాలా రోజుల తర్వాత షారుఖ్ తో కలిసి నటించాడు.