గురువుల కన్నా గూగుల్ మిన్న..! ఏపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నా.. దాని గురించి చెప్పడానికి ఓ గురువు కావాలి.. అందుకే గురువుకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది.. పుస్తకాలను చూసి పాఠాలను చెప్పడమే కాదు.. జీవితాలను చూసి బోధించేవారు ఎంతో మంది మహానుభావులు ఉన్నారు.. ఇక, ప్రస్తుత సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ, గురువు స్థానాన్ని మాత్రం ఎప్పటికీ గూగుల్ భర్తీ చేయలేదంటూ గతంలోనే భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. నేడు, ప్రపంచం శరవేగంగా దూసుకుపోతోంది.. మీకు గూగుల్ అందుబాటులో ఉన్నా సరే.. మీకో గురువు అవసరం.. గురువును గూగుల్ భర్తీ చేయలేదు అంటూ ఓ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. అయితే, దీనికి భిన్నంగా.. అది కూడా ఉపాధ్యాయుల దినోత్సవం రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి.. గురువుల కన్నా గూగుల్లో ఎక్కువ మెటీరియల్ లభిస్తోందంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి.. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన గురుపూజోత్సవ సభలో పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీచర్లను అగౌరవపరుస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. బైజూస్ తో టెక్నాలజీ మొత్తం ట్యాబుల్లో అందు బాటులో ఉందన్నారు. గురువుల స్థానంలో ఇప్పుడు గూగుల్ వచ్చిందని, ఉపాధ్యాయులకు తెలియని అంశాలు కూడా గూగుల్‌లో కొడితే వెంటనే తెలిసిపోతుందని చెప్పారు. గూగుల్ వచ్చిన తర్వాత గురువులు అవసరం లేని పరిస్థితి ఏర్పడిందంటూ మంత్రి సురేష్ వ్యాఖ్యానించడంపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు మండి పడుతున్నారు.
ఆంధ్ర, తెలంగాణ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు..!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాన్ని కొంతమంది పని కట్టుకుని చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరు పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఆ ప్రభుత్వ ప్రాధాన్యాలు.. ఆంధ్ర ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయని.. దానిని పట్టించుకోకుండా ఇష్టానుసారం కొన్ని వార్తలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు తీరు.. మన రాష్ట్రంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు అమలును విశ్లేషించాలని సూచించిన ఆయన.. చంద్రబాబు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. దీనిని గురించి ఎందుకు రాయడం లేదు..? రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.. నాలుగేళ్లు బాగా వర్షాలు కురిశాయి.. ఈ ఏడాది ఇంకా వర్షాలకు సమయం ఉందన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో తిరగడం వల్లే వర్షాలు రావడం లేదని ప్రజలు అంటున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. ఇప్పుడు మళ్లీ వర్షాలు మొదలయ్యాయి.. ఆరు జిల్లాల్లో బాగా కురుస్తున్నాయన్నారు. ఇక, వ్యవసాయ యాంత్రీకరణ పై చర్చకు సిద్ధం అని సవాల్ చేశారు.. టీడీపీ హయాంలో కంపెనీలతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుని అక్రమాలకు పాల్పడ్డారని.. రైతులకు ఇచ్చే ట్రాక్టర్లలో సబ్సిడీని కూడా మింగారని ఆరోపించారు మంత్రి కాకాణి.. మా ప్రభుత్వ హయాంలో ఏది కొనాలో రైతులకే అవకాశం కల్పించామని స్పష్టం చేశారు. మరోవైపు.. కండలేరు హై లెవెల్ కెనాల్ కు సంబంధించి గ్రావిటీ తోనే నీళ్లు ఇస్తున్నాం.. టీడీపీ హయాంలో నీళ్లు అడుగంటి లిఫ్ట్ ద్వారా ఇచ్చారన్నారు. దమ్ముంటే వచ్చి చూడాలి అని సవాల్ చేసిన ఆయన.. సోమశిల జలాశయం పరిధిలోని రైతులను తీసుకు వచ్చి.. టీడీపీ నేతలు కలసి ధర్నా చేశారు.. లిఫ్ట్ పథకానికి కరెంట్ బిల్లు కింద రూ.3 కోట్ల 56 లక్షలు చెల్లించలేదని.. ఈ ప్రభుత్వ హయాంలో కోటి రూపాయలు బిల్లు అయ్యింది.. టిడిపి హయాంలో బిల్లు కట్టక పోవడంతో సర్ ఛార్జ్ కలవడంతో బిల్లు అధికంగా వచ్చింది.. ఈ విషయం చెప్పకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పంటలకు ఇబ్బంది లేకుండా నీళ్లు ఇస్తున్నాం.. విద్యుత్ ఇబ్బంది లేకుండా బయట కొనుగోలు చేస్తున్నాం అని స్పష్టం చేశారు.
వైజాగ్ సిటీపై స్పెషల్ ఫోకస్.. పోలీసు శాఖలో కీలక మార్పులు
ఆంధ్రప్రదేవ్‌లో అతిపెద్ద నగరం విశాఖపట్నం. పారిశ్రామిక, ఓడరేవు నగరంగా వేగంగా విస్తరిస్తోంది. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుచుకునే వైజాగ్ ను పరిపాలన రాజధానిగా ప్రకటించింది వైసీపీ సర్కార్. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అవసరాలకు తగ్గట్టు మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంగా జరుగుతున్నాయి.. దసరా నాటికి సీఎం వైఎస్ జగన్.. వైజాగ్ కేంద్రంగా పరిపాలన ప్రారంభిస్తారని అధికారపార్టీ వర్గాలు ఖచ్చితంగా చెబుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఐపీఎస్ లు ఆకస్మిక బదిలీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సిటీ పోలీసు కమిషనర్ సీఎం త్రివిక్రమ్ వర్మ., లా అండ్ ఆర్డర్ డీసీపీ విద్యాసాగర్ నాయుడుని ఏకకాలంలో బదిలీ చేసింది. వీరిద్దరి ట్రాన్స్‌ఫర్స్ వెనుక అదుపుతప్పిన పోలీసింగ్., రాజకీయ ప్రమేయాలు, బెంగాల్ విద్యార్థిని రీతు మృతి కేసు విచారణ లోపాలు.. ఇలా అనేక కారణాలు దాగి ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఇక, వీటి సంగతి పక్కన బెడితే తాజా బదిలీల్లో విశాఖ పోలీసు బాస్ గా రవిశంకర్ అయ్యంగార్ నియామకంపై ఇప్పుడు ఆసక్తికరమైన వ్యవహారంగా కనిపిస్తోంది. అడిషనల్ డీజీపీ హోదాలో స్టేట్ లా అండ్ ఆర్డర్ పర్యవేక్షిస్తున్న అధికారిని విశాఖకు పంపడం వెనుక ప్రభుత్వ పెద్దలు ఆలోచన విస్పష్టం. కేపిటల్ సిటీగా మారిన తర్వాత విశాఖ పోలీసింగ్ కొత్త సవాళ్లను ఎదుర్కోవాలసి వుంటుంది. శాంతిభద్రతలు, ప్రోటోకాల్ నిర్వహణ పెద్ద ఛాలెంజ్. ప్రస్తుతం విశాఖ సిటీ పోలీసు కమిషనరేట్ పరిధి 40 నుంచి 50 కిలోమీటర్ల వైశాల్యంలో ఉంటుంది. జనాభా సుమారు 25 లక్షలు కాగా జనావాసాలు విస్తరిస్తున్నాయి. సిటీలో క్రైమ్ రేట్ ఆందోళన కలిగిస్తోంది. ఆర్గ నైజ్డ్ నేరాలు చేసే ముఠాల కదలికలు ఎక్కువయ్యాయి. వీటిలో సంచలనం రేకెత్తించిన ఘటనలు ఉన్నాయి. ఇప్పటి వరకు విశాఖలో జరిగిన నేరాల తీరు., వాటిని నియంత్రించే క్రమంలో తీసుకున్న చర్యలు ఒక లెక్క. రాజధాని కార్యాకలాపాలు ప్రారంమైతే భద్రత, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్దీకరణ వంటివి చాలా కీలకం.
‘జమిలి’యే కాదు ఏ ఎన్నికలు.. ఎప్పుడు వచ్చినా రెడీ.. గెలుపు మాదే..!
ఓవైపు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. మరోవైపు జమిలి ఎన్నికలపై చర్చ సాగుతోంది.. ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైవీ సుబ్బారెడ్డి.. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కాంక్షిస్తున్నారని తెలిపారు. జమిలి ఎన్నికలే కాదు ఏ ఎన్నికలు.. ఎప్పుడూ వచ్చినా వైసీపీ సిద్ధం.. గెలుపు వైసీపీదే అని ధీమా వ్యక్తం చేశారు.. ప్రభుత్వ పథకాల వల్ల రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గెలిచి తీరుతాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, చంద్రబాబు 23 మందిని గతంలో టీడీపీలో కలుపుకుని ఝలక్ తిన్నాడు.. మళ్లీ ఇప్పుడు మా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే ఛాల్సే లేదన్నారు వైవీ సుబ్బారెడ్డి.. అయితే, చంద్రబాబుకు ఝలక్‌లు మాత్రం అలవాటే అని సెటైర్లు వేవారు. మరోవైపు.. ఇండియా పేరుని భరత్ గా మార్పు చేస్తే దేశ ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలని సూచించారు వైవీ సుబ్బారెడ్డి.. గతంలో కూడా పలు దేశాలు పేర్లు మార్చుకున్నాయి.. కానీ, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలన్నారు. ఇక, రెచ్చ గొట్టి దాడులు జరిగేలా.. యువగళంలో టి.షర్ట్ లు వేసుకుని కావాలని రెచ్చ గొడుతున్నారు.. ప్రజలు సమన్వయం పాటించాలని సూచించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి.
గుడ్‌న్యూస్.. భవన నిర్మాణ కార్మికులకు 50 రకాల మెడికల్ టెస్టులు ఫ్రీ..
లేబర్ కార్డు పొందిన భవన నిర్మాణ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని, ఏవైనా వ్యాధులు నిర్ధారణ అయితే సంబంధిత ఆసుపత్రులకు రెఫర్ చేస్తామని తెలంగాణ కార్మిక శాఖ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం లేబర్ కార్డుదారులకు రూ.10 వేల వరకు ఖరీదు చేసే 50 రకాల పరీక్షలను ఉచితంగా అందిస్తుంది. అందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. నిర్మాణ రంగ సంక్షేమ బోర్డు నుంచి గుర్తింపు కార్డు తీసుకున్న ప్రతి కార్మికుడు వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. ఈసీజీ, బీపీ, ఊపిరితిత్తులు, కంటి చూపు, చెవి, ముక్కు, గొంతు, రక్తం, మూత్రం, షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలను గుర్తించి, అవసరమైతే హైదరాబాద్ వంటి నగరాల్లోని ప్రధాన ఆసుపత్రులకు రెఫర్ చేస్తారు. చిన్న చిన్న సమస్యలకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నమోదిత నిర్మాణ కార్మికులందరికీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ బాడీ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నారు. లేబర్ కార్డు లేని వారు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, 2 ఫొటోలు తీసుకుని గ్రామ పంచాయతీకి వెళితే నమోదు చేస్తారు. అయితే మీ గ్రామాల్లో ఈ శిబిరాల గురించి మరింత సమాచారం కోసం, మీరు మండల వైద్యాధికారిని లేదా గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించవచ్చు.
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడమేనా సనాతన ధర్మం అంటే ?
డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు సనాతన ధర్మం పై చేసిన ప్రకటన ఎంత వివాదాస్పదం అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రకటనపై దాడికి గురైన ఉదయనిధి స్టాలిన్ క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. ఇదిలా ఉంటే మరోసారి తన ప్రకటన గురించి మాట్లాడాడు. తన ప్రకటన, రాజకీయ దాడులపై ఉదయనిధి స్టాలిన్.. గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి ఆహ్వానించబడలేదు. ఇది సనాతన ధర్మానికి అత్యుత్తమ ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రతిపక్ష పార్టీల కూటమి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే ‘ఇండియా’ కూటమిలో ఉదయనిధి స్టాలిన్ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పార్టీలు ఆయన ప్రకటనను సమర్థిస్తుండగా, కొందరు సంయమనం పాటించాలని ఉదయనిధికి సూచించారు. ఉదయనిధి ప్రకటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ, “తమిళనాడు ప్రజలంటే నాకు చాలా గౌరవం ఉంది, కానీ ప్రతి మతానికి భిన్నమైన మనోభావాలు ఉన్నాయని నేను వారికి వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. అలాంటి విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు. ఏ వర్గానికైనా బాధ కలిగించే అంశం ఉంటుంది. బహుశా అది అతనికి తెలియకపోవచ్చు. భారతదేశం ఒక లౌకిక దేశం, ఇది ప్రజాస్వామ్య దేశం. భిన్నత్వంలో ఏకత్వం మన మూలాధారం కాబట్టి నేను సనాతన ధర్మాన్ని గౌరవిస్తాను. మేము గుడికి, మసీదులకు, చర్చికి వెళ్తాము. ఎవరినీ బాధపెట్టే దాని గురించి మనం వ్యాఖ్యానించకూడదు. భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం గుర్తుంచుకోవాలి.”
మాల్దీవుల ఎన్నికల్లో ఇండియా వర్సెస్ చైనా.. ఎందుకంత కీలకం..
హిందూ మహాసముద్రంలో ద్వీప దేశం మాల్దీవులు. ఈ చిన్న దేశం ఇప్పుడు ఆసియా శక్తులుగా ఉన్న ఇండియా, చైనాలకు కీలకంగా మారింది. ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఇండియా, చైనాలు పోటీ పడుతున్నాయా.? అనే విధంగా అక్కడి పరిస్థితి ఉంది. మాల్దీవుల అధ్యక్ష ఎన్నికలు ఈ రెండు దేశాలకు కీలకంగా మారాయి. ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రభుత్వం భారత్ పక్షాన ఉంది. ఈ ప్రాంత భౌగోళిక స్థితి రెండు దేశాలకు కీలకంగా మారింది. 5,21,000 మంది ప్రజలు ఉంటే అనేక ద్వీపాలతో ఏర్పడిన ఈ దేశం ఆర్థిక వ్యవస్థ మేజర్ గా పర్యాటకంపై ఆధారపడి ఉంది. ఈ దేశంలో మౌళిక సదుపాయాలను డెవలప్ చేయడానికి ఇటు భారత్, అటు చైనాలు పోటీ పడుతున్నాయి. మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెడుతున్నాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం మొహమ్మద్ ‘‘ఇండియా ఫస్ట్’’ నినాదాన్ని అనుసరిస్తూ.. భారత్ వైపు ఉన్నారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో కూడా సోలిహ్ కాస్త ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. సోలిహ్ కు పోటీగా మొహమ్మద్ మయిజ్జూ ఉన్నారు. ఇతని సంకీర్ణానికి చైనా సన్నిహితంగా ఉంది. ‘ఇండియా ఔట్’ అనే నినాదంలో ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నిఘా విమానాలు, భారత సైనిక ఉనికిని తొలగిస్తామని హామీ ఇస్తున్నారు. 2,80,000 ఓటర్లు ఉన్నారు. గత నెలలో బానీ సెంటర్ థింక్ ట్యాంక్ నిర్వహించిన సర్వేలో 21 శాతం మంది సోలిహ్ వైపు మొగ్గు చూపగా.. 14 శాతం మంది మయిజ్జూ వైపు ఉన్నరాు. 53 శాతం మంది ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
‘భారత్’గా మారనున్న ‘ఇండియా’..? ఆ వెబ్‌సైట్లకు చుక్కలే..!
ఇండియా కాస్త భారత్‌గా మారనుందా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ హాట్‌గా సాగుతోన్న చర్చ.. అయితే, ఒక దేశం పేరు మారిస్తే సరిపోదు.. స్వాతంత్ర భారతంలో ఉన్న ఎన్నో వ్యవస్థల పేర్లు కూడా మార్చాల్సి ఉంటుంది.. ఇదే సమయంలో డిజిటల్ మీడియాకు కూడా కష్టాలు తప్పవు.. ఎందుకంటే చాలా వెబ్‌సైట్లు తమ పేర్లలో .in అనే డొమైన్‌ను వాడుతున్నాయి. అంటే.. ఇప్పటి వరకు ఇండియా పేరు ఉంది కాబట్టే ఇండియా స్పెల్లింగ్‌లోని తొలి రెండు అక్షరాలు అయిన INలను ఆయా వెబ్‌సైట్ల పేరు చివరన పెట్టుకుని వాడేస్తున్నారు.. అదే దేశం పేరు ఇండియా నుంచి భారత్‌కు మారితే .IN అనే డొమైన్.. భారత్‌కు ప్రతిభించేదుగా ఉండదు.. దాంతో.. కొత్త టీఎల్‌డీ(డొమైన్)కు మార్చాల్సి ఉంటుంది. కొన్ని ఏళ్లుగా పాతుకుపోయిన ఎన్నో వెబ్‌సైట్లకు ఇలాంటి మార్పు ఇబ్బందులను తెచ్చిపెట్టనుంది అంటున్నారు సాంకేతిక నిపుణులు. రేపు భారతదేశాన్ని వెబ్ అంతటా భారత్ అని పిలిస్తే, దేశంలోని వెబ్‌సైట్‌ల కోసం కొత్త TLDని కూడా కలిగి ఉండటం మంచిది. .BH లేదా .BR వంటిది ఖచ్చితంగా చెప్పండి. .BT కూడా పని చేయవచ్చు. దురదృష్టవశాత్తూ, ఈ TLDలన్నీ ఇప్పటికే తీసుకోబడ్డాయి. ది .BH బహ్రెయిన్‌కు చెందినది. .BR బ్రెజిల్‌కు చెందినది. ది .BT భూటాన్‌కు చెందినది. ఒక ప్రక్కన, మేం బహ్రెయిన్ లేదా భూటాన్‌లను వారి ccTLDని మాకు అందించమని అభ్యర్థించవచ్చు. లేదా మనం కొన్ని అదనపు TLDలను తీసుకోవచ్చు, ఇప్పుడు ఇంకా ఎక్కువ TLDలు అనుమతించబడినప్పుడు. కాబట్టి మనం .BHARATని స్వాధీనం చేసుకోవచ్చు. లేదా .BHRT అని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది.. కానీ, ఇప్పటి వరకు .IN ఉపయోగించే అన్ని వెబ్‌సైట్లకు కష్టాలు తప్పవన్నమాట.
కొంచెంలో మిస్ అయ్యింది లేకపోతేనా? అయినా నీకెందుకమ్మా ఇవన్నీ
పిచ్చి పిచ్చి పనులు చేస్తూ కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సరదా కోసం చేసే పనులు ఉసురు తీస్తున్నాయి. అలా ప్రాణాలు కోల్పొయిన వారికి సంబంధించి ఎన్నో వార్తలు, కథనాలు మనం రోజూ చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అయినా చాలా మందిలో మార్పు రావడం లేదు. ప్రాణాలు పోతాయి అని తెలిసినా పిచ్చి పనులు ఆపడం లేదు. వ్యూస్ కోసం, లైక్ ల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నాయి. రోజు ఇంటర్నెట్ లో ఎన్నో వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే కొన్ని భయపెట్టేలా ఉంటాయి. కొంతమంది సాహసాలు చేస్తూ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇలాగే చేయబోయి రెప్పపాటులో తప్పించుకుంది ఓ యువతి. ఈ వీడియో ఎక్కడ తీశారో తెలియదు కానీ ఇందులో ఓ యువతి బాగా స్పీడ్ గా వెళ్తున్న ట్రైన్ లో బయటకు వచ్చే డోర్ పట్టుకొని గాల్లో వేలాడింది. అచ్చం రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే చేసినట్లుగానే. అయితే ఇక్కడే ఆమెకు ఓ షాకింగ్ ఘటన ఎదురయ్యింది. యువతి ట్రైన్ లో నుంచి చేతులు గాల్లో పెట్టి మంచి ఫోజ్ ఇస్తుంది. దానిని దూరం నుంచి ఎవరో షూట్ చేస్తున్నారు. ఇంతలోనే ఓ పోల్ వచ్చింది. కొద్దిలో ఆ అమ్మాయి తప్పించుకుంది. ప్రమాదం నుంచి బయటపడిన తరువాత ఆ అమ్మాయి రియాక్షన్ చూడాలి. బతికిపోయాను రా దేవుడా అనేలా ఉంది. కొద్దిలో మిస్ అయ్యింది కానీ ఆ పోల్ కు కనుక తగిలి ఉంటే ఆ అమ్మాయి ప్రాణాలే పోయుండేవి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఇలాంటి ప్రాణాలు పోయే సాహసాలు అవసరమా అంటూ నెటిజన్లు హితవు పలుకుతున్నారు. భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టే కొద్దిగలో బతికిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది నెటిజన్స్ ఇలాంటి జీవితాలు మళ్లీ జీవితంలో చేయదంటున్నారు.
ప్రముఖ నటి, మాజీ ఎంపీ దివ్య స్పందన మృతి.. తూచ్ అంతా ఉత్తదే
చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత కొంత కాలంగా చాలా మంది ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు, డ్యాన్స్ మాస్టర్లు ఇలా చాలా మంది కాలం చేశారు. కరోనా టైంలో కొందరు మరణిస్తే.. మరికొందరు ఇతర కారణాలతో కన్నుమూశారు. తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కన్నడ నటి, మాజీ ఎంపీ దివ్యా స్పందన (40) హార్ట్ ఎటాక్ తో చనిపోయినట్లు సమాచారం అందుతోంది. తను మృతి చెందినట్లు జాతీయ మీడియా గుర్తించింది. ఇక కన్నడ నటి, మాజీ ఎంపీ దివ్యా స్పందన మృతి నేపథ్యంలో ఆమెను పలువురు సంతాపం తెలిపారు. కానీ ఇదంతా పుకార్లని తేలిపోయింది. కన్నడ నటి దివ్య స్పందన గుండెపోటుతో మృతి చెందారని సోషల్ మీడియాలో చాలా మంది RIP అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ఈ రూమర్స్ రావడం పలువురిని షాక్‌కి గురి చేసింది. దివ్య స్పందన శింబు, ధనుష్, సూర్యతో పలు సినిమాల్లో నటించారు. గతంలో ఎంపీగానూ బాధ్యతలు నిర్వర్తించారు. కుత్తు రమ్య పేరుతో ఇండస్ట్రీలో ఆమె చాలా పాపులరిటీ సంపాదించుకున్నారు. ధనుష్‌తో పొల్లదవన్ సినిమాలో నటించారు. దివ్య స్పందన నవంబర్ 29, 1982న జన్మించారు. ఆమె స్క్రీన్ నేమ్ రమ్య ద్వారా విస్తృతంగా గుర్తింపు పొందింది. ఆమె కర్ణాటకలోని మాండ్యాకు ప్రాతినిధ్యం వహిస్తూ లోక్‌సభలో పార్లమెంటు సభ్యునిగా ఉన్నారు. తన విశేషమైన ప్రతిభ ఆమెకు రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, ఒక ఉదయ అవార్డు, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డ్‌తో సహా అనేక ప్రశంసలను సంపాదించిపెట్టింది.
ఇక నుంచి అలాంటి కథలకు దూరంగా వుంటాను.
స్టార్ హీరోయిన్ అనుష్క చాలా గ్యాప్ తీసుకోని ఎట్టకేలకు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సరోగసీ నేపథ్యంలో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు.సెప్టెంబర్ 7న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. గత కొద్దీ రోజులుగా హీరో నవీన్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఎంతో బిజీ గా వున్నాడు.కానీ ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కడ కూడా అనుష్క కనిపించ లేదు.ఈ భామ సోషల్ మీడియా ద్వారానే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిని ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది.తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనింది. ఈ ఇంటర్వ్యూ లో తన కెరీర్‌ఫై అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇకపై లేడీ ఓరియెంటెడ్ స్కిప్ట్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అనుష్క తెలిపింది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్స్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. తెలుగులో హీరోయిన్‌గా ఓ రెండు సినిమాలు కమిట్ అయ్యానని వాటి వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తానని అనుష్క తెలిపింది.బెంగళూరు నాగరత్నమ్మ బయోపిక్ గురించి కూడా అనుష్క ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ బయోపిక్ కథను కొన్ని రోజుల క్రితమే నేను విన్నాను.ఎంతగానో నచ్చిందని ఆమె చెప్పింది. అన్ని కుదిరితే తప్పకుండా ఈ బయోపిక్‌లో నటిస్తానని ఆమె పేర్కొన్నది.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ పాపులర్ అయిన అనుష్క ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఈ సినిమాల కారణంగానే అనుష్కకు హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుముఖం పట్టాయని ప్రచారం కూడా జరుగుతోంది. వాటి కారణంగానే అనుష్క ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది..అలాగే అనుష్క తన పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.దేనికైనా టైమ్ రావాలి మనం అనుకుంటే జరగవు అని అనుష్క చెప్పింది. పెళ్లి బంధానికి నేను వ్యతిరేకం కాదని చెప్పింది. త్వరలోనే నా పెళ్లి గురించి అందరికి తెలియజేస్తాను అని అనుష్క చెప్పింది.