NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

వైఎస్‌కు గవర్నర్‌ నివాళి.. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నా నివాళులు.. దార్శనికత ఉన్న నాయకుడు వైఎస్ఆర్ అంటూ కొనియాడారు గవర్నర్‌.. రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేసిన వ్యక్తి వైఎస్సార్ అని పేర్కొన్న ఆయన.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. ఇక, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిలిచిపోయారని సోషల్‌ మీడియా వేదికగా వరుస ట్వీట్లు చేశారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌.

వైఎస్ఆర్ సజీవంగా ఉన్నట్లే.. ఒక్కసారి కాలం వెనక్కి వెళ్తే బాగుండు..
ఇప్పటికీ ఆ దివంగత నేత వైఎస్ఆర్ మనకు సజీవంగా ఉన్నట్లే.. ఒక్కసారి కాలం వెనక్కి వెళ్తే బాగుండు అన్నారు మంత్రి జోగి రమేష్‌.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్వర్గీయ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.. రాజశేఖర రెడ్డికి విగ్రహానికి నివాళులు అర్పించారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు జోగి రమేష్‌, మేరుగ నాగార్జున, ఇతర నేతలు.. ఇక, సజ్జల జ్యోతి ప్రజ్వలన చేయగా.. పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు పార్టీ శ్రేణులు.. ఇక, ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సరిగ్గా ఇదే రోజు వైఎస్ఆర్ ప్రయాణించిన విమానం కనిపించలేదు.. అయినా ఒక ధీమా ఉండేది.. ఆయన ఎక్కడికి వెళతారు.. కచ్చితంగా వస్తారు అనుకున్నాం.. కానీ దురదృష్టం వెంటాడింది.. అయితే, ఒక వ్యక్తి పాలన పై, ప్రజల జీవితాల పై ఎంత ప్రభావం వేయగలరు అనటానికి వైఎస్సార్ ఒక ఉదాహరణ అన్నారు. కోట్లాది ప్రజల. గుండెల్లో రాజశేఖరరెడ్డి చిరస్థానం సంపాదించారు. సిద్ధాంతాలు పెట్టుకుని పాలించలేదు.. అందరూ తన కుటుంబ సభ్యులే అనుకున్నారు. రాష్ట్రాన్ని దేశంలో తలమానికంగా నిలబెట్టారు.. ప్రజల జీవితాల్లో ఒక వెలుగు తెచ్చారని గుర్తుచేశారు. వైఎస్సార్ తర్వాత అలుముకున్న చీకటిలో వెలుగు రేఖ తెచ్చిన వ్యక్తి వైఎస్‌ జగన్ అన్నారు సజ్జల.. మాట మీద నిలబడే తత్వమే ప్రజల్లో ఆయన అంటే ఒక నమ్మకాన్ని సృష్టించిందన్న ఆయన.. ఆయనకు నిజమైన రాజకీయ వారసుడిగా జగన్ గత నాలుగేళ్లుగా పాలన చేస్తున్నారని కొనియాడారు.

వన్ నేషన్ – వన్ ఎలక్షన్.. వైసీపీ విధానంపై క్లారిటీ
వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ విధానానికి మేం అనుకూలమని వైసీపీ మంత్రులు క్లారిటీ ఇచ్చారు.. ఎన్టీవీతో మాట్లాడిన మంత్రి మేరుగ నాగార్జున.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని గెలిపించుకోవటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎన్నికలు రేపు వస్తాయా..? లేక టైమ్ లో వస్తాయా..? అనే అంశం పై మా పార్టీ ఆలోచించటం లేదన్న ఆయన.. చంద్రబాబు మునిగిపోతున్న నావగా అభివర్ణించారు. అద్దె కంపెనీలను తెచ్చుకుని వాటేసుకుంటున్నాడు.. కానీ, ప్రజలంతా జగన్ వెంట ఉన్నారని తెలిపారు. పార్టీలను అప్పు తెచ్చుకుంటున్నాడు.. మమ్మల్ని బూతులు తిట్టిస్తున్నాడు.. రాజకీయాలకు చంద్రబాబు అవసరం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు అమరావతి ప్రాంతంలో డొల్ల కంపెనీల ద్వారా కోట్ల రూపాయలు కొట్టేశాడని ఆరోపించారు.. అవినీతి చేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ విమర్శలు గుప్పించారు మంత్రి మేరుగ నాగార్జున.

శ్రీవాణి ట్రస్ట్‌కి విశేష స్పందన.. నాలుగేళ్లలోనే వెయ్యి కోట్లు..!
శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం (శ్రీవాణి) ట్రస్ట్‌కు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. స‌నాత‌న ధ‌ర్మప్రచారంలో భాగంగా మారుమూల ప్రాంతాల‌లో శ్రీవారి ఆల‌యాలు నిర్మించడం, మ‌త‌మార్పిడుల‌ను అరిక‌ట్టడం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అర్చక శిక్షణ లాంటి కార్యక్రమాల కోసం టీటీడీ ఈ ట్రస్ట్‌ను ప్రారంభించిన విషయం విదితమే కాగా.. ట్రస్ట్ ప్రారంభించిన నాలుగు సంవత్సరాల కాలంలోనే వెయ్యి కోట్లుకు చేరుకున్నాయి భక్తుల విరాళాలు.. 2018 ఆగస్టులో శ్రీవాణి ట్రస్ట్ ను ప్రారంభించారు.. 2019 అక్టోబర్ నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది శ్రీవాణి ట్రస్ట్.. అప్పటి నుంచి అక్రమంగా దాతల సంఖ్య.. విరాళాలను పెంచుకుంది శ్రీవారి ట్రస్ట్‌.. 2019లో 26.25 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు 19,737 మంది భక్తులు.. ఇక, 2020లో 70.21 కోట్లు విరాళంగా సమర్పించారు 49,282 మంది భక్తులు.. మరుసటి ఏడాది అంటే.. 2021లో 176 కోట్లు విరాళంగా అందించారు లక్షా 31 వేల మంది భక్తులు.. అదే 2022 ఏడాదికి వచ్చేసరికి రూ.282.64 కోట్లు విరాళంగా అందించారు 2.70 లక్షల మంది భక్తులు.. ఇక, 2023లో ఇప్పటి వరకు రూ.268.35 కోట్లు విరాళంగా అందించారు లక్షా 58 వేల మంది భక్తులు.. ఇలా నాలుగేళ్ల కాలంలోనే వెయ్యి కోట్లు విరాళంగా వచ్చాయి. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 176 పురాతన ఆలయాల పునఃరుద్ధరణ చర్యలను ప్రారంభించింది టీటీడీ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీలో 2273 నూతన ఆలయాల నిర్మాణాలు ప్రారంభిస్తోంది.. ఇక, 501 ఆలయాలకు ధూపధీప నైవేథ్యం కింద ప్రతి నెల 5 వేల చొప్పున చెల్లిస్తూ వస్తుంది టీటీడీ.

దాదాపు నాలుగేళ్ల తర్వాత.. తుమ్మల ఇంటికి పొంగులేటి..!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కకపోవడంతో ఆ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌ గూటికి చేర్చేందుకు ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో తుమ్మలను కలిసిన రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. కాగా, ఇటీవల కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం ఉదయం ఖమ్మంలోని తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లారు. అయితే ఈ ఇద్దరు నేతలు బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికీ బహిరంగంగా పలకరించుకున్న దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు మారిన సమీకరణాల నేపథ్యంలో పొంగులేటి తుమ్మల నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం ఆప్యాయంగా పలకరించుకోనున్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా పొంగులేటి సోదరులను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ.. చంద్రయాన్ 3 సక్సెస్ వెనుక దాగున్న సీక్రెట్సా?
మన దేశ చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖించేలా.. ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ని సురక్షితంగా దించి.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అంతరిక్ష రంగంలోనే మన దేశం సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రమంలోనే దేశ, విదేశాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనల తెలుపుతున్నారు.. అయితే ఈ చంద్రయాన్ 3 సక్సెస్ వెనకాల ఉన్న మరో కారణం వెలుగులోకి వచ్చింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 విజయం వెనకాల ఆ రెండు ఉన్నట్లు పలు నివేదికలు తెలిపాయి.. చంద్రయాన్‌ 3 విజయంలో మసాలా దోశ, ఫిల్టర్‌ కాఫీ ప్రముఖ పాత‍్ర పోషించిందని ఇస్రో శాస్త్రవేత్తల నుంచి సేకరించిన సమాచారంతో కథనాన్ని ప్రచురించింది. ఈ చంద్రయాన్‌ 3 సక్సెస్‌లో మసాలా దోశ, ఫిల్టర్‌ కాఫీ పాత్రపై ఈ ప్రాజెక్టు శాస్త్రవేత్త వెంకటేశ్వర శర్మ వివరించారు. అసాధ్యమైన పనిని నిర్విరామంగా పనిచేసేందుకు సైంటిస్ట్‌లకు ఓపిక, శక్తి కావాలని తెలిపారు.. అందుకే ఈ రెండు తీసుకొని అందరూ ఇష్టపూర్వకంగా అదనపు గంటలు పని చేశారని వెంకటేశ్వర శర్మ వెల్లడించారు..

మోడీ-బైడెన్ ద్వైపాక్షిక సమావేశం.. స్పష్టం చేసిన వైట్‌హౌజ్
జీ20 సమ్మిట్ కి భారత్ సిద్ధం అయింది. ఇప్పటికే సమావేశం జరగబోతున్న ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జీ20 దేశాధినేతలు, అధికారులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సమావేశానికి రష్యా అధినేత పుతిన్ రావడం లేదు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా ఈ సమావేశానికి డుమ్మా కొట్టవచ్చని తెలుస్తోంది. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశానికి హాజరుకానున్నారు. సెప్టెంబర్ 9-10 తేదీల్లో జీ20 సమ్మిట్ జరగనుంది. అంతకు ఒక రోజు ముందే సెప్టెంబర్ 8న బైడెన్- ప్రధాని మోడీల మధ్య ద్వైపాక్షిచ సమావేశం జరగనున్నట్లు వైట్‌హౌజ్ వర్గాలు ప్రకటించాయి. ‘‘ గురువారం (సెప్టెంబర్ 7), జి 20 నేతల సదస్సులో పాల్గొనడానికి ప్రెసిడెంట్ బైడెన్ భారతదేశంలోని న్యూఢిల్లీకి వెళతారు. శుక్రవారం, ప్రెసిడెంట్ బైడెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు” అని వైట్ హౌస్ ప్రకటన పేర్కొంది.

రూ. 2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
ఆగస్టు 31వ తేదీ నాటికి నమోదైన లావాదేవీల ప్రకారం ఈ వివరాలు వెల్లడిస్తున్నట్టు ఆర్బీఐ తమ తాజా ప్రకటనలో పేర్కొంది. బ్యాంకుల నుంచి వచ్చిన డేటా ప్రకారం వెనక్కి వచ్చిన  రూ. 2 వేల నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలోనూ, మిగిలిన 13 శాతం ఇతర కరెన్సీ నోట్ల  ఎక్స్చేంజ్​ కింద వచ్చినట్లు తెలిపింది. ఆగస్టు 31 నాటికి బ్యాంకులకు చేరుకున్న రూ. 2,000 నోట్ల విలువ రూ. 3.32 లక్షల కోట్లు అని ఆర్​బీఐ  పేర్కొంది. ఇంకా చెలామణీలో మిగిలిన రూ. 2 వేల నోట్ల విలువ కేవలం రూ.24 వేల కోట్లు మాత్రమేనని తెలిపింది. ఇక ఈ రూ. 2000 నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ కొన్ని మార్గదర్శకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే . వాటి ప్రకారం.. ఎవరైనా ఒక వ్యక్తి ఒక్క రోజుకు బ్యాంకు నుంచి రూ. 20,000 వరకు.. అంటే 10 నోట్లు వరకు మాత్రమే  మార్చుకునేందుకు అవకాశం ఉంది. అయితే రూ. 2000 నోట్ల డిపాజిట్స్ పై మాత్రం పరిమితి లేదు. అయినప్పటికీ  ఎక్కువ రెండు వేల రూపాయల నోట్లను డిపాజిట్ చేసే వారు తమ పాన్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఏవైనా అవకతవకలు ఉన్నట్లు గుర్తిస్తే ఇన్ కమ్ ట్యాక్స్ రైడ్స్ జరిగే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది డిపాజిట్ చేయలేకపోతున్నారు. తరువాత ఏదైనా ప్రాబ్లమ్ అయితే వాటికి సంబంధించి ట్యాక్స్ కట్టిన వివరాలు, ఎక్కడ నుంచి సంపాదించారు ఇలా అన్ని వివరాలు  ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా వుండగా ఈ నెలతో రూ. 2000 నోట్లు మార్చకునే గడువు ముగుస్తుండగా అన్ని నోట్లను మార్చుకోవాలని ఆర్బీఐ కోరుతుంది.

భారత్ కు గుడ్ న్యూస్.. పెరిగి వృద్ధి రేటు అంచనాలు
ఇక మూడీ వేసిన ఆర్థిక వృద్ధి అంచనాలలో భారత్.. చైనా కంటే ముందు ఉంది. ఇంతకుముందు చైనా 4.5 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని అంచనా వేయగా.. తాజాగా దానిని 4 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది మూడీస్. చైనా ఆర్థిక వ్యవస్థకు వృద్ధిపరమైన సవాళ్ల రీత్యా 2024కు ఆ దేశ వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తున్నట్లు మూడీస్‌ తెలిపింది. 2023 తొలి అర్ధభాగంలో భారత్‌ సహా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తమ అంచనాలకు మించి రాణించాయని పేర్కొంది ఈ అంతర్జాతీయ సంస్థ. అయితే 2024కు భారత వృద్ధి రేటు అంచనాలను మాత్రం 6.5 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది. అధిక బేస్‌ రేట్‌ కారణంగా ఇలా తగ్గించడం జరిగిందని మూడీస్ పేర్కొంది. ఇక తాజాగా ఆర్బీఐ గవర్నర్ కు అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రకటించిన రిపోర్డు కార్డుడులో ఆయన ప్రపంచవ్యాప్తంగా టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా A+ ర్యాంకును పొంది ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. భారత్ మంచి నిర్ణయాలతో ముందుకు వెళుతుంది అనడానికి ఇది నిదర్శనం అంటూ ప్రధాని మోదీ కూడా శక్తికాంత దాస్ ను కొనియాడారు.

యాడ దొరికిన సంతరా ఇది… సంపేత్తే సంపేయండి కానీ టెన్షన్ పెట్టకండి
డైనోసార్ వెనక్కి అడుగు వేస్తుందని తెలియడంతో… మిగతా సినిమాల రిలీజ్ డేట్స్‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే సలార్ మేకర్ లాక్ చేసింది గోల్డేన్ డే లాంటిది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వరకు వరుసగా ఐదు రోజులు హాలీడేస్ ఉన్నాయి. మధ్యలో మూడు రోజులు వదిలేస్తే మళ్లీ వీకెండ్ వస్తుంది. కాబట్టి… రెండు వారాల్లో బాక్సాఫీస్ పై సలార్ దండయాత్ర మమూలుగా ఉండదని అనుకున్నారు. సడెన్‌గా సలార్ పోస్ట్ పోన్ అనే న్యూస్ షాకింగ్‌గా మారింది. దీంతో సెప్టెంబర్ 28న కొత్త సినిమాలు దూసుకొస్తున్నాయి. ఇప్పటికే మ్యాడ్ అనే సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఇక సెప్టెంబర్ 15న రావాల్సిన రామ్ ‘స్కంద’.. సలార్ డేట్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ అక్టోబర్ 19 నుంచి ముందుకొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే.. సెప్టెంబర్ 28ని మిస్ చేసుకున్న సలార్ కొత్త రిలీజ్ డేట్ ఏంటనేదే.. ఇప్పుడు ఎగ్జైటింగ్‌గా మారింది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం సలార్‌కు మూడు కొత్త డేట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాను డిసెంబర్‌లో క్రిస్మస్ టార్గెట్‌గా రిలీజ్ చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది కానీ సలార్‌కున్న హైప్ కు… ఆ బిజినెస్‌కు సంక్రాంతి అయితే బాగుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే సంక్రాంతికి గుంటూరు కారం, ఈగల్ లాంటి సినిమాలు కర్చీఫ్ వేసేశాయి. ప్రభాస్ ‘కల్కి’ జనవరి 12న డేట్ లాక్ చేసుకొని ఉంది. ఒకవేళ సలార్ వస్తే కల్కి ప్లేస్‌లోనే రావాల్సి ఉంటుంది. అప్పటికీ కుదరకపోతే రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి  26న సలార్ రావడం గ్యారెంటీ అంటున్నారు. మేజర్ టాక్ ప్రకారం.. డిసెంబర్‌ వరకు సలార్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవకపోతే.. రిపబ్లిక్ డేనే నెక్స్ట్ ఆప్షన్ అంటున్నారు. మరి దీనిపై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి. సలార్ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అనే విషయం పక్కన పెడితే, అసలు ప్రభాస్ కి బాహుబలి నుంచి ఇప్పటివరకూ చెప్పిన డేట్ కి రిలీజ్ అయిన సినిమా ఒక్కటి కూడా లేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, నెక్స్ట్ రాబోయే కల్కి సినిమాలు కూడా రిలీజ్ డేట్ వాయిదా పడుతూనే వచ్చాయి. ప్రభాస్ కి మాత్రమే ఇలా ఎందుకు అవుతుందో? ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రమే ఇంత గుండె ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో వాళ్లకే తెలియాలి.

ఈ దీపావళికి బాంబుల మోత… బాక్సాఫీస్ దగ్గర ఊచకోత
పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ సెప్టెంబర్ లో జవాన్, అక్టోబర్ లో లియో, టైగర్ నాగేశ్వర రావు సినిమాలు వస్తున్నాయి… ఇక నవంబర్ నెలలో బాక్సాఫీస్ షేప్ షకల్ మార్చడానికి టైగర్ వస్తున్నాడు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. జోయా, టైగర్ లు యాక్షన్ మోడ్ లో ఉన్నట్లు డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది.

పవన్ కళ్యాణ్ ఓజి గ్లింప్స్ అదిరిపోయిందిగా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఓజి.టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంకా అరుళ్ మోహన్ పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు.ఓజీలో పవన్ ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉండనున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగానే పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అధికారికం గా ప్రకటించారు.. మిగతా భాగం కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు వారు తెలియజేశారు..మేకర్స్ ఈ సినిమాను డిసెంబర్ లో నే విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుక గా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ కాదు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అద్భుతమైన టీజర్ ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇదేవరకే ఒక అప్డేట్ ఇచ్చారు…ఈ టీజర్ ఉందని చెప్పినప్పటి నుండి ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసారు… దీంతో మేకర్స్ నిన్న ఓజి టీజర్ టైం ను ప్రకటించారు మేకర్స్.’ఓజి ‘ఆకలి తో ఉన్న పులి (హంగ్రీ చీతా) సెప్టెంబర్ 2 ఉదయం 10.35 గంటలకు రానుందని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడం తో మేకర్స్ ముందుగా ప్రకటించినట్లు గానే తాజాగా ఓజీ టీజర్ రిలీజ్ చేస్తూ పవన్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.గ్యాంగ్ స్టర్ పాత్రలో పవన్ క్యారెక్టర్ దుమ్ము రేపింది.అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో పవన్ ఎలివేషన్స్ అదిరిపోయాయి.ధమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా పై అంచనాలు పెంచేసింది. మొత్తానికి పవన్ బర్త్డే కానుక గా ఓజి టీం అదిరిపోయే కానుక ఇచ్చింది.