NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

చంద్రబాబు నీతిమంతుడు అయితే.. టీడీపీ నేతలు ఎందుకు పారిపోయారు..?
అసెంబ్లీ నుంచి ఎందుకు టీడీపీ నేతలు పారిపోయారు.. చంద్రబాబు నీతిమంతుడు అయితే ఎందుకు అసెంబ్లీలో చర్చకు సిద్ధం కాలేదు అని నిలదీశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. చంద్రబాబు అవినీతి చేయలేదని ఎన్టీఆర్ ఫ్యామిలీ, కార్యకర్తలు, ప్రజలు నమ్మరన్న ఆయన.. చంద్రబాబు 14 ఏళ్లు స్కాములే చేశారని ఆరోపించారు. అసలు చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ని అమెరికా ఎందుకు పంపారు? అని నిలదీశారు. బొంకడం మాత్రమే తెలుసు చంద్రబాబు కి.. చంద్రబాబు వి స్కామ్‌లు.. జగన్ వి స్కీమ్‌లు అని అభివర్ణించారు. లోకేష్ ఈ స్కాంలో పాత్రధారుడు, సూత్రధారుడు కనుకే దాక్కున్నాడు అని ఆరోపించారు మంత్రి కారుమూరి.. ఇక, నందమూరి బాలకృష్ణ తొడగొడితే తాత్కాలిక అసెంబ్లీ పడిపోతుందేమో అని భయపడ్డాను అంటూ ఎద్దేవా చేశారు. బాలకృష్ణ, లోకేష్ కలిసి టిడిపిని కబ్జా చేయాలని, పదవి లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు. అచ్చెం నాయుడు పాత్రని బాలకృష్ణ పోషిస్తున్నాడు అసెంబ్లీలో.. యనమల కూడా కుర్చీని కైవసం చేసుకోవాలని చూస్తున్నారు.. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన పాపం పోదు కదా..? అని ప్రశ్నించారు. ఏపీ స్కిల్‌ స్కామ్‌లో 13 సంతకాలు చంద్రబాబు చేశాడని ఆరోపించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. కాగా, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. మరోవైపు నారా లోకేష్‌ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం విదితమే.

ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులను వాడుకొని బయటకు నెట్టలేదా..? జూ.ఎన్టీఆర్‌ని అణగదొక్కలేదా..?
ఏపీ స్కిల్‌ స్కామ్‌, అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరు, చంద్రబాబు వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. శాసనసభా సమావేశాల సమయాన్ని టీడీపీ సభ్యులు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు కేసులను ఎత్తివేయమని శాసనసభా సమావేశాల్లో అడగడం అవివేకమన్న ఆయన.. టీడీపీ సభ్యులు కవ్వింపు చర్యలకు దిగారు. సభను సక్రమంగా నడవనీకుండా ఉద్దేశ్యపూర్వకంగా గందరగోళం సృష్టించారు. చంద్రబాబుకు దమ్ముంటే తన నిజాయితీని నిరూపించుకొని నిర్దోషిగా బయటకు రావాలి అని సవాల్‌ చేశారు. తన కేసులపై ఉన్న స్టే అన్నింటిపైన విచారణ జరిపి కడిగిన ముత్యంలా బయటకు రావాలని సూచించారు. ఇక, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో చంద్రబాబు సభ్యుడా? అని ప్రశ్నించారు కోలగట్ల.. ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులను వాడుకొని బయటకు నెట్టలేదా? అని మండిపడ్డ ఆయన.. లోకేష్ కు అడ్డుగా ఉన్నాడని.. జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అన్ని స్టేలు ఎత్తి వేయించుకొని విచారణ జరిపించుకొని మీ నిజాయితీని నిరూపించుకోండి.. ఇంకా మూడు రోజులు సభ జరుగుతుంది టీడీపీ సభ్యులు చెప్పాల్సింది సభకు వచ్చి చెప్పండి అని సలహా ఇచ్చారు. సీఐడీ కస్టడీలో ఇంకా చాలా విషయాలు బయటకు రావాలి అన్నారు కోలగట్ల వీరభద్రస్వామి.

చంద్రబాబు 49 ఏళ్లుగా నాకు తెలుసు.. చాలా భయస్తుడు..!
49 ఏళ్లుగా చంద్రబాబు నాకు తెలుసు.. చంద్రబాబు చాలా భయస్తుడని వ్యాఖ్యానించారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చింతామోహన్.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సొంత తమ్ముడుకి మేలు చేసినా జనాలు ఏమి అనుకుంటారో అని సహాయం చేయకుండా ఉండే వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. కానీ, వ్యక్తిగత కక్ష రాజకీయాలు మంచి కాదని హితవుపలికారు.. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఎంతో కలిసి మెలసి ఉండేవారు.. అనుభవం లేకపోవడం వల్ల వైఎస్‌ జగన్ ఇలాంటి చర్యలు తీసుకున్నారని.. వైసీపీ తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకే అనుకూలంగా మారిందన్నారు. ఇక, అసెంబ్లీలో స్పీకర్ పైనా ఎమ్మెల్యేలకు నమ్మకం లేదన్నారు చింతా మోహన్‌.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు జైల్లో.. వైఎస్‌ జగన్ బెయిల్ పై ఉన్నారన్న ఆయన.. మహిళ రిజర్వేషన్ పై బీజేపీ చేస్తున్నది మ్యాజిక్.. నమ్మడానికి ఏమీ లేదన్నారు.. ఇది కేవలం ఎన్నికల స్టంట్‌గానే కొట్టిపారేశారు. మహిళ రిజర్వేషన్ టీటీడీలో.. సుప్రీంకోర్టు జిడ్జి నియామకాల్లో.. ఐఏఎస్‌లలో వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేవారు. మరోవైపు.. 17 వేల కోట్ల రూపాయల టీటీడీ నిధులు, బంగారం నిల్వలు ఎక్కడ పోయాయో టీడీపీ అధికారులు చెప్పాలని డిమాండ్‌ చేశారు.. 17 వేల కోట్లును వడ్డీ కోసం ఇచ్చామంటున్నారు.. అది ఎక్కడ ఇచ్చారంటే మాత్రం టీటీడీ నుంచి సమాధానం లేదంటూ దుయ్యబట్టారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌.

సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌..
ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు మరింత హీట్‌ పెంచుతోంది.. ఇప్పటి వరకు ఏసీబీ కోర్టు, హైకోర్టు వరకే పరిమితమైన ఈ కేసు.. ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు చంద్రబాబు.. ఆయన తరపున న్యాయవాదులు ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పిటిషన్ లో ఆయన న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా, ఈ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే.

విశాఖలో హత్య కలకలం.. బాలుగు గొంతు కోసి, సముద్రంలోకి విసిరేసి..!
విశాఖపట్నంలో ఓ బాలిడి హత్య కలకలం సృష్టిస్తోంది.. విశాఖ వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 16 ఏళ్ల బాలుడిని దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. బాలుడు గొంతు కోసి.. గోనె సంచిలో చుట్టి.. ఫిషింగ్ హార్బర్ సముద్రంలోకి విసిరేసి పరారయ్యారు.. మృతుడు భజన కోవెల గొల్ల వీధిలో ఉంటున్న చిన్న అలియాస్ చిన్న విస్కీగా గుర్తించారు పోలీసులు.. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వన్ టౌన్ పోలీసులు.. అసలు బాలుడిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది..? హత్య వెనుక ఎవరున్నారు..? కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసుల విచారణ చేపట్టారు పోలీసులు. కాగా, విశాఖలో వరుసగా ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. కిడ్నాప్‌లు, హత్యలు జరగడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విశాఖపట్నం వాసులు.

మల్కాజ్‌గిరి టికెట్‌ నాకొద్దు.. పార్టీకే రాజీనామా చేస్తున్న.. మైనం పల్లి లేఖ
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిన్న(శుక్రవారం) వీడియో రూపంలో పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు మైనంపల్లి ప్రకటించారు. ఇప్పుడు ఎమ్మెల్యే రాజీనామా లేఖను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపారు. మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్ నిరాకరిస్తున్నానని.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మైనంపల్లి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. “నేను భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నేను నా నియోజకవర్గం మల్కాజిగిరి అసెంబ్లీ టిక్కెట్ను తిరస్కరించాను. నా మద్దతుదారులు మరియు నియోజకవర్గాలతో చాలా చర్చలు మరియు సంప్రదింపుల తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీలో చేరినప్పుడు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో GHMCలో ఒక్క కార్పొరేటర్ లేకుండా మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో ఎదురుగాలులు వీస్తున్నాయి.పార్టీ కోసం,ప్రజల కోసం కష్టపడ్డాను.గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా నా కృషిని గుర్తించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. 2016 GHMC ఎన్నికల్లో పార్టీని గెలిపించి, ఎమ్మెల్సీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం కల్పించడం కోసం.. అయితే ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యానని తెలిపారు.. దాని పనితీరులో ప్రజాస్వామ్యం, పారదర్శకత లేదు. పార్టీ నాయకత్వం కిందిస్థాయి కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకాభిప్రాయం, సంప్రదింపులు లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. పార్టీ శ్రేణుల అధిష్టానికి విరుద్ధంగా టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడమే ఇందుకు నిదర్శనం అన్నారు.

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ గ్రూప్-1 పరీక్ష మళ్లీ రద్దు..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్‌పై టీఎస్ హైకోర్టు విచారణ చేపట్టింది. జూన్ 11న జరిగిన పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని కోర్టు ఆదేశించింది. తెలంగాణలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.. TSPSC గ్రూప్-1 పోస్టులకు మొత్తం 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష లీకేజీ కారణాల వల్ల ఇప్పటికే ఒకసారి రద్దు చేయబడి, జూన్ 11న మరోసారి నిర్వహించబడింది. ఇప్పుడు రద్దు చేయడం ఇది రెండోసారి. అయితే గ్రూప్-1 రద్దు చేయాలని కోరుతూ జూన్‌లో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని ఆదిలాబాద్‌కు చెందిన బి.ప్రశాంత్‌ మరో ఇద్దరు అభ్యర్థులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా.. అభ్యర్థుల బయోమెట్రిక్, హాల్ టికెట్ నంబర్, ఫొటో తీసుకోకుండానే ఓమార్ షీట్ ఇచ్చారని ముగ్గురు అభ్యర్థులు పిటిషన్‌లో పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. ఈ నెల 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష సజావుగా ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. పరీక్షకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా 2,33,248 మంది హాజరయ్యారు. హాజరు శాతం 61.37గా నమోదైంది. లీకేజీ సమస్య కారణంగా టీఎస్‌పీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధనలను కఠినంగా అమలు చేశారు. గతంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోగా ఈసారి చేయలేదు.

రూ.290కోట్ల పన్ను నోటీసుపై అప్పీల్ దాఖలు చేయనున్న ఎల్ఐసీ
జీఎస్టీ అథారిటీ పాట్నా నుంచి అందిన రూ.290 కోట్ల పన్ను నోటీసుపై అప్పీల్ దాఖలు చేయనున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) శుక్రవారం తెలిపింది. బిహార్‌లోని పాట్నా అదనపు రాష్ట్ర పన్ను కమిషనర్ (అప్పీల్స్) వడ్డీ, జరిమానాతో పాటు వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎల్‌ఐసి స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. ఎల్ఐసీ ఈ నోటీసుకు వ్యతిరేకంగా జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు నిర్ణీత గడువులోపు అప్పీల్ దాఖలు చేస్తుంది. ప్రీమియం చెల్లింపుపై బీమా చేసిన వ్యక్తి నుంచి తీసుకున్న ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను ఎల్‌ఐసీ రీఫండ్ చేయలేదని, మరికొన్ని ఉల్లంఘనలపై జీఎస్టీ అధికారులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్‌టి కూడా డెల్టా కార్ప్, దాని మూడు అనుబంధ సంస్థలకు 16822 కోట్ల రూపాయల పన్ను నోటీసును పంపింది. ఈ పన్ను బాధ్యత జూలై 2017- మార్చి 2022 మధ్య ఉంటుంది. డెల్టా కార్ప్‌కు రూ.11140 కోట్లు, అనుబంధ సంస్థలకు రూ.5682 కోట్ల నోటీసులు జారీ చేశారు.

గుండె పగిలే దుఖంలోనూ సినిమా రిలీజ్ చేస్తున్న విజయ్.. ఎందుకంటే?
సినీ నటుడు విజయ్‌ ఆంటోనీకి ఏ తండ్రికి రాకూడని పెద్ద కష్టం వచ్చింది. ఆయన పెద్ద కుమార్తె మీరా ఇటీవల ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. కారణం ఏంటో తెలియదు కానీ ఆమె చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆంటోని కుటుంబం మొత్తం బాధలో కూరుకుపోయింది. మొత్తం కుటుంబం శోకసంద్రంలో ఉన్నప్పటికీ విజయ్ ఆంటోనీ మాత్రం తన వృత్తి ధర్మాన్ని మరచిపోలేదు. తన కొత్త సినిమా  ‘రత్తం’ విడుదల ఆపకూడదని ఆయన సూచించారు. తన సమస్య కారణంగా సినిమా ఆగిపోతే నిర్మాతలు నష్టపోతారని భావించిన విజయ్ ఆంటోని సినిమాను అనుకున్న తేదీకే విడుదల చేయాలని చెప్పారట. ఎందుకంటే  అక్టోబర్‌ 6న ఈ చిత్రాన్ని తమిళ్ లో విడుదల చేయాలని నిర్ణయించిన చిత్ర యూనిట్ దాని కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. రెండు వారాల క్రితం నుంచే రత్తం సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టారు. బిజినెస్ డీల్స్ తో పాటు థియేటర్లను కూడా ముందస్తుగానే లాక్ చేసుకున్నారు. తీరా ఇలాంటి సమయంలో సినిమా వాయిదా పడితే నిర్మాతకు భారీగా నష్టం వస్తుంది. అందుకే అలా జరగకూడదని కూతురు చనిపోయిన బాధలో ఉన్నప్పుడు కూడా విజయ్ ఆంటోని ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌, టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చెన్నైలో తీవ్ర సంచలనం సృష్టించిన వరుస హత్యల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.  ఈ వరుస హత్యల కారణంగా చెన్నైలో  పెద్ద రాజకీయ దుమారమే చెలరేగింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన  సీఎస్‌ ఆముధన్‌ ప్రతి సన్నివేశాన్ని ఆకట్టుకునే విధంగా తెరకెక్కిచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్ ఆంటోని పాత్ర ఆకట్టుకునే విధంగా ఉంది.  ఆయన గడ్డంతో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు.  ఈ సినిమాలో నందితా శ్వేత జర్నలిస్ట్‌ పాత్రలో కనిపించనుంది.

మేకప్ ఆర్టిస్ట్ కాస్త హీరోయిన్ అయి.. జీవితాంతం ప్రేమకోసం పరితపించిపోయింది
సిల్క్ స్మిత ఈ పేరంటే తెలియని వారుండరు. తన అందచందాలతో ఓ తరం కుర్రకారును ఉర్రూతలూగించిన హీరోయిన్ కమ్ డ్యాన్సర్. ఆమె ప్రపంచాన్ని వీడి ఇన్నాళ్లైన ప్రేక్షకుల నోళ్లలో తన పేరు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆమె తన కెరీర్‌ను చాలా కింది నుంచి ప్రారంభించి.. తన కీర్తిని ఆకాశం అంత ఎత్తుకు తన నటన, అందంతో తీసుకెళ్లింది. ఆమె కథలు ఇప్పటికీ ప్రజల నోళ్లలో ఉన్నాయి. 1960 డిసెంబర్ 2వ తేదీన చెన్నైలోని తెలుగు కుటుంబంలో జన్మించారు సిల్క్ స్మిత. 23 సెప్టెంబర్ 1996 న తన 36ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు చెప్పారు. తన వర్ధంతి స్పెషల్‌లో సిల్క్ స్మిత జీవితంలోని కొన్ని కథల గురించి తెలుసుకుందాం. సిల్క్ స్మిత బాల్యం కష్టాల్లోనే గడిచింది. తను కడు పేదరిక కుటుంబంలో జన్మించింది. ఆమె ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దాని కారణంగా తాను కేవలం 10 సంవత్సరాల వయస్సులో చదువును వదిలివేయవలసి వచ్చింది. కొంతకాలం తర్వాత సిల్క్ స్మిత పెళ్లి చేసుకుంది. అక్కడా తనకు సుఖం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె అత్తమామల ఇంటిని వదిలి చెన్నైకి వచ్చింది.

ఏజెంట్ ధృవ్ వస్తున్నాడు… ఇది ట్రైలర్ కాదు బ్లేజర్…
పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఒక మూవీని మూడేళ్లు, అయిదేళ్ల పాటు షూటింగ్ చేయడం మాములే. అయితే ఒక సినిమా మాత్రం గత ఏడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఇన్నేళ్లుగా సినీ అభిమానులని ఊరిస్తూనే ఉన్న సినిమా ‘ధృవ నచ్చితరం’. చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఏడేళ్లుగా జరుగుతూనే ఉంది. సెవెన్ ఇయర్స్ అంటే ఇదేదో భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమా అనుకోకండి, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సొంత డబ్బులతో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబ్బటి ధృవ నచ్చితరం డిలే అవుతూ ఉంది. తన దగ్గర డబ్బులు అయిపోయినా, టెక్నీకల్ ఇష్యూస్ వచ్చినా… గౌతమ్ మీనన్ నటుడిగా మారి మరీ తనకి వచ్చి రెమ్యునరేషన్ తో ధృవ నచ్చితరం షూటింగ్ చేస్తున్నాడు. ఒక సినిమా కోసం విక్రమ్ కూడా దర్శకుడికి ఇంత సపోర్ట్ చేయడం గొప్ప విషయం. గ్లిమ్ప్స్ తో ధృవ నచ్చితరం సినిమాపై అంచనాలని పెంచిన గౌతమ్ వాసుదేవ్ మీనన్, టీజర్ తో ఏ స్టాండర్డ్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారో ప్రూవ్ చేసాడు. స్పై థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ధృవ నచ్చితరం సినిమా కోసం విక్రమ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ పెరుగుతూనే ఉంది కానీ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే ప్రశ్నకి సమాధానం దొరకలేదు ఇన్ని రోజులు. లేటెస్ట్ గా మేకర్స్ ధృవ నచ్చితరం సినిమా నవంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసి ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేశారు. దీంతో విక్రమ్ ఫ్యాన్స్ అంతా రిలాక్స్ అయ్యారు, అయితే ధృవ నచ్చితరం సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, అది వాయిదా పడడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే చాలు సార్లు విడుదల తేదీని అనౌన్స్ చేసి వాయిదా వేశారు. మరి ఈసారి అయినా దృవ నచ్చితరం సినిమా చెప్పిన డేట్ కి వస్తుందేమో చూడాలి.

విచారణకు హీరో నవదీప్.. పెద్ద తలకాయల్లో కొత్త టెన్షన్..!
మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణ మొదలైంది.. హీరో నవదీప్ ను నార్కోటిక్ బ్యూరో అధికారులు ప్రశ్నిస్తున్నారు.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఏ 29గా హీరో నవదీప్ ఉన్న విషయం తెలిసిందే కాగా.. డ్రగ్స్ సప్లయర్ రామచందర్‌తో నవదీప్‌కు ఉన్న సంబంధాలపై నార్కోటిక్ పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు.. నవదీప్ ద్వారానే ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్టు అనుమానిస్తున్నారు. అదే కోణంలో ప్రశ్నలు సంధిస్తున్నారట.. సప్లయర్ రామచందర్ పట్టుబడినప్పటి నుంచి హీరో నవదీప్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు.. 41 ఏ సీఆర్‌పీసీ కింద విచారణకు హాజరు కావాలని నవదీప్‌కు సూచించింది. ఇక, కోర్టు ఆదేశాల నేపథ్యంలో నవదీప్‌కు 41 ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసిన అధికారులు.. ఈ రోజు నవదీప్‌ను ప్రశ్నిస్తున్నారు. నవదీప్ ముందు 20 ప్రశ్నలు ఇచ్చిన నార్కోటిక్ బ్యూరో అధికారులు.. రామచందర్‌ తో పరిచాయలపై అధికారులు ఆరాతీస్తున్నట్టుగా తెలుస్తోంది.. నవదీప్, రామచందర్‌ ఇద్దరు అత్యంత సన్నిహితులు ఉన్నారని.. ఇద్దరు కలిసి ఎప్పుడు..? ఎక్కడ..? ఎలా..? డ్రగ్స్ తీసుకున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట.. రామచందర్‌ తో ఉన్న పరిచయం ఏంటి..? రామచందర్‌ను చివరిసారిగా ఎప్పుడు కలిశారు ..? రామచందర్‌ ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చేవాడు..? లాంటి ప్రశ్నలను నవదీప్‌ను సంధిస్తున్నారట అధికారులు.