Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

అప్పటి నుంచే మహిళా రిజర్వేషన్లు అమలులోకి..!
లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లును తీసుకొచ్చింది ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఈ రోజు లోక్‌సభలో చర్చించి.. ఆమోదించే అవకాశం కూడా ఉంది.. అయితే, ఇప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనే చర్చ సాగుతోంది.. దీనిపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ క్లారిటీ ఇచ్చారు.. జనగణన, డీలిమిటేషన్‌ తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇప్పుడు దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీలె నరసింహారావు మాట్లాడుతూ.. జన గణనను 2025 లోపు పూర్తి చేయాలని మోడీ సర్కార్ అలోచనగా తెలిపారు.. జనగణన , డీలిమిటేషన్ తర్వాత మహిళ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయన్న ఆయన.. 2026 నుంచి జరిగే ఎన్నికల్లో మహిళ రిజర్వేషన్లు అమలులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. చట్ట సభల్లో మహిళ సంఖ్య గణనీయంగా పెరగనుంది అన్నారు జీవీఎల్.. గతంలో మహిళ రిజర్వేషన్ల బిల్లును యూపీఏ సర్కార్‌ బుట్ట దాఖలు చేసిందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లులో అనవసర అంశాలు ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మా బిల్లు అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి అంటూ మండిపడ్డారు. సరైన సమయంలోనే మహిళా రిజర్వేషన్ల బిల్లును మోడీ సర్కార్ తీసుకువచ్చింది.. యూపీఏ మహిళా రిజర్వేషన్ల బిల్లులో 5 ఏళ్లకు ఒక సారి సీట్లు మార్చాలని ఉంది.. ఇలా చేస్తే మహిళా నాయకత్వం బలపబడదు.. అందుకే మోడీ ప్రభుత్వం మహిళ రిజర్వేషన్ల బిల్లులో 15 ఏళ్ల రొటేషన్ పద్ధతి ఉందని వెల్లడించారు ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.

ఏపీ కేబినెట్‌ ముందు 49 అంశాలు.. వారికి గుడ్‌న్యూస్‌..!
సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది.. మొత్తంగా 49 అంశాలపై కేబినెట్‌ చర్చించనుంది.. ఇందులో పలు కీలక అంశాలు ఉన్నాయి.. నిరుద్యోగులకు శుభవార్త చెప్పే అంశాలు కూడా ఉన్నాయి.. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం తీసుకురాబోతున్నారు.. ఈ పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చనింది ప్రభుత్వం. UPSCలో ప్రిలిమ్స్, మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆర్ధిక సాయం చేయనుంది సర్కార్‌.. ఇక, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లుపై కేబినెట్‌ చర్చించనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు ముసాయిదా బిల్లుపై చర్చ జరగనుండగా.. ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లుపై చర్చ ఉంటుంది.. జగనన్న ఆరోగ్య సురక్ష పై కేబినెట్‌లోచర్చ సాగుతుండగా.. కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదనపై కూడా చర్చిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ ఆధార్ సవరణ బిల్లుపై కేబినెట్‌లో చర్చకు రానుంది.. పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణం కి ఆమోదం తెలపనుంది కేబినెట్‌.. అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు పీఓటీ చట్ట సవరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది. భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లు పై చర్చ సాగనుండగా.. దేవాదాయ చట్ట సవరణపై కేబినెట్‌ చర్చించనుంది.. ఒంగోలు, ఏలూరు, విజయవాడ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో 123 టీచింగ్, 45 నాన్ టీచింగ్ పోస్టులకు ఆమోదం తెలపబోతోంది..

ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మరో ఏడాది ఉచిత వసతి..
హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతని మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. గతంలో ఉత్తర్వుల ప్రకారం.. ఈ ఏడాది జూన్‌ వరకు ఉచిత వసతి అవకాశం ఉండగా.. 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకూ ఉచిత వసతి, ట్రాన్సిట్ వసతి కల్పిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం, హెచ్‌వోడీలు, హైకోర్టు, రాజ్ భవన్‌లో విధులు నిర్వహించే ఉద్యోగులకు విజయవాడ, గుంటూరు వేర్వేరు ప్రాంతాల్లో కేటాయించిన వసతి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా.. సచివాలయం, వివిధ శాఖలకు సంబంధించిన హెచ్‌వోడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యాన్ని పునరుద్దరిస్తూ ప్రభుత్వం ఊరట కల్పించింది. కాగా, సచివాలయ, హెచ్‌వోడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఉచిత వసతిని ఎత్తివేస్తున్నట్టు గతంలో ఉత్తర్వులిచ్చింది ఏపీ ప్రభుత్వం.. కానీ, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో ఉచిత వసతి సౌకర్యాన్ని పునరుద్ధరించిన విషయం విదితమే.

జనసేన – బీజేపీ పొత్తు.. మరోసారి క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఉండగా.. తాజాగా ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్‌ జైలులో కలిసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీ-జనసేన కలిసి ముందుకు వెళ్తాయని ప్రకటించారు.. ఇదే సమయంలో.. బీజేపీ మాతో కలిసి వస్తుందా? లేదా? అనే విషయం వారే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే స్పందించిన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. మరోసారి ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. పొత్తులు అనేవి ఎన్నికలకు నెల ముందు నిర్మించబడతాయి.. ఆ విషయాన్ని కేంద్ర పెద్దలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో బీజేపీతో పొత్తులో ఉన్నాను అని చెప్పారు.. మేం జనసేన తో పొత్తులో ఉన్నాం అన్నారు పురంధేశ్వరి.. అయితే, పవన్‌ కల్యాణ్‌.. తెలుగుదేశం పార్టీతో వెళ్లాలి అనే విషయం కేంద్రంతో చర్చిస్తా అన్నారు.. ఆ విషయం పార్టీ పెద్దలు చూసుకుంటారని తెలిపారు. కానీ, రాష్ట్రంలో ఏం జరిగిన బీజేపీకి ఆపాదించడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సమర్థనీయం కాదన్నారు.. పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. చీప్‌ లిక్కర్‌ ద్వారా డబ్బు సంపాదించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం సమంజసం కాదన్నారు. ఇక, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి అనే ఆలోచన బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్నారు. సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లు తమదే అంటున్నారు. కానీ, ఆ బిల్లును అమలు చేయడానికి బీజేపీ కృషి చేస్తుందని తెలిపారు. పేదలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలను మోడీ ప్రభుత్వం చేపడుతుందని వెల్లడించారు ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి.

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు సోనియా గాంధీ మద్దతు.. వారికి రిజర్వేషన్లు రాజీవ్‌ గాంధీ వల్లే..
మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మేం మద్దతు ఇస్తాం అని ప్రకటించారు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ.. వంటిల్లు నుంచి ప్రపంచవేదికల వరకు భారత మహిళల పాత్ర ఎంతో ఉందన్న ఆమె.. మహిళలు వారి స్వార్థం గురించి ఏనాడూ ఆలోచించరని తెలిపారు.. స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిదని కొనియాడారు.. ఆధునిక భారత నిర్మాణంలో పురుషులతో కలిసి మహిళలు పోరాడారు.. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు రాజీవ్‌ గాంధీ అందించారని గుర్తుచేశారు.. పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఈ రిజర్వేషన్లను అమలుచేసిందన్న ఆమె.. అందువల్లే ఈ రోజు దేశంలో 15 లక్షల మంది మహిళలు అధికారాన్ని దక్కించుకున్నారని తెలిపారు. ఈ బిల్లుకు కాంగ్రెస్‌ పార్టీని సమర్థిస్తోందని స్పష్టం చేశారు. సరోజిని నాయుడు, సుచేత కృపలానీ, అరుణ్‌ అసఫ్‌ అలీ, విజయలక్ష్మీ పండిత్ వంటి వారెందరో దేశం కోసం పోరాడారంటూ స్మరించుకున్నారు సోనియా గాంధీ.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నేడు లోక్‌సభలో పార్టీ చర్చకు నాయకత్వం వహించారు. లోక్‌సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం సీట్లను రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం నిన్న నారీ శక్తి వందన్ బిల్లును ప్రవేశపెట్టిన విషయం విదితమే కాగా.. ఈ రోజు లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ సాగుతోంది.. లోక్‌సభలో బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లు కింద ఓబీసీ, ఎస్సీ కోటా డిమాండ్ చేయడంతో బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. భారతీయ మహిళల త్యాగాలు మరియు విజయాలను ప్రస్తావించిన సోనియా గాంధీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టినందుకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘనత వహించారని గుర్తుచేశారు.

ఒక లక్ష పెట్టుబడిని రూ. 34.70 లక్షలుగా మార్చిన కంపెనీ.. ఫుల్ ఖుషీగా ఇన్వెస్టర్లు
ఆటో పరిశ్రమలో చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి. టాటా మోటార్స్, మారుతి, మహీంద్రా వంటి ఆటో రంగ దిగ్గజాల గురించి తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అయితే ఈ రోజు ఆటో రంగంలో అలాంటి మరో కంపెనీ గురించి తెలుసుకుందాం. దీని షేర్ విలువ గతంలో రూ.9 మాత్రమే. ఇప్పుడు ఈ షేర్ విలువ రూ.315. అంటే పెట్టుబడిదారులకు 3370.26 శాతం భారీ రాబడి ఇచ్చింది. అన్నింటికంటే, ఈ కంపెనీ ఏమి చేస్తుంది.. పెట్టుబడిదారులను ఎలా ధనవంతులను చేసిందో చూద్దాం… గాబ్రియెల్ ఇండియా పేరుతో ఉన్న ఈ కంపెనీ ఆటో రంగంలో వాహన భాగాలను తయారు చేస్తుంది. ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ కార్లు, యుటిలిటీ వెహికల్స్‌తో సహా అనేక రకాల వాహనాలకు కాంపోనెంట్‌లను తయారు చేసే ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టి, ఆ పెట్టుబడిని కొనసాగించే వారెవరైనా ఈరోజు ధనవంతులుగా మారే ఉంటారు. 22 ఏప్రిల్ 2005న గాబ్రియేల్ ఇండియా వాటా కేవలం రూ.9.08 మాత్రమే. ఇప్పుడు ఈ షేర్ ధర 18 సెప్టెంబర్ 2023న రూ.315.10కి చేరుకుంది. ఈ కాలంలో ఈ కంపెనీ షేర్లు 3370.26 శాతం భారీ రాబడిని ఇచ్చాయి. పెట్టుబడిదారుడు 2005లో ఈ కంపెనీలో రూ.లక్ష పెట్టుబడి పెట్టాడు. ఈ రోజు అతని పోర్ట్‌ఫోలియో ఈ షేర్ విలువ రూ. 34.70 లక్షలు. 1961లో ఏర్పాటైన ఈ సంస్థ చిన్న పోర్ట్‌ఫోలియోతో ప్రారంభమై నేడు పెద్ద స్థాయికి చేరుకుంది. ఈ కంపెనీ టాటా, మారుతీ, మహీంద్రా వంటి దిగ్గజాల ముందు ఎక్కడా నిలబడదు. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4,523.35 కోట్లు. సెప్టెంబర్ 5న కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.338.35కి చేరాయి. ప్యాసింజర్ సెగ్మెంట్ వాహనాలకు షాక్ అబ్జార్బర్స్ , ఇతర ఆటో విడిభాగాలను తయారు చేసే ఈ కంపెనీ, చిన్న వాల్యుయేషన్ తర్వాత పెట్టుబడిదారులకు భారీ రాబడిని ఇచ్చింది.

దగ్గినందుకు జైలు శిక్ష.. అసలు కారణమేంటంటే?
సింగపూర్ లో దగ్గినందుకు ఓ వ్యక్తికి జైలు శిక్ష పడింది. అదేంటి దగ్గితేనే జైలు శిక్ష పడిందా అని అనుకుంటున్నారా? అయితే దాని చాలా పెద్ద కారణమే ఉంది. కరోనా ప్రపంచ వ్యాప్తంగా ఎంత భయందోళనలు క్రియేట్ చేసిందో తెలిసిందే. దీని వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కూడా. ఇదిలా వుండగా  తమిళ్‌ సెల్వం అనే వ్యక్తి సింగపూర్‌లోని ఓ కంపెనీలో క్లీనర్‌గా పని చేస్తున్నాడు. అయితే అతడికి 2021 లో ఆరోగ్యం పాడయ్యింది. అప్పట్లో కోవిడ్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉండటంతో అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దాంట్లో అతడికి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో టెస్ట్ ల అనంతరం అతడు ఇంటికి వెళ్లిపోకుండా తన ఆఫీసుకు వచ్చాడు. అయితే తనకి కోవిడ్ సోకింది సెలవు కావాలని తెలిపేందుకు అతడు ఆఫీసుకు వెళ్లాడు. అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాని ఆఫీస్ సిబ్బంది సూచించాడు. అయినా తమిళ్ సెల్వం వెళ్లకుండా అక్కడక్కడే తిరిగాడు.

బ్రేకింగ్: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న టాలీవుడ్ హీరో
నటుడు, హీరోగా పలు సినిమాలు చేసిన రాజా గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెన్నెల, ఆనంద్ లాంటి సినిమాలతో పక్కింటి అబ్బాయిగా ముద్ర వేసుకుని అందర్నీ ఆకట్టుకున్న రాజా అసలు పేరు రాజా అబేల్. రాజా తల్లి బ్రిటిషర్ కాగా తండ్రి తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారని పలు సందర్భాల్లో వెల్లడించారు. సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రాజా శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఓ చిన్నదాన సినిమాతో నటుడిగా కెరీర్ మొదలు పెట్టారు. హీరోగా ఆయనకు వెన్నెల సినిమాతో గుర్తింపు వచ్చింది. పార్వతి మెల్టన్, రాజా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వకపోయినా హీరోహీరోయిన్లకి మాత్రం అవకాశాలు తెచ్చిపెట్టింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న రాజా ఆ తరువాత సరైన స్టోరీలను ఎంచుకోక పోవడంతో హిట్లు కరువయ్యాయి. ఈ క్రమంలో సినిమాలకు దూరమైన ఆయన ఒకప్పుడు వైఎస్ మీద ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆయన మరణం తరువాత పార్టీ నుండి బయటికి వచ్చి పాస్టర్ అయ్యాడు. పాస్టర్ గా దైవ సేవలో మునిగి తేలుతున్న ఆయన ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గిడుగు‌ రుద్రరాజు సమక్షంలో ఆయన తిరిగి సొంత గూటికి చేరారు. ఈ క్రమంలో రాజా మాట్లాడుతూ నాకు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే అవకాశం ఇచ్చినందుకు సంతోషం అని అన్నారు. కాంగ్రెస్ లాంటి సెక్యులర్ ఆలోచనలు ఉన్న పార్టీలో చేరడం ఆనందంగా ఉందని పేర్కొన్న ఆయన అన్ని వర్గాలకీ న్యాయం చేసే పార్టీగా కాంగ్రెస్ ఉందని అన్నారు. జాతీయస్థాయిలో తెలుగువారికి లీడర్ గా ఉండే అవకాశం నాకు కాంగ్రెస్ వలన వచ్చిందన్న రాజా మణిపూర్ అంశంలో చాలామంది నోరు మెదపలేకపోయారని విమర్శించారు. రాజకీయ పదవులు ఇస్తారు కానీ ఆశిస్తే రావని రాజా పేర్కొన్నారు.

హీరో నవదీప్ కు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు..
ఇటీవల డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో కూడా చాలా సార్లు డ్రస్ వ్యవహారంలో నవదీప్ పేరు వినిపించింది.రీసెంట్ గా డ్రగ్స్ వాడకంలో సీపీ నవదీప్ పేరును ప్రస్తావించారు కూడా. కానీ అది తాను కాదు అంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు నవదీప్.తాజాగా నవదీప్‌ పిటిషన్‌ పై హైకోర్టు విచారణ ముగిసింది.41ఏ కింద నవదీప్‌కు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే విచారణకు హాజరుకావాలని కూడా నవదీప్‌ ను హైకోర్టు ఆదేశించింది.అదేవిధంగా నవదీప్‌పై గతంలో కూడా డ్రగ్స్ కేసులు ఉన్నాయని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని అతని తరపు న్యాయవాది సిద్దార్థ్ కోర్ట్ లో వాదించారు. గతంలో కూడా దర్యాప్తు సంస్థల ముందు నవదీప్ హాజరయిన విషయం అడ్వకేట్ సిద్దార్థ్ తెలిపారు.మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఎలాంటి సంబంధం లేదని అడ్వకేట్ ఎంతో స్ట్రాంగ్ గా వాదించారు. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ డ్రామా ఆడుతున్నాడని పోలీసులు తెలిపారు.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో తనకు ఏమి సంబంధం లేదంటూ మొదట బుకాయించే ప్రయత్నం చేసాడు నవదీప్. పోలీసులు ఎందుకు తన పేరు తీసుకు వచ్చారో తెలియడం లేదని, మీడియా సమావేశంలో పోలీసులు తెలిపిన పేరు తనది కాదంటూ సోషల్ మీడియా లో పోస్ట్ లు కూడా పెట్టాడు నవదీప్.. అయితే నవదీప్ ఇంట్లో నార్కోటిక్ పోలీసులు సోదాలు కూడా నిర్వహించారు. దాంతో నవదీప్ హైకోర్టు ను ఆశ్రయించాడు. అయితే ఇటీవల పోలీసుల దర్యాప్తు కు నవదీప్ స్పందించ లేదు. తాజాగా హైకోర్టు ఆదేశాల తో పోలీసుల విచారణకు నవదీప్ సహకరిస్తాడో లేదో చూడాలి.. నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు నార్కోటిక్ వద్ద పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అయితే రీసెంట్ గా హై కోర్ట్ ఆదేశాల మేరకు డ్రగ్స్ కేసులో విచారణకు నవదీప్ సహకరించకుంటే అరెస్ట్ చేస్తామని నార్కోటిక్ పోలీసులు నవదీప్ కు వార్నింగ్ ఇచ్చారు.

థియేటర్లో షారుఖ్ పాటకు డ్యాన్స్ చేసిన యువకుడు.. నెటిజన్స్ ఫిదా..
బాలివుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా ఇటీవల విడుదలై భారీ సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. ఇందులో ప్రతి సీన్ యావత్ సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇందులో పాటలు జనాలను ఊర్రూతలూరించాయి.. చాలామంది షారుఖ్ పాటకు థియేటర్లోనే అదిరిపోయే డ్యాన్స్ లు వేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. ఆ వీడియోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.. షారుఖ్ ఖాన్ యొక్క జవాన్ విడుదలై రెండు వారాలకు పైగా ఉంది, ఈ చిత్రం నుండి SRK రూపాన్ని పునఃసృష్టించడం నుండి సినిమా పాటలకు నృత్యం చేయడం వరకు, ప్రజలు చిత్రానికి సంబంధించిన అనేక వీడియోలను పంచుకుంటున్నారు. ఇటీవల సినిమా చూడటానికి వెళ్లిన ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుడు చలేయా అనే పాట ప్లే చేసినప్పుడు థియేటర్‌లో డ్యాన్స్ ఆపుకోలేకపోయాడు. అతను పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది మరియు ప్రజల నుండి కామెంట్స్ ను అందుకుంటుంది..

Exit mobile version