సీఎంవోకు మాజీ మంత్రి బాలినేని.. సీఎం జగన్‌తో భేటీకి ఛాన్స్..
ఒంగోలు పోలీసుల తీరుపై సీరియస్ అయిన మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్.. పోలీసుల తీరుకు నిరసనగా తన గన్‌మెన్‌లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్ చేశారు.. ఈ మేరకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు.. ఇది ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది.. అయితే, ఈ రోజు సీఎంవోకు వెళ్లనున్నారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ సెక్రటరీ ధనుంజయ రెడ్డితో భేటీ కానున్నారు.. అయితే, గన్ మెన్స్, ఎస్కార్ట్ లేకుండానే హైదరాబాద్ నుంచి సీఎంవోకు బయలుదేరి వెళ్లారు బాలినేని.. ఇటీవల ఒంగోలులో ఫేక్ డాక్యుమెంట్స్ స్కాంలో సిట్ పరిణామాల నేపథ్యంలో గన్ మెన్లను బాలినేని సరెండర్ చేసిన విషయం విదితమే.. సీఎంవోతో జరిగే భేటీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కీలక నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు.. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్.. కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో.. ఆయన తన పర్యటనను ముగించుకుని వచ్చిన అనంతరం సీఎం జగన్ తో బాలినేని భేటీ అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు.. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను పార్టీ అధినేతకు బాలినేని వివరించేందుకు సిద్ధమయ్యారట.. అయితే, సీఎం జగన్ తో బాలినేని భేటీపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ కీలక నిర్ణయం
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.. ఇవాళ్టితో ఆయన రిమాండ్ పూర్తి కానుంది.. దీంతో.. రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ఈ రోజు.. వర్చువల్‌గా విజయవాడలోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు.. మరోవైపు.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా కార్యక్రమాలపై కీలక నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ.. రాష్ట్రంలో వరుస పార్టీ కార్యక్రమాలపై టీడీపీ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది.. నిజం గెలవాలి పేరుతో వచ్చే వారం నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు నారా భువనేశ్వరి.. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. వారానికి కనీసం రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటన ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తోంది తెలుగుదేశం పార్టీ.. మరోవైపు.. చంద్రబాబు అరెస్టుతో ఆగిన భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని కూడా నిర్ణయానికి వచ్చారు.. భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు స్థానంలో జనంలోకి నారా లోకేష్ వెళ్లబోతున్నారు.. పార్టీ కార్యక్రమాలపై నిర్వహణ, సమీక్షపై నాలుగైదు రోజుల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.. బాబుతో నేను కార్యక్రమం నిర్వహిస్తూనే ప్రజల సమస్యలపై పోరాటాలు, పార్టీ కార్యక్రమాల స్పీడు పెంచాలని నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ. మొత్తంగా వరుస కార్యక్రమాలతో హోరెత్తించాలని టీడీపీ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు.. ఇవాళ చంద్రబాబు రిమాండ్‌పై ఏసీబీ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
ప్రభుత్వ స్కూళ్లలో కొత్త టెక్నాలజీ.. కుదిరిన ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యార్దులకు సందేహ నివృత్తి చాట్ బొట్ పేరిట ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ పరిజ్ఞానం అందుబాటులో ఉంచనుంది.. పాఠశాలల డిజిటైజేషన్ ప్రక్రియలో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా చాట్ బోట్ అందుబాటులోకి తెచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ పాఠశాల విద్యా శాఖ. మొబైల్ యాప్ ద్వారా ఏఐ చాట్ బోట్ పని చేస్తుందని వెల్లడించింది ప్రభుత్వం.. ఈ మేరకు కొన్వే జీనియస్ ఏఐ సొల్యూషన్స్ సంస్థ తో ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్.. ఇక, విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌లు, పాఠశాలల్లో స్మార్ట్ బోర్డుల ద్వారా ఏఐ సందేహ నివృత్తి చాట్ బోట్ అందుబాటులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. తరగతి వేళలు ముగిసిన అనంతరం ఈ చాట్ బోట్ ద్వారా విద్యార్థులు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చే దిశగా సీఎం వైఎస్ జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్న ఆయన.. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో కీలక మార్పులు తీసుకొచ్చారు.. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఏపీ విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులు తీసుకురావాలని కూడా గతంలోనే నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
నేనే రాజు.. నేనే మంత్రి.. టికెట్ నాదే అంటే కుదరదు..!
నేనే రాజు.. నేనే మంత్రి.. 2024 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నాదే అని చెప్పుకుంటే కుదరదు అంటూ వైసీపీ ఇంఛార్జ్ నేదురుమల్లి రాంకూర్‌రెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు ఆ పార్టీ నేత కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. నేదురుమల్లి శైలితో పార్టీలో సమన్వయం లోపించిందని విమర్శించారు. మున్సిపాలిటీలో, మండల్లాల్లో, గ్రామాల్లో పార్టీ కోసం కష్టపడిన నాయకులకు ప్రాధాన్యత లేదు.. పార్టీలో ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారికి ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ లేదు.. పార్టీ నిర్ణయాల ప్రకారం 10 నెలల క్రితం నేదురుమల్లిని స్వాగతించాం. కానీ, ప్రస్తుతం నేదురుమల్లి నియోజకవర్గంలో తాను చెప్పిందే జరగాలంటూ నియంతలా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇటీవల వెంకటగిరిలో జరిగిన సీఎం వైఎస్ జగన్ పర్యటనలో వారికి ప్రాధాన్యత లేదు. నియోజకవర్గంలో పరిస్థితిని పార్టీ అధిష్టానానికి తెలియజేశాం అని తెలిపారు కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి.. పార్టీలో నేదురుమల్లి రాంకూర్‌రెడ్డి పరిస్థితి ఇలానే ఉంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని హెచ్చరించారు. భయపెట్టడం, బెదిరించడం మానుకోవాలని సూచించారు. ఇక, నేనే రాజు… నేనే మంత్రి అంటే కుదరదు. 2024 వైసీపీ టికెట్ నాదే అని చెప్పుకుంటే కుదరదు. టికెట్ ఎవరికనేది ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి.
హోటల్ లో రాసలీలలు.. యువతితో బుక్కయిన కానిస్టేబుల్
రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్. ఇది మర్చిపోయి నేను ఎం చేసిన అడిగేవాళ్ళే లేరు నాకేంటి అని రెచ్చిపోతే. నువ్వెంటి నీ తల్లో జేజమ్మ కూడా చట్టానికి తలవంచక తగప్పదు అంటారు అధికారులు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆచి తూచి వ్యవహరించాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇంతకీ ఎం అయిందా? అనేగా మీ సందేహం.. లాడ్జిలో తప్పుడు పనులను చేసే వాళ్ళని బుక్ చెయ్యాల్సిన కానిస్టేబుల్ తానే యువతితో రాసలీల సాగిస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. గుంటూరులో శ్రీనివాస రావు అనే వ్యక్తి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి ప్రకాశం జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. అయితే శ్రీనివాస రావు మరో యువతితో వివాహేతర సంబంధాన్ని సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భార్య భర్తలకు తరుచు వాగ్వివాదాలు జరుగుతుండేవి. భార్య ఎన్ని సార్లు అడిగిన అలాంటిది ఏమి లేదని బుకాయించేవాడు శ్రీనివాస్. కాగా ఓ లాడ్జిలో శ్రీనివాస్ రావు యువతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు శ్రీనివాస్ రావు భార్య, బంధువులు. వెంటనే భార్య, బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లాడ్జిలో ఉన్న శ్రీనివాస్ రావుని అలానే యువతిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బైక్ ఎక్కిన రాహుల్ గాంధీ.. బాంబుల గడ్డ వరకు నిరుద్యోగులతో ర్యాలీ..
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గురువారం భూపాలపల్లిలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఈ నెల 18న ములుగు నియోజకవర్గంలో బస్సుయాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్ర నిన్న రాత్రి భూపాలపల్లికి చేరుకుంది. రాహుల్ గాంధీ భూపాలపల్లిలోని జెన్ కో అతిథి గృహంలో రాత్రి బస చేశారు. ఈరోజు ఉదయం భూపాలపల్లిలోని కేటీకే ఐదో గని నుంచి బొమ్మ గడ్డ వరకు నిరుద్యోగులతో రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అంబేద్కర్ సెంటర్‌లో రాహుల్ గాంధీ కొద్దిసేపు స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత రెండో రోజు భూపాలపల్లి నుంచి కాటారం వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రేపటి వరకు కాంగ్రెస్ బస్సు యాత్ర కొనసాగనుంది. తొలి విడత బస్సు యాత్ర రేపటితో ముగియనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి రాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. కర్నాటక ఫార్ములాను ఆ పార్టీ తెలంగాణలో అమలు చేయనుంది. పార్టీ నేతలంతా ఒక్కటయ్యారనే సంకేతం ఇచ్చేందుకు కాంగ్రెస్ బస్సుయాత్ర చేపట్టింది.
కాంగ్రెస్ సీట్లు సెంచరీ కొట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
70 సీట్లు అనుకున్నాం కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ మేనిఫెస్టోని కేసీఆర్ కాపీ కొట్టారో అప్పుడు 75 అయిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని తెలిపారు. రాహుల్ గాంధీ, ప్రియాంక విజభేరికి కాంగ్రెస్ సీట్లు పెరగడం ఖాయమన్నారు. కాంగ్రెస్ సీట్లు సెంచరీ కొట్టిన ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు. కేసీఆర్ కు సింగిల్ డిజిట్ అవుతుందని పరిషాన్ కావాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రూప్2 విద్యార్థిని ప్రవళిక కుటుంబాన్ని కలవలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవళిక కుటుంబానికి ఆర్ధిక సహాయం చేస్తామని అన్నారు. ప్రవళిక కుటుంబాన్ని ఆదుకుంటామని, రూ.2లక్షల ఆర్ధిక సహాయం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు. ప్రవళిక కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రకటించాలని ప్రవళిక కుటుంబానికి కలిసేందుకు వెళుతున్నప్పుడు ప్రయాణం మధ్యలో ఆక్సిడెంట్ అయి ఇద్దరు యువకులు చనిపోతే వారిని కాపాడేందుకు నిలిచిపోవాల్సి వచ్చిందని దాని కారణంగా రామన్నకోటకు పోవడం జరిగిందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులారా 45రోజుల ఆగండి.. తొందరపడొద్దు. ఆత్మహత్యలు కరెక్ట్ కాదని మీడియా ద్వారా నిరుద్యోగులకు కోమటి రెడ్డి సూచించారు. పదిఏళ్లు నిరుద్యోగ నరకాన్ని అనుభవించారు.. ఒక్క 45 రోజులు ఆగాలని సూచించారు. ఫీజు రీయంబెర్స్ మెంట్ లేదు. ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. ఒక్క డిఎస్ సీ నోటిఫికేషన్ లేదు. సుమారు 70వేల మంది టీచర్లు రిటైర్ అయ్యారు. ఆరువేల స్కూల్లు మూతపడ్డాయని గుర్తుచేశారు. ఇవాళ టీఎస్‌పీసీ ఎగ్జామ్ కండెక్ట్ చేయలేనివారు లేరని అన్నారు. ఇలాంటి వారు రాష్ట్రాన్ని పాలించే హక్కువుందా? అని ప్రశ్నించారు. ప్రవళిక ఐదు పరీక్షలు రాసింది. పోలీసు ఆఫీసర్లుతో ఏం మాటలు చెప్పించారు? అని మండిపడ్డారు. ప్రేమ వ్యవహారంతోనే ఆత్మహత్య అని చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఏమో రాజకీయం చేస్తున్నారు అందతా వేరే అంటున్నారు. ఉద్యోగం కాదు.. నీ మూలంగా చనిపోయిన ప్రవళిక మాక్కావాలి.. తెచ్చిస్తావా? అని ప్రశ్నించారు. ప్రవళికనే కాదు 32 మంది సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలో ఎక్కడైనా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారా? మొదటి రాష్ట్రం తెలంగాణ అని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బాగా ఉత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. మేము కొట్టుకుంటున్నామా.. వాళ్లు కొట్టుకుంటున్నారా? కోమటి రెడ్డి ప్రశ్నించారు. రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఐదు బీఆర్‌ఎస్ లు అయితాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వీడక్కడి మనిషండి బాబూ.. ఐదు కిలోల బంగారం ధరించి గల్లీ గల్లీ తిరుగుతుండు
బంగారం అంటే మనలో చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఏదైనా ఫంక్షన్స్ కి హాజరు అయినప్పుడు పురుషులైనా స్త్రీలు అయిన వాళ్లకు ఉన్న ఆభరణాలలో ఒకటో రెండో భరణాలను అలంకరించుకుని వెళ్తారు. మిగిలిన సమయంలో సాధారణ ఆభరణాలతో ఉంటారు. ఎందుకంటే ఏదైనా మిగతంగా ఉంటేనే అందంగా ఉంటుంది. మితిమీరితే వికారంగా కనిపిస్తుంది. అయితే బీహార్ కి చెందిన ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి గోల్డ్ మ్యాన్ గా పేరు పొందాడు. దీనికి కారణం అతను ఎక్కడికి వెళ్లిన 5.2 కేజీల బంగారాన్ని ధరించి వెళ్తాడు. తన మేడలో ఎపుడు 30 గొలుసులు, రెండు చేతులకి కలిపి 10 ఉంగరాలు ధరిస్తాడు. అంతే కాదు తన కళ్ళజోడు, ఫోన్ పౌచ్ ఇలా తన దగ్గర ఉన్న అన్ని వస్తువులని బంగారంతో కప్పేసాడు. ఈ విషయం గురించ్చి భోజ్ పూర్ కు చెందిన ప్రేమ్ సింగ్ మాట్లాడుతూ, నేను భూస్వామ్య కుటుంబంలో పుట్టాను. నాకు బంగారం అంటే చాల ఇష్టం. అయితే ప్రస్తతం నేను కాంట్రాక్టరు పని చెస్తున్నాను. కాగా వచ్చిన ఆదాయంతో బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తాను. నేను ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్లినప్పుడు ప్రజలు నాతో సెల్ఫీలు తీసుకుంటారు. ఆలా వాళ్ళు నాతో సెల్ఫీలు దిగడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. అలానే తనకు ఎపుడు బయటకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు భద్రత సిబ్బందిగా తన వెంట ఉంటారని, అలానే వస్తువులకు సంబంధించిన అన్ని పత్రాలు ఎప్పుడు తనతో పాటుగా ఉంచుకుంటానని వెల్లడించారు.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. రోహిత్ శర్మ నాలుగో సెంచరీ చేసేనా?
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. పసికూనలు పెద్ద జట్లకు షాక్ ఇస్తున్నాయి. దాంతో టోర్నమెంట్ ముందుకు సాగే కొద్ది అన్ని మ్యాచ్‌లు ఆసక్తికరంగా మారాయి. ఇక మెగా టోర్నీలో జోరు మీదున్న భారత్.. నేడు అండర్ డాగ్స్ బంగ్లాదేశ్‌తో పోటీ పడుతోంది. పూణేలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.. ఐసీసీ ఈవెంట్లలో బంగ్లాదేశ్‌పై హిట్‌మ్యాన్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఐసీసీ టోర్నీల్లో బంగ్లాదేశ్‌తో ఆడిన గత మూడు సందర్భాల్లో రోహిత్ శర్మ సెంచరీలు చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శతకం (126 బంతుల్లో 137 పరుగులు) చేశాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ సెంచరీ (129 బంతుల్లో 123 నాటౌట్) బాదాడు. ఇక 2019లో హిట్‌మ్యాన్ బంగ్లాదేశ్‌పై మరో సెంచరీ (92 బంతుల్లో 104) కొట్టాడు. దాంతో బంగ్లాదేశ్‌పై ఐసీసీ టోర్నీల్లో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు. రోహిత్ గత రికార్డులు, ప్రస్తుత ఫామ్ చూస్తే.. నేడు కూడా సెంచరీ చేసే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌పై వరుసగా నాలుగో సెంచరీ నమోదు చేయడం ఖాయమని నెట్టింట ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
బాలయ్య సినిమా వదిలేయమని నాకు చాలా మంది చెప్పారు.. కానీ..
నటసింహం బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా నేడు ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. విడుదల అయిన మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతోంది.ఈసినిమాలో బాలయ్య ఎంతో కొత్తగా కనిపించారు.సరికొత్త బాలయ్య ను చూసి ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది.అయితే శ్రీలీల తాజాగా ఈసినిమాకు సబంధించిన షాకింగ్ విషయాన్ని తెలియజేసింది.. బాలకృష్ణ హోస్ట్ గా.. రీసెంట్ గా అన్ స్టాపబుల్ సీజన్ 3 స్టార్ట్ అయ్యింది. ఈ షోకి ఫస్ట్ గెస్ట్ లు గా భగవంత్ కేసరి టీమ్ నే పిలిచాడు బాలకృష్ణ. అనిల్ రావిపూడితో పాటు. కాజల్ మరియు శ్రీలీల వచ్చి సందడి చేశారు.అయితే ఈ సందర్భంగానే శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈసినిమాలో తనను నటించవద్దంటూ చాలా మంది సలహా ఇచ్చారంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల. ఆమెకు కొన్ని ప్రశ్నలు ఎదురవ్వగా.. శ్రీలీల సమాధానం చెబుతూ నేను నటించిన పెళ్లి సందడి సినిమా సమయంలోనే నాకు ఈ సినిమా కథ వినిపించారు. అప్పటికే నాకు హీరోయిన్గా చాలా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి.అలాంటి సమయంలో కూతురి పాత్ర అంటే చాలామంది ఈ సినిమాని ఒప్పుకోవద్దు నో చెప్పు అంటూ నాకు ఎన్నో సలహాలు ఇచ్చారు. కూతురు పాత్ర చేశావో.. హీరోయిన్ గా నీ కెరీయర్ దెబ్బతింటుందని అందుకే ఈ సినిమాను రిజెక్ట్ చేయమని చాలా మంది చెప్పారు. అంటు అసలు విషయం తెలిపింది శ్రీలీల.అయితే హీరోయిన్ గా నేను ఎన్ని సినిమాలైనా చేయవచ్చు కానీ ఇలా కూతురి పాత్రలో నటించే అవకాశాలు ఇక మీదట వస్తాయనే నమ్మకం నాకు లేదు.అందుకే వచ్చిన అవకాశం వదలుకోవద్దు అనుకున్నాను .. అందులోను బాలయ్య కూతురుగా నటించే అవకాశం కాబట్టి కచ్చితంగా ఇలాంటివి సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నాను అందుకే ఈ సినిమాకు కమిట్ అయ్యానని శ్రీలీల తెలిపారు.అంతే కాదు ఆమె మరో మాట చెప్పింది ..నేను కెరియర్ పరంగా తీసుకున్న బెస్ట్ నిర్ణయం ఏదైనా ఉంది అంటే ఈ సినిమాకు కమిట్ అవ్వడమే అంటూ శ్రీ లీల చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. శ్రీలీల మాటలకు అటు బాలయ్య, డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు ఫాన్స్ కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు.
