NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి వైఎస్ విజయమ్మ..
సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తల్లి వైఎస్‌ విజయమ్మ.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్నారు.. ఆమె ఈ రోజు ఉదయం ఒంగోలులోని మాజీమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి నివాసానికి వెళ్లారు.. బాలినేని కుటుంబ సభ్యులతో కలసి అల్పాహారం తీసుకున్నారు.. ఇక, శుక్రవారం రోజు వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మను పరామర్శించేందుకు ఒంగోలు వెళ్లారు వైఎస్ విజయమ్మ.. నిన్న పిచ్చమ్మను పరామర్శించిన ఆమె.. ఈ రోజు బాలినేని నివాసానికి వెళ్లారు.. విజయమ్మ రాకతో సందడిగా మారిపోయింది బాలినేని నివాసం.. కాగా, వైవీ సుబ్బారెడ్డి కుటుంబం, బాలినేని కుటుంబం వైఎస్‌ ఫ్యామిలీకి బంధువులైన విషయం విదితమే.

అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్.. సీఐడీకి సరికొత్త ఆధారాలు..!
గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్‌లను వరుసగా వెలికి తీస్తున్నామని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెబుతున్నారు.. మరోవైపు.. కక్ష సాధింపులో భాగంగానే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ, కేసుల పరంపర మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. ఈ కేసులో సీఐడీకి సరికొత్త ఆధారాలు చిక్కాయి.. అమరావతి అసైన్డ్ భూముల కేసును మళ్లీ ఓపెన్ చేస్తూ హై కోర్టులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ రెండు పిటిషన్లు ఫైల్ చేసింది.. ఈ మేరకు సీఐడీకి మాజీ మంత్రి నారాయణ మరదలు పొంగూరు కృష్ణప్రియ ఆడియో, వీడియో ఆధారాలు అందజేశారు. ఇందులో నారాయణ, తదితరులు ఏ విధంగా అక్రమంగా భూములు కొనుగోలు చేసింది.. ఎసైన్డ్ భూములున్న దళితులు, ఇతర బలహీనవర్గాలవారిని అధికార దర్పంతో బలంతో ఏ విధంగా బెదిరించారు.. ఏ విధంగా వాటిని కాజేశారు అనే విషయాలను కృష్ణప్రియ వివరించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసును రీ-ఓపెన్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు సీఐడీ అధికారులు.. వాస్తవానికి ఆ భూముల విషయంలో తాము ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని పేర్కొంటూ ఈ కేసును కొట్టేయాలని గతంలోనే కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో విచారణ ముగియగా తీర్పును హైకోర్టు ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ఎల్లుండి సోమవారం తీర్పు రానున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ కేసును రీ ఓపెన్ చేయాలంటూ సీఐడీ పిటిషన్ వేయడం టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి నారాయణకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.

ప్రమాదంలో చంద్రబాబు జీవితం.. అంత‌మొందించే కుట్ర..!
ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. గత నెల 9వ తేదీన చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేసింది.. చంద్రబాబు రిమాండ్‌ 36వ రోజుకు చేరింది.. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. చంద్రబాబును డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తు్న్నారని.. చంద్రబాబు భద్రత, ఆరోగ్య విషయంలో నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నామని జైలు అధికారులు స్పష్టం చేస్తు్నారు.. అయితే, జైలు అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. వ్యవ‌స్థల్ని మేనేజ్ చేస్తూ, జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో ఉంచుతూనే 73 ఏళ్ల చంద్రబాబుని అనారోగ్య కార‌ణాల‌తో అంత‌మొందించే కుట్ర జరుగుతోందన్నారు. భ‌ద్రత‌లేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయ‌న‌కి ప్రాణ‌హాని తల‌పెడుతున్నారంటూ ఆరోపించారు నారా లోకేష్‌.. ఎన్నడూ ఏ త‌ప్పూ చేయ‌ని 73 ఏళ్ల చంద్రబాబు ప‌ట్ల రాక్షసంగా వ్యవ‌హ‌రిస్తోంది ఈ ప్రభుత్వం అని మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉందన్నారు. జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుని ముద్దాయి అని హెల్త్ బులెటిన్‌లో ప‌దే ప‌దే పేర్కొన్నారు.. ముద్దాయి అనేందుకు పెట్టిన శ్రద్ధ చంద్రబాబు ఆరోగ్యం, భ‌ద్రత‌పై పెట్టడంలేదన్నారు. చంద్రబాబుకి ఏ హాని జ‌రిగినా, సైకో జ‌గ‌న్ స‌ర్కార్‌, జైలు అధికారుల‌దే బాధ్యత‌ అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎందుకీ కక్ష? చంద్రబాబు జీవితం ప్రమాదంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.

రాష్ట్ర ప్రభుత్వం పోర్టుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..!
కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాకో హార్బర్ ను సీఎం వైఎస్‌ జగన్ నిర్మిస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం పోర్టుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందన్నారు పాడి పరిశ్రమ శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు.. నెల్లూరు నగరంలోని వీఆర్ కళాశాల మైదానంలో జరుగుతున్న సింహపురి సేంద్రియ మేళాను కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా.. ఎంపీలు బీద మస్తాన్ రావు, జీవీఎల్‌ నరసింహారావు, మత్స్య శాఖ కమిషనర్ కన్నబాబుతో కలిసి పరిశీలించిన మంత్రి అప్పలరాజు.. సేంద్రియ, మత్య్స ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, చిరుధాన్యాల స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోర్టుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు వెల్లడించారు.. వేట నిషేధిత సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందన్నారు. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తవుతున్నాయి.. ఫిష్ ఆంధ్ర కార్యక్రమం ద్వారా సముద్ర ఆహార ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేస్తున్నామని పేర్కొన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.

ప్రధానమంత్రి యోజన పథకం కింద ఏపీకి రూ.2,500 కోట్ల అదనపు నిధులు
ప్రధానమంత్రి యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు ఇతర రాష్ట్రాల కంటే అధికంగా రూ.2 వేల 500 కోట్ల మేర నిధులు ఇచ్చామని తెలిపారు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా.. ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో ఉన్న ఆయన.. నెల్లూరు నగరంలోని వీఆర్ కళాశాల మైదానంలో జరుగుతున్న సింహపురి సేంద్రియ మేళాను ఏపీ మంత్రి అప్పలరాజు, ఎంపీలు బీద మస్తాన్ రావు, జీవీఎల్‌ నరసింహారావు, మత్స్య శాఖ కమిషనర్ కన్నబాబుతో కలిసి పరిశీలించారు.. సేంద్రియ, మత్య్స ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, చిరుధాన్యాల స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సముద్ర పరిక్రమ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నానని తెలిపారు.. దేశంలో మూడు కోట్ల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి.. వీరి సంక్షేమం కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని తెలిపారు.. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని రూ.20 వేల కోట్లతో తీసుకువచ్చారు.. దేశానికి ఎంతో తీర ప్రాంతం ఉంది.. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ నుంచి దేశం మొత్తం మీద 30 శాతం సముద్ర ఆహార ఉత్పత్తులు వస్తున్నాయని వెల్లడించారు.

దిల్ రాజు అల్లుడు కారు చోరీ.. దొంగ చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్
దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి శుక్రవారం ఉదయం రూ.1.7 కోట్ల విలువైన తన పోర్షే కారులో జూబ్లీహిల్స్ లోని దసపల్లా హోటల్ కు వెళ్లారు. హోటల్ ముందు కారు ఆపి లోపలికి వెళ్లారు. 40 నిమిషాల తర్వాత బయటకు వచ్చేసరికి కారు బయట కనిపించలేదు. దీంతో అర్చిత్ రెడ్డి వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కారు సిగ్నల్ జంప్ చేసినట్లు గుర్తించారు. వెంటనే కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారును ఆపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే కారు దొంగ చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు. తాను ప్రముఖ వ్యాపారవేత్త ఆకాష్ అంబానీ పి.ఎ అంటూ పోలీసులకు దబాయించాడు. హృతిక్ రోహన్ నా పీఏ అంటూ రుబాబుగా మాట్లాడాడు. ఒక్క మంత్రి పిక్ అప్ కొరకు కారు తీసుకొని పోతునాన్ని పోలీసులకే దబాయించి మట్లాడాడు. అతని వదిలేస్తే అంబానీ దగ్గరకు వెళ్తానని పోలీసులను బెదిరించాడు. అతని మాటలు విన్న పోలీసులు ఒక్కసారిగా తలలు పట్టుకున్నారు. కాసేపటి తర్వాత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అసలు విషయం తెలుసుకున్నారు. కారును దొంగిలించిన వ్యక్తికి మతిస్థిమితం లేదని, బ్రైట్ లైఫ్ ఫౌండేషన్‌లో చికిత్స అందించారని తేలింది. నిందితుడిని హైదరాబాద్ మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా గుర్తించారు. అనంతరం అర్చిత్ రెడ్డికి కారు అప్పగించారు.

పాము కాటుతో భర్త హత్య.. చేయించింది కట్టుకున్న భార్యే
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్ కొచ్చెర ప్రవీణ్ ఈ నెల 9న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. గుండెపోటుతో మృతి చెందాడని భార్య చెప్పడంతో.. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడిది గుండెపోటు కాదని, భార్యే ప్లాన్ వేసి హత్య చేయించిందని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ప్రవీణ్ భార్య సహా ఆమెకు సహకరించిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లిలో ప్రవీణ్, లలిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా ప్రవీణ్‌కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న భార్య లలిత నిత్యం భర్తతో గొడవ పడుతుండేది. భర్తలో మార్పు రాకపోవడంతో అతడిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ప్రవీణ్ స్థలంలో సెంట్రింగ్ పనులు చేస్తున్న రామగుండం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మచ్చ సురేష్ కు లలిత చెప్పింది. ఆమె తన భర్తను చంపితే అతనికి ప్లాట్లు ఇచ్చేందుకు రాజీ కుదుర్చుకున్నారు. హత్యకు అంగీకరించిన సురేష్.. రామగుండుకు చెందిన ఇందారపు సతీష్, మందమర్రికి చెందిన మాసా శ్రీనివాస్, భీమా గణేష్ లతో కలిసి ప్రవీణ్ ను హత్య చేసేందుకు ప్లాన్ సిద్ధం చేశాడు.

ఇండియన్ నేవి లో జాబ్స్..పూర్తి వివరాలు ఇవే..
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ ను చెబుతుంది.. తాజాగా ఇండియన్ నేవిలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 224 ఖాళీలను భర్తీ చేయనున్నారు.. అర్హత, ఆసక్తి కలిగిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. ఖాళీల సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల అర్హతలకు సంబంధించి BE/B.Tech, MBA, M.Tech, B.Sc, B.Com, M.Scతోపాటు పోస్టుల వారీగా అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులు వారి అర్హత డిగ్రీలో పొందిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు.. వారిని ఫైనల్ చేస్తారు.. ఈ ఉద్యోగాలకు ఎంపికైనా వారు సబ్ లెఫ్టినెంట్ హోదాలో నియమితులవుతారు. వారికి నెలకు రూ.56,100 బేసిక్ వేతనంతోపాటుగా పలు రకాల అలవెన్సులు అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబర్ 29 గా నిర్ణయించారు.. ఆ తర్వాత అప్లై చెయ్యడానికి ఉండదు.. ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే నేవి అధికార వెబ్ సైట్ joinindianavy.gov.in పరిశీలించగలరు.. నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు.. గతంలో కన్నా ఈసారి ఎక్కువ పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసినట్లు తెలుస్తుంది..

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్స్.. బెనిఫిట్స్ మాములుగా లేవుగా..
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన కస్టమర్ల కోసం అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తుంది.. ఇప్పటివరకు అందించిన ఫీచర్స్ జనాలను ఆకట్టుకున్నాయి..తాజాగా మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది..వాట్సాప్ బిజినెస్ ఇండికేటర్స్ ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది..యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి మెటా సర్వీసెస్‌లను కొన్ని బిజినెస్ యజమానులు ఉపయోగిస్తారు. ఆ సర్వీసులను ఉపయోగించే కొన్ని వ్యాపారాలతో చాట్ చేసినప్పుడు ఈ ఇండికేటర్స్ కనిపిస్తాయి. యూజర్ ఇంటరాక్షన్ గురించి మెటా తెలుసుకుంటుందని ఈ ఇండికేటర్స్ తెలియజేస్తాయి.. ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. ఆ సర్వీసులను ఉపయోగించే కొన్ని వ్యాపారాలతో చాట్ చేసినప్పుడు ఈ ఇండికేటర్స్ కనిపిస్తాయి. యూజర్ ఇంటరాక్షన్ గురించి మెటా తెలుసుకుంటుందని ఈ ఇండికేటర్స్ తెలియజేస్తాయి.. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోందని వాట్సాప్ బీటా లేటెస్ట్ రిపోర్ట్ వెల్లడించింది.. టెస్టర్లకు ఈ ఫీచర్ పని చేస్తుంది.. ఇక ఆండ్రాయిడ్ యాప్ ఫ్యూచర్‌ అప్‌డేట్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది.. ఈ ఇండికేటర్స్ వల్ల ప్రైవసీ దెబ్బతింటుందని చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిన్న, మధ్యస్థ వ్యాపారాలతో మెసేజ్‌లు ఇప్పటికీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి.. యుజర్, బిజినెస్ లు మాత్రమే ఇందులో ఉంటాయి..

11 నెలల్లో 29 శాతం పెరిగిన పామాయిల్ దిగుమతి.. 90.80 లక్షల టన్నులకు చేరిక
ఎడిబుల్ ఆయిల్ దిగుమతి పెరగడంతో పాటు పామాయిల్ దిగుమతి కూడా వేగంగా పెరుగుతోంది. 2022-23 సీజన్‌లో మొదటి 11 నెలల్లో భారతదేశ పామాయిల్ దిగుమతి 29.21 శాతం పెరిగి 90.80 లక్షల టన్నులకు చేరుకుంది. పామ్, ఎడిబుల్ ఆయిల్ దిగుమతులు పెరగడం దేశీయ రిఫైనర్లకు ఆందోళన కలిగించే విషయమని ఎస్ఈఏ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద కూరగాయల నూనెను కొనుగోలు చేసే దేశం భారతదేశం, గత సీజన్‌లో 70.28 లక్షల టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంది. దేశం మొత్తం కూరగాయల నూనె దిగుమతి 2022-23 నవంబర్-సెప్టెంబర్ మధ్యకాలంలో 20 శాతం పెరిగి 156.73 లక్షల టన్నులకు చేరుకుంది. ఇది మునుపటి సీజన్‌లో ఈ కాలంలో 130.13 లక్షల టన్నులు. దేశ కూరగాయల నూనె దిగుమతులు సెప్టెంబర్‌లో 5 శాతం క్షీణతతో 15.52 లక్షల టన్నులకు పడిపోయాయని, గతేడాది ఇదే కాలంలో 16.32 లక్షల టన్నులుగా నమోదయ్యాయని ఎస్‌ఇఎ తెలిపింది. ముంబయికి చెందిన సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) ఉత్పత్తుల దిగుమతి వేగంగా పెరిగిందని తెలిపింది. పామాయిల్ వాటా 59 శాతానికి పెరిగింది. సోయాబీన్, ఇతర నూనెలతో పోలిస్తే ముడి పామాయిల్ దిగుమతులు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మొత్తం 7.05 లక్షల టన్నులు, అంతకు ముందు నెలలో ఇది 8.24 లక్షల టన్నుల కంటే తక్కువ. పామాయిల్‌లో RBD పామోలిన్, ముడి పామాయిల్ (CPO), క్రూడ్ ఓలిన్, ముడి పామ్ కెర్నల్ ఆయిల్ (CPKO) కూడా ఉన్నాయి.

మొగుడు ఎందుకు మణీ వేస్ట్.. నాకు నేనే పెళ్లికి బెస్ట్
మనిషి జీవితంలో పెళ్ళికి చాల ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే కష్టసుఖాల్లో చివరి వరకు తోడుండేది కేవలం జీవిత భాగస్వామి మాత్రమే. అయితే మనకి నచ్చిన వ్యక్తిని అన్నివిధాలా మనకి సరిపోయే వ్యక్తిని ఎపిక చేసుకోవడం కష్టం. అయితే తల్లిదండ్రులు చూసిన సంబంధాలను చేసుకుని కష్టమో నష్టమో కలిసిబ్రతికేవాళ్లు కొందరు, ప్రేమించి పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళు కొందరు, స్నేహితులని వదిలి ఉండలేక ఒకే జెండర్ వ్యక్తుల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ పెళ్లి మాత్రం కనివిని ఎరుగని రీతిలో జరిగింది. ఓ మహిళా తనని తానే పెళ్లి చేసుకుని ప్రభంజనం సృష్టించింది. ఈ వింత ఘటన లండన్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. లండన్ లో సారా విల్కిన్సన్ అనే మహిళ క్రెడిట్ కంట్రోలర్‌గా పని చేస్తున్నారు. కాగా ఆమె వయసు 42 సంవత్సరాలు. రెండు దశాబ్దాలుగా ఆమె తన వివాహం కోసం డబ్బులు ఆదా చేస్తూ వచ్చింది. అయితే ఆమె కోరుకున్న లక్షణాలు ఉన్న వరుడు ఆమెకి చిక్కలేదు. దీనితో ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది. తనకు సరైన జీవిత భాగస్వామి దొరకకపోవడంతో తనని తానే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో నిశ్చితార్థపు ఉంగరాన్ని కూడా కొనుగోలు చేసింది. సఫోల్క్‌లోని ఫెలిక్స్‌స్టోవ్‌లోని హార్వెస్ట్ హౌస్‌లో ఆమె స్నేహితులు, బంధువుల సమక్షంలో ఆమె వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆమె దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఇక మీడియా తో మాట్లాడిన సారా విల్కిన్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ఈ రోజు నా పెళ్లి రోజు అయింది. నా పక్కన భాగస్వామి లేకపోవచ్చు కానీ నేను ఆ డబ్బులు నా పెళ్లి కోసం ఆదా చేసిన డబ్బులు మరి నాపెళ్ళి కి ఎందుకు ఉపయోగించకూడదు? అనే ప్రశ్నను లేవనెత్తారు.. దీనితో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే తనకి అందరూ విష్ చేశారని, తనకి ఇప్పుడు చాల సంతోషంగా ఉందని చెప్పింది. అలానే పెళ్లి సందర్భంగా తాను 14 ప్రమాణాలను చేసుకున్నానని పేర్కొన్నారు.

#SDT17 ఫస్ట్ థండర్ వచ్చేస్తుంది…
యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్… విరూపాక్ష సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమాలో నటించి, తన యాక్టింగ్ కి కాంప్లిమెంట్స్ అందుకున్నాడు. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా అప్డేట్ ని ఆడియన్స్ ముందుకి తీసుకోని రాబోతున్నాడు సాయి ధరమ్ తేజ్. రచ్చ సినిమాతో మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన మాస్ డైరెక్టర్ సంపత్ నందితో సాయి ధరమ్ తేజ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందనే రూమర్ వినిపిస్తుంది కానీ అఫీషియల్ గా మేకర్స్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ థండర్ రిలీజ్ కాబోతుంది అంటూ సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. #SDT17 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ ఫస్ట్ థండర్ రేపు ఉదయం 8:55 నిమిషాలకి రిలీజ్ చేయనున్నారు. ఈ అప్డేట్ ఇస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్ లో సాయి ధరమ్ తేజ్ ఫేస్ రివీల్ చెయ్యకుండా తేజ్ మెడపై ఉన్న త్రిశూలం టాటూని మాత్రమే రివీల్ చేసారు. దేవుడి టచ్ ఉందా లేక క్యాజువల్ టాటూనా అనేది తెలియాలి అంటే ఫస్ట్ థండర్ బయటకి వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ‘గంజా శంకర్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీన్ని ఫిలిం చాంబర్ లో సైతం నిర్మాతలు రిజిస్టర్ చేయించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే టైటిల్ ని మేకర్స్ రేపు రివీల్ చేస్తారా లేదా అనేది చూడాలి.

అనిమల్ కి పోటీగా సామ్ బహదూర్… డిసెంబర్ 1న బాలీవుడ్ లో యుద్ధం
బాలీవుడ్ లో డిసెంబర్ 1న బాక్సాఫీస్ వార్ భారీగా జరగబోతుంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న అనిమల్ సినిమా… మేఘ్నా డైరెక్ట్ చేస్తున్న సామ్ బహదూర్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ కి రెడీ అయ్యాయి. విక్కీ కౌశల్ హీరోగా నటించిన సామ్ బహదూర్ సినిమా అనౌన్స్మెంట్ రోజునే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసారు కానీ అనిమల్ మాత్రం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడి డిసెంబర్ 1న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే అనిమల్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసిన సందీప్, టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఇటీవలే అనిమల్ మూవీ నుంచి వచ్చిన అమ్మాయి సాంగ్ సినిమాకి మరింత బజ్ జనరేట్ చేసింది. సాంగ్ లో రణబీర్ కపూర్-రష్మికల కెమిస్ట్రీకి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. లవ్ స్టోరీ చేయాలన్నా, యాక్షన్ ఎపిసోడ్స్ చేయాలన్నా సందీప్ రెడ్డి వంగ స్టైల్ యే వేరు అంటూ కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. మరో వైపు ప్రమోషన్స్ ని స్లో స్టార్ట్ చేసిన సామ్ బహదూర్ చిత్ర యూనిట్… ఇటీవలే టీజర్ లాంచ్ చేసారు. ఫీల్డ్ మార్షల్ సామ్ బహదూర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా, టీజర్ తో అంచనాలని పెంచేసింది. ఉరి, సర్దార్ ఉద్ధం సింగ్ తర్వాత విక్కీ కౌశల్ నుంచి వస్తున్న ఆ స్థాయి సినిమా సామ్ బహదూర్ అవ్వడంతో బాలీవుడ్ వర్గాల్లో ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే మాస్ ఆడియన్స్ అంతా అనిమల్ మూవీకి, క్లాస్ ఆడియన్స్ అంతా సామ్ బహదూర్ సినిమాకి వెళ్తారేమో. ఏ సినిమా ఆడియన్స్ ఆ సినిమాకి ఉన్నా కూడా రెండు పెద్ద సినిమాలు ఒకటే రోజున రిలీజ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. థియేటర్స్ నుంచి కలెక్షన్స్ వరకూ ప్రతి విషయంలో అనిమల్, సామ్ బహదూర్ సినిమాలకి దెబ్బ తగలడం గ్యారెంటీ. మరి ఏ సినిమా అయినా ముందుకి కానీ వెనక్కి కానీ వెళ్తుందేమో చూడాలి.