Site icon NTV Telugu

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

బెజవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. కండక్టర్‌ సహా ఇద్దరు మృతి
విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది.. ఆటోనగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. గుంటూరు వెళ్లాల్సి ఉంది.. ఉదయమే ఆటోనగర్‌ డిపో నుంచి బయల్దేరిన ఆ ఏసీ బస్సు.. నేరుగా నెహ్రూ బస్టాండ్‌కు వచ్చింది.. గుంటూరు ప్లాట్‌ ఫారమ్‌ దగ్గర ఆపేందుకు డ్రైవర్‌ ప్రయత్నం చేశాడు.. అయితే, బ్రేక్ ఫెయిల్ కావడంతో.. బస్సు ఒక్కసారిగా ప్లాట్‌ఫారమ్‌పైకి దూసుకెళ్లింది.. దీంతో.. ప్లాట్‌ఫారమ్‌ ఉన్న ఉన్న ఔట్ సోర్సింగ్ కండక్టర్, మరో మహిళా ప్రయాణికురాలు అక్కడికక్కడేమృతిచెందారు.. తీవ్ర గాయాలపాలైన 10 నెలల చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడి చికిత్స పొందుతూ మృతిచెందింది. మరికొంతమంది ప్రయాణికులకు కూగా గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. ప్లాట్‌ఫారమ్‌ మీదకు బస్సు దూసుకురావడంతో.. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక.. భయభ్రాంతులలో పరుగులు తీశారు ప్రయాణికులు.. నెహ్రూ బస్టాండ్‌లోని 12వ నంబరు ప్లాట్ ఫారమ్‌ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.. నేరుగా బస్సు డిపో నుంచే వచ్చినా.. ఎలాంటి తనిఖీలు చేయకుండానే తీసుకొచ్చారా? అసలు ఏం జరిగింది.? అనే కోణంలో ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది.

ప్రజా సంకల్పయాత్రకు ఆరేళ్లు పూర్తి..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు నేటితో నాలుగేళ్లు పూర్తి అయ్యింది.. ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌.. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు.. వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.. రైతులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాలను కలుస్తూ.. వారి సమస్యలను అధ్యయనం చేస్తూ.. తాను అధికారంలోకి రాగానే వాటి పరిష్కారానికి కృషి చేస్తానంటూ ముందుకు సాగారు వైఎస్‌ జగన్‌.. ప్రజా సంకల్ప పాదయాత్ర.. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయాన్ని తెచ్చిపెట్టడంలో కీలక భూమిక పోషించిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. ప్రజా సంకల్పయాత్ర అంటూ ఉక్కు సంకల్పంతో పాదయాత్ర చేసిన వైఎస్‌ జగన్‌ చరిత్ర సృష్టించాడు.. అలాంటి పాదయాత్ర ఇవాళ్టికి ఆరేళ్లు పూర్తి చేసుకుంటుంది.. ఈ రోజును రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుపుకుంటుంది వైసీపీ.. అధికారంలోకి కూడా రావడంతో.. ఘనంగా ఈ వేడుకలు నిర్వహిస్తోంది.. కాగా, 2017 నవంబర్ 6న కడప జిల్లాలోని ఇడుపులపాయలో ప్రజా సంకల్పయాత్రని ప్రారంభించారు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 13 జిల్లాలను టచ్ చేస్తూ పాదయాత్ర సాగించారు.. 134 నియోజవర్గాల్లో 341 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు.. 3,648 కిలోమీటర్లు నడిచారు. 2,516 గ్రామాల గుండా పాదయాత్ర సాగింది. మొత్తం 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమవేశాలు.. ఇంకా ఎందరితో మమేకం అయ్యారు.. దారిలో రైతులను పరామర్శించారు.. పొలాల్లోకి వెళ్లి.. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.. తమ ప్రభుత్వం వస్తే అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.. అందుకు అనుగుణంగా.. 2019 ఎన్నికల ముందు నవరత్నాల పేరుతో మేనిఫెస్టో తీసుకొచ్చారు.. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా పార్టీ ప్రణాళికను రూపొందించారు.. ఇక, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని మెజార్టీతో గెలిపించారు ప్రజలు.. అసెంబ్లీలోనే కాదు.. పార్లమెంట్‌ స్థానాల్లోనూ ఆ పార్టీ సత్తా చాటింది.

పురంధేశ్వరి వర్సెస్ విజయసాయిరెడ్డి.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ
పురంధేశ్వరి పై వరుస ట్విట్లతో కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు విజయసాయిరెడ్డి.. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్రావులే అని ఆరోపించారు సాయిరెడ్డి.. ఎమ్మెల్యేలు వెంటలేకున్నా అంతా తన వైపు వచ్చారని బాబు ఎల్లో మీడియాలో రాయించుకోవడం ఒక ఎత్తయితే, ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసిగొల్పిన ఘనచరిత్ర పురందేశ్వరిది అని విమర్శించారు. సిగ్గు విడిచి పదవీ కాంక్షతో అప్పట్లో బాబుగారి ఇంటికి వెళితే తలుపులు తెరవకుండా తరిమికొట్టినా.. మళ్లీ ఆయన పల్లకి మోస్తున్నారు ఈ ఆదర్శ దంపతులు అంటూ దుయ్యబట్టారు.. “అన్న టీడీపీ” అనే పార్టీని పురంధేశ్వరి ప్రేరేపించి నందమూరి హరికృష్ణ చేత ప్రారంభించి, తనే కొబ్బరికాయ కొట్టి, కొంతకాలం గౌరవ అధ్యక్షురాలిగా పనిచేసి, ఆ పార్టీ ఓడిపోవటంతో కాంగ్రెస్ లో చేరి సోనియాగాంధీని పొగడ్తలతో ముంచెత్తిన ఘనురాలు ఈవిడ అంటూ పురంధేశ్వరిపై ట్విట్టర్‌ వేదికగా విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇక, నమ్మకద్రోహం అనేది పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉంది. తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారింది. ఇప్పుడు పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా బావ పార్టీ టీడీపీ సేవలో తరిస్తోంది. ఇలాంటి వారినే మోసగాళ్లకు మోసగాళ్లు అంటారు.. అంటూ మరో ఘాటు ట్వీట్‌ సంధించారు. .

బస్సు ప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
విజయవాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ బస్టాండ్‌లో జరిగిన ప్రమాదంపై విచారణం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశాలు జారీ చేశారు.. ఇక బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.. విజయవాడ బస్టాండ్‌లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం.. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం ముఖ్యమంత్రికి ప్రమాద ఘటనపై వివరాలను అధికారులు అందించారు. ఆర్టీబస్సు ప్రమాదవశాత్తూ ఫ్లాట్‌ఫాంమీదకు దూసుకుపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని, గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.

టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ రెండో భేటీ.. అజెండా ఇదే..
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ కలిసి ముందుకు నడవాలని నిర్ణయించాయి.. అందులో భాగంగా.. టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ తొలిసమావేశం ఇప్పటికే జరగగా.. ఇప్పుడు రెండో సమావేశానికి సిద్ధం అవుతున్నాయి రెండు పార్టీలు.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమన్వయ కమిటీ రెండో భేటీ జరగనుంది.. ఈ నెల 9వ తేదీన జరిగే టీడీపీ – జనసేన పార్టీల నుంచి చెరో ఆరుగురు సభ్యుల హాజరుకానున్నారు.. అయితే, ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రోగ్రాం రూపకల్పనపై ప్రధానంగా చర్చ సాగనుంది. అయితే, ఉమ్మడి మేనిఫెస్టో కోసం షణ్ముఖ వ్యూహం పేరిట 6 అంశాలు ప్రతిపాదించింది జనసేన.. సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా- ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ధి చేసే ప్రణాళిక రూపొందిస్తున్నారు.. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేయాలని.. బీపీఎల్ కుటుంబాలు ఇళ్లు కట్టుకోవాలన్నా, లేక ఇళ్ల మరమ్మతులకు ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలని.. దాదాపు 30 లక్షల భవన నిర్మాణ కార్మికులకు చేయూత ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని.. సౌభాగ్య పథకం పేరిట ఏటా లక్ష మంది యువ పారిశ్రామిక వేత్తలకు చిరు వ్యాపారాలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నడుపుకునేలా రూ.10లక్షల చొప్పున సాయం అందించాలని.. వ్యవసాయం – బంగారు ఫలసాయం పేరిట ఉద్యాన రైతులకు రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని.. ఉద్యాన పంటలు పండే ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందిస్తామని.. మైనర్ ఇరిగేషన్ రంగాన్ని ప్రోత్సహాం.. ఇబ్బందుల్లేని వ్యవసాయం మన లక్ష్యమని.. మన ఏపీ – మన ఉద్యోగాలు పేరిట ప్రతీ ఏటా ఏపీపీఎస్సీ ద్వారా సకాలంలో పోస్టుల భర్తీ చేస్తామని.. ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు తీసుకుంటామని.. సీపీఎస్ రద్దు చేసి పాత ఫించన్ విధానం అమలు చేస్తామని ఇలా మేనిఫోస్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది జనసేన పార్టీ.

ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి రాష్ట్రంలో పుష్కలంగా ఆర్థిక సంపద ఉంది..!
ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి రాష్ట్రంలో పుష్కలంగా ఆర్థిక సంపద ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రామన్నపాలెం, ఎర్రుపాలెం మండలం, మధిర నియోజకవర్గంలో భట్టి ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. బీఆర్ఎస్ కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు బందు చేస్తామని.. భయపెట్టి ఓట్లు వేయించుకునే పరిస్థితి తెలంగాణలో లేదన్నారు. దొరల ప్రభుత్వానికి చరమగీతం పాడి కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. ప్రజల సంపదని దోపిడి చేసి అత్యంత అవినీతిపరులుగా మారిన బీఆర్ఎస్ పాలకులు అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలకుల అవినీతి దోపిడి వల్లనే తెలంగాణ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సంపద ప్రజలందరి పంచాలన్న రాహుల్ ఆకాంక్షలు నెరవేరుస్తామన్నారు. ప్రజల సంపద ప్రజలకు చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తెచ్చుకోవాలన్నారు. దళిత బంధు పథకం కంటే మెరుగ్గా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అభయ హస్తం పథకం తీసుకువచ్చి దళితుల అభ్యున్నతికి పాటుపడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఎక్కడివని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని వ్యంగాస్త్రం వేశారు. రాష్ట్ర రాబడి, బడ్జెట్ పై ఆర్థిక లెక్కలు తెలిసిన వ్యక్తిగా చెబుతున్నాను.. ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి రాష్ట్రంలో పుష్కలంగా ఆర్థిక సంపద ఉందన్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు పాలకుల ఆర్థిక దోపిడిని అరికడితే చాలు… వాటిని అమలు చేయడం పెద్ద కష్టం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి దోపిడీకి తావులేదు. చిత్తశుద్ధితో 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల పథకాలనే బీఆర్ఎస్ కాపీ కొట్టి మేనిఫెస్టోగా ప్రకటించిందన్నారు. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. రైతులకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వలే, సబ్సిడీ ఎరువులు ఇవ్వలే, మద్దతు ధర ఇవ్వలే, మహిళలకు పావుల వడ్డీ రుణాలు ఇవ్వలే, పేదలకు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే తొమ్మిది రకాల నిత్యవసర సరుకులకు మంగళం పాడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మహస్తం పథకం అటక ఎక్కించి రేషన్ దుకాణాలను బియ్యం దుకాణాలుగా మార్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు.

సీఎంకు రూ. 508 కోట్లు ఇచ్చా.. మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ఓనర్‌ వీడియో వైరల్!
ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌పై మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ఓనర్‌ సుభమ్ సోని సంచలన ఆరోపణలు చేశాడు. సీఎం భూపేశ్‌ తనను ప్రోత్సాహించడంతోనే బెట్టింగ్‌ యాప్‌ రూపొందించానని, తాను ముఖ్యమంత్రి సహాయకులకు ఇప్పటివరకు రూ. 508 కోట్లు చెల్లించినట్లు తెలిపాడు. భిలాయ్‌లో తన సహచరులు అరెస్టైన సమయంలో సీఎం భూపేశ్‌ తనని దుబాయ్‌కి పారిపోవాలని సలహా ఇచ్చినట్లు ఓ వీడియోలో చెప్పాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ పేరుతో ఉన్న ఓ ఎక్స్‌ ఖాతాలో మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ఓనర్‌ సుభమ్ సోని మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు. వీడియోలో సుభమ్ సోని మాట్లాడుతూ… తాను మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ఓనర్‌ అని చెప్పి డాకుమెంట్, పాస్ పోర్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డులను చూపించాడు. ‘2021లో ఈ బెట్టింగ్‌ యాప్‌ తయారు చేశాను. చిన్నగా మొదలెట్టిన ఈ ఆప్ ద్వారా బాగా సంపాదించా. నా లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. భిలాయ్‌లో నా సహచరులు అరెస్టైన సమయంలో సీఎం భూపేశ్‌ బఘేల్‌ దుబాయ్‌కి పారిపోమ్మని చెప్పాడు. సెప్టెంబర్ 2022లో దుబాయ్ వచ్చా. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 508 కోట్లు ఇచ్చాను’ అని సుభమ్ సోని వీడియోలో చెప్పాడు.

భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్.. అనుష్క పాటకు మైదానంలోనే డ్యాన్స్ చేసిన కోహ్లీ!
ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. బ్యాటింగ్ కష్టంగా మారిన పిచ్‌పై 120 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ బాదాడు. ఈ సెంచరీ కోహ్లీ ఎంతో ప్రత్యేకమైందిగా నిలిచింది. పుట్టిన రోజు నాడు శతకం చేయడమే కాకుండా.. వన్డేలలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. సెంచరీ అనంతరం విరాట్ ఫుల్ జోష్‌లో కనిపించాడు. భారత్ ఫీల్డింగ్ సమయంలో మైదానంలోనే డాన్స్ చేశాడు. బర్త్ డే రోజున సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికా ఛేజింగ్ సమయంలో మంచి హుషారుగా కనిపించాడు. తనదైన స్టైల్‌లో ఫీల్డింగ్ చేస్తూ సహచరులతో పాటు అభిమానాలను అలరించాడు. దక్షిణాఫ్రికా అప్పటికే 7 వికెట్స్ కోల్పోయి ఓటమి దిశగా వెళుతోంది. ఈ సమయంలో ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో సాంగ్స్ వస్తుంటే.. ఫాన్స్ డాన్సులు చేశారు. మైదానంలో ఉన్న కోహ్లీ కూడా స్టెప్పులు వేశాడు. తన భార్య అనుష్క శర్మ నటించిన సినిమాలోని ‘అయినవీ అయినవీ’ పాటకు డాన్స్ చేశాడు. పఠాన్ సినిమాలోని ‘చలెయా చలెయా’ సాంగ్‌కు కూడా డ్యాన్స్ చేశాడు విరాట్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ సమం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో సమానంగా 49 సెంచరీలు బాదాడు. 2009లో శ్రీలంకపై ఈడెన్‌ గార్డెన్స్‌లోనే విరాట్ తొలి వన్డే సెంచరీ అందుకోవడం విశేషం. సుదీర్ఘ చరిత్ర కలిగిన వన్డే క్రికెట్లో ఇప్పటివరకూ కేవలం సచిన్‌, కోహ్లీ మాత్రమే 35 శతకాలకు పైగా నమోదు చేశారు. మరో శతకం బాదితే.. సెంచరీల హాఫ్ సెంచరీ రికార్డును కోహ్లీ నెలకొల్పుతాడు. సచిన్‌ 452వ ఇన్నింగ్స్‌ (463 మ్యాచ్‌)లో 49వ వన్డే సెంచరీ చేస్తే.. విరాట్ 277వ ఇన్నింగ్స్‌ (289 మ్యాచ్‌)లోనే ఆ రికార్డు సమం చేశాడు.

ధనరాజ్ డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ అప్డేట్ వచ్చేసింది.
జబర్దస్త్ తో చాలా మంది నటులు కమెడియన్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..జబర్దస్త్ తో బాగా సక్సెస్ అయి తర్వాత సినిమాల్లో కమెడియన్స్ గా మరియు హీరోలుగా కూడా ఇండస్ట్రీ లో బాగా బిజీ అవుతున్నారు.అయితే వీరిలోనే రైటర్స్ మరియు డైరెక్టర్స్ కూడా ఉండటం విశేషం… ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్స్ శాంతి కుమార్ మరియు వేణు దర్శకులుగా మారారు. వేణు బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.త్వరలోనే కిరాక్ RP కూడా దర్శకుడిగా రాబోతున్నాడు. తాజాగా మరో కమెడియన్ ధనరాజ్ డైరెక్టర్ గా మారబోతున్నాడు. సినిమాల్లో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనరాజ్ ఇప్పుడు డైరెక్టర్ గా మారబోతున్నాడు. ఇందులో హీరోగా తానే చేయడం విశేషం.స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 గా ధనరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి.తండ్రి కొడుకుల ఎమోషన్ తో ఎవరూ టచ్ చెయ్యని ఒక పాయింట్ తో ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు ధనరాజ్. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల ఈ సినిమాకు కథ మరియు మాటలు సమకూరుస్తూన్నారు. సంగీత దర్శకుడు అరుణ్ చిలువేరు ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నారు… ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ నవంబర్ 9 నుండి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.మరి బలగం సినిమాతో వేణు బంపర్ హిట్ కొట్టినట్లు ధనరాజ్ కూడా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి..

రష్మిక డీప్‌ఫేక్‌ వీడియో వైరల్‌.. స్పందించిన బిగ్‌ బీ
రష్మిక మందన్న తన డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సైబర్ క్రైమ్‌ గురయ్యారు. ఆ వీడియోలో ఓ మహిళ నల్లటి దుస్తులు ధరించి ఎలివేటర్‌లోకి వెళ్లడం కనిపించింది. అయితే, ఆమె ముఖం రష్మిక ముఖంతో మార్ఫింగ్ చేయబడింది. వీడియోపై అభిమానుల్లో తీవ్ర ఆందోళన చెలరేగడంతో ఓ జర్నలిస్టు వాస్తవాన్ని బయటపెట్టారు. అది డీప్ ఫేక్ ఏఐ సాంకేతికతతో తయారు చేసినదని నెటిజన్లను అప్రమత్తం చేశారు. వీడియో వైరల్ అయిన తర్వాత, చాలా మంది ఇది ఫేక్ అని ఎత్తి చూపారు, అయితే అమితాబ్ బచ్చన్ దానికి స్పందిస్తూ.. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ఆ మహిళ ముఖాన్ని రష్మికగా మార్చారు. నెటిజన్లు రష్మికకు మద్దతుగా నిలిచారు. వైరల్ వీడియోకు కారణమైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ కూడా నెటిజన్లతో రష్మికకు మద్దుతుగా నిలిచారు. అంఏతకాకుండా.. ఇది న్యాయపరమైన బలమైన కేసు బాధ్యతులపై చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఈ వీడియోపై రష్మిక ఇంకా స్పందించలేదు.

Exit mobile version