NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

మందు బాబులకు అలర్ట్.. ఆ మూడు రోజు వైన్స్‌లు, బార్లు బంద్‌
వరుసగా మూడు రోజుల పాటు తెలంగాణలో మద్యం షాపులు క్లోజ్‌ కానున్నాయి.. ఈ నెల 28, 29 తేదీలతో పాటు పోలింగ్‌ జరగనున్న 30 తేదీ కూడా మద్యం షాపులు అన్నీ మూతపడనున్నాయి.. మొత్తంగా మూడు రోజుల పాటు.. అంటే 28వ తేదీ సాయంత్రం మూసివేస్తే.. మళ్లీ డిసెంబర్‌ 1వ తేదీనే ఓపెన్‌ చేసే అవకాశం ఉంది.. మరోవైపు.. నవంబర్‌ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు మూసివేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు రోజుల పాటు మద్యం విక్రయాలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి.. ఆయా బార్లు, వైన్‌ షాపుల యజమానులకు ముందస్తు సమాచారం ఇచ్చి.. మూడురోజుల పాటు బంద్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సింపుల్‌గా నకిలీ మద్యం గుర్తించొచ్చు.. ఆ యాప్‌ ఉంటే చాలు..
‘వేరిట్’ యాప్‌పై నారాయణగూడ ఎక్సైజ్ సీఐ గీత ఓ ప్రకటన విడుదల చేశారు.. ప్లే స్టోర్ నుంచి ‘వేరిట్‌’ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.. ఈ యాప్‌ ద్వారా మద్యం బాటిల్ తెలంగాణ రాష్ట్రానికి చెందినదా? కాదా? అనే విషయం తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అయితే, యాప్‌ ను ఎలా ఉపయోగించాలో కూడా ఆమె వివరించారు.. ‘వేరిట్‌’యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత బాటిల్‌పై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. అది ఏ రాష్ట్రానికి సంబంధించిన లిక్కరో ఇట్టే తెలిసిపోతుందన్నారు.. అంతే కాదు.. అది ఒరిజినలా? లేక నకిలీనా? అనే విషయం కూడా వెంటనే నిర్ధారణ చేసుకోవచ్చు అని తెలిపారు. ఇక, ఎన్నికల సమయంలో.. జోరుగా మద్యం పంపిణీ, అక్రమ మద్యం నిల్వలపై సమాచారం తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.. దాని కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-2523కు కాల్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు ఎక్సైజ్ సీఐ గీత.

పురంధేశ్వరి-విజయసాయిరెడ్డి మధ్య ముదిరిన వార్‌.. సీజేఐకి ఏపీ బీజేపీ చీఫ్‌ లేఖ
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి, వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మధ్య రోజురోజుకూ వార్‌ ముదురుతోంది.. అయితే, ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి పురంధేశ్వరి లేఖ రాయడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. విజయసాయిరెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారు. తన పైన ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విషయంలో 10 ఏళ్లకు పైగా బెయిల్‌లో కొనసాగుతున్నారు. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ.. న్యాయ వ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధిస్తున్నారు. విజయసాయి రెడ్డి వ్యవహరంపై విచారణ చేయాలి.. విజయసాయి రెడ్డే కాదు.. వైఎస్‌ జగన్ కూడా పదేళ్ల నుంచి బెయిల్ మీదే ఉన్నారు అంటూ ఆమె సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని రాసుకొచ్చిన పురంధేశ్వరి.. CBI, IT, ED కేసుల దర్యాప్తు జరగకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయవ్యవస్థలోని విధానపరమైన అంతరాలను అన్నింటిని పదేపదే వాడుకుంటున్నారు. విచారణలు, వాయిదా వేయిచుకోవడం, విచారణకు హాజరు కాకపోవడం ద్వారా కేసులు అపరిమిత కాలంగా పెండింగులో ఉంటున్నాయి. విజయ సాయిరెడ్డిపై IPC కింద నమోదైన కేసులు పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ సెక్షన్ల కింద విజయ సాయిరెడ్డిపై నమోదైన కేసులను పరిశీలిస్తే తిమ్మిని బమ్మిని చేయగలరని అర్థమవుతోందని పేర్కొన్న ఆమె.. వైఎస్‌ జగన్ ఆస్తుల కేసులో రెండో నిందితుడు విజయ సాయిరెడ్డి. జగన్ కేసులో సాయిరెడ్డిని కింగ్‌పిన్ అని సీబీఐ స్పష్టం చేసిందని గుర్తుచేశారు.. అంతగా ప్రభావ వంతం చేయలేని పరిస్థితుల్లో విజయసాయిపై కేసులు నమోదయ్యాయి. కానీ, ఇప్పుడు విజయసాయు అత్యున్నత పదవుల్లో ఉన్నారని తెలిపారు.

రైతులను సీఎం జగన్ మోసం చేశారు.. కేబినెట్‌లో కనీస చర్చ లేదు..!
సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం, కరవు తాండవిస్తున్నా.. కేబినెట్ భేటీలో కనీస చర్చ లేదని దుయ్యబట్టారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. దోచుకోవడం, చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదుకే సీఎం జగన్ రెడ్డి తన సమయాన్ని వెచ్చిస్తున్నారన్న ఆయన.. కరవు మండలాల ప్రకటనలోనూ రైతులను సీఎం వైఎస్‌ జగన్ మోసం చేశారని విమర్శించారు. లక్షలాది ఎకరాల్లో కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నా కనీసం కేబినెట్ భేటీలో చర్చలేదు. 70 శాతం మంది ఆధార పడిన వ్యవసాయం రంగం పట్ల జగన్ రెడ్డి ఉదాసీన వైఖరికి ఈ ఘటన అద్దం పడుతోందన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కరవుతో ప్రజలు వలసబాట పడుతున్నది కనిపించడం లేదా? రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీరు అందక పడుతున్న అవస్థలపై కేబినెట్ లో చర్చించే తీరిక కూడా లేదా? వ్యవసాయ రంగంపై కనీస సమీక్ష కూడా లేకపోవడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు. కరవు తీవ్రంగా ఉంటే.. జగన్ రెడ్డి మొక్కుబడిగా 103 కరవు ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. రాష్ట్రంలో కరవుకు ప్రజలు బలవడానికి, రైతులు, రైతు కూలీల వలసలకు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దోపిడీ పరిపాలనే కారణం అంటూ ఆరోపణలు గుప్పిస్తూ.. ఓ ప్రకటన విడుదల చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

అన్ని అనుమతులు తీసుకునే రుషికొండపై నిర్మాణాలు..
కోర్టు తీర్పులను గౌరవిస్తూనే అన్ని అనుమతులు తీసుకొని రుషికొండ నిర్మాణాలు చేపట్టాం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి సామాజిక సమతుల్యం చేస్తూ వచ్చారని తెలిపారు.. ఆర్ధికంగా వెనుకబడిన అందరినీ అభివృద్ధి చేయాలని పనిచేస్తున్నారు.. వెనుకబడిన విజయనగరం జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం.. ఇప్పటికే మెడికల్ కాలేజ్ తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 13 మంది చనిపోయారు.. ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించి మానవత్వం చాటుకున్నారు.. బాధితులను ఆదుకునేందుకు నష్టపరిహారం కూడా వెంటనే అందజేశారని గుర్తుచేశారు. పరిశ్రమల కోసం రాయితీలు ఇచ్చి తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు మంత్రి బొత్స.. అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం.. ఇక, ఋషికొండపై కట్టడాలను కోర్టులు కాదంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది..? అని ప్రశ్నించారు.. కోర్టులను ఎవరూ కాదనలేరన్న ఆయన.. కోర్టు తీర్పులను గౌరవిస్తూనే అన్ని అనుమతులు తీసుకొని రుషికొండపై నిర్మాణాలు చేపట్టాం అన్నారు. ఇక, గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలు జేబులు నింపుకున్నారని ఆరోపించారు. అవినీతి జరిగింది కాబట్టి కేసు పెట్టాల్సి వచ్చిందన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో అవినీతి లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పాలసీ తెచ్చామని తెలిపారు మంత్రి బొత్స సత్యానారాయణ.

తెలంగాణలో వర్షాలు.. అత్యధికంగా ఖమ్మంలో
తెలంగాణలో నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలోని ఆగ్నేయ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. చలికాలం ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఐరన్‌ లోపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలికాలంలో కూడా జనం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లకు అతుక్కుపోతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో సాధారణం కంటే 4.8 డిగ్రీలు అధికంగా 36 డిగ్రీల సెల్సియస్‌ నమోదైందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. భద్రాచలంలో 2.7 డిగ్రీలు పెరిగి 34.6 డిగ్రీల సెల్సియస్‌, ఆదిలాబాద్‌లో 2.3 డిగ్రీలు పెరిగి 32.8 డిగ్రీల సెల్సియస్‌, హనుమకొండలో 1.2 డిగ్రీలు పెరిగి 32.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని అధికారులు తెలిపారు.

రేపు ఖమ్మం, కొత్తగూడెంలో ప్రజా ఆశీర్వాద సభలు.. సీఎం కేసీఆర్‌ ప్రసంగాలు
ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం నెలకొంది. రేపు ఖమ్మం నగరంలోని ఎస్ ఆర్ అండ్ బీజీఎన్ ఆర్ కళాశాలలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభకు మంత్రి అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మూడు రోజులుగా ఖమ్మంలోనే మకాం వేసి మంత్రి పువ్వాడతో కలిసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసేందుకు బీఆర్ ఎస్ శ్రేణులు ఇప్పటికే ఖమ్మం నగరంలోని అన్ని డివిజన్లతో పాటు రఘునాథపాలెం మండలంలో జన సమీకరణ చేస్తున్నారు. 2018 శాసనసభ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే కళాశాల మైదానంలో జరిగిన సభను సందర్శించారు. పువ్వాడ అజయ్‌కుమార్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పువ్వాడ అజయ్‌కుమార్‌ విజయం సాధించారు. ఎమ్మెల్యే అజయ్ కుమార్ గెలుపొందడంతో సీఎం కేసీఆర్ కు మంత్రి పదవి ఇచ్చారు. కొత్తగూడెంలో పార్టీ నియోజకవర్గ ఎంపీ వావిరాజు రవిచంద్ర, బీఆర్‌ఎస్‌ కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభలకు జనసమీకరణ చేసేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు. ఖమ్మంలో సభ ముగిసిన తర్వాత సీఎం వెంటనే హెలికాప్టర్‌లో కొత్తగూడెం చేరుకుని ప్రసంగిస్తారు. సీఎం కేసీఆర్ రాక కోసం పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

బీఆర్‌ఎస్‌ పార్టీని బంగాళాఖాతంలో కలపాలి.. భట్టి సంచలన వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్‌ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎడవెళ్ళి నుంచి కార్యక్రమాలు కొనసాగించడం నా సాంప్రదాయం అన్నారు. పాదయాత్ర కూడా ఇక్కడ నుంచే కొనసాగించానని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాల్లో పనులు జరుగడం లేదన్నారు. మోసం చేయడం మాటలు చెప్పడం బీఆర్ఎస్ కు అలవాటు అని మండిపడ్డారు. తెలంగాణ వస్తే జీవితాలు బాగు పడతాయని భావించారు. బీఆర్ఎస్ దొరలు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల జీవితాల్లో మార్పులు రావాలంటే ప్రజలు ఎన్నికల సమయంలో ఆలోచించాలని తెలిపారు. ప్రజల తెలంగాణ గెలవాలన్నారు. ప్రజల తెలంగాణ గెలవాలి అంటూ బట్టి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంపద వెలుగు నిండాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. బీఆర్ఎస్ పార్టీని బంగాళా ఖాతంలో కలపాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని తెలిపారు. ప్రజల సంపదను దోచుకోనివ్వమని.. రాష్ట్రంలో రాబడి చాలా వుందని కీలక వ్యాఖ్యాలు చేశారు. 2004 కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇల్లు, రేషన్ కార్డులు, రుణమాఫీ చేసింది కాంగ్రెస్ మాత్రమే అని అన్నారు. ఆనాడు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామన్నారు. మా హామీలను కూడా అమలు చేస్తామని బట్టి తెలిపారు. మొదటి సంతకం ఆరు గ్యారంటీల మీదనే వుంటుందని స్పష్టం చేశారు.

తన స్కెచ్ వేసిన అమ్మాయికి లేఖ రాసిన ప్రధాని
ప్రధాని ర్యాలీకి హాజరైన బాలికకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. చేతుల్లో ప్రధాని స్కెచ్‌తో నిలబడి ఉన్న ఆయన కళ్లు ఆ అమ్మాయిపై పడ్డాయి. ఆ అమ్మాయిని ప్రధాని చాలా మెచ్చుకుని.. ఆమెకు లేఖ రాస్తానని చెప్పారు. ప్రధాన మంత్రి తన లేఖలో, ‘కంకేర్ కార్యక్రమానికి మీరు తెచ్చిన స్కెచ్ నాకు చేరింది. ఈ ఆప్యాయత వ్యక్తీకరణకు చాలా ధన్యవాదాలు. భారత కుమార్తెలు దేశానికి ఉజ్వల భవిష్యత్తు. మీ అందరి నుండి నేను పొందుతున్న ఈ ఆప్యాయత, అనుబంధం దేశానికి సేవ చేయడంలో నాకు కొండంత బలం. మన కుమార్తెల కోసం ఆరోగ్యకరమైన, సురక్షితమైన, సుసంపన్నమైన దేశాన్ని నిర్మించడమే మా లక్ష్యం.’ అన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రజల నుంచి తనకు ఎప్పుడూ ఎంతో ప్రేమ అందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా దేశ ప్రగతి పథంలో ఉత్సాహంగా సహకరించారన్నారు. రాబోయే 25 సంవత్సరాలు మీలాంటి యువత దేశానికి ముఖ్యం. ఈ సంవత్సరాల్లో యువ తరం ముఖ్యంగా మీలాంటి కుమార్తెలు, వారి కలలను నెరవేరుస్తున్నారు. దేశ భవిష్యత్తుకు కొత్త దిశను అందిస్తారు. మీరు కష్టపడి చదివి, ముందుకు సాగండి. మీ విజయాలతో మీ కుటుంబానికి, సమాజానికి, దేశానికి కీర్తిని తీసుకురండి. మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు ప్రధాని మోడీ.

హువావే నుంచి మరో సూపర్ స్మార్ట్‌ఫోన్.. 108 ఎంపీ కెమెరా, 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ!
చైనాకు చెందిన మొబైల్ కంపెనీ ‘హువావే’ ఎప్పటికప్పుడు భారత మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తుంటుంది. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా బడ్జెట్ ధరలో ఫోన్‌లను రిలీజ్ చేస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో మరో సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను హువావే రిలీజ్ చేస్తోంది. అదే ‘హువావే నోవా 11 ఎస్‌ఈ’ స్మార్ట్‌ఫోన్‌. చైనా మార్కెట్‌లో ఇప్పటికే లాంచ్ అయిన ఈ ఫోన్‌.. త్వరలోనే భారత మార్కెట్‌లోకి రానుంది. హువావే 11 సిరీస్ ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనాలో ప్రారంభించబడింది. ఈ లైనప్‌లో మూడు ఫోన్‌లు (హువావే నోవా 11, హువావే నోవా 11 ప్రో మరియు హువావే నోవా 11 అల్ట్రా) ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ హువావే నోవా 11 ఎస్‌ఈ లాంచ్‌తో సిరీస్‌లో మరో మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ప్రీ ఆర్డర్‌లు ఇప్పటికే చైనాలో ఆరంభమయ్యాయి. ఈ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్ ధర రూ. 23,000 కాగా.. 8 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 25,000గా ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు రంగులలో (నలుపు, ఆకుపచ్చ మరియు తెలుపు) అందుబాటులో ఉంది. హువావే నోవా 11 ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌ డ్రాగన్‌ 680 ఎల్‌టీఈ ఎస్వోసీ ప్రాసెసర్‌ను అందించారు. ఎల్‌టీఈ ఎస్వోసీ విత్ 2.4 గిగా హెర్ట్జ్ సీపీయూతో ఇది పనిచేయనుంది. హార్మోనీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 4 వెర్షన్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 ఇంచెస్‌ ఫ్లాట్‌ ఓఎల్‌ఈడీ ప్యానెల్ డిస్‌ప్లే ఉంటుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్‌ను ఇందులో అమర్చారు.

అయ్యో పాపం భోలే.. ఆట పేరుతో పిచ్చ కొట్టుడు కొట్టారే..
బిగ్ బాస్ లో ఈ వారం కొత్త టాస్క్ లతో జనాలకు పిచ్చెక్కిస్తున్నారు.. ఈరోజు కూడా కొత్త టాస్క్ లతో జనాలను ఎంటర్టైన్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.. నిన్న బాల్ గేమ్ అవ్వగానే ఈరోజు బలానికి పరీక్ష పెట్టాడు బిగ్ బాస్.. ఇవ్వాళ్టి ఎపిసోడ్ బిగినింగ్లోనే దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చాడు. బ్లాక్ బాల్ దక్కించుకున్న వీర సింహాలకు ఓ అడ్వాంటేజ్ ఉంటుందంటూ చెబుతాడు.. ఇక అదేంటో తెలుసుకోవాలనే కోరికతో జనాలు రెచ్చిపోతారు.. అందులో అమర్ కాస్త ఓవర్ అయ్యాడు.. ‘హాల్ ఆఫ్ బాల్’ గేమ్ గెలవడంతో… కెప్టెన్సీ కంటెడర్స్‌ గా ఎన్నికైన వీర సింహాలు.. ఓటింగ్ ద్వారానే తమలో ఒకరిని కెప్టెన్ చేస్తాడంటూ… అవతలి టీంలో ఉన్న సభ్యులను మచ్చిక చేసుకుంటూ ఉండగా… ఉన్నట్టుండి సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్… మరో దిమ్మతిరిగే ట్విస్ట్ ఇస్తాడు. కెప్టెన్ ఎవరనేది ఫిజికల్ టాస్క్‌తో తేలుస్తామని చెబుతాడు.. ఈ టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో కెప్టెన్ కంటెండర్స్‌ ఫోటోలతో బీన్ బ్యాగ్స్‌ ఉంటాయని.. కెప్టెన్ కంటెండర్స్‌ను సపోర్ట్ చేసిన వాళ్లు… వారి వారి సపోర్ట్ చేస్తున్న కంటెండర్స్ బ్యాగ్‌ను భుజానికి వేసుకొని.. యెల్లో సర్కిల్లో తిరుగుతూ…. అవతలి బ్యాగ్‌లో ఉన్న బీన్స్ కింద పడిపోయేలా చేయాలని చెబుతాడు. అలా బజర్ మోగే టైంకు.. ఎవరి బ్యాగ్‌లో తక్కువగా బీన్స్ ఉంటాయో.. వాళ్లు గేమ్ నుంచి బయటికి వెళతారని బిగ్ బాస్ చెబుతాడు..

ఈ సాంగ్ అండ్ మీ పెయిర్ కూడా ముద్దొస్తుందండీ…
న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘హాయ్ నాన్న’. డెబ్యూ డైరెక్టర్ శౌర్యవ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న ఆడియన్స్ ముందుకి రాబోతుంది. కంప్లీట్ లవ్ స్టోరీ మిక్స్డ్ విత్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ తో హాయ్ నాన్న సినిమా రూపొందింది. నాని లాంగ్ కర్లీ హెయిర్ తో కొత్త లుక్ లో కనిపిస్తుండగా, మృణాల్ చాలా అందంగా ఉంది. నాని-మృణాల్ పెయిర్ ఆన్ స్క్రీన్ చాలా ఫ్రెష్ అండ్ అట్రాక్టివ్ గా ఉంది. గ్లిమ్ప్స్, టీజర్ తో హాయ్ నాన్న మూవీ మంచి పాజిటివ్ వైబ్స్ కి క్రియేట్ చేసింది. ఇక అనౌన్స్మెంట్ నుంచే తన మ్యాజిక్ చూపిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ ప్రతి సాంగ్ ని ఒక చార్ట్ బస్టర్ లా, రిపీట్ మోడ్ లో ప్రతి ఒక్కరూ వినేలా చేసాడు. ఇప్పటికే హాయ్ నాన్న సినిమా నుంచి సమయమా, గాజు బొమ్మ సాంగ్స్ బయటకి వచ్చి మూవీకి సూపర్బ్ ప్రమోషన్స్ చేసాయి. ఇప్పుడు లేటెస్ట్ గ హాయ్ నాన్న సినిమా నుంచి థర్డ్ సాంగ్ ‘అమ్మాడి’ అంటూ బయటకి వచ్చింది. నాని-మృణాల్ పై కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి కృష్ణ కాంత్ లిరిక్స్ రాయగా… కాలభైరవా, శక్తిశ్రీ గోపాలన్ వోకల్స్ ఇచ్చారు. “ముద్దొస్తున్నాడే” అనే హుక్ లైన్ తో సాగిన సాంగ్ సూపర్బ్ గా ఉంది. నాని-మృణాల్ పెళ్లి విజువల్స్ చూపిస్తూ వచ్చిన సాంగ్ ని డిజైన్ చేసిన విధానం బాగుంది. హాయ్ నాన్న సినిమా నుంచి వచ్చిన మూడు సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మరి ఈ సినిమా నానిని డిసెంబర్ 7న ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

బీడీ నుంచి బిర్యాని పాట వరకూ అన్నీ లీకులే కదా సర్… ఏంటో ఈ కర్ణుడి కష్టాలు
మహేష్ బాబు ఏ సమయంలో గుంటూరు కారం సినిమాని ఓకే చేసాడో కానీ అప్పటి నుంచి ఈ సినిమా గురించి ఎన్ని వినకూడదో అన్నీ వినాల్సి వస్తోంది. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ అనగానే స్కై హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ అంచనాలు అందుకోవడానికి షూటింగ్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్… లీకుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతూనే ఉంది. మహేష్ బాబు బీడీ కాల్చేది బయటకి వచ్చినప్పుడు, ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు. అదే డైరెక్ట్ ఆన్ స్క్రీన్ చూసి ఉంటే థియేటర్స్ టాప్ లేపే వాళ్లు. ఆ తర్వాత మహేష్ బాబు హెడ్ బ్యాండ్ కట్టుకోని ఉన్న ఫోటో లీక్ అయ్యింది. సారథి స్టూడియోలో షూటింగ్ చేస్తే బ్లాస్ట్ చేసిన కార్స్ లీక్ అయ్యాయి. శ్రీలీలా-మహేష్ బాబు ఉన్న ఫోటో లీక్ అయ్యింది, పూజా హెగ్డే-మహేష్ బాబు షాపింగ్ మాల్ లో ఉన్న ఫోటో లీక్ అయ్యింది. ఇటీవలే “ప్రజాబంధు… జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి, గౌరవనీయులు శ్రీ. వైర వెంకటస్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు… నిజామాబాద్” అంటూ ప్రకాష్ రాజ్ పాత్రకి సంబంధించిన లీక్… ఇలా గుంటూరు కారం షూటింగ్ స్పాట్ నుంచి ఎప్పుడు షూటింగ్ జరిగినా ఎదో ఒకటి లీక్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా ఈ లిస్టులో గుంటూరు కారం సాంగ్ కూడా వచ్చి చేరింది. నవంబర్ 7న రిలీజ్ కావాల్సిన గుంటూరు కారం ఫస్ట్ సాంగ్… సోషల్ మీడియాలో డైరెక్ట్ గా బయటకి వచ్చేసి అందరికీ షాక్ ఇచ్చేసింది. ఇప్పటివరకు గుంటూరు కారం నుంచి బయటకి వచ్చిన అన్నింటికన్నా ఇది అతిపెద్ద లీక్ అనే చెప్పాలి. ఈ లీకులని చిత్ర యూనిట్ ఎందుకు ఆపలేకపోతున్నారో తెలియట్లేదు కానీ లీకులు మాత్రం ఆగట్లేదు. ఇప్పటికైనా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకోని గుంటూరు కారం లీకులని బయటకి రాకుండా ఆపుతారో లేదో చూడాలి.