Site icon NTV Telugu

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

వైజాగ్‌ నుంచి పాలనకు ముహూర్తం ఫిక్స్.. ఏర్పాట్లలో మునిగిపోయిన అధికారులు
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎక్కడ.. ఇన్నాళ్ల ప్రశ్నకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం దాదాపుగా సమాధానం ఇచ్చేసింది. మూడు రాజధానుల ఏర్పాటుపై వడివడిగా అడుగులేస్తున్న జగన్ సర్కార్.. విశాఖ నుంచి పాలన సాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసేసింది. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాల వల్ల ఇన్నాళ్లూ జాప్యం జరిగినా.. డిసెంబర్ 8వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ నుంచి సీఎం జగన్ పాలనకు సంబంధించి మంత్రి సిదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ మొదటి వారం నుంచి విశాఖ వేదికగా సీఎం జగన్ పాలన ప్రారంభమవుతుందన్నారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా ప్రకటించారన్నారు. విశాఖను రాజధాని చేయడం ద్వారా 50 ఏళ్ల ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందన్నారు సిదిరి.

అందుకే అవినీతి నిర్మూలనపై ఫోకస్‌ చేశాం..!
అవినీతి అనేది ఒక అవమానకరమైన స్థితి.. అవినీతి ఉంటే పాలనకు మంచి పేరు రాదు.. అందుకే అవినీతి నిర్మూలనపై ఎక్కువ దృష్టి పెట్టాం అన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ఏలూరు దెందులూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చిందని తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ జరిగి, అవినీతిలేని పాలన అందడంతో ప్రజలు సంతృప్తి చెందే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒక స్థాయి వరకు అవినీతి తొలగించాము.. మరిన్ని విధానాలు అవలంభించి పూర్తి స్థాయిలో ఎక్కడా అవినీతి కనిపించకుండా చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు.. అవినీతి అనేది ఒక అవమానకరమైన స్థితన్న మంత్రి.. అవినీతి ఉంటే పాలనకు మంచి పేరు రాదు.. అందుకే అవినీతి నిర్మూలనపై ఎక్కువ దృష్టి పెట్టినట్టు వెల్లడించారు. రెండేళ్లు కరోనాలో గడిచిపోయిన ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా పరిపాలన అందించాం.. దేశం అంతా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలని చూస్తోంది.. ఒక వ్యక్తి వాలంటీర్స్ ని అవమానిస్తే రాష్ట్రమంతా ఆందోళనలు వెల్లువెత్తాయంటూ.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. వాలంటీర్లపై వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత వాలంటీర్లు ఆందోళనకు దిగిన సందర్భాన్ని తెలిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

ఎస్‌ఐ పోస్టుల భర్తీపై హైకోర్టు కీలక ఆదేశాలు
రాష్ట్రంలో ఎస్‌ఐ పోస్టుల భర్తీపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. అభ్యర్థుల ఎత్తు కొలిచే విషయంలో అనుసరించిన డిజిటల్ విధానం సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో 24 మంది పిటిషన్ దాఖలు చేశారు.. ఛాతీ, ఎత్తు కొలిచే విధానంలో డిజిటల్ విధానం వల్ల అనేక మంది అర్హులైన అభ్యర్థులు కూడా అర్హత కోల్పోయారని కోర్టుకు తెలిపారు పిటిషనర్.. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. హైకోర్టు పర్యవేక్షణలో కోర్టు ప్రాంగణంలో ఎత్తు, కొలతలు తీయాలని ఆదేశాలు జారీ చేసింది.. అయితే, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇచ్చిన కొలతలు కరెక్ట్ అయితే.. ఒక్కో పిటిషనర్ ఖర్చుల కింద లక్ష రూపాయలు చెల్లించాలంటూ ఆదేశించింది. కొలతలకు సిద్దంగా ఉన్న అభ్యర్థుల వివరాలు కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌ను సూచించిన హైకోర్టు.. తదుపరి విచారణ ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.

బీజేపీ హటావో… దేశ్ బచావో.. మోడీ పాలనా వైఫల్యాలను ప్రజలు గమనించారు..!
బీజేపీ హటావో… దేశ్ బచావో.. అనే నినాదంతో ముందుకెళ్తామన్నారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా.. ప్రధాని మోడీ ప్రతిపక్షాల మీద తప్పుడు విధానాలు అనుసరిస్తున్నారన్న ఆయన.. మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్, తెలంగాణలలో ఎన్నికలు జరుగుతున్నాయి.. మోడీ పాలనా వైఫల్యాలను ప్రజలు గమనించారని తెలిపారు. పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలలో మోడీ పాలనా వైఫల్యాలు ప్రతిభింస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మైనారిటీల పట్ల బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసమానతలు ఉన్నాయి.. అన్ని సెక్యులర్ పార్టీలు కలిసి బీజేపీని గద్దె దించాలన్నారు. ఇండియా కూటమి రోజు రోజుకు బలపడుతోందన్న ఆయన.. మోడీ పాలనలో చేసిన పనులు అన్నీ వైఫల్యాలే… ఆకలితో అలమటిస్తున్న వారు భారతదేశంలో ఎక్కువైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

విశాఖ నుంచి పాలన కోర్టు ధిక్కరణే..!
త్వరలోనే విశాఖపట్నం నుంచి పాలన ప్రారంభించేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం సిద్ధం అవుతుంది.. డిసెంబర్‌ 8వ తేదీ మూహూర్తం కూడా ఫిక్స్‌ చేసినట్టు ప్రచారం సాగుతోంది.. అయితే, సుప్రీంకోర్టు తీర్పు రాకుండానే విశాఖపట్నం నుంచి పరిపాలన చేస్తానంటున్నారు.. విశాఖ నుంచి పరిపాలిస్తాననడం కోర్టు ధిక్కరణే అవుతుందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఋషికొండపై నిర్మాణంలో 150 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు. ఇక, 2014 నుంచి ఇవాళ్టి వరకూ జరిగిన మద్యం అమ్మకాలపై విచారణ జరగాలన్నారు రామకృష్ణ.. ఓటర్ల చేర్పు లోనే దొంగ ఓట్లు ఉన్నాయి.. దొంగ ఓట్ల పై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం అన్నారు. గవర్నర్ పాత్రపైన కూడా అనుమానాలున్నాయన్నారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ పెద్ద ఎత్తున కొనసాగుతోంది.. ఉచిత ఇసుకతో అన్యాయం జరిగిందని చంద్రబాబుపై కేసు పెట్టారని.. ఇంకా వెళ్లిపోయిన జేపీ ఇన్ఫ్రా పేరుతోనే బిల్లులు ఇస్తున్నారని మండిపడ్డారు. డ్యామ్‌లలో నీళ్లు లేవు.. వర్షాలు కురవడం లేదు.. మద్యం దోపిడీ కింద మొత్తం సొమ్మంతా దోచుకుంటున్నారని ఆరోపించారు. కొల్లు రవీంద్ర, చంద్రబాబు పైన కేసులు పెడుతున్నారు.. దొంగల రాజ్యం ఈ రాష్ట్రంలో నడుస్తోందని విమర్శించారు.. మద్యంలో చంద్రబాబు అవినీతి ఉంటే విచారణ చేయాలని సూచించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.

మత ఘర్షణల రికార్డ్‌ కాంగ్రెస్‌ దే.. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి..
కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు… వాళ్లు బీఆర్ఎస్ లో చేరారని.. బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తే అవినీతికి పాల్పడిందని.. ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వండని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మత ఘర్షణల రికార్డ్ కాంగ్రెస్ ది… బీజేపీ ఎక్కడ అధికారం లో ఉన్న వీటిని అణచి వేస్తుందని అన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ తో సిద్ధాంత పరమైన, రాజకీయ పరమైన పొత్తులు ఎప్పుడు ఉండవన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరవాత అవినీతిపై విచారణ చేసి దోషులను జైల్ కి పంపిస్తామన్నారు. ఎంఐఎం పాలస్తీనా అంశం చెప్పకుండా ఇంకేమి చెప్పి ఓట్లు అడుగుతుందన్నారు. మాదిగ వర్గీకరణను స్పీడ్ అప్ చేసేందుకే కమిటీ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు. రోయింగ్యలపై ఎన్ఐఏ ఆక్షన్ తీసుకుంటుందని తెలిపారు. ఇక్కడ వాళ్లు కేసీఆర్ కి ఓటు బ్యాంక్… మా దృష్టిలో రోహింగ్యాలు దేశ ద్రోహులు అన్నారు. పీఎస్ యూ లను అమ్మాలని అనేది మా విధాన పరమైన నిర్ణయమన్నారు. తెలంగాణలో పబ్లిక్ సెక్టార్ యూనిట్ లను అమ్మమని, ఇక్కడ ఆ ప్రశ్న ఉత్పన్నం కాదని అన్నారు. ఎంఐఎం ఓటును ఈ సారి కాంగ్రెస్ తీసుకోబోతుంది.. అసద్ కి కాంగ్రెస్ భయం పట్టుకుందని తెలిపారు. రైతు బంధు నీ మేము ఆపమని షా అన్నారు.

తెలంగాణలో హంగ్ వస్తే కాంగ్రెస్ కు సీపీఎం మద్దతు
దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే మా పోరాటం కొనసాగుతుంది అని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశ వ్యాప్తంగా యువతకు ఉపాధి లేదు.. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉంది.. మధ్యప్రదేశ్ లో కొంత బలం ఉన్నా.. ఫలితాల్లో మాత్రం కనిపించకపోవచ్చు.. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ED ), సీబీఐ.. బీజేపీ చేతిలో బందీ అయ్యాయని ఆయన ఆరోపించారు. దేశంలో బాధ్యత లేకుండా బీజేపీ పాలన నడుస్తోంది.. ఉత్తరాఖండ్ టన్నెల్ ఘటనపై అకౌంటబిలిటీ కనిపించడం లేదు.. ఉత్తరాఖండ్ లో టన్నెల్ కు ఎవరు అనుమతి ఇచ్చారో.. ఆ ఘటనకు భాధ్యత ఎవరు వహించాలి అని సీతారం ఏచూరి ప్రశ్నించారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు మోడీ పాల్పడుతున్నారు అయినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీసులు ఇవ్వదు అంటూ సీతారం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సీపీఎం ఒంటరిగా బరిలో ఉన్నా కాంగ్రెస్ నష్టం లేదు అనే భావనలో కాంగ్రెస్ ఉంది.. యాంటి బీజేపీగా అందరినీ ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఒంటరిగా పోటీ చేస్తున్నారు.. హంగ్ వస్తే కాంగ్రెస్ కు సీపీఎం మద్దతు ఉంటుంది.. ఇండియా కూటమిలో ఇప్పటికే ఉన్నాం.. సీపీఎం ఖమ్మం జిల్లాలో పోటీ చేయకుండా పొత్తులు అనేది అసంభవం అని సీతారం ఏచూరి పేర్కొన్నారు.

తేజస్‌ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని మోడీ
బెంగుళూరులో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఈవెంట్ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్‌లో ప్రయాణించారు. పూర్తిగా స్వదేవీ ప‌రిజ్ఞానంతో అభివృద్ది చేసిన ఈ తేజ‌స్‌ యుద్ధ విమానంలో ఆయ‌న ఓ ట్రిప్ వేశారు. బెంగుళూరులో ఉన్న హెచ్ఏఎల్ కంపెనీని నేడు ఆయ‌న విజిట్ చేశారు. ర‌క‌ర‌కాల ఫైట‌ర్ జెట్ల త‌యారీ గురించి అక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు. యుద్ధ విమానాల ఉత్పత్తి కేంద్రాన్ని మోడీ ప‌రిశీలించారు. తేజ‌స్ యుద్ధ విమానం త‌యారీ గురించి కూడా తెలుసుకున్నారు. తేజస్ యుద్ధ విమానంలో గాల్లోకి ఎగిరిన ప్రధాని నరేంద్ర మోడీ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఓ పోస్ట్ చేస్తూ.. తేజస్‌ యుద్ద విమానంలో నా ప్రయాణం విజయవంతంగా పూర్తి చేశా.. ఈ అనుభవం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది మన దేశ స్వదేశీ సామర్థ్యాలపై, మన జాతీయ సామర్థ్యంపై నాకు చాలా నమ్మకాన్ని పెంచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నాలో నూతనమైన ఉత్సహం కలిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ.. తేజ‌స్ యుద్ధ విమానాల‌ను ప్రస్తుతం త‌యారు చేస్తుంది. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా వాటికి గుర్తింపు ఉంది. అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ సంస్థతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ ఒప్పందం చేసుకుంది. తేజ‌స్ యుద్ధ విమానాల‌కు చెందిన‌ మాక్‌-3 ఇంజిన్లను హెచ్ఏఎల్ తయారు చేస్తోంది.

ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ ట్రేడింగ్ విధానం ద్వారా కెప్టెన్ మారాడు!
సరిగ్గా ఆడని ఆటగాళ్లను వేలంలో వదిలేయడం, కొత్త వారిని కొనుక్కోవడం ప్రతి ఐపీఎల్ సీజన్‌లో ఫ్రాంచైజీలు చేస్తుంటాయి. అలానే ట్రేడింగ్ విధానం ద్వారా ఆటగాళ్లను బదిలీ చేసుకోవడం కూడా మామూలే. అయితే కెప్టెన్‌ను వదులుకోవడం మాత్రం చాలా అరుదుఅనే చెప్పాలి. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ప్రాంచైజీ ఇదే చేస్తోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు ట్రేడింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌ను ట్రేడింగ్ చేయడం ఇదే మొదటిసారి మాత్రం కాదు. కెప్టెన్‌ను వద్ధులుకున్న జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌లు ఉన్నాయి. 2019 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ ట్రేడ్‌ ప్రక్రియలో దక్కించుకుంది. 2019లో రాజస్తాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానేను ఢిల్లీ క్యాపిటల్స్‌ తీసుకుంది. 2020 సీజన్‌లో వీరిద్దరూ సారథిగా కాకుండా.. ఆటగాళ్లుగా ఆడారు. అప్పుడు ఢిల్లీకి శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యం వహించాడు. 2020 సీజన్‌లో ఢిల్లీ ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరి.. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది.

ముంబై ఇండియన్స్‌లోకి హార్దిక్ పాండ్యా.. ఆ ముగ్గురిలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ ఎవరు?
ఐపీఎల్ ప్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. మళ్లీ తన పాత జట్టు ముంబై ఇండియన్స్‌కు ఆడనున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే ‘ట్రేడింగ్ విండో’ ద్వారా ముంబై, గుజరాత్ జట్ల మధ్య ఒప్పందం జరిగినట్లు ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్ తన కథనంలో పేర్కొంది. అయితే ఈ ఒప్పందంపై అటు గుజరాత్ గానీ.. ఇటు ముంబై గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఐపీఎల్ 2024కు సంబందించిన మినీ వేలం వచ్చే నెలలో జరగనుంది. రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ ప్రకటించేందుకు నవంబర్ 26 వరకు అన్ని జట్లకు అవకాశం ఉంది. గుజరాత్‌ టైటాన్స్‌ యాజమాన్యంతో విభేదాల కారణంగా హార్దిక్ పాండ్యా ఆ ఫ్రాంచైజీని వీడనున్నాడని తెలుస్తోంది. ఒకవేళ హార్దిక్ గుజరాత్‌ను వీడితే.. కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో మనస్సులో ఉంది. ప్రస్తుతం గుజరాత్ కెప్టెన్సీ రేసులో న్యూజీలాండ్ సారథి కేన్‌ విలియమ్సన్‌, టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌లు ముందు వరుసలో ఉన్నారు. అఫ్గాన్‌ స్పిన్నర్‌ రషీద్ ఖాన్‌, దక్షిణాఫ్రికా సారథి డేవిడ్‌ మిల్లర్‌లు కూడా కెప్టెన్సీ పోస్ట్‌కు పోటీలో ఉన్నారు. హార్ధిక్‌ పాండ్యా స్థానాన్ని అనుభవం ఉన్న వ్యక్తితో భర్తీ చేయాలనుకుంటే.. కేన్‌ విలియమ్సన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్ అవుతాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కేన్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. ఆలా కాకుండా భవిష్యత్‌ కోణం, స్వదేశీ కెప్టెన్ కోణంలో చూస్తే శుభ్‌మన్‌ గిల్‌ సారథి అవుతాడు. గిల్‌ ఇదివరకే ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో తానేంటో ప్రూవ్‌ చేసుకున్నాడు. గత ఏడాదిన్నర కాలంగా పరుగుల వరద పారిస్తున్నాడు. భారత జట్టు భవిష్యత్‌ సారథి రేసులో గిల్ కూడా ఉన్నాడు. రషీద్‌ ఖాన్‌ గుజరాత్‌ టీమ్‌కు వైస్‌ కెప్టెన్‌. గత సీజన్‌లో పాండ్యా లేనప్పుడు సారథ్య బాధ్యతలు కూడా నిర్వహించాడు. అయితే ప్రధానంగా కేన్, గిల్ మధ్యనే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.

సలార్ కన్నా ముందే పాన్ ఇండియా సినిమాలో నటించేసింది
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి యంగ్ స్టార్ హీరోలందరి పక్కన నటించి స్టార్ స్టేటస్ అందుకుంది శృతి హాసన్. రవితేజతో హిట్ కాంబినేషన్ ఉన్న శృతి హాసన్… బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ఉంటుంది. గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ రెండు ఎలిమెంట్స్ ఉన్న శృతి హాసన్ కెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తోంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 22న రిలీజ్ కానున్న సలార్ సినిమాలో శృతి హాసన్ ‘ఆధ్య’ పాత్రలో నటిస్తోంది. సలార్ సినిమా రిలీజ్ అయితే శృతి హాసన్ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోతుంది. సలార్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అనుకుంటే శృతి హాసన్ మరో పాన్ ఇండియా సినిమాతో సలార్ కన్నా ముందే ఆడియన్స్ ముందుకి వస్తుంది. నాని నటించిన లేటెస్ట్ సినిమా ‘హాయ్ నాన్న’. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా ప్రమోషన్స్ జరుపుకుంటున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజులో డిసెంబర్ 7న రిలీజ్ కానుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్లు ఉంది. హాయ్ నాన్న మేకర్స్ ఇన్ని రోజులు ఈ విషయాన్ని దాచి పెట్టి.. ట్రైలర్ లో ఒక చోట మాత్రం ఒక క్లోజప్ లో శృతి హాసన్ ఫేస్ ని రివీల్ చేసారు. హాయ్ నాన్న ట్రైలర్ లో శృతి హాసన్ ని చుసిన వాళ్లు షాక్ అయ్యారు. ఈ విషయాన్నీ మేకర్స్ బయటకి రాకుండా బాగానే మేనేజ్ చేసారు. మరి హాయ్ నాన్న సినిమాలో శృతి హాసన్ ఎంత సేపు కనిపించనుంది? ఎలాంటి క్యారెక్టర్ ప్లే చేసింది అనేది తెలియాలి అంటే డిసెంబర్ 7 వరకు వెయిట్ చేయాల్సిందే.

తీరం తాకనున్న ‘సలార్’ తుఫాన్‌!
సలార్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచే… రిలీజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసేశారు ప్రభాస్ ఫ్యాన్స్. 250, 200, 150, 100, 50 రోజులు అంటూ కౌంట్ డౌన్ చేస్తునే ఉన్నారు. ఫైనల్‌గా సలార్ తుఫాన్ తీరం తాకే సమయం ఆసన్నమైంది. మరో నాలుగు వారాల్లో బాక్సాఫీస్‌ను కమ్మేయనుంది సలార్ తుఫాన్. డిసెంబర్ 22 బాక్సాపీస్ దగ్గర జరగబోయే తుఫాన్ భీభత్సం మామూలుగా ఉండదు కానీ డిసెంబర్ 1న శాంపిల్‌గా తీరాన్ని తాకనుంది సలార్ తుఫాన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్ ట్రైలర్ రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో సలార్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన యానిమల్ ట్రైలర్‌కు మించి… సలార్ ట్రైలర్ మరింత వైలెంట్‌గా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే జోష్‌లో నెక్స్ట్ ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబోలో రానున్న స్పిరిట్‌ను కూడా ట్రెండ్ చేస్తున్నారు కానీ సలార్ ట్రైలర్ మాత్రం పీక్స్ అనేలా ఉంటుందనే నమ్మకంతో ఉన్నారు. టీజర్‌లో డైనోసర్ అంటూ ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్‌ను ఊహించుకొని.. ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ హై ఓల్టేజ్ ట్రైలర్ కట్ చేసే పనిలో ఉన్నాడు ప్రశాంత్ నీల్. ఈ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ బయటికి రావడమే లేట్.. డిజిటల్ రికార్డ్స్ అన్ని చెల్లా చెదురు కానున్నాయి. ఈ అవుట్‌ అండ్ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్‌ నటిస్తుండగా… మలయాళ నటుడు పృథ్విరాజ్‌ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. కెజియఫ్ తర్వాత హోంబలే సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌ తో సలార్‌ను నిర్మిస్తోంది. మరి ఇంత హైప్ ఉన్న సలార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version