NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

విజయవాడలో సూపర్‌ స్టార్‌ కృష్ణ విగ్రహం.. ఆవిష్కరించిన కమల్‌ హాసన్‌
టాలీవుడ్‌ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు సినీ హీరో, పద్మ భూషణ్ కమల్ హాసన్.. విజయవాడ వచ్చారు కమల్.. భారతీయుడు 2 షూటింగ్‌ కోసం వచ్చిన ఆయన.. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన సూపర్‌ స్టార్‌ కృష్ణ విగ్రహాన్ని ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్‌ పాల్గొన్నారు.. ఇక, సూపర్‌ స్టార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై ఆనందం వ్యక్తం చేశారు దేవినేని ఆవినాష్‌.. పదిరోజుల వ్యవధిలోనే కృష్ణ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన సీఎం వైఎస్‌ జగన్ కు కృష్ణ కుటుంబ సభ్యులు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ప్రజలందరి అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు దేవినేని అవినాష్‌.. తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు కృష్ణ అని కొనియాడారు.. అయన వారసత్వంతో ఇండస్ట్రీ లోకి వచ్చిన మహేష్ బాబు అటు సినీరంగంలో, ఇటు సేవా కార్యక్రమాల్లో ముందుంటు.. కృష్ణ పేరు నిలబెడుతున్నారని పేర్కొన్నారు.. ఇక, ఎప్పుడు షూటింగ్ లలో బిజీగా ఉండే కమల్ హాసన్.. ఇక్కడకు రావటం సంతోషంగా ఉందన్నారు.. నగర ప్రజల తరపున, సూపర్‌ స్టార్‌ కృష్ణ, మహేష్ బాబు అభిమానుల తరపున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.. ఇదే సమయంలో.. 10 రోజుల వ్యవధిలోనే కృష్ణ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన సీఎం జగన్ కు.. కృష్ణ కుటుంబ సభ్యులు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు దేవినేని అవినాష్‌.

హాట్‌ కేకుల్లా వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విక్రయం.. నిమిషాల వ్యవధిలోనే పూర్తి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. ఇక, ప్రత్యేక రోజుల్లో అయితే.. ఇక చెప్పాల్సిన అవసరం లేదు.. అదే వైకుంఠ ద్వారా దర్శనం అయితే.. తిరుమల గిరులు అన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి.. ఏడు కొండలు గోవందనామస్మరణతో మార్మోగుతాయి.. ఇప్పటికే వైకుంఠద్వారా దర్శనం షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేయగా.. ఈ రోజు వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టింది.. అయితే, హాట్‌ కేకుళ్లా.. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే టికెట్లు మొత్తం విక్రయించింది తిరుమల తిరుపతి దేవస్థానం.. డిసెంబర్‌ 23వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్టు ఇప్పటికే టీటీడీ ప్రకటించింది.. ఇక, ఆ సమయంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులకు ప్రత్యేకంగా 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్ల కోటాను ఈ రోజు ఆన్‌లైన్‌లో పెట్టింది.. ఈ వైకుంఠ ద్వార దర్శన టికెట్లు డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు వర్తించనుండగా.. రోజుకి 22,500 టికెట్ల చొప్పున మొత్తం 2.25 లక్షల టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.. అయితే, హట్ కేకుల్లా వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విక్రయం అయ్యాయి.. టికెట్లు విడుదల చేసిన 14 నిమిషాల వ్యవధిలోనే 80 శాతం టికెట్లు విక్రయాలు పూర్తి కాగా.. 16 నిమిషాల వ్యవధిలోనే 2 లక్షల టికెట్లు.. 17 నిమిషాల నిముషాల వ్యవధిలోనే 90 శాతం టికెట్ల విక్రయాలు పూర్తి కాగా.. 21 నిమిషాల వ్యవధిలో పూర్తిస్థాయిలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టికెట్ల విక్రయాలు పూర్తి అయ్యాయి.. వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి 6.75 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.

నేటితో ముగియనున్న వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర.. చివరి రోజు ఇలా..
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలతో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను చేపట్టింది. గత నెల 26వ తేదీన ప్రారంభమైన మొదటి దశ బస్సు యాత్ర… ఇవాళ్టితో ముగియనుంది. ఫస్ట్ ఫేజ్ లో 39 నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్దేశించుకున్నా… పలు కారణాలతో 35 నియోజకవర్గాల్లో పూర్తి అవుతోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో ఏకకాలంలో ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో మూడు బస్సు యాత్రలు, మూడు సభలు నిర్వహించారు. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, కోస్తాలో తెనాలి, రాయలసీమలో శింగ‌న‌మ‌ల‌ నుంచి బస్సు యాత్ర ప్రారంభం అయింది. ఈ బస్సు యాత్ర పూర్తిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు పాల్గొనే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో ఈ సామాజిక వర్గాలకు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకు వివరించడమే ప్రధాన అజెండా. ఇక, చివరి రోజు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సామాజిక బస్సు యాత్ర చివరి రోజు కూడా మూడు ప్రాంతాల్లో కొనసాగనుంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఈ రోజు బస్సు యాత్ర కొనసాగనుంది.. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జయరాం, ఉషాశ్రీ చరణ్‌, మెరుగు నాగార్జున, ఎంపీ మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకారెడ్డి, రామసుబ్బారెడ్డి, హఫీజ్‌ఖాన్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎంపీ నందిగాం సురేష్‌, కుంభ రవిబాబు తదితరలు పాల్గొనన్నారు.. మరోవైపు పల్నాడు జిల్లా పెదకూరపాడులో సామాజిక సాధికార యాత్ర సాగనుంది.. ఇక్కడ మంత్రులు విడదల రజినీ, మేరుగు నాగార్జున, మాజీ మంత్రి పార్థసారథి, డొక్కా మాణిక్యవరప్రసాద్, అలీ తదితరులు పాల్గొననున్నారు. ఇక, మన్యం జిల్లా పార్వతీపురంలో జరగనున్న వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ముత్యాలనాయుడు, రాజన్నదొర తదితరలు పాల్గొననున్నారు.

నాపై పెట్టిన కేసులన్నీ పూర్తి కావాలంటే మూడు జన్మలు కావాలి..!
నాపై పెట్టిన కేసులన్నీ పూర్తి కావాలంటే మూడు జన్మలు కావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాడిపత్తి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి.. అనంతపురం జిల్లా ఎస్పీని కలిసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు మాత్రమే వచ్చానని చెప్పారు… రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదు.. తాడేపల్లి రాజ్యాంగం ఉందంటూ విమర్శలు గుప్పించారు. ఇక, నాపై పెట్టిన కేసులన్నీ పూర్తి కావాలంటే మూడు జన్మలు కావాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పటికే నాకు 73 ఏళ్ల వయసు.. ఆ కేసులన్నీ ఎప్పటికీ క్లియర్ అవుతాయి? అని ప్రశ్నించారు. మరోవైపు.. పుట్లూరు, యల్లనూరు మండలాల్లో భారీగా దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు. ఆ రెండు మండలాలు తహశీల్దార్ లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మాకు ఈ ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ సమస్య లాంటివి అని.. అందుకే చాలా సీరియస్ గా తీసుకున్నాం.. ఎక్కడ ఏ తప్పిదం జరిగినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్ని కేసులు వచ్చినా వెనక్కు తగ్గేది లేదు.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏమాత్రం పోలీసు పరిధిలో పనిచేయడం లేదంటూ ఆరోపించారు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి.

20 మందితో బిఎస్పీ ఐదో జాబితా విడుదల.. పెండింగ్ లో పటాన్ చెరు
బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఐదో జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విడుదల చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గురువారం 20 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీఎస్పీ ఇప్పటికే 118 మంది అభ్యర్థులను ప్రకటించగా, పటాన్ చెరువు స్థానానికి మిగిలిన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. బీఎస్పీ అభ్యర్థి, రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ కార్యాలయం – బాలాజీనగర్‌ – అంబేద్కర్‌ విగ్రహం – రాజీవ్‌ గాంధీ కూడలి – ఎన్టీఆర్‌ చౌక్‌ – ఎన్టీఆర్‌ కూడలి నుంచి ర్యాలీగా సిర్పూర్‌ వెళ్లి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒకేలా ఉన్నాయని, ఈ పార్టీలకు ఓటు వేయవద్దని సూచించారు. పలువురు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు బీఎస్పీలో చేరిన సందర్భంగా కాగజ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.వందలాది మంది అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం కబ్జాకు గురైందన్నారు. మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉంటే కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో రూ.5 లక్షల కోట్ల అప్పు ఉండేదన్నారు.

పొరపాటున కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే పదేళ్లు వెనక్కిపోతాం..
పొరపాటున కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే పదేండ్లు వెనక్కిపోతామని మంత్రి హరీష్ రావు అన్నారు. అబద్దాలతో అధికారంలోకి రావాలాని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ తక్కువ అని అన్నారు. అధికారం మీద యావ ఎక్కువ అన్నారు. అబద్దాలతో అధికారం లోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ తో జాగ్రత్త గా ఉండాలని మంత్రి ప్రజలకు సూచించారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కి అధికారం ఇస్తే 10ఏళ్ళు వెనక్కి పోతామని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కి అధికారం ఇస్తే మన ఏళ్ల తో మన కన్ను పొడుచుకున్నట్టే అని తెలిపారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణకు శ్రీరామరక్ష సీఎం కేసీఆర్ పాలన అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల కంటే కాంగ్రెస్ అధికారాన్ని ఎక్కువగా ప్రేమిస్తోందని విమర్శించారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. నాయకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మాట్లాడుతూ కర్ణాటకలో వ్యవసాయానికి 5 గంటల కరెంట్‌ ఇస్తున్నామని, మన రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్నామన్నారు. రైతుబంధు సృష్టికర్త సీఎం కేసీఆర్ అని అన్నారు. ఉమ్మడి పాలనలో కరువు కాటకాలతో సతమతమయ్యేవారని, నేడు హరితహారంగా మార్చామన్నారు. పొరపాటున అయినా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే పదేళ్లు వెనక్కి వెళ్తుందని హెచ్చరించారు. దీంతో తెలంగాణ నేడు అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా ఉందని తేలింది. బీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టో అద్భుతం. కేసీఆర్ బీమాతో ప్రతి ఇంటికి ధీమా. రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నామన్నారు. రైతుబంధు, ఆసరా పింఛన్లు పెంచబోతున్నట్లు తెలిసింది. ఐక్య మెదక్ జిల్లాలో 10కి 10 సీట్లు బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందన్నారు.

వాయు కాలుష్యంపై రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు
దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖ రాశారు. ఈ సందర్భంగా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు వాయు కాలుష్యం యొక్క తీవ్ర సవాలును పరిష్కరించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ జారీ చేశారు. దేశ రాజధానిలో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటంతో ఇక్కడి ప్రజలు సతమతమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) తరచుగా పేలవమైన స్థాయి నుండి తీవ్రమైన స్థాయికి చేరుకుంటుంది. ఇక, శీతాకాలంలో ఈ సమస్య మరింత పేరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో వాయు కాలుష్యం ద్వంద్వ ముప్పును కలిగిస్తుందని చెప్పారు. వాయు కాలుష్యం యొక్క ఆరోగ్య ప్రభావాలను హైలైట్ చేస్తూ.. ఇది తీవ్రమైన, దీర్ఘకాలిక అనారోగ్యాలకు దోహదం చేస్తుందని, శ్వాసకోశ, హృదయ, సెరెబ్రోవాస్కులర్ వ్యవస్థలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ తెలిపారు.

భారత్ కు వ్యతిరేకంగా ప్రసంగాలు .. లష్కరే మాజీ కమాండర్ హతం
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పాకిస్థాన్‌లో గురువారం గుర్తు తెలియని వ్యక్తులు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్‌ను కాల్చి చంపారు. వివరాలలోకి వెళ్తే.. భారత్ గురించి వ్యతరేకంగా ప్రసంగాలు చేసే అక్రమ్ గాజీ అలియాస్ అక్రమ్ ఖాన్‌ న్ను పాకిస్థాన్‌ లోని బజౌర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం హత్య చేసారు. కాగా ఇతను తీవ్రవాద సంస్థకు చెందిన ప్రముఖ వ్యక్తి. ఈయన 2018 నుంచి 2020 వరకు LET రిక్రూట్‌మెంట్ సెల్‌కు నాయకత్వం వహించారు. అలానే కొన్ని సంవత్సరాలుగా తీవ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చాడు. ఇక పాకిస్థాన్‌లో భారతదేశం పైన వ్యతిరేకంగా ప్రసంగాలు చేయడంలో ఇతను దిట్ట. కాగా పేరుకు తగ్గట్టే అక్రమ్ అక్రమాలు చేయడంలో ఆరితేరారు. ఉగ్రవాద సంస్థలో విధులు నిర్వహిస్తున్న అక్రమ్ ప్రధాన కర్తవ్యం.. అమాయక యువతను తన మాటాలతో మాయచేసి ఉగ్రవాదులుగా మార్చడం. అలా ఉగ్రవాదులుగా మార్చిన యువతను సంస్థలోకి రిక్రూట్ చేసుకుని వాళ్ళతో చట్ట విరుద్ధ కార్యకలాపాలు చేయించడం ఇదే అతను సంస్థలో నిర్వహించే విధి. కాగా గత కొంతకాలంగా ముష్కరులు ఉగ్రవాదులను టార్గెట్ చేస్తున్నారు. గతంలో ఉగ్రవాద సంస్థలో ప్రధాన విధులను నిర్వహిస్తున్న నాయకులను చంపేశారు. అక్టోబర్‌లో పఠాన్‌కోట్‌ దాడి సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌ను పాకిస్థాన్‌లో కాల్చిచంపారు. అలానే సెప్టెంబర్ లోనూ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ లోని రావల్‌కోట్‌ లోని అల్-ఖుదుస్ మసీదులో లష్కరే తోయిబాకు చెందిన టాప్ టెర్రరిస్టు కమాండర్‌ రియాజ్ అహ్మద్ అలియాస్ అబు ఖాసిమ్‌ని గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు.

ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన టెక్‌ దిగ్గజం విప్రో.. వారికి మాత్రమే మినహాయింపు..
టెక్‌ దిగ్గజం విప్రో కీలక నిర్ణయం తీసుకుంది. ధరలు మండిపోతున్నాయి. ఆదాయం చాలక చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. ఇక వేతన జీవులు తమ జీతాలు ఎప్పుడు పెరుగుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది టెక్‌ దిగ్గజం విప్రో. ఈ ఏడాది జీతాల పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. డిసెంబర్‌ ఒకటిన విప్రో ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. అయితే, అధిక జీతాలు తీసుకుంటున్న వాళ్లకు ఈ ఏడాది పెంపులు ఉండబోవంటూ అంతర్గత ఈ-మెయిల్స్‌ ద్వారా సమాచారం పంపింది విప్రో. తక్కువ జీతాలు పొందుతున్న వాళ్లకు మినహాయింపు ఇచ్చింది. వాళ్లకు యథావిధిగా డిసెంబర్‌ ఒకటో తారీఖున జీతాలు పెరగనున్నాయి. సాధారణంగా టాప్‌ పెర్ఫార్మర్లకు జీతాల్లో అధిక పెంపు ఇస్తూ వస్తుంది విప్రో. అయితే, ఈ సారి సెలక్టీవ్‌ మెరిట్‌ సాలరీ ఇంక్రీజ్‌ విధానాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం తక్కువ వేతనం పొందుతున్న వాళ్లలో అర్హులకు మాత్రమే జీతాల పెంపు ఉంటుంది. అందువల్ల.. అధిక వేతనాలు పొందుతున్న వాళ్లు అద్భుతమైన పనితీరు కనబర్చినా.. జీతాల పెంపు మాత్రం ఉండబోదని స్పష్టం చేసింది విప్రో యాజమాన్యం. గత సెప్టెంబర్‌ 30 నాటికి విప్రోలో 2 లక్షల 44 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. దేశంలోని సాఫ్ట్‌వేర్‌ ఎగుమతిదారుల్లో నాల్గో స్థానంలో ఉంది ఈ సంస్థ. అయితే, ప్రస్తుతం సంస్థ కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓ వైపు క్లయింట్లు ఖర్చు తగ్గించుకుంటున్నారు. మరోవైపు.. ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఇలాంటి సమయంలో ఉద్యోగులు అందరికీ జీతాలు పెంచి భారం పెంచుకోవడం సరికాదనే ఆలోచనలో విప్రో యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది.

హీరో మోటార్స్ సీఎండీ పవన్ కు చిక్కులు.. రూ.25 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్
ఆటోమొబైల్ కంపెనీ హీరో మోటోకార్ప్ సీఎండీ, చైర్మన్ పవన్ కుమార్ ముంజాల్ కష్టాలు మరింత పెరిగాయి. ఢిల్లీలోని అతనికి చెందిన మూడు స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. వాటి విలువ దాదాపు రూ.25 కోట్లు. ఈడీ చేపట్టిన ఈ చర్య మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించినదిగా చెప్పబడింది. హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలపై వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తదుపరి విచారణ తేదీ వరకు స్టే అమలులో ఉంటుందని కోర్టు తెలిపింది. 81 లక్షల విలువైన అప్రకటిత విదేశీ కరెన్సీని కలిగి ఉన్నారనే ఆరోపణలపై పవన్ ముంజాల్ సన్నిహితుడు అమిత్ బాలిని విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ కేసు 2018లో ప్రారంభమైంది. దీని తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో 2014-2019 మధ్య అమిత్ బాలి, సాల్ట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యక్తిగతంగా రూ. 54 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు నివేదికలో తేలింది. పవన్ ముంజాల్‌ సాయంతో.. కోట్లాది రూపాయల విదేశీ కరెన్సీని వివిధ దేశాలకు పంపారు.

బ్లాక్ ఔట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న శృతి హాసన్..
శృతి హాసన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. టాలీవుడ్ లో ఈ భామ వరుస గా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది… అయితే సడన్ గా ఈ భామ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది..కొన్నాళ్ళ తరువాత మళ్ళీ సినిమాలలోకి కమ్ బ్యాక్ ఇచ్చిన శృతి క్రాక్, వకీల్ సాబ్ రూపంలో హిట్స్ అందుకుంది.. ముఖ్యంగా క్రాక్ భారీ విజయం సాధించింది. క్రాక్ సినిమాలో రవితేజ కు జంట గా నటించింది. వకీల్ సాబ్ లో ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేసింది. శృతి హాసన్ 2023 సంక్రాంతి హీరోయిన్ గా నిలిచింది. ఆమె నటించిన వీర సింహారెడ్డి మరియు వాల్తేరు వీరయ్య విడుదలై మంచి విజయాలు సాధించాయి. వాల్తేరు వీరయ్య రెండు వందలకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.. సంక్రాంతి సీజన్ కలిసొచ్చి ఆమె కు రెండు హిట్స్ అందుకుంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి విజయాలు సాధించిన నేపథ్యంలో శృతి హాసన్ బాగానే రెమ్యూనరేషన్ అందుకుందట. ప్రస్తుతం శృతి చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ సలార్. ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సలార్ డిసెంబర్ 22 న విడుదల కానుంది.సలార్ ట్రైలర్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 1 న విడుదల చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే శృతి హాసన్ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది… తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్స్ లో డిఫరెంట్ పోజుల్లో కనిపించి శృతి హాసన్ రెచ్చగొట్టింది. ఆమె క్రేజీ ఫోటో షూట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. టెంప్టింగ్ పోజులతో శృతి హాసన్ గ్లామర్ ట్రీట్ అందించింది..ఈ భామ కు బ్లాక్ కలర్ అంటే ఎంత గానో ఇష్టమట.. అందుకే ఎలాంటి ఈవెంట్స్ లో అయినా కూడా శృతి హాసన్ బ్లాక్ డ్రెస్ లోనే మెరుస్తుంది..

మంగళవారం సినిమా లో పాయల్ పాత్ర ఎలా ఉంటుందంటే..?
పాయల్ రాజ్ పుత్.. ఈ భామ ఆర్‌ఎక్స్‌ 100′ చిత్రం తో ఓవర్ నైట్ పాపులర్ హీరోయిన్ అయింది..అజయ్‌ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అద్భుత విజయం సాధించడంతో పాటు.. ఆ సినిమాలో పాయల్ రాజ్ పుత్ చేసిన ఇందు పాత్ర సెన్సేషన్‌ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత పాయల్ కు వరుస అవకాశాలు వచ్చాయి.ఆర్ఎక్స్ 100 తరువాత ఈ భామ చాలా సినిమాలలో నటించింది. కానీ అవేమి కూడా పాయల్ కు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించలేదు.. స్టార్ హీరో వెంకటేష్ సరసన వెంకీ మామ సినిమా లో నటించిన కూడా పాయల్ కు అంతగా కలిసి రాలేదు. దీనితో ఇప్పుడు మరోసారి దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వం లో నటిస్తోంది ఈ భామ . పాయల్‌ రాజ్ పుత్ హీరోయిన్ గా దర్శకుడు అజయ్‌ భూపతి రూపొందించిన తాజా చిత్రం ‘మంగళవారం’. ఈ సినిమా లో నందితా శ్వేత, అజయ్‌ ఘోష్ మరియు దివ్యా పిళ్లై తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రంలో పాయల్ చేసిన పాత్ర పై ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది…ఇందులో పాయల్ నింఫోమానియాక్ కండీషన్ వున్న పాత్రలో కనిపిస్తుందని సమాచారం.నింఫోమానియాక్ అంటే.. శృంగార కోరికలను అదుపు చేయలేని స్థితి అని తెలుస్తుంది.. ఈ పాత్ర ఎంతో బోల్డ్ గా వుంటుందని, కథ కు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో కొన్ని బోల్డ్ సీన్లు వున్న విషయం తెలిసిందే. ‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత పాయల్‌- అజయ్‌ భూపతి కాంబోలో తెరకెక్కిన చిత్రం కావడం తో ‘మంగళవారం’ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి మంగళవారం సినిమా పాయల్ కు మరో బ్లాక్ బస్టర్ అందిస్తుందో లేదో చూడాలి..