NTV Telugu Site icon

Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ఏపీలో నడి రోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుళ్లు.. వీడియో వైరల్‌
ఏపీలో కానిస్టేబుళ్లు నడిరోడ్డుపై ఘర్షణకు దిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా రొల్ల మండలం పిల్లిగుండ్లు చెక్ పోస్టులో శివ, నారాయణస్వామి అనే ఇద్దరు కానిస్టేబుళ్లు బాహాబాహీకి దిగారు.. ఒకరికొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఇంతకీ ఇద్దరు కానిస్టేబుళ్ల మధ్య ఘర్షణకు దారి తీసిన విషయం ఏంటంటే.. ? సాయంత్రం డ్యూటీ షిఫ్ట్ ఆలస్యం అయిందనే విషయంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది.. అది కాస్తా వాగ్వాదానికి దారితీసింది.. ఇద్దరూ సహనం కోల్పోయారు.. రోడ్డుపైకి ఎక్కారు.. ప్రజలంతా చూస్తుండగానే నడి రోడ్డుపై కొట్టుకున్నారు ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఇక, ఏదైనా కాస్త భిన్నంగా కనిపిస్తే.. ఎప్పుడు వీడియో చూద్దామా? సోషల్‌ మీడియాలో పెడదామా? అని చూసే ఈ రోజుల్లో.. ఓ వ్యక్తి కానిస్టేబుళ్ల వ్యవహారాన్ని తన మొబైల్‌ ఫోన్‌లో బంధించాడు.. ఆ తర్వాత అది సోషల్‌ మీడియాకు ఎక్కి వైరల్‌గా మారిపోయింది.

పవన్‌ కల్యాణ్ ఆఫర్‌..! ముద్రగడ కౌంటర్‌
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను, ఆయన కుమార్తె క్రాంతిని కలుపుతాను తప్పా.. కుటుంబాలను విడదేసేవాడిని నేను కాదంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలుకు కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు ముద్రగడ పద్మనాభం.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్‌ నీ మెగా ఫ్యామిలీ చరిత్ర గురించి కూడా చెప్పు.. మీ కుటుంబంలో ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. తాగి తందనాలు ఆడుతున్నారు.. ఎవరు ఎవరితో ఉంటున్నారు చెప్పండి అంటూ హాట్‌ కామెంట్లు చేశారు.. నీ ముగ్గురు భార్యల గురించి కూడా చెప్పు అని సవాల్‌ చేశారు.. కానీ, నా కుటుంబంలో ఎవరికి ఏమైనా మా అమ్మాయిని పంపొద్దు.. నా కూతురితో తెగతెంపులు చేసేశారు.. చాలా రిలీఫ్ వచ్చింది.. హ్యాపీగా ఉన్నాను.. మా అమ్మాయి కూడా ఎప్పుడు ఇక్కడికి వస్తానని అనొద్దు అని పేర్కొన్నారు. ఇక, ఆయన సీటుకు దిక్కులేదు.. మా అమ్మాయికి సీటు ఇస్తానంటున్నాడు అది మా కర్మ అంటూ విమర్శలు గుప్పించారు. ఇక, పవన్ కల్యాణ్‌ చెప్పేది సొల్లు.. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి అంటూ ఫైర్‌ అయ్యారు ముద్రగడ.. కులాల మధ్య, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని మీ గురువుగారు చెప్పారా? అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎస్టేట్ లో పవన్ కల్యాణ్‌ మార్కెటింగ్ మేనేజర్, జనరల్ మేనేజర్ అంటూ దుయ్యబట్టారు. గురువుగారి ఆజ్ఞ ప్రకారం పని చేస్తున్నాడు.. కాపు కులాన్ని మొత్తం పోగు చేస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా కూతురిని.. ముద్రగడ పద్మనాభం కూతురుగా ఎందుకు పరిచయం చేసావు? అని నిలదీశారు.. నీకు సిగ్గు లేదా? బాగా నటిస్తున్నావు.. నువ్వు వదిలేసిన భార్యలను, ఉన్న భార్యను కూడా పరిచయం చేయాలి అని డిమాండ్‌ చేశారు. భీమవరం, గాజువాకలో తన్ని తరిమేశారు… పిఠాపురంలో కూడా అదే జరుగుతుంది అని జోస్యం చెప్పారు.

బాబు చరిత్ర చెప్పే సత్యం ఇది..! గుర్తుపెట్టుకుని ఓటు వేయాలి…
చంద్రబాబును నమ్మితే ప్రజలు మళ్లీ మోసం పోతారు.. నిద్రపోతున్న చంద్రముఖిని మళ్లీ నిద్రలేపినట్లు అవుతుంది.. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే అంటూ హెచ్చరించారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. మరో వారం రోజుల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోంది.. జరగబోయే ఎన్నికలు, ఎమ్మెల్యేలను ,ఎంపీలను, ఎన్నుకోవడానికి కాదు.. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం, ఎన్నికలు జరుగుతున్నాయి.. రాబోయే ఎన్నికల్లో మీరు వైసీపీకి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్ని ఆగిపోతాయని హెచ్చరించారు.. చంద్రబాబును నమ్మితే ప్రజలు మళ్ళీ మోసం పోతారు.. బాబు చరిత్ర చెప్పే సత్యం కూడా ఇదే.. సాధ్యం కానీ హామీలు మేనిఫెస్టోలో పెట్టిన అర్థం కూడా అదే… ఇది గుర్తుపెట్టుకుని ప్రజలు ఓటు వేయాలని సూచించారు. ఇక, దేవుడి దయతో, ఈ ప్రభుత్వంలో మీ బిడ్డ మీకు మంచే చేశాడు.. గతంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి చేశాను అన్నారు సీఎం జగన్.. మీ బిడ్డ సంక్షేమ పథకాలను మీ ఇంటికి చేర్చాడు.. నా అక్క చెల్లెమ్మల ఖాతాలో రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు జమ చేశాను.. లంచాలు లేని ,వివక్ష లేని పాలన చేశాను.. నాడు, నేడు పథకం ద్వారా, ప్రభుత్వ పాఠశాలల తలరాతను మార్చేశాను.. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యకు నాంది పలికాను.. గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి వంటి పథకాలతో, విద్యా వ్యవస్థలో విప్లవాలు తీసుకొచ్చాను.. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకాలు అమలు జరిగాయా మీరే ఆలోచించండి అని సూచించారు.

సాయిధరమ్‌ తేజ్‌పై దాడి..! క్లారిటీ ఇచ్చిన కాకినాడ డీఎస్పీ
ఆదివారం రోజు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మేనల్లుడు, మెగా హీరో సాయిధరమ్ తేజ్‌పై దాడికి యత్నించారంటూ ప్రచారం జరిగింది.. సాయి ధరమ్‌ తేజ్‌పై దుండగులు కూల్‌డ్రింక్‌ సీసాలతో దాడి చేశారని.. ఈ ఘటనలో జనసేనకు చెందిన ఓ యువకుడికి గాయాలు అయినట్టు తెలసింది.. అయితే, ఈ ఘటనపై స్పందించారు కాకినాడ డీఎస్పీ కోపల్లె హనుమంతరావు.. సాయిధరమ్‌ తేజ్‌పై ఎటువంటి దాడి జరగలేదని స్పష్టం చేశారు.. తాటిపర్తి గ్రామంలో ప్రచారం ప్రశాంతంగా జరిగిందన్న ఆయన.. సాయి ధరమ్ తేజ్ వెహికల్ అక్కడి నుంచి వెళ్లిపోయిన 30 నిమిషాల తర్వాత ఒక యువకుడిపై ఎవరో రాయి విసిరితే.. ఆ యువకుడికి తగిలింది.. అంతేకానీ, సినీ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌పై గాజు సీసాతో దాడి అనేది అసత్యం.. దీనిపై అసత్య ప్రచారం చేయడం తగదని సూచించారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థిగా.. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. ఆయన తరపున పిఠాపురంలో ఎంతోమంది సినీ, టీవీ పరిశ్రమకు చెందినవారు ప్రచారం చేస్తూ వస్తున్నారు.. ఇక, మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు కూడా రంగంలోకి దిగారు.. ఇప్పటికే వరుణ్‌ తేజ్ ప్రచారం నిర్వహించగా.. తాజాగా, సాయి ధరమ్‌ తేజ్‌ కూడా తమ మేనమామ గెలుపుకోసం ప్రచారంలోకి దిగారు.. అయితే, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో సాయి ధరమ్ తేజ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో.. అతడిపై కూల్‌ డ్రింక్ బాటిల్ విసిరారని. సాయి ధరమ్‌ తేజ్‌కు తృటిలో ప్రమాదం తప్పగా.. ఆ పక్కనే ఉన్న జనసేన నాయకుడు నల్ల శ్రీధర్‌కు ఆ కూల్‌ డ్రింక్‌ బాటిల్ తగలడంతో తీవ్ర గాయం అయినట్టు వార్తలు వచ్చిన విషయం విదితమే.

కోడ్ పూర్తి కాగానే ఇందిరమ్మ ఇళ్లకు శంఖుస్థాపనలు చేస్తాం..
కోడ్ పూర్తి కాగానే ఇందిరమ్మ ఇళ్లకు శంఖుస్థాపనలు చేస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశ సంపద ను మోడీ పెట్టుబడి దారులకు పంచి పెడుతున్నారని అన్నారు. నామా నాగేశ్వర రావు ఏ పార్టీ నుంచి మంత్రి అవుతారు? అని ప్రశ్నించారు. పది మంది పోటీ చేయని మీరు ఒక్క సీట్ కూడా గెలవని బీఆర్ఎస్ నుంచి నామా ఎలా మంత్రి అవుతారన్నారు. దేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అడ్రస్ వుండదన్నారు. దాని గురించి భయపడేది లేదని తెలిపారు. కార్ షెడ్ నుంచి ఇక బయటకు రాదన్నారు. ఓట్లు అడుగడం వరకే కాదన్నారు. కాంగ్రెస్ గతంలో ఎలా సేవ చేసింది భవిష్యత్ లో కూడా అలా సేవ చేస్తామన్నారు. 1400 కోట్ల తో కావల్సిన ప్రాజెక్టు లను వేల కోట్లు వెచ్చించి ఒక్క చుక్క నీరు రాకుండా చేసిన చరిత్ర కేసీఆర్ ది అన్నారు. కృష్ణా జలాలతో పాటు గోదావరి జలాలు కూడా అందిస్తామన్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురు.. బెయిల్ నిరాకరించిన కోర్టు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు బెయిల్‌ నిరాకరించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు ఈ విధంగా తీర్పు వెలువరించింది. కవిత కు వ్యతిరేకంగా ఈడి, సిబిఐ కేసులు ఉండటంతో.. రెండు కేసుల్లో కవిత కు బెయుల్ నిరాకరించింది కోర్టు. రెండు కేసుల్లో కవిత దాఖలు చేసిన వేసిన పిటీషన్లను న్యాయమూర్తి కావేరీ బవేజా డిస్మిస్ చేశారు. కవిత ప్రస్తుతం తిహాద్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. కవిత దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ, సీబీఐ కోర్టుకు తెలిపాయి. స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చిందని కవిత కోర్టుకు తెలిపారు. మహిళగా తనకు పీఎంఎల్‌ఏ సెక్షన్ 45 కింద బెయిల్‌కు అర్హత ఉందని కవిత కోర్టుకు తెలిపారు. రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లు మరోసారి తిరస్కరణకు గురయ్యాయి. అయితే తాజాగా కవిత మాట్లాడుతూ.. నేను అప్రూవర్‌ గా మారేది లేదని, కడిగిన ముత్యంలా బయటికి వస్తానని అన్న విషయం తెలిసిందే. ఇది మనీలాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అన్నారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ.. ఒక నిందితుడు ఆల్రెడీ బిజెపిలో చేరాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకో నిందితుడు బీజేపీ టికెట్ ఇచ్చిందని అన్నారు. మూడో నిందితుడు రూ.50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడని తెలిపారు. క్లీన్ గా బయటకు వస్తా.. అప్రూవ్ వర్ గా మారేది లేదని క్లారిటీ ఇచ్చారు. మరి రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

అబద్దమైతే నిరూపించండి..? బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి లకు కేటీఆర్‌ సవాల్‌..
నేను చెప్పేది అబద్ధం అని బండి సంజయ్, కిషన్ రెడ్డి లేదా.. బీజేపీ పార్టీవాళ్ళు ఎవరైనా నిరూపిస్తారా? అని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉదయం సిరిసిల్ల పట్టణం కొత్త బస్టాండ్ లోనీ కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా.. అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపుకోసం పలు వార్డులలో ప్రచారం నిర్వహించి, కార్నర్  మీటింగ్ పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. పన్నులు వేస్తే, ట్యాక్స్ లు వసూలు చేస్తే రాష్ట్రాలకు ప్రత్యేకంగా వాటా ఇవ్వలసి వస్తుందని సెస్ పేరుతో వసూల్ చేసాడు మోడీ అన్నారు. పెట్రోలు, డీజిల్ పై సెస్ ల రూపంలో పైసలు వసూలు చేసి రహదారులు వేస్తామని పేదల రక్తం పీల్చి 30 లక్షల కోట్లు దండుకున్నాడన్నారు. దోచుకున్న 30 లక్షలు కోట్ల రూపాయలను 14 లక్షల కోట్లు ఆదాని అంబానీలకు పంచిపెట్టాడని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను చెప్పేది అబద్ధం అని బండి సంజయ్ కిషన్ రెడ్డి లేదా బీజేపీ పార్టీవాళ్ళు ఎవరైనా నిరూపిస్తారా? అని ప్రశ్నించారు. అబద్ధం అని నిరూపిస్తే రేపు తెల్లారే సరికి సిరిసిల్ల కొత్త బస్టాండ్ దగ్గర తెలంగాణ తల్లి సాక్షిగా నా రాజీనామా చేసి వారి మోఖానికి కొడుతా అంటూ సవాల్ విసిరారు.

ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ పరీక్షా ఫలితాలు విడుదల
సీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ (12వ తరగతి) పరీక్షా ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్​సీఈ) విడుదల చేసింది. ఈ సంవత్సరం 2,43,617 మంది ఐసీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,42,328 మంది ఉత్తీర్ణులయ్యారు. 99,901 మంది విద్యార్థులు ఐఎస్సీ క్లాస్​ 12 పరీక్ష రాయగా.. అందులో 98,088 మంది ఉత్తీర్ణులయ్యారు. ఐసీఎస్​ఈ పాస్​ పర్సెంటేజ్​ 99.47శాతం కాగా.. ఐఎస్​సీ పాస్​ పర్సెంటేజ్​ 98.19శాతంగా నమోదైంది. ఐసీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాల్లో 99.65శాతం మంది బాలికలు పాలయ్యారు. 99.31శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు 2024ల 98.92శాతం మంది అమ్మాయిలు, 97.53శాతం మంది అబ్బాయిలు పాస్​ అయ్యారు. 10 క్లాస్, ​12 క్లాస్ ఫలితాలను www.cisce.org అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలని సీఐఎస్సీఈ తెలిపింది. డిజీలాకర్​లో ఫలితాలను https://results.digilocker.gov.in ద్వారా చూడొచ్చు.

గుజరాత్‌లో గుబులు.. అహ్మదాబాద్‌లోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ-ఎన్‌సీఆర్ తర్వాత ఇప్పుడు గుజరాత్‌లోని పాఠశాలలకు బెదిరింపు ఇమెయిల్‌లు పంపబడ్డాయి. ఇప్పటివరకు సుమారు 7 పాఠశాలలకు బాంబులతో బెదిరింపులు వచ్చాయి. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. వాస్తవానికి మే 1వ తేదీన రాజధాని ఢిల్లీతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లోని 200కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో జనంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సంఘటన జరిగిన నాలుగు రోజులకే చాలా పాఠశాలలకు ఏకకాలంలో బెదిరింపు ఇమెయిల్‌లు పంపబడ్డాయి. అహ్మదాబాద్‌లో కూడా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ వంటి నమూనా కనిపిస్తోంది. నగరంలోని ఉన్నత పాఠశాలలకు బెదిరింపు ఇమెయిల్‌లు పంపబడ్డాయి. ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. దాదాపు 7 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్‌ను చూసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS), ఆనంద్ నికేతన్ వంటి పాఠశాలలు పోలీసులను సంప్రదించాయి. ఈ పాఠశాలలకు పోలీసు బృందాలు చేరుకున్నాయి. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దించారు. వాస్తవానికి, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కూడా, మూడు పాఠశాలలను పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చినట్లు మొదట్లో నివేదించబడింది. అయితే కొన్ని గంటల్లో ఈ సంఖ్య 200 దాటింది.

ఒక నెలలో 10శాతం పడిపోయిన క్రూడాయిల్ ధర.. మరి పెట్రోల్ ధరల పరిస్థితి
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర దాదాపు 10 శాతం తగ్గింది. గల్ఫ్ దేశాల్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 8 డాలర్ల కంటే ఎక్కువ తగ్గింది. మరోవైపు, అమెరికన్ ముడి చమురు ధరలు కూడా బ్యారెల్‌కు 8 డాలర్లకు పైగా తగ్గాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత తగ్గడం.. డిమాండ్‌తో పాటు అమెరికన్ చమురు ఉత్పత్తి పెరగడం వల్ల ముడి చమురు ధర తగ్గింది. జూన్ తర్వాత ఒపెక్ తన స్వచ్ఛంద ఉత్పత్తి కోతను వాయిదా వేయవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ప్రపంచంలోని ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు ముడి చమురు ఉత్పత్తిని తగ్గించడాన్ని కొనసాగించవచ్చు. దీని ప్రభావం క్రూడాయిల్ ధరపై కనిపిస్తుంది. మరోవైపు, ముడి చమురు ధర తగ్గింపు తర్వాత దేశంలోని పెద్ద నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ఎటువంటి ప్రభావం లేదు. అంటే పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. చివరిసారిగా మార్చి 15న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయి. ఆ సమయంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.2 తగ్గాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మరోసారి గొప్ప మనసు చాటుకున్న లారెన్స్..వారికి భారీ సాయం…
తమిళ హీరో రాఘవ లారెన్స్ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. హీరోగా, డైరెక్టర్ గా, డ్యాన్స్ మాస్టర్ గా, ప్రోడ్యూసర్ చేసి ప్రేక్షకుల మనసు దోచుకొని స్టార్ హీరో అయ్యాడు.. ఇప్పుడు జనాలకు తోచిన సాయం చేస్తూ రియల్ హీరో అయ్యాడు. మొన్న వికలాంగులకు స్కూటీలు, నిన్న రైతన్నలకు ట్రాక్టర్లు, నేడు మహిళా ఆటో డ్రైవర్లకు సాయం అందించాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా 10 మంది మహిళా ఆటో డ్రైవర్లకి లోన్లు క్లియర్ చేసి వారికి ఆర్థికంగా అండగా నిలిచారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు లారెన్స్.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆటో డ్రైవర్లు తమ వాహనాల రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. అంతేకాక ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లుగా వారు చెప్పారు..

మరో తెలుగు దర్శకుడితో ధనుష్ మూవీ..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.అది కూడా తెలుగు దర్శకులతోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు.ఇప్పటికే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో “సార్” సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న ధనుష్. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో “కుబేర” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.రీసెంట్ గా నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఇదిలా ఉంటే తాజాగా ధనుష్ మరో తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తెలుగులో శర్వానంద్ హీరోగా “శ్రీకారం” అనే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు కిషోర్.. ధనుష్ ను కలిసి కథ వినిపించగా ఆ కథ ధనుష్ కి నచ్చడంతో సినిమా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.ఈ కాంబినేషన్ ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సెట్ చేసినట్లు తెలుస్తుంది.శ్రీకారం సినిమా కమర్షియల్ గా అంతగా వర్క్ అవుట్ కాకపోయినా ఆ సినిమాతో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం అందరికి నచ్చింది.దీనితో దిల్ రాజు ఈ దర్శకుడికి మరో అవకాశం ఇచ్చాడు.మరి ఈ దర్శకుడు ధనుష్ తో చేయబోయే సినిమా ఎలా ఉంటుందో చూడాలి .