NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ దృష్టి సారించిన ప్రభుత్వం
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగమైన సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ (SSMPP)కి పర్యావరణ క్లియరెన్స్ (EC) ఇతర అవసరమైన అనుమతులను అధికారుల నుండి త్వరలో పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘం (CWC), కేంద్ర పర్యావరణ & అటవీ మంత్రిత్వ శాఖకు పంపిన ప్రాజెక్ట్ తాజా వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR) అన్ని సంభావ్యతలలో, పర్యావరణ క్లియరెన్స్‌తో సహా అవసరమైన అన్ని అనుమతులలో ఆమోదించబడుతుందని, త్వరలో మంజూరు చేయబడుతుందని నీటిపారుదల అధికారులు తెలిపారు. సీతమ్మ సాగర్‌ బ్యారేజీకి, పంప్‌హౌస్‌కు కూడా రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి అనుమతి కోరిందని తెలిపారు. ఇరిగేషన్‌పై ముఖ్యమంత్రికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD) శ్రీధర్ రావు దేశ్‌పాండే ప్రకారం, రాష్ట్రానికి ఇప్పటికే ప్రాజెక్ట్ కోసం EC ఉంది. నిపుణుల అంచనాల కమిటీ (EAC) 2022 జూన్‌లో దీనికి తాజా నిబంధనలను (ToR) మంజూరు చేసింది.

జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం.. గ్రేటర్‌లో సెలార్ల తవ్వకాలపై ఆంక్షలు
తెలంగాణ వ్యాప్తంగా గత రెండు వారాలుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో సైతం భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అయితే.. ఉరుములు, ఈదురు గాలులతో కూడి భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. కొన్ని చోట్ల రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా.. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ఆ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సెల్లార్‌ తవ్వకాలపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు నిర్మాణదారులకు పలు సూచనలు జారీ చేస్తూనే సెల్లార్‌ నిర్మాణాలపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని నిర్ణయించింది జీహెచ్‌ఎంసీ. అన్ని సర్కిళ్ల ఏసీపీలు, డీసీలు తగు చర్యలు చేపట్టాలని లేదంటే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ హెచ్చరికలు జారీ చేశారు. నిర్మాణాలు చేపట్టే ప్రతి బిల్డర్‌ రక్షణ చర్యలు చేపట్టాలని, రక్షణ గోడ నిర్మాణం, పని జరుగుతున్న ప్రదేశం చుట్టూ బారికేడింగ్‌, సెల్లార్‌లో నీరు నిలువకుండా చూసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సెల్లార్‌, సెట్‌బ్యాక్‌లను అధికారులు తనిఖీ చేయాలన్నారు.

బెజవాడలో దారుణం.. రూ.100 ఇవ్వలేదని కత్తితో దాడి
విజయవాడలో దారుణం వెలుగు చూసింది.. వంద రూపాయలు ఇవ్వలేదని యువకుడుపై కత్తితో దాడి చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. విజయవాడ కస్తూరిబాయ్ పేటలో ఈ ఘటన జరిగింది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మాచవరంలోని ఓ సెలూన్ లో పనిచేస్తున్న భోగిల హరిప్రసాద్.. నిన్న రాత్రి 11 గంటలకు నడిచి వెళ్తుండగా మాస్కులు ధరించిన ఇద్దరు యువకులు అతడిని అడ్డుకున్నారు.. 100 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. అయితే, వంద రూపాయాలు ఇచ్చేందుకు నిరాకరించాడు హరిప్రసాద్‌.. దీంతో.. ఒక్కసారి కత్తితో దాడికి పాల్పడ్డారు.. గాయాలపాలైన హరిప్రసాద్‌ను జీజీహెచ్‌కు తరలించారు పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. నిజంగా వంద రూపాయల కోసమే కత్తితో దాడి చేశారు.. ఈ దాడి వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. కాగా, గతంలోనూ రూ.5, రూ.10కి కూడా దాడి చేసిన ఘటనలు వెలుగుచూశాయి.. ఏదైమానై.. వంద రూపాయలు ఇచ్చేందుకు నిరాకరించిన యువకుడిపై దాడి ఘటన బెజవాడలో కలకలం రేపుతోంది.

విశాఖలో ఫ్లెక్సీల కలకలం..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన ముందు విశాఖలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.. రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం అంటూ జనజాగరణ సమితి పేరుతో సిటీలో బ్యానర్లే ఏర్పాటు చేశారు.. మధురవాడ ఐటీ హిల్స్ ప్రాంతంలో, భీమిలి వెళ్లే దారిలో ఈ బ్యానర్లు ప్రత్యక్షం అయ్యాయి. కాగా, భోగాపురం ఎయిర్ పోర్ట్, అదానీ డేటా సెంటర్ శంకుస్థాపన కోసం రేపు విశాఖ రానున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ రెండు కీలకమైన మైలురాళ్లుగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చెబుతోంది. అయితే, సీఎం వైఎస్‌ జగన్‌ టూర్ కోసం సన్నాహాలు, ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు సీఎం జగన్‌ టార్గెట్‌గా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు పొలిటికల్‌ హీట్‌ పుట్టిస్తున్నాయి.

పాపికొండల విహార యాత్రకు మళ్లీ బ్రేక్‌..
వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి.. ఎండలు దంచికొట్టాల్సిన సమయంలో వానలు కురుస్తున్నాయి.. వడగాలులు వీయాల్సిన వేళ.. ఈదురుగాలులు వణికిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు.. చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రను నిలిపివేసింది.. ఇప్పటికే పలుమార్లు.. పాపికొండల టూర్‌ వాయిదా పడగా.. ఇప్పుడు మరోమారు బ్రేక్ పడింది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు వాతావరణ శాఖ తుపాను హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో.. రెండు రోజులపాటు పాపికొండల విహార యాత్రను అధికారులు నిలిపివేశారు. ఈ మేరకు రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే సోమవారం ఉదయం ఓ ప్రకటన జారీ చేశారు.. దీంతో, మంగళవారం, బుధవారం పాపికొండల పర్యటనకు వెళ్లే బోట్లను నిలిపివేసినట్టు పేర్కొంది పోచవరం పర్యాటక కంట్రోల్ రూమ్‌.. ఇటీవల కూడా పాపికొండల విహారయాత్ర బోట్లను నిలిపివేయగా.. ఇప్పుడు కూడా పర్యాటకులు సహకరించాలని కోరుతున్నారు అధికారులు.

అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైంది.. ఆదుకోండి..
అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైందన్న ఆయన.. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షల ఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. వరి, మామిడి, మొక్కజొన్న, అరటి, మిరప రైతులు ఆవేదనలో ఉన్నారు. బాధిత రైతులకు అండగా నిలిచి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు.. దెబ్బ తిన్న పంటల గణనను సత్వరమే చేపట్టి, మానవతా దృక్పథంతో నష్ట పరిహారాన్ని చెల్లించాలని కోరారు.. వరి సాగు చేసిన రైతులను ఈ వర్షాలు తీవ్రంగా దెబ్బ తీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, ధాన్యం కొనుగోలు పకడ్బందీగా సాగటం లేదని విమర్శించారు పవన్‌ కల్యాణ్‌.. గోదావరి జిల్లాల్లో సాగు చేసిన జయ రకం (బొండాలు) ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్న ఆయన.. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఆర్బీకేల్లో తీసుకోకపోవడం వల్ల బస్తాకు రూ.300 నష్టంతో మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ వైఖరి మూలంగా కష్టపడిన రైతు నష్టపోతున్నాడు.. దళారులు, మిల్లర్లు లాభపడుతున్నారన్నారు.. అదే విధంగా మామిడి నేల రాలిపోయింది. మొక్క జొన్న కూడా మొలకెత్తిపోతోంది. ప్రకృతి విపత్తులతో నష్టపోయే రైతులు, ముఖ్యంగా కౌలు రైతుల వేదన కళ్ళారా చూశాను అన్నారు. నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను వారి పొలాల్లో, కళ్ళాల్లో కలిసినప్పుడు వారుపడ్డ బాధలు తెలుసుకున్నాను.. కౌలు రైతు భరోసా యాత్రలో వారి ఆవేదన విన్నాను. ప్రకృతి విపత్తుల మూలంగా పంటలు కోల్పోతున్న రైతులను ఆదుకొనేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తాం. దీనిపై రైతు ప్రతినిధులు, వ్యవసాయ ఆర్థిక వేత్తలతో చర్చిస్తున్నామని వెల్లడించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

బాలినేని రాజీనామాపై వైసీపీలో ఉత్కంఠ.. నేడు సీఎం జగన్‌తో భేటీ..
మాజీమంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా విషయంలో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.. నాలుగు రోజుల క్రితం వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అధిష్టానానికి సమాచారమిచ్చారు బాలినేని.. ప్రస్తుతం నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న బాలినేని.. ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు పార్టీ పెద్దలకు సమాచారాన్ని చేరవేశారు. అయితే, రాజీనామా వ్యవహారంలో వైసీపీ పెద్దలు రంగంలోకి దిగి మాట్లాడేందుకు ప్రయత్నించినా బాలినేని వెనక్కి తగ్గడంలేదు.. దీంతో, నేరుగా సీఎం వైఎస్‌ జగన్‌తో మాట్లాడాలంటూ సీఎంవో అధికారుల నుంచి ఆయనికి సమాచారం వెళ్లిందట.. దీంతో.. హైదరాబాద్ నుంచి తాడేపల్లికి బయల్దేరి వెళ్లారు బాలినేని.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ తో సమావేశం కాబోతున్నారు.. సీఎం జగన్‌, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి మధ్య జరిగే భేటీలో ప్రస్తావనకు వచ్చే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తెలంగాణకు భారీ వర్ష సూచన.. పడిపోయిన ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో గత వారం రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. భారీ వడగళ్ల వాన వల్ల పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అకాల వర్షాల సంక్షోభం ఎప్పటికి ముగుస్తుందా అని రైతులు ఎదురు చూస్తుండగా.. వాతావరణ శాఖ మరో ఆందోళన కలిగించే విషయం వెల్లడించింది. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ ఈ సూచనతో రైతుల్లో ఆందోళన పెరిగింది. వాతావరణ శాఖ విడుదల చేసిన సూచన ప్రకారం, నేడు, రేపు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయి. అయితే.. సోమవారం సాయంత్రం హైదరాబాద్ భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే.. హైదరాబాద్ లోనే కాకుండా.. రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

తీహార్‌ జైల్లో గ్యాంగ్‌ వార్‌.. గ్యాంగ్‌స్టర్‌ మృతి
తీహార్‌ జైలులో గ్యాంగ్‌ వార్‌ జరిగింది.. ఈ ఘటనలో రోహిణి కోర్టు కాల్పుల కేసులో ప్రధాన సూత్రధారి, గ్యాంగ్‌స్టర్‌ టిల్లు తజ్‌పూరియా ప్రాణాలు కోల్పోయాడు.. జైల్లో జరిగిన గ్యాంగ్‌ వార్‌లో అతను మృతిచెందినట్టు తీహార్‌ జైలు అధికారులు ప్రకటించారు. జైలులో జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడిన అతన్ని.. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయడని పేర్కొన్నారు.. అయితే, తీహార్‌ జైలులో గత రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. ప్రత్యర్థి గ్యాంగ్‌ చేతిలో తజ్‌పూరియా తీవ్రంగా గాయపడ్డాడు.. అతడిపై యోగేష్‌ తుండా, అతని అనుచరులు ఇనుప రాడ్లతో దాడికి తెగబడినట్లు సమాచారం.. అయితే, తీవ్రంగా గాయపడిన టిల్లు తజ్‌పూరియాను ఢిల్లీ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు..

ఏపీలో క్షీణించిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు.. ఏకంగా 8.03 శాతం డౌన్‌..!
ఆంధ్రప్రదేశ్‌ ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో -8.03 శాతం మేర నెగెటివ్ గ్రోత్ రేట్ నమోదు చేశాయి ద్విచక్ర వాహనాల అమ్మకాలు.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6.89 లక్షలుగా ఉన్నాయి.. ఇక, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6.34 లక్షలు.. అంటే, అమ్మకాలు భారీగా పడిపోయాయి.. గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 55 వేలకు పైగా ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గిపోయాయి.. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకల్లో సగటున 30 శాతం మేర ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరిగాయి.. కానీ, ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.

OG అయిపోయింది… ఇక వీరమల్లడుగా మారనున్నాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సినిమాకి మధ్య గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ చేస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ నుంచి ఇంకో సినిమా సెట్స్ లోకి వెళ్ళిపోతున్న పవన్ కళ్యాణ్, లేటెస్ట్ గా OG ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ సుజిత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ‘OG’. ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా ‘పవన్ కళ్యాణ్’ని చూపిస్తూ ముంబై బ్యాక్ డ్రాప్ లో జరిగే మాఫియా కథతో OG సినిమా రూపొందుతుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటివలే గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ముంబైలో జరిగిన ఈ షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో మేకర్స్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ రేజ్(ఆపలేని ఆవేశం అని అర్ధం)ని తెరపై చూస్తారు అంటూ డీవీవీ ఎంటర్టైన్మెంట్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ వచ్చింది. సెప్టెంబర్ 2న OG నుంచి అదిరిపోయే అప్డేట్ బయటకి వచ్చే ఛాన్స్ ఉంది. OG ముంబై షెడ్యూల్ అయిపోవడంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు పీరియాడిక్ హీరోగా మారిపోవడానికి రెడీ అయ్యాడు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఎపిక్ వార్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అవ్వనున్నాడు. ఎప్పటినుంచో సెట్స్ పైకి ఉన్న ఈ మూవీ షూటింగ్ ఈ పాటికి ఎప్పుడో కంప్లీట్ అవ్వల్సింది కానీ అనివార్య కారణాల వలన డిలే అవుతూ వచ్చింది. అసలు ఈ సినిమా ఎంతవరకు షూట్ చేశారు? ఎంత బాలన్స్ ఉంది? రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఇలాంటి ఏ విషయంపైనా ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాల్లో పూర్తిగా లోఫేజ్ లో ఉన్న సినిమా హరిహర వీరమల్లు మాత్రమే. మరి ఈ ప్రాజెక్ట్ పై ఉన్న ఎన్నో అనుమానాలని క్రిష్ ఎలా క్లియర్ చేస్తాడో చూడాలి.

మూడు రోజుల్లో రిలీజ్ ఉంది కానీ బజ్ లేదు… MCU పనైపోయిందా?
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4, ‘వకాండా ఫరెవర్’ సినిమాతో కంప్లీట్ అయ్యింది. ‘వకాండా ఫరెవర్’ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది కానీ ఫేజ్ 4లో వచ్చిన మిగిలిన మార్వెల్ సినిమాలని చూడడానికి ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. MCU పై ఆడియన్స్ లో ఇంటరెస్ట్ తగ్గుతూ ఉంది, ఇలాంటి సమయంలో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మళ్లీ పుంజుకోవాలి అంటే ఫేజ్ 5లో అద్భుతాలు జరగాలి. 2023 నుంచి 2024 మిడ్ వరకూ మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చే సినిమాలు ఫేజ్ 5 కిందకి వస్తాయి. ఈ ఫేజ్ 5లో మొదటి సినిమాగా ‘ఆంట్ మాన్ అండ్ ది వాస్ప్: క్వాంటూమేనియ'(Ant-Man and the Wasp: Quantumania) 2023 ఫిబ్రవరి 17న విడుదల అయ్యింది కానీ బాక్సాఫీస్ దగ్గర ఇంపాక్ట్ చూపించలేదు. దీంతో MCU పని అయిపొయింది, ఇకపై సూపర్ హీరో సినిమాలకి మార్కెట్ తగ్గిపోతుంది అనే కామెంట్స్ మరింతగా వినిపించడం మొదలయ్యింది. ‘ఆంట్ మాన్ అండ్ ది వాస్ప్: క్వాంటూమేనియ’ తర్వాత సమ్మర్ లో ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3′(Guardians of the Galaxy Vol. 3) మే 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. మూడు రోజుల్లో రిలీజ్ కానున్న ఈ మూవీపై కూడా ఎలాంటి బజ్ లేదు. అసలు మార్వెల్ నుంచి సినిమా వస్తుంది అనే విషయమే కొంతమందికి తెలిసి ఉండదు, అలాంటి ఫేజ్ లో ఉంది MCU ఇప్పుడు. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ సీరీస్ కి ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు, ఇప్పటికే రిలీజ్ అయిన రెండు వాల్యూమ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి సహజంగానే ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3’పైన మంచి అంచనాలు ఉండాలి కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు.

Show comments