*ఎమ్మెల్సీ పోలింగ్ ఏర్పాట్లు.. అక్కడ భద్రత కట్టుదిట్టం..
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులు ఓటింగ్ సజావుగా సాగేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల కు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రం నుంచి పోలింగ్ స్టేషన్ లకు జంబో, మిని బ్యాలెట్ బాక్స్ లను తరలిస్తున్నారు.. పోలింగ్ పూర్తి అయిన తరువాత మళ్ళీ ఈ బాక్స్ లు జిల్లా కేంద్రానికి చేరుకుంటాయి. ఆ తరువాత ఇక్కడ నుంచి నల్గొండ కు భద్రతా మధ్య తరలిస్తారు.. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సామగ్రిని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ కళాశాలలో, భద్రాద్రి జిల్లాకు సంబంధించిన పోలింగ్ సామగ్రిని రామచంద్ర డిగ్రీ కళాశాలలో ఆదివారం పంపిణీ చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో 118, భద్రాద్రి కొత్తగూడెంలో 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే తొలి విడత శిక్షణ ఇచ్చారు. ఆదివారం పోలింగ్ సామగ్రి పంపిణీ సందర్భంగా రెండో విడత శిక్షణను ప్రారంభిస్తారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఏవైనా సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనీలు అందుబాటులో ఉంటారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ప్రిసైడింగ్ అధికారి (పీఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ (ఏపీఓ) మరియు ఇతర పోలింగ్ అధికారులు (ఓపీఓలు) విధులు నిర్వహించనున్నారు.
*బడి గంట సమయం మారిందోచ్.. ఇకపై 9 గంటలకే స్కూల్..
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల పనివేళలను తాజాగా పాఠశాల విద్యాశాఖ మళ్లీ మార్చింది. ఉదయం 9 గంటలకే బడులు మొదలు కానున్నట్లు పేర్కొన్నది. 2024 – 25 విద్యాసంవత్సరం నుంచి తాజాగా పనివేళలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధిచి గతంలో కూడా 9 గంటలకే బడులు మొదలయ్యేవి. కాకపోతే అప్పట్లో ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి విజ్ఞప్తి వాళ్ళ ప్రాథమిక పాఠశాలల బడివేళలను ఉదయం 9:30 గంటలకు మార్చారు. సినికి కారణం ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్థులుంటే.. ఒకరిని ఉదయం 9 గంటలకు, మరొకరిని ఉదయం 9:30 గంటలకు బడికి తీసుకెళ్లాల్సి వస్తుండడంతో తల్లిదండ్రులు ఇబ్బందిపడుతున్నారని, కాబట్టి మార్చాలని అప్పట్లో కోరగా దాంతో బడి పనివేళలను మార్చారు. కాకపోతే ఇప్పుడు మళ్లీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించి ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలను తిరిగి ఉదయం 9 కే మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9:30 గంటలకు మొదలు కానున్నాయి. సాయంత్రం 4:45 గంటల వరకు బదులు జరుగుతాయి. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రమే ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే నడుపుతారు. 1- 7వ తరగతుల వరకు నిర్వహించే ప్రబుత్వత ప్రాథమికోన్నత పాఠశాలలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు నిర్వహించబోతున్నారు. ఇక అలాగే ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మాత్రం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక అదే హైదరాబాద్ జంటనగరాల్లో మాత్రం ఈ స్కూళ్లను ఉదయం 8:45 గంటలకు మొదలై, సాయంత్రం 3:45 గంటల వరకు జరుగుతాయి. ఒకవేళ ప్రాంగణంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నట్లయితే ఆయా స్కూళ్లు ఉన్నత పాఠశాల వేళలనే పాటించాల్సి ఉంటుంది. అలంటి స్కూళ్లు కూడా ఉదయం 9:30గంటలకు మొదలుకానున్నాయి. ఇక మధ్యాహ్నభోజనం కోసం 45 నిమిషాల విరామం ఇచ్చారు అధికారులు.
*పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. 44.9 డిగ్రీలు దాటిపోతోంది..
రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా శనివారం నమోదైంది. నిర్మల్ జిల్లా కుభీర్‌లో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా అల్లీపూర్‌లో 44.9 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 44.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బేలలో 44.7 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా వ్యాల్‌పూర్‌లో 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. ఆదిలాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 44.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, నల్గొండ, మహబూబ్‌నగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 25.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం శనివారం తూర్పు, మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పారు. రాష్ట్రానికి పశ్చిమ, వాయువ్య దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ క్రమంలోనే రాజస్థాన్‌లోని ఫలోడిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో ఈ స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఐదేళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. జూన్ 1, 2019న రాజస్థాన్‌లోని చురులో 50.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాజస్థాన్‌లోని ఫలోడిలో శనివారం మధ్యాహ్నం ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది.
*గల్లిమే లూటో… ఢిల్లీకి భేజో అన్నట్టుగా కాంగ్రెస్ నేతల తీరు
గల్లిమే లుటో…డిల్లీకి బేజో అన్నట్టుగా కాంగ్రెస్ నేతల తీరు ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సివిల్ సప్లైస్ శాఖలో కుంభ కోణం పై ఒక్కరూ మాట్లాడడం లేదన్నారు. కాంగ్రెస్ అంటేనే స్కాం లు అని చెప్పామన్నారు. గల్లిమే లుటో…డిల్లీకి బేజో అన్నట్టుగా కాంగ్రెస్ నేతల తీరు ఉందన్నారు. కుంభకోణాలకు తెర లేపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నారు. వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం సివిల్ సప్లైస్ శాఖలో జరిగిందన్నారు. ఈ కుంభకోణంలో తెలంగాణ లోని కాంగ్రెస్ పార్టీ నేతలు కాకుండా డీల్లి పెద్దల హస్తం ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు తమ జేబులు నింపుకోవడం లేదు.. ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు లో 700 నుంచి 750 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు. ధాన్యం సేకరణ కోసం జనవరి 25 న కమిటీ , గైడ్ లైన్స్ ,టెండర్లు పిలిచింది ఈ ప్రభుత్వం అని తెలిపారు. నాలుగు కంపెనీలకు టెండర్లు వచ్చేలా చూశారన్నారు. కేంద్రీయ బండార్ తో పాటు మూడు సంస్థలకు టెండర్లు వచ్చేలా చూశారన్నారు. గతంలో కేంద్రీయ బండర్ ను మేము అధికారంలో ఉన్నప్పుడు బ్లాక్ లిస్ట్ లో పెట్టామన్నారు. నాలుగు సంస్థలు రైస్ మిల్లర్లను భయపెట్టి మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలోని రైస్ మిల్లులను ఈ నాలుగు కంపెనీలు భయపెడుతున్నాయన్నారు. పిల్లల మధ్యాహ్న బోజన పథకం లో సన్న బియ్యం సేకరణ వ్యవహారంలో 300 కోట్లు స్కాం చేశారన్నారు. 35 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ లో నాలుగు కంపెనీలు 700 కోట్ల రూపాయలు మిలర్ల నుంచి వసూలు చేశాయన్నారు. సంబంధం లేని ప్రైవేట్ సంస్థలు రైస్ మిల్లుల నుంచి డబ్బులు ఎలా వసూలు చేస్తాయి ? అన్నారు. నాలుగు కంపెనీలు ప్రభుత్వ ఏజెంట్ ల లాగా వ్యవహరిస్తున్నాయన్నారు. గడువు ముగిసిన 20 శాతం ధ్యానంను ఈ నాలుగు కంపెనీలు లిఫ్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
*’రెమల్’ తుఫాన్ ఎఫెక్ట్.. బెంగాల్, ఒడిశా అలర్ట్
పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈరోజు, రేపు రెమల్ తుపాను కారణంగా మత్స్యకారులు సముద్రానికి దూరంగా ఉండాలని కోరారు. మరో ఆరు గంటల్లో తుపాను మరింత తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో కోస్ట్ గార్డ్ అప్రమత్తంగా ఉంది. సముద్రంతోపాటు ఆకాశం నుంచి కూడా నిఘా ఉంచుతున్నారు. బంగాళాఖాతంలో మత్స్యకారులు, పడవలు ఈరోజు, రేపు సముద్రంలోకి వెళ్లవద్దని కోస్ట్ గార్డ్ నిరంతరం హెచ్చరిస్తోంది. సముద్ర తీరంలో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ, ఉత్తర 24 పరగణాల వంటి కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు రెడ్ అలర్ట్ ప్రకటించారు. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తర, దక్షిణ పరగణాలలో 130 కి.మీ వరకు జరుగుతుంది. తూర్పు మిడ్నాపూర్, హౌరా, హుగ్లీ, కోల్‌కతాలో గంటకు 70-80 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫాను ‘రెమల్’గా రూపాంతరం చెందింది. ఈ రోజు అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య తీరాన్ని తుఫాను తాకే అవకాశం ఉంది, దీనివల్ల పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని కోస్తా జిల్లాల్లో నేడు, రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. మే 27-28 తేదీల్లో ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెమల్ తుపాను కారణంగా రైలు, రోడ్డు ట్రాఫిక్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. విమానాల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం నుంచి 21 గంటల పాటు విమాన సర్వీసులను నిలిపివేశారు. అంతర్జాతీయ, దేశీయ 394 విమానాలు రద్దు చేయబడ్డాయి. ఉత్తర ఒడిశాలోని బాలాసోర్, భద్రక్, కేంద్రపరా వంటి కోస్తా జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. NDRF అప్రమత్తంగా ఉంది. ఆర్మీ, నేవీ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
*రెమల్ తుఫానుకు ఆ పేరు ఎందుకు పెట్టారు..ఇంతకీ దాని అర్థం ఏమిటంటే ?
ఉత్తర భారతదేశం మండుతున్న వేడిని ఎదుర్కొంటుండగా, మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో మరో పెద్ద సమస్య తలెత్తబోతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని, అది తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. ఈ తుఫానుకు రెమాల్ అని పేరు పెట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య ఆదివారం అర్ధరాత్రి రెమల్ అనే ఈ తుఫాను వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తుఫాను కారణంగా, మే 26-27 తేదీలలో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. అలాగే, మే 27-28 తేదీలలో ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను కారణంగా సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు మే 27వ తేదీ వరకు బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని, తీరానికి తిరిగి రావాలని అధికారులు సూచించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫానులకు పేరు పెట్టే ప్రక్రియ కారణంగా ఈ తుఫానుకు పేరు పెట్టారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతంతో సహా ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫానులకు పేరు పెట్టే సంప్రదాయాన్ని అనుసరించి తుఫానుకు ‘రెమల్’ అని పేరు పెట్టారు. ఈ సంప్రదాయం ప్రకారం దీని పేరు కూడా ఉంచబడింది. ‘రెమల్’ అనే పేరును ఒమన్ సూచించింది. దీని అర్థం అరబిక్‌లో ‘ఇసుక’. తుఫాను దానితో పాటు బలమైన గాలులు, భారీ వర్షాలు తెస్తుంది. దీని వల్ల భారీగా నష్టపోయే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ , ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో విద్యుత్, కమ్యూనికేషన్ లైన్‌లు (మొబైల్ టవర్లు), చదును చేయని రోడ్లు, పంటలు , తోటలకు భారీ నష్టం వాటిల్లుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కచ్చా ఇళ్లలో నివసించే ప్రజలు అలాంటి స్థలాలను ఖాళీ చేసి సురక్షితమైన ఇండోర్ ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు.
*4 అంతస్తుల నివాస భవనంలో చెలరేగిన మంటలు.. ముగ్గురు మరణం..
దేశ రాజధాని ఢిల్లీలో నేడు ఉదయం ఓ తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. 4 అంతస్తుల భవనంలో మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో అక్కడిక్కడే 3 వ్యక్తులు మరణించగా, ఒకరు గాయపడ్డారు. తూర్పు ఢిల్లీ లోని కృష్ణ నగర్ ప్రాంతం లో ఉన్న 4 అంతస్తుల నివాస భవనంలో ఈ తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సమయంలో ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ కు ఫోన్‌కాల్ వచ్చింది. దాంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ సర్వీస్ లతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. అగ్నిమాపక సిబ్బంది ప్రకారం., ఈ ఘటనలో మొత్తం 12 మందిని రక్షించామని తెలిపారు. కాకపోతే ఈ ప్రమాదంలో ద్రువదృష్టశాత్తు ముగ్గురు మరణించినట్లు ప్రకటించారు. వారిలో ఇద్దరిని అంజు శర్మ, కేశవ్ శర్మగా గుర్తించారు అధికారులు. ఇంకో మహిళ మృతదేహం భవనం మొదటి అంతస్తులో కనుగొన్నారు అధికారులు. ఆమెను 66 ఏళ్లు కలిగిన పర్మిలా షాద్ గా అధికారులు వివరాలు తెలిపారు. రిపోర్ట్ ప్రకారం, ఆ భవనంలోని పార్కింగ్ స్థలంలో మంటలు చెలరేగినట్లు అనుమనం వ్యక్తం చేస్తున్నారు. ఇకపొహతే అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటన వల్ల ఆ స్థలంలో ఉన్న 11 వాహనాలు బూడిదయ్యాయి.
*హమ్మయ్య.. ఈసారి నన్ను వదిలేసారు.. నవదీప్ సంచలన కామెంట్స్..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు కంటే హాట్ టాపిక్ గా బెంగళూరులో జరిగిన రేవు పార్టీ సంబంధించిన విశేషాలు తెలుసుకుంటున్నారు ప్రజలు. దీనికి కారణం రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు అలాగే వారి అనుచరులు, మరి కొంతమంది సినీ తారలు ఈ రేవు పార్టీతో సంబంధం కలిగి ఉండడంతో అనేక వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. రేవ్ పార్టీ వద్ద పట్టుబడిన కారుకు ఎమ్మెల్యే కాకాని స్టిక్కర్ ఉండడంతో ఆ వార్త కూడా కాస్త వైరల్ గా మారింది. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీకు సంబంధించిన కొంతమంది పేర్లు ప్రస్తుతం వినిపించడంతో ఇందుకు సంబంధించిన విశేషాలు వైరల్ గా మారాయి. ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హీరో తన పేరు రేవు పార్టీలో లేనందుకు తెగ ఆనందపడిపోతున్నాడు. ఆయన మరెవరో కాదు హీరో ‘నవదీప్’. దీనికి కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు, ఎక్కడ ఏ డ్రగ్ కేసులో విచారణ జరిగిన సినీ ఇండస్ట్రీ నుండి అటెండెన్స్ వేయించుకునే మొదటి వ్యక్తి ఆయనే. ఇదివరకు పోలీసులు అనేకమార్లు నవదీపును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పేరిట విచారణ జరిగిన సంఘటనలు చాలామంది చూసాం. ఆ సమయంలో హీరో నవదీపును కూడా చాలాసార్లు మీడియా టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. ఎవరైనా సినిమా ఆర్టిస్టులు పట్టు పడ్డారంటే చాలు అందులో నవదీప్ పేరుతో కథనాలు రావడం సహజంగా మారంది. కాకపోతే సెన్సేషనల్ క్రియేట్ చేసిన బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో ఆయన పేరు ఎక్కడ కూడా వినిపించలేదు. ఈ నేపథ్యంలో ఆయన మొదటిసారిగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఇన్నాళ్లకు మీడియా తనని వదిలి పెట్టిందంటూ సంతోషపడుతూ మాట్లాడాడు. అలాగే తాను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్టు రూమర్స్ రాక పోవడంతో చాలా మంది నిరుత్సాహపడి ఉంటారని కాస్త సెటైర్ గా మాట్లాడాడు. మరికొందరైతే ఏంటన్నా ఈసారి నువ్వు ఫేక్ న్యూస్ లో కనిపించలేదంటూ కూడా ఆయనను అడిగినట్లు నవదీప్ తెలిపాడు. ఈసారి తనకు మంచి జరిగిందని., తనను ఈసారి ఒక్కసారి మీడియా వదిలేసిందని కాస్త ఫన్నీగా తెలిపారు. ఇక రేవు పార్టీ అంటే కాస్త కొత్త అర్థాన్ని కూడా ఇచ్చాడు నవదీప్. రాత్రి, పగులు జరిగే పార్టీని రేవు పార్టీ అంటారు అంటూ తనదైన శైలిలో నిర్వచించాడు నవదీప్.
*ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్.. పిచ్ రిపోర్ట్ ఇదే..!
ఐపీఎల్(IPL 2024) ఫైనల్ మ్యాచ్ ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)తో రాత్రి 7.30గంటలకి తలపడబోతుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మరి మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఒకవేళ మ్యాచ్ లో వాన పడితే అదనంగా 120 నిమిషాల సమయం ఇస్తారు. అయినా వర్షం తగ్గకపోతే తర్వాత రోజు (రిజర్వ్ డే) మ్యాచ్ జరుగుతుంది. అయితే, రెండు రోజులూ వర్షం పడితే పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్ గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ విజేతగా ప్రకటిస్తారు. కాగా, చిదంబరం స్టేడియంలో పిచ్ బౌలింగ్‌కి అనుకూలిస్తుంది. ఈ స్టేడియంలో 84 ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగ్గా.. అందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 49 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 35 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచాయి. దీంతో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. భారత వాతావరణ విభాగం (IMD) తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొనింది. అలాగే, గంటకు 30 నుంచి 40 కిలో మీటర్లు వేగంతో గాలి వీస్తుందని చెప్పారు. తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉంది.. ఇక, ఇవాళ చెన్నైలో మేఘాలు కమ్మేస్తాయని ఐఎండీ తెలిపింది. రాత్రి 12 తర్వాత మాత్రమే మేఘాలు పోతాయని చెప్పుకొచ్చింది. ఇక, ఈరోజు ఏ సమయంలోనైనా చెన్నైలో వాన పడే అవకాశం లేదు అనే న్యూస్ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, చెన్నైలో ఇవాళ మ్యాచ్ జరిగే సమయంలో గంటకు 11 నుంచి 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. చెన్నై చుట్టుపక్కల గాలి వేగం తక్కువగానే ఉండంతో వర్షం వచ్చే అవకాశం లేనట్లే అని తెలిపింది. కాగా, నేడు చెన్నైలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.. మ్యాచ్ జరిగే సమయంలో 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వెల్లడించింది. తేమ రాత్రి 7.30కి 58 శాతంగా.. రాత్రి 8.30కి 66 శాతంగా, రాత్రి 9.30కి 72 శాతంగా, రాత్రి 10.30కి 76 శాతంగా, రాత్రి 11.30కి 78 శాతంగా ఉండనుందని ప్రకటించింది. ఇప్పటివరకూ వచ్చిన సమాచారం ప్రకారం.. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇవాళ వాన కురిసే అవకాశం లేదని.. సాయంత్రానికి వాతావరణంలో అనూహ్య మార్పులేమైనా వస్తే.. వర్షం పడే అవకాశం ఉండొచ్చు అని భారత వాతవరణ శాఖ వెల్లడించింది.
*మహిళలు గుడ్ న్యూస్.. బంగారం ధర ఢమాల్.. వారం రోజుల్లో ఏకంగా..
ఆకాశమే హద్దుగా వెళ్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడినట్లయింది. ఇకపోతే గడిచిన వారం రోజుల నుంచి గోల్డ్ ధరలు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. ఇదివరకు గడిచిన 6 రోజుల్లో 10 గ్రా. ల 24 క్యారెట్ల బంగారంపై సుమారు 3వేల రూపాయల వరకు తగ్గింది. ఇదే కొనసాగితే ఈ నెల చివరికి గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారంతోపాటుగా వెండి ధర కూడా తగ్గుతూ వస్తోంది. గత వారంలో లక్షదాటిన కిలో వెండి ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది ఇక తెలుగు రాష్ట్రాల్లో ధరలను చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం నాడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మార్కెట్ నివేదికల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రా. ల బంగారం ధర రూ.66,400 ఉండగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,440 గా కొనసాగుతుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వీటి ధరలు చూస్తే.. ముంబయి, కోల్కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారట్ల 10గ్రా. ల గోల్డ్ ధర రూ.66,400 ఉండగా, 24 క్యారట్ల 10 గ్రా. ల బంగారం ధర రూ. 72,440 గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రా. ల బంగారం ధర రూ. 66,550 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,590 గా ఉంది ఇక మరోవైపు వెండి ధరలను చూస్తే ఇలా ఉన్నాయి. నేడు దేశ వ్యాప్తంగా వెండి ధరలో ఎలాంటి మార్పులు లేవు. ఇక నేడు ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ. 96,000 ఉండగా.. చెన్నైలో కూడా వెండి రూ.96,000.., కోల్కతా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ. 91,500 గా కొనసాగుంది. బెంగళూరులో రూ. 92,500 గా కొనసాగుతుంది.