తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితి.. ఎండలు.. వానలు..
తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏపీలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. అయితే నిన్న కొన్ని జిల్లాల్లో వర్షం కురియడంతో జనం కాస్త సేద దీరారు. నెల్లూరు, ప్రకాశం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో సాయంత్రం వరకు ఎండ దంచి కొట్టగా… తర్వాత చిరు జల్లులు కురిశాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈదురు గాలుల వాన భీబత్సం సృష్టించింది. గాలుల తీవ్రతకు ఆత్మకూరులో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. ప్రకాశంజిల్లా పుల్లలచెరువు మండలంలో హోరు గాలి, భారీ వర్షానికి రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ చిరు జల్లులు పడ్డాయి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏజెన్సీలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఉక్కిరిబిక్కిరైన ఏజెన్సీవాసులు…వానతో సేదదీరారు. అయితే గాలుల ఉధృతికి హోర్డింగ్‌లు పడిపోయాయి. కురుపాం ఏజెన్సీలో విద్యుత్ సరఫరా కొంతసేపు నిలిచిపోయింది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతిచెందాడు. మరోవైపు ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాలకు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే… సాయంత్రం వేళ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నా… అంతవరకు భానుడు ఠారెత్తిస్తున్నాడు. దీంతో వడదెబ్బకు చనిపోయేవారి సంఖ్య అంతకంతకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వృద్ధులు, ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
జగన్ సర్కార్‌పై పవన్ కౌంటర్లు.. చర్యలేంటో ఆ దేవుడికే ఎరుక ..!
సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తూ ట్విట్టర్ ద్వారా వరుస కౌంటర్లు వేశారు.. అన్నమయ్య డ్యాం విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ ట్వీట్ చేసిన పవన్.. క్లాస్ వార్ అంటూ జగన్ చేసిన కామెంట్ల మీద సెటైర్లు వేశారు.. అధికారికంగా రూ. 500 కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ఉన్న రిచెస్ట్ సీఎం.. నిరంతరం కార్ల్ మార్క్స్ లా క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారు. కార్ల్ మార్క్స్ లాగా ‘వర్గ యుద్ధం’ జగన్ మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు.. అణచివేసే వారే.. అణచివేతకు గురైనవారిలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్న ఆయన.. నా కామెంట్లపై సందేహాలు ఉంటే, ఏపీ మానవ హక్కుల సంఘాలను సంప్రదించండి అని సలహా ఇచ్చారు. 19.11.2021 తేదీన తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షాలకు అన్నమయ్య డ్యాం తెగిపోయింది. హఠాత్తుగా సంభవించిన ఈ వరద వల్ల.. ఒడ్డున ఉన్న మందపల్లి, తొగురుపేట, పులపత్తూరు మరియు గుండ్లూరు గ్రామాలలోని 33 మంది ప్రజలు జల సమాధి అయ్యారని తన ట్వీట్ ద్వారా గుర్తుచూశారు పవన్.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారు. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని వాపోయారని.. ప్రమాద ఘటన జరిగిన వెంటనే ఏపీ సీఎం అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నామన్నారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగతా డ్యాములకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెప్పారో తెలీదు అని ఎద్దేవా చేశారు.
చివరి నిమిషంలో సీబీఐ విచారణకు డుమ్మా..! పులివెందులకు అవినాష్‌రెడ్డి..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతూనే ఉంది.. ఈ రోజు మరోసారి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. ఆయన హైదరాబాద్‌కు రావడంతో.. ఈ రోజు సీబీఐ ముందుకు వస్తారని భావించారు.. ఉదయం 11 గంటలకు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి రావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఆయన డుమ్మా కొట్టారు.. ఈ రోజు విచారణకు రాలేను అంటూ సీబీఐకి సమాచారం ఇచ్చిన ఆయన.. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది.. దీంతో విచారణకు రాలేకపోతున్నాను.. అని సమాచారం ఇచ్చి.. పులివెందులకు బయల్దేరి వెళ్లారు.. కాగా, పులివెందులలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి.. ఆమె అనారోగ్యంతో ఆందోళనలో ఉన్న అవినాష్ రెడ్డి.. వెంటనే పులివెందులకు బయల్దేరారు. మరోవైపు.. గురువారం రోజు ఎంపీ అవినాష్‌రెడ్డి తరపు లాయర్లు సీబీఐ అధికారులను కలిశారు.. వెకేషన్ బెంచ్‌లో విచారణ వరకు అవకాశం ఇవ్వాలని కోరారు.. కానీ, దీనికి అంగీకరించలేదు సీబీఐ.. ఇక, ఈ రోజు విచారణకు హాజరు కాలేనంటూ కూడా ఎంపీ అవినాష్‌రెడ్డి.. సీబీఐకి సమాచారం ఇచ్చారు.. కానీ, సీబీఐ ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై స్పందించలేదు.. మరోసారి కడప ఎంపీని విచారణకు పిలుస్తారా? లేదా సీబీఐ మరేదైనా స్టెప్ తీసుకోనుందా? అనే చర్చ సాగుతోంది.. కాగా, ఈ రోజు ఉదయం 11 గంటల కంటే ముందు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయల్దేరారు ఎంపీ అవినాష్‌రెడ్డి.. అప్పటికే పెద్ద ఎత్తున అవినాష్‌రెడ్డి అభిమానులు ఆయన ఇంటికి తరలివచ్చారు.. ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.. అంతా ఆయన సీబీఐ ఆఫీస్‌కే బయల్దేరి వెళ్తున్నారని భావించారు.. కానీ, ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా పులివెందులకు బయల్దేరి వెళ్లారు. మరోవైపు, సీబీఐ కార్యాలయం నుంచి రెండు టీమ్‌లు బయల్దేరి వెళ్లాయి.. ఒక టీమ్ సీబీఐ కోర్టుకు వెళ్లగా.. మరో టీమ్ ఎక్కడికి వెళ్లిందనేది క్లారిటీ లేదు. దీంతో.. వైఎస్ వివేకా హత్య కేసులో ఈ రోజు ఏదైనా కీలక పరిణామం చోటుచేసుకోనుందా? అనేది ఉత్కంఠగా మారింది.
జగన్‌కు వాలంటీర్లు ఒక సైన్యం.. చంద్రబాబుకు కడుపు మంట..
జగన్‌కు వాలంటీర్లు ఒక సైనం.. కానీ, చంద్రబాబుకు వాళ్లంటేనే కడుపు మంట అంటూ మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విజయవాడలో నిర్వహించిన వాలంటీర్ల సేవా పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ వారదులు, సంక్షేమ సారథులు ఈ వాలంటీర్లు.. సేవకులు, సైనికులు ఈ వాలంటీర్లు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న సైన్యం వాలంటీర్లు.. అవినీతి, రాజకీయం చూడకుండా అందరికీ సంక్షేమం అందిస్తున్నది ఈ వాలంటీర్లు.. జగన్ పెట్టుకున్న నమ్మకం వాలంటీర్ల వ్యవస్థ అంటూ వారి సేవలను కొనియాడారు.. గత ప్రభుత్వ హయాంలో ఈ విధంగా ప్రతి ఇంటికి వెళ్లి ఫించన్ ఇచ్చారా ? అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఇళ్ల పట్టాలు ఇచ్చే పనులు గత ప్రభుత్వంలో ఎప్పుడైనా చూశారా? అంటూ ప్రశ్నించారు. గతంలో జన్మభూమి కమిటీ అరాచకాలు, వివక్ష, లంచాల ద్వారానే పథకాల అమలు అయ్యేవని విమర్శించారు సీఎం జగన్.. తులసి మొక్క లాంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని ప్రశంసించిన ఆయన.. ప్రభుత్వం చేసిన పని ప్రతీ ఒక్కరికీ చెప్పాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందన్నారు. 3 లక్షల కోట్ల రూపాయలు అక్క చెల్లెళ్ళకు ఇచ్చామని గుర్తిచేశరాఉ. కానీ, అన్యాయమైన రాజకీయాల మధ్య మనం ఉన్నాం.. పేదల ప్రభుత్వంపై అసత్య ప్రచారాలను కొన్ని మీడియాల్లో, సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన మంచి ప్రతి గడపకు వెళ్లి చెప్పే వాలంటీర్లు మనకి అండగా ఉన్నారు.. ప్రభుత్వానికి చేసే సేవ చేస్తున్నారు ఈ వాలంటీర్లు.. సేవ చేసే వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు.. కేవలం సేవ చేయాలని తపన ఉన్న వారే ఈ వాలంటీర్లు అని పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థకు అడ్డంకి ఎప్పటికీ ఉండదని స్పష్టం చేసిన సీఎం వైఎస్ జగన్.. మంచి చేస్తున్న ప్రభుత్వానికి వాలంటీర్లు బ్రాండ్ అంబాసిడర్లుగా అభివర్ణించారు.
తెలుగు రాష్ట్రాల్లో మే 21న 17 రైళ్లు రద్దు.. ప్రటించిన దక్షిణ మధ్య రైల్వే
తెలుగు రాష్ట్రాల్లో మే 21న 17 రైళ్లు రద్ద చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్వే అభివృద్ధి పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 21న 17 రైళ్లను రద్దు చేస్తున్నమని, ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఘట్‌కేసర్-చర్లపల్లి మధ్య చర్లపల్లి కోచింగ్ టెర్మినల్ నిర్మాణ పనుల కారణంగా ఈ నెల 21న 17 రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-వరంగల్, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-కాజీపేట, కాచిగూడ-మిర్యాలగూడ, నడికుడి-మిర్యాలగూడ, గుంటూరు-వికారాబాద్. సికింద్రాబాద్-రేపల్లె, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్-గుంటూరు, సికింద్రాబాద్-సిర్పూజ్ కాగజ్ నగర్ రైళ్లు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రీషెడ్యూల్ చేశారు. హౌరా-సికింద్రాబాద్, త్రివేండ్రం-సికింద్రాబాద్, సికింద్రాబాద్-మన్మాడ్ రైళ్లు, మరో ఐదు రైళ్లు మే 20, 21 తేదీల్లో ఆలస్యంగా నడుస్తాయి. హౌరా-సికింద్రాబాద్ రైలు (12703) 20వ తేదీ ఉదయం 8.35 గంటలకు బయల్దేరాల్సి ఉండగా దానిని 11.35 గంటలకు మార్చారు. సికింద్రాబాద్-మన్మాడ్ రైలు (17064) రాత్రి 18.50 గంటలకు బయలుదేరాల్సి ఉంది కానీ రాత్రి 9.50 గంటలకు బయలుదేరనుంది. అలాగే, మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరాల్సిన భూషణేశ్వర్-ముంబై CSM(11020) 6.20కి, త్రివేండ్రం-సికింద్రాబాద్ ఉదయం 6.45కి బయలుదేరి 8.45కి, విశాఖపట్నం-ముంబై ఎల్‌టీటీ మధ్యాహ్నం 11.20 గంటలకు, మధ్యాహ్నం 1.2.00 గంటలకు బయలుదేరుతుంది.
చంద్రబాబుకు సజ్జల సవాల్..
చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆర్ 5 జోన్ లే అవుట్ లలో ప్రభుత్వ సలహాదారు సజ్జల ఈ రోజు పర్యటించారు.. నవులూరు, కృష్ణాయపాలెంలో లేఅవుట్లను పరిశీలించారు.. అయితే, కృష్ణాయపాలెంలో అమరావతి రైతుల నినాదాలు చేశారు.. సజ్జల కాన్వాయ్ వెళుతున్న సమయంలో ఆర్ 5 జోన్ వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు అమరావతి రైతులు.. తన పర్యటన తర్వాత మీడియాతో మాట్లాడిన సజ్జల.. లే అవుట్ల అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు.. ప్రైవేటు లే అవుట్లు కూడా ఇంత చక్కగా ఉండవని ప్రశసించారు.. లేఅవుట్లలో 62 శాతం రోడ్లు, ఓపెన్ స్పేస్ గా వదిలాం.. ఇంటర్నల్ రోడ్ల కోసం 36 శాతం భూమి కేటాయించామని.. స్లమ్స్ అని ఎలా అంటారు? అని నిలదీశారు.. మొత్తం స్థలంలో 38 శాతం మాత్రమే ప్లాటింగ్ చేశాం అని వెల్లడించారు.. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబుకు చాలెంజ్ విసిరారు సజ్జల.. చంద్రబాబు తన హయాంలో ఎక్కడ భూమి ఇచ్చాడో చెప్పాలన్న ఆయన.. ఒక సెంటు ఇచ్చినా చూపించమని అడుగుతున్నాం.. చూపిస్తే స్వయంగా క్షమాపణ చెబుతాం.. చూపించలేకపోతే.. నేను అబద్దాలు చెప్పానని చంద్రబాబు ఓపెన్ గా అంగీకరించాలి అని సవాల్ చేశారు.. చంద్రబాబు రాజకీయంలో పేదలకు చోటు ఉండదన్న సజ్జల.. చంద్రబాబు దిక్కుమాలిన లెక్కలు వేసుకోవటం వల్లే ప్రజలు తిరస్కరించారన్నారు.. చంద్రబాబు చెప్పినట్లు ఇవి స్లమ్ లు, శ్మశానలు అయితే లబ్దిదారులు టీడీపీకే మద్దతు ఇస్తారు కదా? మరి ఎందుకు భయపడటం? అంటూ ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
మద్యం మత్తులో మలద్వారంలో టీవీ రిమోట్ పెట్టుకున్న యువకుడు
మందు బాబులు తాగితే ఏం చేస్తారో కూడా వారికి అర్ధం కాదు. చుక్క పడిందంటే చాలు చుక్కల లోకంలో విహరిస్తుంటారు. ఫుల్ కొట్టితే తనంతటోడు లేదన్నట్లు ప్రవర్తిస్తారు. ఇలా చేసి తను ఇబ్బందులకు గురవుతూ ఇతరులను కష్టపెడుతుంటారు. అలా ఫుల్ కొట్టి ప్రాణాల పైకి తెచ్చుకున్నాడో యువకుడు. టీవీ రిమోటును మలద్వారంలో పెట్టుకుని ఆస్పత్రిపాలయ్యాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో టీవీ రిమోట్‌ను మలద్వారంలో పెట్టుకున్న వ్యక్తికి అనంతపురం సర్వజనాస్పత్రిలోని డాక్టర్లు ఆపరేషన్ లేకుండా సురక్షితంగా బయటకు తీశారు. ఆస్పత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామినాయక్ మీడియాకు ఆపరేషన్ వివరాలు వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గానికి చెందిన యువకుడు గురువారం సాయంత్రం ఫుల్‌గా తాగి మద్యం మత్తులో అనంతపురం సర్వజనాస్పత్రికి వచ్చాడు. మలద్వారం వద్ద నొప్పిగా ఉందని తెలపడంతో వైద్యులు పరిశీలించారు. ఆ ప్రదేశంలో టీవీ రిమోట్‌లోని కొంత భాగం కనిపించింది. లాగితే బయటకు రాలేదు. ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ రామస్వామినాయక్ ఆదేశాల మేరకు బాధితున్ని అడ్మిట్ చేసుకుని.. సర్జన్ రష్మి, పీజీ వైద్యురాలు లీలా మౌనిక, డాక్టర్ దివ్య, అనస్తీషియా వైద్యులు డాక్టర్ మురళీ ప్రభాకర్, డాక్టర్ హరికృష్ణ, స్టాఫ్‌నర్సు నాగలక్ష్మి బృందం మత్తు మందు ఇచ్చి గంటపాటు శ్రమకోర్చి సర్జరీ చేయకుండానే చేతితోనే రిమోట్‌ను బయటకు తీశారు. వైద్య బృందాన్ని ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ ప్రత్యేకంగా అభినందించారు.
రెండు కేసుల్లో ఇమ్రాన్‌ఖాన్‌కు బెయిల్ మంజూరు
లాహోర్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు జూన్ 2 వరకు రెండు కేసులలో బెయిల్ మంజూరు చేసింది. జిన్నా హౌజ్ విధ్వంసం కేసు, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్త జిల్లే షా హత్య కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ లభించింది. జూన్ 2 వరకు రెండు కేసుల్లో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ లభించింది. ఇమ్రాన్ ఖాన్ తన న్యాయవాది, బారిస్టర్ సల్మాన్ సఫ్దర్ ద్వారా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇమ్రాన్‌పై “నిరాధారమైన కేసు” నమోదైందని పిటిషన్‌లో న్యాయవాది పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రతీకార రాజకీయాల బాధితుడని, రాజకీయ కారణాలతో ఒంటరిగా ఉన్నారని పిటిషన్‌లో తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా జిల్లే షా హత్య కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసుల్లో ఇమ్రాన్ ఖాన్‌కు పాక్ యాంటీ టెర్రరిజం కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు లెజెండ్స్…
సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ మెగా ఫోన్ పట్టి డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘లాల్ సలామ్’. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నాడు. ఒక చిన్న సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. చిన్న సినిమాపై అంతగా అంచనాలు ఎందుకు పెరిగాయి అంటే ‘లాల్ సలామ్’లో ‘మొయిద్దీన్ భాయ్’ అనే పవర్ ఫుల్ పాత్ర ఉంది. ఈ పాత్రని సూపర్ స్టార్ రజినీకాంత్ ప్లే చేస్తున్నాడు. ఈ కారణంగానే ‘లాల్ సలామ్’ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇటీవలే రజినీకాంత్ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేసారు. మొయిద్దీన్ భాయ్ గా రజినీకాంత్, చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. ఆల్మోస్ట్ ఒక రోజంతా సోషల్ మీడియాలో రజినీకాంత్ పోస్టర్ వైరల్ అవుతూనే ఉంది. ఈ పోస్టర్ తో లాల్ సలామ్ సినిమాపై హైప్ పెరగడానికి కారణం అయిన రజినీకాంత్, లేటెస్ట్ గా కపిల్ దేవ్ తో దిగిన ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసాడు. ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చిన మొదటి కెప్టెన్ కపిల్ దేవ్, లాల్ సలామ్ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ బ్యాక్ డ్రాప్ లో రజినీకాంత్, కపిల్ దేవ్ మధ్య సీన్స్ ఉన్నట్లున్నాయి. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్ లో కలిసి కనిపించడం గొప్ప విషయం అనే చెప్పాలి. ప్రతి అప్డేట్ తో లాల్ సలామ్ సినిమా స్టేక్స్ ని పెంచుతుంది ఐశ్వర్య రజినీకాంత్. ఇక దళపతి విజయ్ తమ్ముడు ‘విక్రాంత్’ కూడా నటిస్తున్న లాల్ సలామ్ సినిమాలో ‘జీవిత రాజశేఖర్’ నటిస్తోంది. చాలా రోజులు తర్వాత మేకప్ వేసుకుంటున్న జీవిత రాజశేఖర్, రజినికాంత్ కి చెల్లిగా కనిపించనుంది. ఫైనల్ లెగ్ ఆఫ్ షూటింగ్ లో ఉన్న లాల్ సలామ్ సినిమాని మల్టీలాంగ్వేజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. క్రికెట్ అనే ఇండియాలో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్ కాబట్టి లాల్ సలామ్ సినిమాకి పాన్ ఐడియా రీచ్ వచ్చే ఛాన్స్ ఉంది.