విచారణకు రాలేను.. సమయం ఇవ్వండి.. సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ
సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ రోజు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకావాల్సి ఉంది.. ఎంపీ అవినాష్ రెడ్డికి 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ అధికారులు.. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించారు.. అయితే, ఈరోజు విచారణకు హాజరు కాలేనంటూ సీబీఐకి విజ్ఞప్తి చేశారు వైఎస్ అవినాష్‌రెడ్డి.. షార్ట్ నోటీసుతో విచారణకు పిలిచారన్న ఆయన.. వివిధ పనుల్లో నిమగ్నమై ఉన్నానని తెలిపారు.. అత్యవసర పనులు ఉన్నాయని సీబీఐకి లేఖ రాసిన ఆయన.. 3-4 రోజుల సమయం కావాలని కోరారు.. ఈమేరకు సీబీఐ అధికారులకు లేఖ రాశారు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి కడపకు బయల్దేరారు.. అయితే, ఎంపీ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తిపై ఇప్పటి వరకు సీబీఐ స్పందించలేదు..
మీకు ఎలాంటి కష్టం రానివ్వను.. ఈ ప్రభుత్వం మీ బిడ్డది..
సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకార కుటుంబాలకు ఎలాంటి కష్టం రానివ్వను అని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా నిధుల విడుదల సందర్భంగా బాపట్ల జిల్లా నిజాంపట్లంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ మత్స్య కార భారోసాలో ఒక్కొక్క కుటుంబానికి యాభై వేల రూపాయలు అందించామని తెలిపారు. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం మత్స్య కార కుటుంబాలకు ఉపయోగ పడుతుందని.. ఇప్పటి వరకు మత్స్యకార సోదరుల కు 538 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించామని గుర్తుచేశారు.. వైసీపీ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం.. మీకు ఎలాంటి కష్టం రానివ్వకుండా చూసకుంటుందని తెలిపారు సీఎం వైఎస్ జగన్.. చేపల వేట నిషేధ సమయంలో గత ప్రభుత్వాలు మత్స్యకార కుటుంబాలను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు సీఎం జగన్.. ముష్టి వేసినట్లు నాలుగు వేలు ఇచ్చేవారు.. గత ప్రభుత్వం ఐదేళ్ల లో 104 కోట్లు ఇస్తే వైసీపీ ప్రభుత్వం ఒక సంవత్సరంలోనే 125 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు.. ఇక, డీజిల్ సబ్సిడీ స్పాట్ లో వచ్చేలా చర్యలు తీసుకున్నాం.. వైసీపీ అధికారంలోకి వచ్చాక వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం అన్నారు.. మత్స్యకార కుటుంబాలలో ప్రమాదం జరిగితే పది లక్షల రూపాయలు నష్ట పరిహారం అందిస్తున్నాం అని పేర్కొన్నారు. దేశంలోనే రెండవ అతి పెద్ద సముద్ర తీరం ఉన్న మత్స్యకార కుటుంబాల జీవనం అంతంత మాత్రమే.. మత్స్యకారుల అభివృద్ధి కోసం నాలుగు వందల కోట్ల రూపాయలతో నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణం శరవేగంగా జరుగుతుందని తెలిపారు.
పెళ్లిళ్లు చేసుకునేది వీళ్లే.. విడాకులు తీసుకునేది వీళ్లే.. సీఎం సెటైర్లు
ఎన్నికల్లో పొత్తుల విషయంలో విపక్షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా నిధుల విడుదల సందర్భంగా బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు పేదలు గుర్తుకు వస్తున్నారు.. గత పాలనలో ఎస్సీలకు, మత్స్యకారులకు, బీసీలకు అన్యాయం జరిగింది అని ఆరోపించారు.. నేను చేసిన మంచిని ప్రజలని, దేవుడిని నమ్ముకున్నాను.. కానీ, చంద్రబాబు, దత్త పుత్రుడు పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు నమ్ముకున్నారు. పెద్ద గ్రౌండ్‌లో సభ పెట్టే దమ్ము లేదు.. చిన్న చిన్న సందుల్లో మీటింగ్ పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.. ఇక, చంద్రబాబుతో సహా టీడీపీ వెంటిలేటర్ మీద ఉందని.. దత్త పుత్రుడు రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా ప్రజలు నమ్మలేదు.. దండం పెట్టి పంపారని ఎద్దేవా చేశారు. ఇక, ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటు పెట్టి పార్టీని అమ్ముతున్న ప్యాకేజ్ స్టార్‌కు సీఎం పదవి అవసరం లేదట అంటూ పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు సీఎం జగన్.. రాష్ట్రాన్ని గజ దొంగల ముఠా లాగా దోచుకోవాలని అందరూ కలుస్తున్నారు.. కానీ, పేదల కోసం నిలబడి ఉన్న నన్ను ఎవ్వరూ ఏమిచేయలేరనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. అయితే, బీజేపీతో, కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకునేది వీళ్లే.. విడిపోయేది వీళ్లే.. పెళ్లిళ్లు చేసుకునేది వీళ్లీ.. విడాకులు ఇచ్చేది వీళ్లేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు ఏం చెబితే దానికి తల ఆడించడం ఒక్కటే దత్త పుత్రుడి తెలిసిందంటూ ఫైర్ అయ్యారు. బీజేపీకి భయపడే పవన్ ఆ పార్టీ పక్కకు చేరాడని.. కానీ, చంద్రబాబు చెబితే బీజేపీకి దత్త పుత్రుడు విడాకులు ఇస్తాడని వ్యాఖ్యానించారు.. ఇలాంటి రాజకీయాలు కాదు.. రాజకీయాల్లో విశ్వసనీయత కావాలన్నారు జగన్..
వెంటనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయండి.. గవర్నర్‌కు వినతిప్రతం
రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తో జీహెచ్ఎంసి బీజేపీ కార్పొరేటర్ల సమావేశమయ్యారు. జల మండలి, జీహెచ్ఎంసి అధికారులపై గవర్నర్ కు కార్పొరేటర్ల ఫిర్యాదు చేశారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ సమావేశం వాయిదా పడడంపై బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్పొరేటర్లు గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో కోరారు. జీహెచ్‌ఎంసీ సమావేశంలో జరిగిన పరిణామాలను బీజేపీ కార్పొరేటర్లు గవర్నర్‌కు వివరించారు. సమస్యలు చర్చించకుండానే జీహెచ్‌ఎంసి సమావేశం బాయికాట్ చేసినందుకు గవర్నర్ కు పిర్యాదు చేశామని బీజేపీ కార్పొరేటర్లు అన్నారు. వెంటనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామన్నారు. సంబంధిత అధికారులను పిలిచి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు. గ్రేటర్ లో ఇబ్బందులపై కౌన్సిల్ లో మాట్లాడదాం అంటే సమావేశాలు సరిగా నిర్వహించడం లేదని తెలిపారు. అధికారులు ఎన్నికైన కార్పొరేటర్లను అవమానపరిచారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే
కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారికి ఒక్క ఓటు వేసినా రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా లోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక ఫలితాల తర్వాతైనా బీజేపీకి జ్ఞానోదయం కలగలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా అంతర్గత కుమ్ములాటలతో సీఎంను ఎన్నుకునే పరిస్థితి లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వమే శరణ్యం తప్ప, మరొకటి లేదనే భావనలో ప్రజలున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వారికి ఒక్క ఓటు వేసినా రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మతోన్మాద బీజేపీకి, ఓటేసి గెలిపించినా కుమ్ములాటలతో మారని కాంగ్రెస్ పార్టీలకు దూరంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎలా నడిపిస్తుందో ఆలోచించాలని సుఖేందర్ రెడ్డి కోరారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఊహల్లో ఉన్నారని సుఖేందర్ రెడ్డి అన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ కల్లోలం ఇంకా కొనసాగుతోందని అన్నారు. అధికార కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు చేసి రాజకీయ అస్థిరత తెస్తున్నారని సుఖేందర్ రెడ్డి గుర్తు చేశారు. అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ పార్టీ పతనమవుతుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల పప్పులు ఉడకదన్నారు. కేసీఆర్ వెంట తెలంగాణ సమాజం నడుస్తుందని సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అస్సాం సీఎం బిశ్వంత్ శర్మ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. మతోన్మాద అల్లర్లు సృష్టించి అధికారంలోకి రావాలనేది బీజేపీ కుట్ర అని సుఖేందర్ రెడ్డి అన్నారు. వామపక్షాలు లేకుండానే రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని ,రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 100 సీట్లు గెలవాల్సిన అవసరం ఉందన్నారు.
హస్తినకు డీకే శివకుమార్.. సీఎం పోస్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది కాంగ్రెస్ పార్టీ.. అయితే, ఇద్దరు కీలక నేతలు ఉండడంతో.. ఎవరు సీఎం అనే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా తలపట్టుకుంటోంది.. ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు రోజులు అవుతున్నా సీఎం ఎవరు అనే విషయం తేల్చలేదు.. మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ లో ఎవరినో ఒకరిని సీఎం పదవి వరించనుండగా.. ఎవరి బలం ఏంటి? ఎవరి బలహీనత ఏంటి? లాంటి విషయాలను బేరీజు వేస్తోంది కాంగ్రెస్ అగ్రనాయకత్వం.. ఇక, ఇప్పటికే మాజీ సీఎం సిద్ధరామయ్య హస్తినలో మకాం వేయగా.. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది.. ఢిల్లీకి బయల్దేరి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ పార్టీ నాకు తల్లిలాంటిది.. పిల్లలకు ఏం ఇవ్వాలో దేవుడికి, తల్లికి తెలుసు.. నేను నా దేవుడిని కలవడానికి గుడికి వెళ్తున్నాను అంటూ ఢిల్లీ పర్యటనను ఉందేశించి కామెంట్లు చేశారు.. నా డ్యూటీ నేను చేశాను.. నా పని కి నేను న్యాయం చేశానన్న ఆయన.. జనరల్ సెక్రటీరి నన్ను ఒక్కడినే రమ్మన్నారు.. అందుకే నేను మాత్రమే ఢిల్లీ వెళ్తునానని వెల్లడించారు. ఇక, ఈ రోజు సాయంత్రానికి ఎవరు సీఎం అని విషయం తెలుస్తుందని వెల్లడించారు డీకే శివకుమార్..
నిరుద్యోగం లేకుండా చేయాలన్నదే ప్రధాని మోడీ లక్ష్యం
భారతదేశంలో నిరుద్యోగం లేకుండా చేయాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని తెలిపారు కేంద్రమంత్రి కౌషల్ కిషోర్.. విజయవాడ రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో 5వ రోజ్ గార్ (జాబ్) మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. విజయవాడ డివిజన్ పరిధిలో వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 300 మందికి నియామక పత్రాలు అందజేశారు.. రోజ్ గార్ కింద దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించగా.. అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక నియామక పత్రాలు అందజేస్తున్నారు కేంద్ర మంత్రులు.. ఇక, ఈ సందర్భంగా కౌషల్ కిషోర్ మాట్లాడుతూ.. ఆత్మనిర్భర భారతదేశాన్ని తయారు చేయడమే లక్ష్యం అన్నారు.. 5 కోట్ల మందికి గృహ నిర్మాణం చేయడం, ప్రతీ ఇంటికి నీటి వసతి ఉండేలా పైప్ లైన్లు వేయడం లక్ష్యంగా వెల్లడించారు.ఇక, నియామక పత్రాలు తీసుకునే వాళ్ళు మాదకద్రవ్యాలు తీసుకోకుండా సంబరాలు చేసుకోవాలని సూచించారు కౌషల్ కిషోర్.. ఈ రోజ్ గార్ మేళ దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో నిర్వహిస్తున్నాం.. ఈ సంకల్పానికి మద్దతిస్తూ కేంద్ర ప్రభుత్వ విభాగాలు ప్రభుత్వ రంగ సంస్థలలో నియామకాలు చేశారని తెలిపారు. ఉపాధి కల్పనకు ఉన్నత ప్రాధాన్యతను ఇవ్వాలనే మన ప్రధానమంత్రి నిబద్ధతను తెలియ చేస్తుందన్న ఆయన.. భవిష్యత్తులో ఉద్యోగ కల్పనకు ఈ ఉద్యోగ మేళా ఆదర్శ కార్యక్రమంగా నిలుస్తుందన్నారు.. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములవడానికి ఇదొక మంచి అవకాశంగా తెలిపారు.. విభిన్న ప్రభుత్వ విభాగాలలో కొత్తగా నియమితులైన వారు.. ఆన్‌లైన్ ఓరియెంటేషన్ కోర్సు కర్మయోగి ప్రారంభ్ ద్వారా శిక్షణ తీసుకుని వస్తారని తెలిపారు.
ఆ మూడు రూల్స్‌ని సవరించిన ఐసీసీ.. అవేంటంటే?
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా మూడు రూల్స్‌ని సవరించింది. తరచూ వివాదాలకు తెరతీసిన సాఫ్ట్ సిగ్నల్, ఫ్రీ హిట్ బౌల్డ్ నిర్ణయాలతో పాటు హెల్మెట్ విషయంలో తప్పనిసరి నిబంధనని అమలులోకి తీసుకొచ్చింది. మొదట సాఫ్ట్ సిగ్నల్ గురించి మాట్లాడుకుంటే.. బౌండరీకి దగ్గరో, లేదంటే బంతి నేలను తాకినట్లు పట్టిన క్యాచ్‌ల విషయంలో తీసుకుంటే నిర్ణయం. ఇది ఎప్పుడు వివాదాస్పదం అవుతూనే వస్తోంది. తొలుత ఫీల్డ్ అంపైర్ అవుటిచ్చినా, దాన్ని మళ్లీ టీవీ (థర్డ్) అంపైర్‌కు నివేదిస్తారు. అప్పుడు నాటౌట్ అని తేలినా.. సాఫ్ట్ సిగ్నల్ ప్రకారం అవుటనే ప్రకటిస్తారు. ఇప్పుడు ఆ రూల్‌ని ఐసీసీ టాటా చెప్పేసింది. ఇప్పుడు టీవీ అంపైర్ తీసుకునే నిర్ణయాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. రెండోది ఫ్రీ హిట్ బౌల్డ్.. ఇప్పటివరకూ ఫ్రీ హిట్‌కు బౌల్డ్ అయితే, అప్పుడు పరుగులు తీయడానికి వీలు ఉండేది కాదు. ఒకవేళ బంతి బౌండరీ లైన్‌వైపు పరుగులు తీసినా సరే, దాన్ని లెక్కలోకి తీసుకునే వారు కాదు. దాంతో ఫ్రీ హిట్ వృధా అయ్యేది. కానీ, ఇప్పుడు ఆ రూల్‌ని ఐసీసీ ఎత్తివేసింది. ఫ్రీ హిట్‌కు బౌల్డ్ అయినా సరే, పరుగులు తీసుకోవచ్చు. అది చట్టబద్ధమేనని ఐసీసీ ప్రకటించింది. పైగా.. ఈ పరుగులు ఎక్స్‌ట్రా కోటాలోకి వెళ్లవు, నేరుగా బ్యాటర్ ఖాతాలోకే వెళ్తాయి. ఒకరకంగా ఇది బ్యాటర్‌కి బంపరాఫర్ అని చెప్పుకోవచ్చు. ఇక మూడోది హెల్మెట్.. పేసర్లు బౌలింగ్ వేస్తున్నప్పుడు, బ్యాటర్లు తప్పకుండా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. తనకు నొప్పట్లేదని తీసివేయడానికి వీలు లేవు. అలాగే.. బ్యాటర్లకు చేరువగా మోహరించే ఫీల్డర్లు, కీపర్ సైతం హెల్మెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
కుక్కకు గిన్నిస్ రికార్డు.. అంత స్పెషల్ ఏంటో?
చాలా మందికి కుక్కల పెంపకం అంటే ఎంతో ఇష్టం. ఒక్కసారి కుక్కలపై ప్రేమ చూపిస్తే జీవితాంతం విధేయత చూపిస్తాయి. యజమానికి ఎలాంటి కష్టం మెచ్చినా అస్సలు సహించలేవు. అలాంటి కుక్కలను మనం చూస్తుంటాము. సోషల్ మీడియాలో కూడా అలాంటి వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే కుక్కలు సాధారణంగా 15 నుండి 20 సంవత్సరాల వరకు జీవిస్తాయి. కుక్కలు 25 సంవత్సరాలు జీవిస్తాయి అంటే అది చాలా అరుదు అనే చెప్పాలి. అయితే కొన్ని శునకాలు రెండు లేదా మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించాయి అంటే అది అద్భుతం అని చెప్పాలి. కానీ పోర్చుగీస్ లో ఓ కుక్క 20 లేదా 25 సంవత్సరాలు జీవించడం కాదు.. ఏకంగా 31వ పుట్టినరోజు జరుపుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన కుక్క పేరు బాబీ. ఇది పోర్చుగీస్ రాఫిరో డో అలెంటెజో జాతికి చెందిన మగ కుక్క. పోర్చుగల్‌లోని కాంక్విరాస్ గ్రామానికి చెందిన లియోనెల్ కోస్టా అనే మహిళ ఈ కుక్కను పెంచుకుంటోంది. కోస్టా తల్లిదండ్రులు ఆమె 8 సంవత్సరాల వయస్సులో మే 13, 1992న కుక్కను తమ ఇంటికి తీసుకువచ్చారు. లియోనెల్ కోస్టాకు ప్రస్తుతం 38 ఏళ్లు. గత శనివారం 30 ఏళ్లు నిండి 31 ఏళ్లు పూర్తి చేసుకున్న శునకం బాబీ పుట్టినరోజును కోస్టా ఘనంగా జరుపుకున్నారు. లియోనెల్ కోస్టా దాదాపు 100 మంది ఇరుగుపొరుగువారిని ఆహ్వానించి, వారికి మటన్, చికెన్ , చేపలతో భోజనాలు ఏర్పాటు చేశారు. 31 సంవత్సరాల కుక్క బాబీకి పుట్టినరోజు పార్టీని అందరికి ఘనంగా ఇచ్చారు. ఈ సందర్భంగా బాబీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను కోస్టా వెల్లడించారు.
ప్రముఖ సింగర్ ఆత్మహత్య.. ఆరోజు ఏం జరిగిందంటే?
ప్రముఖ కే-పాప్ సింగర్ హెసూ బలన్మరణానికి పాల్పడింది. తక్కువ వయసులోనే మంచి పాపులారిటీ గడించిన ఈ 29 ఏళ్ల కొరియన్ సింగర్.. తన హోటల్ గదిలో సూసైడ్ చేసుకుంది. మే 20వ తేదీన షెడ్యూల్ చేసిన ఒక ఈవెంట్‌కి హెసూ హాజరు కావాల్సి ఉండేది. కానీ, ఈలోపే ఆమె సూసైడ్ చేసుకోవడంతో, ఆమె మరణవార్తను ఆర్గనైజర్లు మీడియాకు తెలిపారు. ఆమె మరణవార్త అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అక్కడ ఒక సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు. అయితే.. అందులో ఉన్న వివరాల్ని మాత్రం ఇంతవరకు బయటపెట్టలేదు. అధికారులు దాన్ని గోప్యంగానే ఉంచారు. దీంతో.. హెసూ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అనే కారణాలు తెలియరాలేదు. బహుశా కుటుంబ సమస్యల కారణాల వల్లనో, లేక ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడం వల్లనో ఆమె సూసైడ్ చేసుకొని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. అసలు కారణాలేంటన్నది ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఆమె ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ఎలాంటి అవకతవకలు జరిగే ప్రసక్తి లేదని, పారదర్శకంగా విచారణ చేపడతామని తేల్చి చెప్పారు. కాగా.. హెసూ 1993లో జన్మించింది. మై లైఫ్, మీ అనే సింగిల్ ఆల్బమ్స్‌తో ఈమె సింగర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. గయో స్టేజ్, హ్యాంగౌట్ విత్ యూ, ద ట్రాట్ షోలతో హెసూ ఫేమ్ పొందింది. తన గానంతో అందరి మనసుల్ని దోచుకుంది. సింగింగ్ ఫీల్డ్‌లో అడుగుపెట్టిన అనతికాలంలోనే విపరీతమైన పాపులారిటీ గడించింది. సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటూ, తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. తాను చనిపోవడానికి ముందు రోజు కూడా నెట్టింట్లో తన ఫ్యాన్స్‌తో కాసేపు చిట్‌చాట్ చేసింది. కానీ, ఇంతలోనే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో, అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఈమె మరణవార్త తెలుసుకుని.. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు శోకసంద్రంలో మునిగిపోయారు.